సీమ “వేగు చుక్కలు”

భౌతికంగా చూస్తే రాయలసీమ రాళ్ళసీమలానే కనిపిస్తుంది కానీ,తాత్విక కోణం లోంచి ఇది రతనాలసీమ. పద్యం ఎంత లోతుగా , ఎంత బలంగా ఈ సీమలో వేళ్ళూనికొని పోయిందో , తత్వం అంతకన్నా ఎక్కువగా జనం నోట వినిపిస్తుంది. శృంగార , విలాస వస్తువై బ్రాహ్మణ పండితుల భుక్తిమార్గమై , రాజుల లోగిళ్ళలో దొర్లిపడిన పద్యమే , విచిత్రంగా అన్ని బంధాలను తెగతెంచుకొని ,రెక్కలు విచ్చుకొని ఊళ్ళలో,వాడల్లో తిరుగులాడిన దృశ్యమూ రాయలసీమలో కనిపిస్తుంది. పండిత గోష్ఠి లో రాగయుక్తంగా ధ్వనించి ఒకప్పుడు గండభేరుండాలను తొడిగించుకున్న పద్యమే , ఇప్పుడు ఊరి చివర ఎనుమును కోసి భాగాలేసే మాదిగల నోట కమ్మగా వినిపిస్తుంది.ఈ వైరుధ్యపు లోతుల్ని వెతికే పని సాహిత్యంలో ఇప్పటికీ బలంగా జరగలేదనే చెప్పాలి.అయితే ఈ వైరుధ్యపు తీరుతెన్నులను కళ్లకు కట్టినట్లుగా చెప్పే ప్రయత్నం మాత్రం వినోదిని ఇటీవల చేశారు .ఉద్యోగ రీత్యా కడపలో ఉన్న వినోదిని , కడప జిల్లాలో పుట్టి పెరిగిన ముగ్గురు వాగ్గేయకారుల సాహిత్యాన్ని సామాజిక కోణంలోంచి విశ్లేషించారు. ఈ ముగ్గురిలోని సారూప్యతలను పట్టుకున్నారు.తేడాలను గుర్తించారు. అన్నమయ్య ,వేమన, వీరబ్రహ్మం – ఈ ముగ్గురినీ కడప జిల్లా వాసులగానే భావిస్తారు. అన్నమయ్య 15వ శతాబ్దానికి చెందినవాడు , మిగిలిన ఇద్దరూ 17వ శతాబ్దానికి చెందినవారు. అన్నమయ్య బ్రాహ్మణకులంలో పుట్టినవాడు కాగా , వేమన శూద్రుడు, కాపు కులంలో పుట్టాడు . వీరబ్రహ్మం శ్రామిక కులంలో పుట్టిన శూద్ర బహుజనుడు. అయితే ముగ్గురూ , వారి కాలాల్లోని సమాజాన్ని లోతుగా చూసిన వాళ్ళు . ఈ పరిశీలన వీళ్ళలో అలజడిని రేపింది .అసమానతపై ఆగ్రహాన్ని కలిగించింది.లోలోపల జరిగిన ఘర్షణే ఈ ముగ్గురినీ కవులుగా మార్చింది.సమాజంలోని దుర్మార్గపు రీతులను చూసి కలిగిన వైరాగ్యం వీళ్లని తాత్వికులగా మార్చింది. పరిస్థితులని చూసి కలిగే వేదన , ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం ,తిరుగుబాటు తత్వం ఈ సీమ కవిత్రయంలో కనిపిస్తాయి.

అన్నమయ్య , వీరబ్రహ్మం లు దేవున్ని అడ్డం పెట్టుకొని సమాజంలోని కుళ్ళుని బయటపెడితే , వేమన ఏకంగా దేవుడినే కడిగేస్తాడు. దురదృష్టం ఏమంటే , ఈ ముగ్గురు మహాకవులనీ కులాలవారీగా పంచేసుకోవడం . దేవుళ్ళను విగ్రహాలుగా మార్చేసుకోవడం . 32వేల కీర్తనలు రాసిన అన్నమయ్యను తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతంగా జనంలోకి తీసుకువచ్చినా , అది కేవలం భక్తి కోణానికే పరిమితమయ్యింది.వేల కీర్తనల్లో జనం నోట పలికేది వందలే.వాటిల్లోనూ ఎక్కువ భక్తి పదాలే. కొద్దిగా భక్తి చాటున శృంగారమూ కనిపిస్తుంది. కానీ , అట్టడుగు వర్గాల బతుకుచిత్రాన్ని అన్నమయ్య పాటకట్టిన తీరు రావల్సినంతగా జనంలోకి రాలేదు . ‘అన్నమయ్య సామాజిక ధృక్పధం’ అనే శీర్షికతో వినోదిని రాసిన వ్యాసంలో ఆమె ఉదహరించిన పదాలను చూస్తే అన్నమయ్యని ఇంత మిస్సయ్యామా అనిపిస్తుంది.పోతులూరి వీరబ్రహ్మం విషయంలోనూ దారుణమైన అన్యాయము జరుగుతోందని అర్ధమవుతుంది.

గొప్ప సామాజికవేత్తను , ఒట్టి కాలజ్ఞానిగా పరిమితం చేస్తున్న తీరు భాధపెడుతుంది.వీరబ్రహ్మం మహత్యాలను ప్రచారం చేసినంతగా , ఆయన కవిత్వాన్ని జనంలోకి తీసుకెళ్ళడం లేదు . సామాజిక అసమానతలపై దేవుడి చాటునే అయినా , వీరబ్రహ్మం కవిత్వాన్నే ఆయుధంగా మలచుకొని పోరాడిన వైనాన్ని ‘ పోతులూరి వీరబ్రహ్మం’ అనే వ్యాసంలో వినోదిని వెల్లడిస్తారు. పై ఇద్దరిలా కాకుండా లోకరీతిని తప్పుపడుతూ ఎడాపెడా వాయించేసిన కవి వేమన. కుల వైషమ్యాలనీ , దేవుడి పేరిట సాగే దురాచారాలనీ వివక్షని వాడుక మాటల్లోనే దుయ్యబట్టిన వేమన ఇప్పటికీ జనం నాలుక మీద నిలిచిపోయాడు.దళితకోణం నుంచీ , స్త్రీల కోణం నుంచీ కూడా వినోదిని ఈ ముగ్గురు మహాకవుల సాహిత్యాన్ని పరిశీలించారనీ ఈ పుస్తకం చదివితే అర్ధమవుతుంది. వీరి సాహిత్యం మీద ఇంకా లోతైన అధ్యయనం జరగవలసిన అవసరాన్ని వినోదిని వేగుచుక్కలు’ గుర్తుచేస్తుంది.

– ఆర్.యం.ఉమామహేశ్వరరావు , ఆదివారం ఆంధ్రజ్యోతి , 22 జూన్ 2014 .

 

Andhrajyothi_22nd June 2014

 

“వేగు చుక్కలుడిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

వేగు చుక్కలు on kinige

 

Veguchukkalu600

Related Posts:

  • No Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>