అమ్యూజింగ్స్

మదనపల్లిలో జువాలజీ లెక్చరర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఎ. పుష్పాంజలి గారు రాసిన కథల సంకలనం “అమ్యూజింగ్స్”. దేశకాలమాన పరిస్థితులను బట్టి మారిపోయే ఇజాల మీద తనకి నమ్మకం లేదని రచయిత్రి తన మాటలో తెలిపారు. ఈ సంకలనంలోని చాలా కథలలో వినిపించే స్వరం – ఆధునిక యుగంలో విద్యావతైన మధ్యతరగతి భారతనారిది. ఈ కథలు సమిష్టి కుటుంబ వ్యవస్థకి మూల స్తంభమైన వివాహ వ్యవస్థని నాశనం చేయమని చెప్పకుండా కుటుంబంలో స్త్రీకి గౌరవప్రదమైన ఫెయిర్ డీల్ కోరుతాయి.
ఇందులోని కొన్ని కథలను పరిచయం చేసుకుందాం.
ఈక్వేషన్: ఓ ఆఫీసర్ తన ఆఫీసులో పనిచేసే ఓ వివాహితని మోహించి, ఆమెతో ‘స్నేహం’ పెంచుకోవాలని ప్రయత్నించి ప్రయత్నించగా…ఆమె ఇంటికి వెళ్ళగలిగేంత చనువు సంపాదిస్తాడు. ఓ సారి ఆమె ఇంటికి వెడతాడు. మాటల సందర్భంలో తన భార్య కూడా ఉద్యోగిని అని, తన కుటుంబం గురించి చెప్తాడు. ‘ ఇల్లు చూద్దాం ‘ అంటూ ఆమెని తొందర పెడుతు అడ్వాన్స్ అవడానికి ప్రయత్నిస్తూ ఆమె అందాన్ని పొగుతుంటాడు, “మీ అందాన్ని చూసాకా, మీ బెడ్‌రూం ఇంకెంత అందంగా ఉంటుందో చూడాలని ఉంది’ అని అంటాడు. ఆమె మాత్రం అతని తొందరపాటుని పట్టించుకోకుండా, “మీరు విశాల హృదయలనుకుంటా, మీకిది బాగా అలవాటా?’ అని అడుగుతూ ‘ ఒక వేళ మీ భార్య కూడా ఎవరినైనా ఇష్టపడితే…అయినా మీరు విశాల హృదయులు కదా’ అని అంటుంది. ఆ మాటలలోని హేళనని గుర్తించినా, పట్టించుకోకుండా ఇల్లు చూడ్డానికి లేస్తాడు. ఓ గదివైపు నడుస్తుంటే అంత పెద్ద బెడ్‌రూమా అని ఆశ్చర్యపోతాడు. తీరా గదిలోకి ప్రవేశించాకా తెలుస్తుంది, అదో వర్కింగ్ రూమ్‌ అని. దాంట్లో ఆమె భర్త పనిచేసుకుంటూ ఉంటాడు. అతన్ని ఎక్కడో చూసినట్లనిపిస్తుంది. లీలగా గుర్తొస్తుంది… ఆయన చీఫ్ సెక్రటరీ అని, తనలాంటి ఆఫీసర్లందరికీ అధికారి అని. ఒక్కసారిగా కంగారు పడిపోతాడు. “బెడ్ రూం చాలా లోపలికి ఉంది, దాన్నిండా పుస్తకాలే” అని ఆమె చెబుతుంటే… అతను బెడ్‍రూమ్ వైపు కాకుండా రోడ్డు వైపు నడుస్తాడు.

