గమనం

రచయిత సత్యభాస్కర్ రాసిన కథల సంపుటి గమనం. రచయిత ఓ ప్రభుత్వరంగ పరిశ్రమలో పనిచేస్తుండడం వలన చాలా కథలలోని ఇతివృత్తం ఫాక్టరీలు, అక్కడి వాతావరణం, ‘ పెద్దసార్లు’, వారి లీలలు, సూపర్‌వైజర్ల గూఢచర్యాలు, యూనియన్లు, ఎన్నికలు, మొదలైన వాటి చుట్టూ తిరుగుతుంది. ఇందులో చాలా కథలను కార్మికుల కోసం ఉద్దేశించిన పత్రిక కోసం రాసినా, అవి మాములు పాఠకులని సైతం చివరిదాక చదివిస్తాయి.

ఈ సంకలనంలోని కొన్ని కథల గురించి తెలుసుకుందాం.

ముందడుగు” కథలోని ఆడపిల్లలు తమ చిన్నతనంలో తండ్రి పురుషాహంకారంతో ప్రవర్తిస్తే ఎదురు చెప్పలేరు, ఓ స్నేహితురాలి సాయంతో కొత్తగాలి పీల్చుకోడానికి చేసే ప్రయత్నాలను తండ్రి అడ్డుకుంటాడు. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఆ స్నేహితురాలి సాయంతోనే ఆ కుటుంబంలోని మరో అమ్మాయి తన భర్తతోను, కూతురితోను కలసి జీవితంలో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తుంది

ఆర్ధికావసరాలు ఎక్కువగా ఉన్న ఓ కార్మికురాలిని యజమాని కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేసి, ఓ ఆదివారం పూట ఆయనగారు ఉండగా డ్యూటీ పడేట్లు చేస్తుంది ఆమెపై అజమాయిషీ చేసే మరో మహిళ. అయితే, తోటి కార్మికురాలికి తన గోడు వెళ్ళబోసుకుంటే, సాటి కార్మికురాళ్ళతో కలసి వారంతా పెద్దసారుని చితక్కొట్టి, ఆమెకి క్షమాపణ చెప్పిస్తారు. ఆయనకి మొదటిసారిగా పనివాళ్ళంటే వణుకు పుట్టిన విధానాన్ని చెబుతుంది “ఎర్ర కలువలు” కథ.

తమ ఫాక్టరీని అక్రమంగా లాకౌట్ చేస్తే, తన భవిష్యత్తుని తలచుకుని బెంగపడతాడు ప్రభాకరం. లాకౌట్ త్వరగా ముగిసి పని మొదలైతే బాగుండని అనుకుంటాడు. కానీ యాజమాన్యం దిగిరావడం లేదు, కార్మికులు పట్టువీడడం లేదు. తన కన్నా తక్కువ జీతం ఉన్న కార్మికులు తాడో పేడో తేల్చుకోవాలనుకుంటుంటే ప్రభాకరం మాత్రం భయపడతాడు. రాములు అనే కార్మికుడు పోరాడుతునే కూరగాయలు అమ్మడం, తన భార్య, తోటి ఉద్యోగి భార్య రెడీమేడ్ వస్త్రాలు కుట్టివ్వడానికి అంగీకరించడం, పెద్ద కూతురు ట్యుటోరియల్ కాలేజిలో క్లాసులు తీసుకుని ఆర్ధికంగా భరోసా కల్గించడం వంటి చర్యలతో ప్రభాకరంలోనూ ధైర్యం వస్తుంది. “పరిష్కారం” కథ చివరి దాక చదివిస్తుంది.

కుంచెవాడు” ఉద్యోగం పోగొట్టుకున్న ఓ ఫాక్టరీ వర్కర్ కథ. బ్రతుకు తెరువు కోసం ఇళ్ళకి సున్నాలు వేసుకుని జీవిస్తూంటాడు. వేరే ఫాక్టరీ ఉద్యోగి ఇంట్లో సున్నం వేయడానికి పిలిస్తే, బేరం కుదరదు, వాళ్ళ బావమరిది మాట తూలితే, సున్నం వేసే వ్యక్తి “నేనూ ఒకప్పుడు మీలాంటి ఫాక్టరీ వర్కర్‌నే అని చెబుతాడు. ఆ క్షణంలో అతని పట్ల తృణీకార భావంతో ఉన్న ఇంటి యజమాని అతను అడిగిన మొత్తానికే సున్నం వేయించడానికి అంగీకరిస్తాడు. కార్మికుల మధ్య ఉండే సౌభాతృత్వాన్ని తెలియజేస్తుందీ కథ.

ఉద్యమంలో పనిచేసే భార్యభర్తలు పార్టీ కోసం చెరో దిక్కుకీ పోతే, వారికి పుట్టిన బిడ్డ వేరే వారి దగ్గర పెరుగుతాడు, బాగా చదువుకుంటాడు. కానీ అతను కూడా….విప్లవ ఉద్యమానికి ఊతం ఇవ్వసాగాడు. ఈ కుటుంబం కథే “గమనం” .

తాను ఫాక్టరీలో చేసే పనంత పనీ ఇంట్లో తన భార్య చేస్తుందని గ్రహించిన వ్యక్తి తన అలవాట్లు మార్చుకుని వంటింటి పనిలో భార్యకి సాయం చేయడం మొదలు పెడతాడు. సామాజిక ప్రయోజనం ఉన్న కథ “కష్టజీవి“.

కార్మిక సంఘాల ఎన్నికలలో వస్తున్న మార్పులను, చోటు చేసుకుంటున్న అవినీతిని వర్ణిస్తూ, కార్మికులు ఎలా మసలుకుంటే వారికి ప్రయోజనకరంగా ఉంటుందో చెబుతుంది “చైతన్య పథం” కథ.

ఒకప్పుడు ఆత్మాభిమానంతో బ్రతికిన రైతు, సర్వం కోల్పోతే ఏమవుతాడో తెలుసుకోవాలంటే.. “రోడ్డున పడ్డ మనిషి ” కథ చదవాలి.

ఈ పుస్తకంలో మొత్తం 15 కథలున్నాయి. “జీవితం పట్ల ప్రేమ, మనిషి పట్ల విశ్వాసం, జీవనం పట్ల అచంచలమైన నమ్మకం ఈ కథానికలకు శక్తి సంపన్నతలో పాటు సాహిత్యపు విలువలు అందించాయని” ఆచార్య కొలకలూరి ఇనాక్ పేర్కొన్నారు. జనమిత్ర ప్రచురణలు ఈ కథాసంపుటిని నవంబరు 2010 ప్రచురించారు.

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల 67/- రూపాయలు. నెలకి 30/- రూపాయల అద్దెతో ఈ కథల సంపుటిని చదువుకోవచ్చు.

గమనం-కథల సంపుటి On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

One thought on “గమనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>