ఆకాశం అనంతం. కనిపించే నిర్మలమైన ఆకాశం దాని సహజ రూపం కాదు. అలాగే నిశ్శబ్దంగా అన్నింటినీ భరించేటంత అవనిలోనూ సహజత్వం లేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఆకాశానికి భూమికీ మధ్య జరిగే మానవ సంఘర్షణలు, మనిషి మేధో మధనాల ఫలితమే ఈ అసహన మనోకృతులు ప్రకృతిని కూడా ఆవరించాయి. సముద్రాన్ని దేవతలు మధిస్తే అమృతం వచ్చినట్లు, వీటన్నింటినీ ఎంతో కొంత చదివి ఆకళింపు చేసుకొని సానపడితే తప్ప కథానిక పుట్టదు. తోడిన కొద్దీ మానవ జీవితంలో ఎన్ని సమస్యలున్నాయో వాటికి ఆలోచనాభరిత పరిష్కారాలే కథానికలు. ఒక వ్యక్తి తనకొచ్చిన సమస్యను పరిష్కరించుకోవడానికి ఎంతో ప్రయాస పడుతుంటాడు. అదే సమస్య ఎదుటి వ్యక్తికి రాగానే పరిష్కారం క్షణాల్లో చెప్పేయగలడు. అంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని మనకు అర్థమవుతుంది కానీ ఆ పరిష్కారం మనకెంత వరకు వర్తిస్తుందో అనేది ఆలోచించాల్సిన విషయం. సి.ఉమాదేవి రచించిన ‘మాటే మంత్రము’ అనే కథానికల సంపుటిని కథల సంపుటిగా సంబోధించారు. కానీ నిజానికిది కథానికలు. ఊహాజనితమైన ప్రపంచంలో నిత్యం ఊయలులూగుతూ తమకు దక్కని, తాము ఎదురుచూడని సన్నివేశాలతో కదిలేది కథని, వాస్తవ ప్రతిరూపాలన్నీ కథానికలనీ ప్రముఖ కథకులు వేదగిరి రాంబాబు గారి నుండి తెలుసుకున్నప్పటి నుండి చాలామంది కథానికలే రాస్తారని అర్థమైంది. ఆ కోవలో ఆలోచిస్తే ఉమాదేవి ‘మాటే మంత్రము’ కథానికల కోవలోనివే అని చెప్పవచ్చు.
మానవ జీవతానికి రెండు రిటైర్మెంట్లు. ఒకటి ఉద్యోగరీత్యా, రెండవది జీవితరీత్యా! జీవితరీత్యా రిటైర్ అవ్వడానికి ఇంత వయసని ఎక్కడా లేదు. ఆ వయసనేది దేవుడు నిర్ణయం. కానీ ఉద్యోగరీత్యా రిటైర్మెంట్ అనేది తప్పనిసరి కానీ ఆ సంబంధిత వ్యక్తికి మాత్రం దిగులు ఆవరిస్తుంది. పైకి నవ్వుతూ కనిపించినా తనకున్న ఒక పని పోయేసరికి తను ఇక ఏమీ చేయలేడా? అనే ఆవేదన వెంటాడుతుంది. అందుకు తగినట్లుగా ఉదయమే ఆయనకేం తొందర? ఇంట్లోనే ఉంటారుగా అనే ఇంటిలోని వారి రకరకాల మాటలు వింటున్నా, తనకిన్నాళ్లు ఇచ్చిన ప్రాముఖ్యత ఇవ్వడం లేదనిపించి దిగులు పడిపోయేవారు ఎందరో. అదే విషయాన్ని ‘మౌనమే నీ భాష’ అనే కథలో అనంతం పాత్ర ద్వారా ఎంతో చక్కగా తెలిపారు. నాన్నకు పని లేదు. కనుక ఏదో ఒకటి మాట్లాడతారు’ అనే కొడుకు మాటలకు ఎంతో ఆవేదన చెందిన తండ్రి అనంతం ఇకపై మాట్లాడకూడదని నిర్ణయించుకుని వౌనం పాటిస్తాడు. ఆ మౌనం భరించక తిరిగి కుటుంబ సభ్యులందరూ మీరు మాట్లాడితేనే బావుంది అని దగ్గరకు చేరే సంఘటనల్ని ఈ కథలో చాలా అద్భుతంగా పలికించారు. ఇంట్లో వారు హడావిడిలోనో, కోపంతోనో, పని వత్తిడితోనో ఏదయినా అంటే అందులో ఏ మాత్రం నిజం ఉండదని తెలియజేయడం ఎంతో బావుంది. రచయిత్రి ఉమాదేవి తమదైన శైలిలో రచించారు. వయసు పెరిగినా మనసు పెరగదనేది నిజం అనిపిస్తుంది కొన్ని విషయాల్లో. సృష్టికి ఉదయాస్తమయాలు ఉన్నట్లే, మనిషి ఆకలిదప్పులు, ఆశలు ఆవేశాలు ఉండనే ఉంటాయి. వాటిని గురించి తెలిపే కథ ‘ఏం చేస్తున్నావు బుజ్జీ’ అనే కథ. సెల్ఫోను తనకెందుకు ఇంట్లోనే ఉంటుంది కదా? తనకేమయినా ఫోను వస్తే నాకు చేస్తే నేను ఇస్తాను కదా అనేది సాధారణంగా ప్రతి ఇంట్లో ఉంటుంది. స్త్రీకి స్వతంత్రత ఉండదనే విషయం ఇంకా అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటుంది. అలా కాదు పిల్లలు పెద్దవారయి అమ్మకు ఒక ఫోను ఉండాలి అని కొనిస్తే, ఆ అమ్మకు మెసేజ్ ఇస్తే, అదీ అపరిచిత వ్యక్తి? అనేది సరదాగా సాగిన ఒక సంఘటనను కథానికగా మలచిన తీరు చాలా బావుంది.
ఉమాదేవి కథలన్నీ నాలుగు గోడల మధ్య జరిగే సంఘటనలే. ఇల్లు నాలుగు గోడలే అయినా ఉదయం నించి రాత్రి దాకా నలభై రకాల సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. సమస్యలు అయితేనేం? సామరస్యాలు అయితేనేం? అంతా అపురూపమే! ఇల్లంటేనే ఒక అపురూపం. అలాంటి అపురూప సంఘటనలను ఒకచోట చేర్చి ‘మాటే మంత్రము’ అనే శీర్షికతో కథానికల సంపుటి తీయడం ప్రశంసనీయం. ముఖ్యంగా నాన్న ఉండాలి, నాన్నా నీకేం కావాలి? మీరు క్యూలో ఉన్నారు. జీవిత చక్రం, అమ్మ సన్నిధి, పలుకే బంగారుమాయెనా? వర్షించని కన్నులు లాంటి కథలు పాఠకుల్ని ఎంతో అందమైన లోకంలో విహరించేలా చేస్తాయి. పెదవులపై చిరునవ్వు చిందించేలా చేస్తాయి. మొత్తానికి అందరినీ హాయిగా చదివించే కథలు ఇవి. ఎందరినైనా ఆకట్టుకోగల కథలివి.
-శైలజా మిత్ర, ఆంధ్రభూమి-అక్షర, 09/08/2014.
“మాటే మంత్రము” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.