బామ్మగారు – ఇంటర్నేషనల్ స్కూల్: ఆధునికత పేరుతో, ఆంగ్ల భాష మీద మోజుతో మాతృభాషలో బోధనని తిరస్కరిస్తూ, తెలుగులో మాట్లాడుకునే పిల్లలకి ఫైన్ విధించే ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌‍ యాజమాన్యానికి ఓ బామ్మగారు చెమటలు పట్టించి తెలుగులో బోధన జరిగేలా, పిల్లలకి తెలుగు సాహిత్యం గురించి చెప్పేలా చేయించిన విధానాన్ని తెలుపుతుంది ఈ కథ. ఆంగ్ల భాష మీద అవాజ్యమైన మమకారంతో, పిల్లలకి మాతృభాష సైతం నేర్పని తల్లిదండ్రులపై వ్యంగ్యాస్త్రాలు విసురుతుంది ఈ కథ.

వైరుధ్యం: వసంత “కారుణ్య” అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు. తన సంస్థ ద్వారా వృద్ధులకు, అనాధ పిల్లలకు వసంత ఎన్నో సేవలందిస్తుంది. గొప్ప సంఘ సేవికగా ఎంతో పేరు తెచ్చుకొంది. అయితే శాశ్వతంగా వారి ఇంట్లో ఉండిపోడానికి ఆమె మేనమామ కొడుకు శివ రావడంతో ఆమె వ్యక్తిత్వంలోని వైరుధ్యం బయటపడుతుంది. తమ చిన్నతనంలో తన మేనమామ భార్య తన పట్ల ప్రవర్తించిన క్రూరత్వానికి ఆమె కొడుకుపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుని అనుక్షణం శివని మానసికంగా హింసిస్తుంది. చివరికి ఆ బాధలు తట్టుకోలేక శివ ఇల్లు వదిలి పారిపోతాడు. చివరికి ఆమెలో ఆత్మసంఘర్షణ మొదలవుతుంది. ఎప్పుడో తన మేనమామ, అతని భార్య చేసిన దుర్మార్గాలకి ఇప్పుడు వాళ్ల సంతానంపై తాను పగతీర్చుకోడం రాక్షసత్వమని గ్రహిస్తుంది. చివరికి దినపత్రికలో ప్రకటన ఇచ్చి, శివని ఇంటికి రప్పించుకుంటుంది. శివ ఇంటికి వచ్చాక అతనికి పట్టుకుని వసంత కార్చిన కన్నీరు ఆమె మనోమాలిన్యాన్ని కడిగేస్తుంది.

తడి: ఇద్దరు అక్కచెల్లెళ్ళ కథ ఇది. అక్క సులోచన బాగా చదువుకుని డబ్బున్న కుటుంబంలోని రవిని పెళ్ళాడితే, చెల్లెలు సువర్చలకి పెద్దగా చదువబ్బదు, ఆమె తన పల్లెటూరి బావనే పెళ్ళాడుతుంది. వివాహం తర్వాత సులోచనకి అన్నీ కలిసొస్తాయి, సువర్చల పరిస్థితి మరింత దిగజారుతుంది. వీరిద్దరి తల్లి లక్ష్మీకాంతమ్మ. ఒకసారి ఊరెళ్ళినప్పుడు తల్లి పోళ్ళకమ్మలు చెవులకి పెట్టుకుని, తిరిగి ఇవ్వడం మరచిపోయి తన ఊరు వచ్చేస్తుంది సులోచన. ఆ తర్వాత తల్లి ఫోన్ చేసిన ప్రతీ సారీ ఆ కమ్మలని తెమ్మని అడుగుతుంటూంది. సులోచనకేమో తల్లి వాటిని తన చెల్లెలికి ధారపోస్తుందేమోనని భయం, ఎందుకంటే ఆమె తల్లికని ఇచ్చిన ఎన్నో వస్తువులను తల్లి తను ఉంచుకోకుండా సువర్చలకి ఇచ్చేసింది. తన తల్లి ధోరణి గురించి భర్తకి చెప్పుకుని వాపోతుంది సులోచన. “నీకు అక్కర్లేని వస్తువు ఎక్కడుంటే మాత్రం నీకెందుకు? అయినా సువర్చల మాత్రం పరాయిదా?’ అని అంటాడు రవి. అయితే తన చెల్లెలుది కాకాలు పట్టే తత్వం అని భ్రమపడుతుంది సులోచన. అయితే ఒక్కోసారి అంతర్మధనం జరిగినప్పుడు మాత్రం తనని తాను విశ్లేషించుకుంటుంది. ఒకసారి తల్లికి జబ్బు చేసిందని కబురు వస్తే, ఆమె ఊరు చేరేసరికి తల్లి చనిపోయి ఉంటుంది. ఆ సందర్భంగా పోళ్ళకమ్మల గురించి పిన్ని చెప్పిన మాటలు ఆమెకి దిగ్భ్రమ కలిగిస్తాయి. అనేక సంవత్సరాలుగా పొడిబారిన సులోచన హృదయంలో తడి!! అంత తడిని ఇముడ్చుకోలేని గుండె వాటిని అశ్రువులుగా మారిస్తే, కన్నీళ్ళు ఆగకుండా ప్రవహిస్తాయి. అక్క అంతలా ఏడవడం చూసి చెల్లెలు వచ్చి సులోచనని కౌగిలించుకుంటుంది. ఇన్నాళ్ళు ఆ అక్కచెల్లెళ్ళిద్దరికీ మధ్యగా ఉన్న ఒక పెద్ద గోడను కూలగొట్టిందా కౌగిలి.

