శ్యామ్‌యానా

మెడికో శ్యామ్‌గా సుప్రసిద్ధులైన డా. చిర్రావూరి శ్యామ్ రాసిన కథల సంకలనం ఇది. “సాహిత్య కుటుంబంలో జన్మించిన శ్యామ్ చిన్ననాటి నుంచే గొప్ప సాహితీపరుల సాంగత్యంలో పెరిగారు. తండ్రీ, రోణంకీ, చాసో…వంటి వారి మాటలు….వాదనలు…. ఇంటినుండా ఉన్న ఉత్తమమైన పుస్తకాలు – వీటన్నింటికీ తోడు గొప్ప ధారణా శక్తితో శ్యామ్‌లో రిఫ్లెక్టివ్ థాట్‌కి పునాది పడింది” అని అంటారు ఈ కథల గురించి, కథకుడి గురించి రాసిన చాగంటి తులసి గారు.

రచయిత మెడికో అయినప్పటికీ, ఈ సంకలనంలో వైద్యం, ఆసుపత్రి, రోగుల నేపధ్యంలో అల్లిన కథలు తక్కువే. ఈ పుస్తకంలోని కొన్ని కథల గురించి తెలుసుకుందాం.

మధ్యతరగతి మనస్తత్వాలను, ఓ ఇరవై ఐదేళ్ళ ఏళ్ళ క్రిందటి మధ్యతరగతి కుటుంబాల జీవనాన్ని ” ఇదీ మా కథ“లో చక్కగా చిత్రించారు.

తేడా” అనే చిన్న కథ సరదాగా ఉంటుంది. చురుక్కుమనిపిస్తుంది.

గీతలు” కథలో ప్రేయసికి తనకిష్టమైన హిందీ పాటలు వినిపించాలనుకుంటాడు ప్రియుడు. ప్రేయసికేమో తెలుగు పాటలిష్టం. ఏవేవో మాట్లాడనుకుంటాడు ప్రియుడు, కానీ వారు కలిసినప్పుడు ఆ సమావేశం – ఇద్దరు మేధావులు పావుగంట సేపు కలుసుకున్నంత మౌనంగా ఉంటుంది. ప్ర్రేమంటూ అమ్మాయిల వెంట పడేవారి మనస్తత్వాన్ని ఈ కథలో వివరించే ప్రయత్నం చేసారు రచయిత.

రామం ఇంజనీరింగ్ పాసయి ఉద్యోగం చేస్తూ, పెళ్ళికి సిద్ధంగా ఉంటాడు. పెళ్ళిచూపుల కోసం ఓ పల్లెటూరు వెడితే, అక్కడ అతన్ని స్వాగతించడానికి కాబోయే పెళ్ళికూతురు రాధే స్వయంగా వచ్చేసరికి రామం ఆశ్చర్యపోతాడు. వాళ్ళిద్దరూ నడుస్తూ రాధ వాళ్ళింటికి బయల్దేరుతారు. రాధ ఆధునిక యువతని, ఆమె ఇష్టాలు, తన ఇష్టాలు కలవవని రామం అర్థం చేసుకుంటాడు. ఇల్లు చేరాక, రాధ కుటుంబ సభ్యులతో పరిచయాలవుతాయి. అందరూ అతనిని ఆకట్టుకుంటారు. ” నాకు ఆంధ్ర వనిత కావాలి గానీ, ఆధునిక వనిత కాదని ఎలా చెప్పడం?” అని రామం తటాపటాయిస్తాడు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే “వేయబోవని తలుపు” కథ చదవాల్సిందే.

వారిజాక్షులందు” కథలో రైలు ప్రయాణంలో జరిగే పదనిసల్ని హాస్యంగా వివరిస్తారు రచయిత. ప్రయాణంలో ఆడ మగల మధ్య అనవసరంగా సాగే సంభాషణల పట్ల చిరాకు వ్యక్తం చేస్తారు. ‘ అసలెందుకు వారిజాక్షులందు కుర్రాళ్ళు చిత్తం చిత్తం అంటారో ‘ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ‘ చిత్తం చిత్తమే ‘నని నవ్వుతారు. ఈ కథలోని ఓ వాక్యం ‘ రైల్లో పరిచయాలు రైల్లోనే. రైల్లో లవ్ అంటే సినిమాల్లో హర్షిస్తారేమో గానీ బైట తంతారు…. ‘ చాలా వాస్తవికంగా ఉంటుంది.

‘మనుషుల మీద నమ్మకం లేకపోతే జీవితం జిడ్డుగా అయిపోతుంది. స్మూత్‌నెస్ నశిస్తుంది’ అని అంటారొకరు. ఎందుకు? ఏ సందర్భంలో అలా అనాల్సివచ్చిందో తెలుసుకోవాలంటే “సన్నాయి పాట” కథ చదవాలి.

‘కొందరు ముందు సంపాదిస్తారు, కొందరు వెనుక. కొందరు ఎక్కువ సంపాదిస్తే మరికొందరు తక్కువ.. కొందరు న్యాయంగా, కొందరు అన్యాయంగా… ఏది కావలిస్తే అది ఎన్నుకో. దేని సుఖాలు దానివి, దేని కష్టాలు దానివి’ అంటారు రచయిత “సరాగమాల” కథలో.

‘ప్రతీ విషయానికి కదిలీ, అసంతృప్తి స్థితిలో, అసహాయ స్థితిలో, క్షణక్షణం స్ట్రెస్‌కి స్టెయిన్‌కీ లోనౌతూ ఏదో చేయాలని తెలిసినా ఏం చేయాలో తెలీక ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్న యువతీయువకుల కథ “హంతకుడి కథ“.

‘మనుషులు ఎందుకు వాళ్ళ తెలివితేటలని చూపాలని ప్రయత్నిస్తారు?’ అని అడుతుతూ, ‘బ్రిలియన్సీ మస్ట్ బీ ఎపారెంట్, బట్ నాట్ టు బీ ఎక్టివేటెడ్’ అని అంటారు “ముక్కు పుడక” కథలో. ఓ అతివ అతిశయం గురించి చెబుతుందీ కథ. ఓ వైద్యుడు ఆసుపత్రిలో వివిధ రోగులతో ప్రవర్తించే తీరుని తెలియజేస్తుందీ కథ.

క్రేన్” అనే చిన్న కథని చదువుతుంటే, అందులోని వ్యంగ్యానికి మన ముఖంపై చిరునవ్వు కదలాడుతుంది.

ఉత్తమ రచనలు ఉన్నాయా లేవా అంటూ ఈనాడు మనం వాపోతున్నట్లే, దాదాపు ఇరవై ఐదేళ్ళ ఏళ్ళ క్రితం రచయిత కూడా వాపోయారు. ‘ నీకు చూడాలని ఉండాలే గాని ఎక్కడ చూస్తే అక్కడే కనిపిస్తుంది ఉత్తమ రచన. మనం గ్రహించడంలో ఉంటుంది’ అంటారు రచయిత “నత్తివాడి కథ“లో. నత్తితో ఆత్మన్యూనతకి గురైన ఓ వ్యక్తి పుస్తకాలతో స్నేహం చేస్తాడు. రేడియో వినడం అలవాటైన అతనికి రేడియోలో మాట్లాడేవారిలో చాలామంది అనేక పదాలను సరిగా పలకలేకపోతున్నారని అర్థమవుతుంది. ‘నాకు తెలిసినా పలకలేను’ అనుకుంటాడు. ఆర్ద్రత నిండిన కథ ఇది.

కథకుడి కథ” లోని ఘటనలు దాదాపుగా అందరు రచయితలకు ఎదురయ్యేవే.

లీవిట్” కథ తాము సంస్కారవంతులం అనుకునేవారి సంస్కారాన్ని బయటపెడుతుంది.

సాహిత్యం కథ” లో రచయిత వర్ణించిన పరిస్థితులు ఈనాటికీ కొనసాగుతునే ఉన్నాయి. ‘సాహిత్యం కూడా బురఖావే’ అయిపోయిందని వాపోతూ, ఎక్కడో సుదూర సీమలో సాహిత్యాన్ని జీవితం కంటే విలువైనదిగా భావిస్తూ, సాహిత్యాన్ని పీలుస్తూ, సాహిత్యాన్ని జీవిస్తూ, ప్రపంచం దృష్టిలో పడని వారి కోసం రాసిన కథ ఇది.

కట్నం తీసుకోడాన్ని ఇద్దరు ప్రేమికులు ఎలా సమర్థించుకున్నారో, ఎంత గడుసుగా ప్రవర్తించారో తెలుసుకోవాలంటే “డౌరీ హౌ మచ్” కథ చదవాలి.

కుష్టు వ్యాధిగ్రస్తుడు బస్ ఎక్కితే, అతన్ని ఆ బస్ ఎక్కేందుకు అనుమతించినందుకు తోటి ప్రయాణీకులు విసుక్కుంటారు, ఆ ప్రయాణం చేయాల్సివచ్చినందుకు తమని తాము నిందించుకుంటారు. అయితే అదే బస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆ వ్యాధి అంత ప్రమాదకరం కాదని, సరైన మందులు వాడితే తగ్గిపోతుందని బిగ్గరగా అరచి చెప్పాలనుకుంటాడు. కానీ ఏమీ మాట్లాడక మౌనంగా ఉండిపోతాడు. అప్పటి దాక తనని తాను – రోగుల వ్యధని గుర్తించగలిగే వైద్యునిగా ఊహించుకున్న అతను కూడా ఓ రోగే. గొంతు కాన్సర్ కారణంగా అతని స్వరపేటిక తొలగించబడింది. “సాటి మనిషి కష్టాలు అర్థం చేసుకోడానికి నువ్వు అలాంటి కష్టాన్ని పడివుండాలి అనే సత్యాన్ని చెబుతున్నట్లుగా రెండు కన్నీటి చుక్కలు రాలి నేల మీద పడతాయి. “వెన్నెల సోన” అనే కథ చదవండి.

ఈ కథలను రచయిత 1971/72 నుంచి 1979 మధ్యలోనూ, ఐ.సి.సి.యు అనే కథని 1981-82 మధ్యకాలంలోను రాసారు. వీటిని ఓ సంకలనంగా తెచ్చే ప్రయత్నం 2010 నాటికి సాధ్యమైంది. ఈ కథా సంకలనాన్ని జులై 2010లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ప్రచురించారు.

మంచి కథలున్న ఈ శ్యామ్‌యానా డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది
శ్యామ్‌యానా On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>