‘తెలీని రహస్యాలు’ తెలిస్తే అంతా మేలే – మనకే తెలీని మన రహస్యాలు పుస్తకంపై సమీక్ష

అన్ని ప్రశ్నల్లోకి అతి పెద్ద ప్రశ్న ‘నేనెవరు?’ అనేది. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే, ఇంక అడగవలసిన ప్రశ్నలు గాని, తెలుసుకోవలసిన సమాధానాలు గాని వుండవు. ఉపదేశంకోసం తన దగ్గరకు వచ్చిన వాళ్ళతో రమణమహర్షి చెప్పేవారట, ‘ఈ ప్రశ్ననే ఎవరికివారు వేసుకొని సమాధానం వెతుక్కోండి’ అని. ఒక ఉపనిషత్తులో శిష్యుడు అడుగుతాడు. ‘ఏ ఒక్కటి తెలుసుకొంటే బయట కనిపించే ఈ చరాచర ప్రపంచం అంతా తెలుస్తుంది?’ అని. బహుముఖాలుగా, చిత్ర విచిత్రాలుగా భాసిస్తున్న ఈ రంగుల ప్రపంచం తెలుసుకోవటం ఏ ఒక్కరికైనా ఎలా సాధ్యం అంటే తననుతాను తెలుసుకొన్నప్పుడు, ఆత్మజ్ఞానం అలవడినప్పుడు సాధ్యమవుతుంది అనవచ్చు.
మన వేదాంతం అంతా ఇందుకొరకే, అంటే, తానెవరో తాను తెలుసుకొనేందుకే ఉద్దేశించబడింది. ఆ వేదాలు, వేదాంతాలైన ఉపనిషత్తులు వేల ఏండ్ల నాటివి కావటంవల్ల, అప్పటి సాంఘిక పరిస్థితులు ఈనాటి స్థితిగతులకంటే వేరుకావటంవల్ల, జన సామాన్యానికి అవి అందుబాటులోకి రాక, అవి అన్నీ గూఢార్థాలుగా, వేదాంత రహస్యాలుగా వుండిపోయినవి. భావం చెడకుండా వాటిని మళ్ళీ మన భాషలోకి మన పరిస్థితుల కనుగుణంగా మలుచుకోవలసిన అవసరం నేటి కాలానికి ఎంతైనా వుంది.
అలాంటి ప్రయత్నంలో భాగంగానే డాక్టర్ వాసిలి వసంతకుమార్ రాసిన అనేకానేక గ్రంథాలు. వాటిల్లో ‘‘మనసు గెలవాలి’’ గ్రంథంలో మనసు మర్మం విప్పిచెప్పినా, ‘‘77 సాధనా రహస్యాలు’’, ‘‘56 ఆత్మదర్శనాలు’’ గ్రంథాలలో సంఖ్యాపరంగా తాత్వికతను గురించి విశదీకరించినా వారికివారే సాటి అనిపించుకున్నారు.
ప్రస్తుత గ్రంథం ‘మనకే తెలీని మన రహస్యాలు’లో రచయిత ఆ రహస్యాలేమిటో చెప్పి, మనలోమనకే తెలీని ఇన్ని రహస్యాలున్నాయా? అని ఆశ్చర్యపడేట్టు చేశారు. ఒక విధంగా మనం వాస్తవికంగా ఏమిటో తెలిసేట్టు చే శారు. ఏ రహస్యమైనా అది తెలియనంతవరకే రహస్యం. తెలిసిన తరువాత బట్టబయలు. ఆ రహస్యాలు ఏమిటో తెలుసుకోని మనిషి కష్టాల పాలవుతున్నాడు అనీ, తెలుసుకొని, వాటిని అధిగమించి సుఖ జీవితం గడపాలనీ రచయిత కాంక్షిస్తున్నారు.
నిత్యజీవితంలో ఎదురుపడే సంఘటనలను ఆధారంచేసుకొని వెలువరించిన సార్వకాలిక సత్యాలు రచయిత నిశిత పరిశీలనా దృష్టికి మచ్చుతునకలుగా నిలుస్తవి. ఉదాహరణకు:
1. జీవితాన్ని దొర్లించేస్తుంటే ఉప్పగానే వుంటుంది. జీవితాన్ని కదిలించగలిగితే కర్పూరమే అవుతుంది. – పేజీ 19.
2. పడుకోబోయేముందు లెక్కల పద్దులు రాయగలమేకానీ ఏం సాధించామన్నది డైరీకి ఎక్కించాలంటే కలంలో సిరా ఉన్నా
జీవితంలో సారం కనిపించదు. – పేజీ 38.
3. ఇంతకాలం మనం ఇతరులతో పోటీపడుతూ వచ్చాం… ఇప్పటినుండయినా మనతో మనం పోటీ పడగలమా అన్నది ప్రశ్న.
– పేజి 39.
4. ఇతరుల మెప్పుకోసం మన బ్రతుకును దుర్భరం చేసుకోకూడదు. – పేజి 94
5. మనకు మనమే కేంద్రం కావాలన్న ప్రయత్నమే ధ్యానం. – పేజి 132
6. గడప దాటితేనే గదా ప్రపంచం కనిపించేది అన్నట్టుగా మనం కూడా ఎన్నోవిధాల మన గడప దాటాల్సిందే! మన ప్రమేయం లేకుండా మనపై బడ్డ ముసుగులను తొలగించుకుంటూ పోవలసిందే! అప్పుడే మనం సరికొత్తగా కాంతులీనుతాం. – పేజి 138
డాక్టర్ వాసిలి వసంతకుమార్ రచనలన్నీ ఆధునిక ఉపనిషత్తులు అయితే, వాటిల్లో ప్రస్తుత గ్రంథం ‘మనకే తెలీని మన రహస్యాలు’ ఒకటి

-దీవి సుబ్బారావు, అక్షర, ఆంధ్రభూమి, 21/06/2014

మనకే తెలీని మన రహస్యాలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

మనకే తెలీని మన రహస్యాలు on kinige

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>