బాధ్యత: ఇది దమయంతి అనే పేరుమోసిన ఓ స్త్రీవాద రచయిత్రి కథ. స్త్రీ జనోద్ధారణకి నడుం కట్టుకున్న ఆమెకి స్వయంగా తనకి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించే చొరవ లేదు. ఆమె స్తబ్ద జీవితాన్ని గడుపుతూ, రచనలు చేస్తూంటుంది. ఆమె సాహసం చేయకుండా ఇతర మహిళలను బలిపశువులని చేసిన వైనాన్ని ఈ కథ తెలియజేస్తుంది.

ఆశలపాశం: పరిస్థితులు అనుకూలించనప్పుడు మనుషుల్లో వైరాగ్యం కమ్ముతుంది, అప్పటి దాక చేసిన తప్పులు గుర్తొస్తాయి, దిద్దుకోడానికి ప్రయత్నిస్తారు. తీరా పరిస్థితులు మెరుగుపడ్డాక మళ్ళీ స్వార్ధం కమ్మేస్తుంది. అప్పటి దాక సాయం చేసిన వారిని పట్టించుకోరు. మనుషుల్లోని ఈ సంకుచిత నైజానికి ఈ కథ అద్దం పడుతుంది.

అమ్యూజింగ్స్: ఓ మంచి కథ రాద్దామని కూర్చున్న ఓ రచయిత్రిలో కలిగిన భావ వెల్లువ ఈ కథ. కథ రాసే ప్రయత్నంలో భాగంగా ‘రచయిత ఒక స్త్రీగానో, పురుషుడిగానో రాయడం తనని తాను ఓ చట్రంలో బిగించుకోడమేనని’ గ్రహిస్తుంది. ఓ సీరియస్ కథ రాద్దామనే ఆమె ఆలోచన క్రమంగా మారుతుంది. “అసలెందుకు రాయాలి సీరియస్ కథ? మనుషులు సీరియస్! సమాజం సీరియస్! బతుకులు సీరియస్! అన్నీ…. అన్నీ సీరియస్….. కథలైనా ఉల్లాసంగా ఉండకూడదా?” అని ప్రశ్నించుకుంటుంది. అన్ని ప్రశ్నలకి మానవతావాదం సమాధానం చెబుతుందని తెలుసుకుంటుంది. ఈ కథ సాగే క్రమంలో కథకురాలి జీవితంలో తటస్థపడిన పాత్రల గురించి తెలుసుకుంటాం.

