తెలుగు సినిమా రంగంలో తనదైన ఒరవడితో అగ్రపథంలో దూసుకెళ్తున్న కథా నాయకుడు పవన్ కళ్యాణ్. విభిన్న చిత్రాలు తీస్తూ ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నాడు. తను ఏది చేసినా ఓ సంచలనమే. అయితే ఆయన వివాదాస్పద వైఖరీ సంచలనమే. అయితే, ఆయన ఆటిట్యూడ్‌ను పవనిజంగా అభిమానులు ముద్దు చేస్తారు. కానీ, ఆయన కప్పదాటు వైఖరిని, తెలంగాణ వ్యతిరేకతను తన పవనిజంలోని రాజకీయ వైరుధ్యాల్ని తెలిపే భిన్న కోణాలను పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అంటూ బొగ్గుల శ్రీనివాస్ ఒక పుస్తకంగా తీసుకొచ్చాడు. ఇది మొదటి భాగం అని రచయిత చెప్పుకున్నాడు. ముఖ్యంగా మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హఠావో నినాదంతో జనసేన పార్టీని ఏర్పాటు చేయడం తెలిసిందే. రాజకీయాలు నాకు పడవంటూనే కాంగ్రెస్‌ని ఖతం చేయాలని, రాజకీయ పిలుపు నిస్తూ జనసేన పార్టీని ఏర్పాటు చేయడం గురించి శ్రీనివాస్ బాగానే విమర్శించిండు. పవన్ ద్వందరీతిని, ఆయన అపసవ్య ఆలోచన తీరును ఎండగట్టిండు. అటు తర్వాత జనసేన పార్టీ సిద్ధాంత గ్రంథంగా ఇజం పేర్న పుస్తకాన్ని కూడా పవన్ కళ్యాణ్ వెలువరించాడు.
ఇందులో తన ఆలోచనా విధానాల్ని ప్రకటించిండు. అయితే, ఇందులో ఆయన చెప్పిన సిద్ధాంతాలకు ఆచరణకు సంబంధం లేని అనేక విషయాలు కనిపిస్తాయని రచయిత వివరించిండు. తెలంగాణలో పుట్టానంటూనే ