పల్లవించిన పల్లె సోయగం..”డాక్టర్ వాసా ప్రభావతి కథానికలు” పుస్తకం పై సమీక్ష

కథకురాలు వాసా ప్రభావతిగారు విలక్షణమైన వ్యక్తిత్వం కలదని వేదగిరి రాంబాబు గ్రంథాదిలో చెప్పినట్టుగా కావచ్చు. కాని ఆమె తన కథల్లో గ్రామీణమైన వస్తువుతోనే ఎక్కువ కథల్ని రాసినట్టు చెప్పుకోవాలి. ఈ పుస్తకంలో ఆమె పదహారు కథల్ని గుదిగుచ్చి తెలుగు కథా సరస్వతి అలంకరించడం విశేషం. ‘ఊరగాయ జాడీ’తో ప్రారంభించి ‘నాకూ ఓ మనసుంది’తో ముగించారు. ఈ సంపుటిలో మూడొంతుల కథలు పల్లె వాసనల గుబాళింపులు, ‘కొత్తవెలుగు’ వంటి తుళ్లింతలు, ‘అనసూయ లేచిపోయింది’ వంటి పలవరింతలు ఈనాటి సమాజాన్ని దృశ్యమానం చేస్తాయి. ప్రతీ కథా పాఠకుడ్ని చివరి వరకు చదివిస్తాయి. ‘న్యాయం గుడ్డిది’ కథ ద్వారా ఆమె కూటికి పేదరాలైనా నిజాయితీగల స్ర్తి ఔన్నత్యాన్ని ఆ ఇంటి యజమానురాలి కొడుకు సానిదానికి సమర్పించిన నగల గురించి చివర్లో ఇంటి దొంగను ఈశ్వరుడే పట్టలేడన్న నీతిని ప్రదర్శించారు. దీనిలో యజమానుల అభియోగం, పోలీసుల జులుం, పేదల పట్ల చులకన ఉంది.
‘ఊరగాయ జాడీ’ కథలో కొంత సాంప్రదాయ వాసన కనిపించినా చుట్టాల కంట్లో అది పడకూడదని యజమాని అది తీస్తూ కిందపడి జాడీ బద్దలవ్వడం, ఊరగాయ బూజు పట్టడం వంటివి సహజత్వానికి దగ్గరగా నిలుస్తాయి. ‘సంధ్య అంచున’ అన్న కథ ఒక ప్రధానోపాధ్యాయురాలు పదవీ విరమణ చేస్తూ భర్తతో తాను ఎక్కువ సమయాన్ని గడపలేకపోయానే అనే ఆవేదన కనిపిస్తుంది. జీవితం చివరిలోనైనా మనం ఒకరికొకరమయ్యాం అనే కొసమెరుపు హాయిగా ఉంది. ‘సిలకమ్మ’ కథలో ఆమె కాస్త విద్యాగంధం కలిగినందువల్ల చిన్నయ్యకు తాకట్టుపెట్టిన పొలం కూలి నాలి చేసి అప్పు తీర్చి పొలం దక్కించుకున్న తీరు బాగుంది. ‘నాన్న కావాలి’ కథలో తన పుట్టుకకు తండ్రిగాని తండ్రి అయిన అతనినే ఆరాధించే బిడ్డలున్న తీరును రచయిత్రి చిత్రించిన తీరు ఆకట్టుకునే దిశలో సాగింది.
‘కామాక్షి కాసులపేరు’ కథలో కథకురాలు ఒక గమ్మతె్తైన ఎత్తుగడతో నగలమీద మోజున్న కూతురిని కష్టపెట్టడం ఇష్టంలేక వెండిదాన్ని కొని దానికి బంగారు మలాము చేయిస్తుంది. అది కొన్ని రోజులకే రంగు మారిపోతుంది. ఆ కాసుల పేరు పుణ్యాన కూతురికి పెళ్లి కుదురుతుంది. ఈ కథలో నిజ జీవితంలో నగల్ని చూసి పెళ్లిళ్లయిపోతే ఆడకూతుళ్లకు అత్తింటి ఆరళ్లు అసలుండవా అనిపిస్తుంది. నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా విషయం తెలియక తప్పదు. ‘వీధి దీపాలు’ కథ ద్వారా భిన్న మతస్తులలో గుడ్డినమ్మకం, అంధ విశ్వాసాలు విడిచిపెట్టి అంతా సోదరులలా జీవించాలని రచయిత్రి సహేతుకంగా వస్తువులో చూపించారు. ‘మిసెస్ రామనాథం’ కథలో పెద్దగా పట్టులేకపోయినా సామాజిక స్పృహతోబాటు స్ర్తిలు కూడా గౌరవార్హులు కావాలన్న బాధ్యతల్ని సూచిస్తుంది. ‘మా బతుకులింతేనా’ కథానికలో వస్తువు మనిషి జీవన పోరాటంగా చిత్రితమైంది. దానిలో తల్లి, కొడుకు వీరితోబాటు ఓ మూగజీవం కుక్క. అట్టడుగు బడుగు జీవులకు తమకురోజులు వెళ్లకపోయినా మరో ప్రాణిని పోషించగల ఉదారగుణం ఉంటుందన్న కారుణ్య దృక్పథాన్ని ఆవిష్కరిస్తుంది.
‘తోడు-నీడ’ ఈ కథానికలో వస్తువు పాతదైనా భార్యాభర్తలలో భర్త ఆమెనే శాసించడం, బాస్‌లా పీడించడం వంటివి సాధారణ విషయాలైనప్పటికీ మహిళల పట్ల మగవారి అలసత్వాన్ని అక్షరీకరించిన వైనం అగుపిస్తుంది. ‘చుక్క’ కథలో నీలిమ అనే యువతిని ఒక దొమ్మరాట వాడు కిడ్నాప్ చేసి తీసికెళ్లి ‘గడసాని’గా చేస్తాడు. ఆమె తాను జీవితాన్ని ప్రారంభించిన ప్రాంతంలోనే విద్యను ప్రదర్శిస్తూ తాడుమీంచి పడి ప్రియుని ఒడిలో కన్ను మూస్తుంది. ఇది కరుణరస పూరితమైన కథ. ‘అంగడి వినోదం’ నేటి వస్త్ర దుకాణాలలో బొమ్మలుగా మనుషుల్ని పెట్టి వారి వ్యాపారం పెంచుకునే తీరును రచయిత్రి చిత్రించారు. దీనిలో బొమ్మలా నిలుచున్న వ్యక్తి తిండి తిననీయకుండా ప్రదర్శిస్తూ పడిపోతే యజమాని జనం వత్తిడికి జడిసి అనుకున్న దానికన్నా పైకం ఎక్కువిస్తే అందులో కొంత దళారీ మింగేస్తాడు. అతని తల్లి ఆ కుర్రాడిని ఆసుపత్రికి తీసికెళ్లడంతో కథ ముగుస్తుంది.
‘గెద్ద’ కథానికలో అత్తగారు ఎరుకల సానిగా సోది చెబుతూ, కోడలు పురుళ్లు పోస్తూ, కొడుకు పందులు మేపుతూ వారు తమదైన శైలిలో జీవిస్తుంటారు. వారి కలిమిలేములను చిత్రిస్తుందీ కథ. డా. వాసా ప్రభావతిగారి కథలు కొన్ని నాటి నేటి వస్తువుల జమిలి నేతతో హృద్యంగా సాగుతాయి.

-మంతెన,22/11/2014,ఆంద్రభూమి – శనివారం – అక్షర

డాక్టర్ వాసా ప్రభావతి కథానికలు” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి..

డాక్టర్ వాసా ప్రభావతి కథానికలు on kinige

 

DoctorVaasaaPrabhavathiKathanikalu600 (1)

Related Posts:

  • No Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>