మాఁ హసన్బీ తెలుగు వాచకము On Kinige
Kinige Review:
’తెలుగువారి గర్వ కారణం’ అనే ఉపశీర్షికతో ముదురు నీలం రంగు అట్టతో ఆకర్షణీయంగా కనపడుతుందీ పుస్తకం. తెలుగు పుస్తకాల్లో అదీ పిల్లలకోసం వచ్చిన వాచకంలో ఇటివంటి నాణ్యమైన, మంచి రంగుల కలబోత ఉండటం అరుదు అనే చెప్పుకోవాలి. అచ్చులు, హల్లులు, తేలిక పదాల తర్వాత ప్రతి హల్లుకీ గుణింతరూపాలు పట్టీ రూపంలో ఇవ్వబడ్డాయి. గుణింతాల్లో ఉన్న కొమ్ములు, దీర్ఘాలకు అచ్చులకు ఉన్న సంబంధాన్ని వివరించారు. ఒత్తులు, ద్విత్వాక్షరాలకు ఆధారాలు, ఉదాహరణలు చేర్చారు. సంయుక్త/సంశ్లేషాక్షరాలు రాసే పద్ధతి, దాని సూత్రీకరణ నేర్చుకోవచ్చు.
ప్రత్యేక శబ్ధాలను, పదాలను పలికే విధానంపై మంచి వివరణలతో పాటు ఉభయాక్షరాలు, వాడుకలో లేని,అశాస్త్రీయమైన అక్షరాల పరిచయము కూడా ఉంది. తెలుగులిపిలోని హ్రస్వములు, పరుషములు, అనునాసికములు వంటి వివిధ విభాగాల యొక్క సాంకేతిక నామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తెలుగు వారాలు, సంవత్సరాలు వగైరా వివరాలతో పాటు మహాకవుల సంక్షిప్త పరిచయాలు పుస్తకం చివర్లో ప్రత్యేక అనుబంధం.
— Swathi. http://swathikumari.wordpress.com
ముందుమాట
వంద రూపాయలకు తెలుగు వాచక పుస్తకాన్ని ఎవరైనా కొంటారా అన్న సంశయాన్ని పటాపంచలు చేస్తూ ఎందరో తెలుగు ఉపాధ్యాయులు ఇష్టపడి మరీ కొన్నారు. వ్యాపార పరిమాణం ఆకర్షణీయంగా ఉండటంతో ఈ పుస్తకాన్ని రెండు భాగాలుగా పాఠశాల విద్యార్థుల సౌలభ్యం కోసం విడుదల చేశాము. గత నాలుగు సంవత్సరాలుగా మా పుస్తకాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు కష్టపడకుండా ఎంతో సులభంగా తెలుగు లిపిని బోధిస్తూ/నేర్చుకుంటున్నారు.
కరీంనగర్ జిల్లాకు చెంది బీహార్ రాష్ట్రంలోని వైశాలి పట్టణంలో జవహర్ నవోదయ విద్యాలయలో తెలుగు బోధిస్తున్న ఒక ఉపాధ్యాయుడు మా పుస్తకం కోసం ఎన్నో విక్రయ కేంద్రాలలో విచారించారని తెలిసి ఆనందం, బాధ రెండూ కలిగాయి. మా పుస్తకానికి లభించిన గుర్తింపుకు ఆనందం, అందరికీ అందుబాటులోకి తేలేకపోయినందుకు బాధ. అందుకే మళ్ళీ ప్రచురించి అందరికీ సులభంగా అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు ప్రారంభించాము.
పుస్తకాలకు ఆకర్షణీయమైన బొమ్మలు అదనపు అలంకారం. పువ్వులని నేపధ్యంగా తీసుకుని బొమ్మలు ప్రచురించాము. మన భూ ప్రపంచాన్ని అందాల రంగుల ప్రపంచంగా మార్చేవి రంగు రంగుల పువ్వులే! మన దైనందిన జీవితంలో పూలు ఒక ముఖ్య అంతర్భాగం. భక్తిలో, అలంకరణల్లో, సన్మానాల్లో, ప్రేమ, శృంగారంలో పూలకు ప్రత్యేక స్థానముంది. పూల అందాల్ని ఆస్వాదించని వాళ్ళుంటారా? మల్లెపూల పరిమళానికి పరవశించని మనసుంటుందా? మనల్ని మురిపించి, మరపించే అందాల పూతోటలు ఇంటిని స్వర్గంగా మార్చటం లేదా?
తెలుగు లిపిపై నాకు ఎంతో విలువైన విజ్ఞానాన్ని ప్రసాదించిన దయామయుడైన అల్లాకు వేనవేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ…..
-షేక్ బడే సాహెబ్
మాఁ హసన్బీ తెలుగు వాచకము On Kinige