తెలిసినవాళ్ళు: అమృత బొంబాయి నుంచి మద్రాస్ మీదుగా విజయవాడ వెళ్ళడం కోసం దాదర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతుంది. ఆ భోగీలోనే తెలుగువారైన ఓ బామ్మగారు, ఆమె మనవడూ కూడా ఉంటారు. వాళ్ళ మధ్య సంభాషణలు మొదలవుతాయి. మాటల సందర్భంగా అమృత తన సొంత ఊరిని, కుటుంబ సభ్యులని తలచుకుంటుంది. అమృత బొంబాయిలో ప్రేమించి పెళ్ళిచేసుకుది. ఆస్తిలో ఆమెకు వాటా ఇవ్వకూడనే ఉద్దేశంతో ఓ సారి సొంతూరికి వచ్చిన అమృతతో వదినలిద్దరూ కటువుగా ప్రవర్తిస్తారు. ఆమె వల్ల తమ పిల్లకి సంబంధం తప్పిపోయిందని నిందిస్తారు. కాలక్రమంలో అన్నలిద్దరూ ఆస్తుల్ని పోగుట్టుకుని పేదలవుతారు, ఎలాగో అమృత ఫోన్ నెంబరు తెలుసుకుని ఆమెని మాయమాటలతో నమ్మించి ఆమె కూతురిని తమ కొడుకులకి పెళ్ళి సంబంధం కలపాలని ప్రయత్నిస్తారు. చివరికి నెల్లూరు రైల్వే స్టేషన్‍లో కలుసుకొని అమృతని ఆకట్టుకోడానికి యత్నిస్తారు. వారందరిని చూసి బామ్మగారు ఆశ్చర్యపోతారు. చివరికి రైలు కదిలాక, “ఎవరమ్మా వాళ్ళంతా?” అని అడిగితే “తెలిసిన వాళ్ళు” అని జవాబు చెబుతుంది అమృత.

తారకమంత్రం: తమ ఇంట్లో అద్దెలకుండే వారిని ఇంటి ఓనర్లు ఎలా వాడుకుంటారో ఈ కథ చెబితుంది. వారు చెప్పినది చేయకపోయినా, అడిగింది ఇవ్వకపోయినా వారి నోట వెలువడే తారకమంత్రం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే. హాస్యంగా సాగుతుంది ఈ కథ.

పొదుపులక్ష్మి: పొదుపు పేరుతో ఇరుగుపొరుగు వాళ్ళతో ఖర్చులు చేయించి, తన వంతు వచ్చేసరికి ఏదో వంకతో చల్లగా తప్పుకునే మహిళ కథ ఇది. సరదాగా సాగినా ఆలోచింపజేసే కథ ఇది.

చేసాక చెప్పు: వాణి, సుధాకర్ భార్యాభర్తలు. ఇద్దరూ చిరుద్యోగులు. మధ్యతరగతి కుటుంబం. పొద్దున్న లేస్తున్నే అన్ని పనులు చేసుకుని ఏడింటింకల్లా బస్ ఎక్కాలి వాణి ఆఫీసుకు వెళ్లడానికి. ఓ అరగంట తర్వాత సుధాకర్ బయల్దేరుతాడు. ఫ్రిజ్ కొనుక్కున్నాక ఓ పూట వండేసుకుని, రాత్రి పొద్దున్న పదార్థాలనే వెచ్చజేసుకుని తింటూంటారు. ఓ సారి సుధాకర్ అమ్మ వచ్చి వీళ్ళ ఇంట్లో పది రోజులుండి వెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఆసక్తిదాయకం.

రచయిత్రే స్వయంగా ప్రచురించుకున్న ఈ సంకలనంలో 19 కథలు ఉన్నాయి. విషయ వైవిధ్యం వలన, హాస్య చమత్కార పూరిత శైలి వలన ఈ కథలన్నింటిని చకచకా చదివేసుకోవచ్చు.

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.90/- రూ. ౩౦/- నెలసరి అద్దెతో కూడా ఈ పుస్తకాన్ని మీ కంప్యూటర్లో చదువుకోవచ్చు.

అమ్యూజింగ్స్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>