అపర్ణ కథల్లో రెండురకాల జీవితాల్ని చూస్తాం. ఒకటేమో, అమాయకమైన తెలుగు గ్రామీణ జీవితం, మరొకటి గడసరి అమెరికన్ సంస్కృతి. ‘ఆగుపిల్లా! మామూలు చామంతులు కాదు. ఒకటిన్నర శేరు నక్షత్ర చామంతులు తెమ్మని చెప్పు. చామంతులకి మాచిపత్ర ఆకులు అందంగా ఉంటాయి. అవో గుప్పెడు తీసుకుని రమ్మను. జడగంటలున్నాయా?’ (పువ్వుల జడ)…బతుకు పరుగులో పడిపోయి, దాదాపుగా మనం మరచిపోతున్న సంప్రదాయ సంభాషణలు ఈ కథల్లో వినిపిస్తాయి. ‘చూసేవా! సంగీత సాధన వల్ల ఎన్ని ఉపయోగాలో? ఆనందం, ఆరోగ్యం, సాహిత్యం, భాషా పటుత్వం, స్పష్టత, భక్తి’ (సంగీతమే వర సుఖదాయిని)… తరహా హెచ్చరికలు ఆనందం పేరుతో మనమంతా నెత్తినెక్కించుకుంటున్న అపభ్రంశ జీవనశైలిని గుర్తుచేస్తాయి. ‘అమెరికా వస్తే విజ్ఞానం పెంచుకుంటామనుకున్నాం. కానీ విలువల్ని మర్చిపోతామనుకోలేదు’ (లోకరీతి)… అచ్చంగా అమెరికన్లలా బతకాలనుకునే పిల్లల్ని తలుచుకుని ప్రవాస మాతృమూర్తులు అనుభవించే సంఘర్షణను చూస్తాం. కుక్కపిల్లల పుట్టినరోజు పార్టీల్ని ఒకప్పటి కాలభైరవ సమారాధనతో పోల్చే సునిశితమైన హాస్యమూ సంకలనంలో అంతర్లీనమే. అమెరికాలో ఉంటున్న రచయిత్రి… గ్రామీణ జీవితాన్నీ, నేటి అమెరికన్ జీవనశైలినీ సరిపోల్చి చక్కని సందేశాలతో కథల్ని ముగించారు.
- వినోద,ఈనాడు ఆదివారం, 18 – 1 – 2013.
“ఘర్షణ – కథలు” డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
ఘర్షణ – కథలు on kinige