రేపటి చరిత్రకి దినుసును అందిస్తున్న పత్రికారంగ చరిత్ర మీద మనకి ఆసక్తి తక్కువే. నిజానికి పత్రికారంగంలో వచ్చిన పరిణామాలను గమనించడమూ అవసరమే. ఆ ప్రయత్నంలో భాగమే ‘మీడియా సంగతులు’. ప్రముఖ జర్నలిస్ట్, జర్నలిజం పాఠాలు చెప్పిన మాస్టారు గోవిందరాజు చక్రధర్ ఈ పుస్తకం రాశారు. కాబట్టే పత్రికల నేపథ్యం, పత్రికల నాటి స్థానం, వర్తమానంలో ఉన్న స్థానాల గురించి చాలా లోతుగానే చర్చించారు. చక్రధర్ ప్రతికారంగంలోని వెలుగునే కాదు, చీకటిని తడమడానికి కూడా ప్రయత్నం చేశారు.
ప్రింట్ మీడియా తరువాత జరిగిన ఎలక్ట్రానిక్ మీడియా ఆవిర్భావం, ఇంటర్నెట్ గురించి కూడా ఇందులో చదవవచ్చు. అలాగే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పతనంలో కూడా పెరిగిన పోటీని ఇందులో రచయిత నిభాయింపుతోనే అయినా చర్చించారు. ఏ రంగంలో అయినా మార్పు సహజమే. కానీ మార్పునీ పతనాన్నీ వేర్వేరుగా చూడలేకపోతున్న చానెళ్ల, పత్రికాప్రచురణ సంస్థల మీద చక్రధర్ ప్రదర్శించిన నిరసనను అర్థం చేసుకోవలసిందే. పుస్తకం చివర తెలుగు పత్రికా రచయితల ఫోటోలు ఇవ్వడం రచయిత ఉత్తమ అభిరుచికి నిదర్శనం.
– కల్హణ , సాక్షి ఫన్డే , 20 ఫిబ్రవరి 2014.
“మీడియా సంగతులు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.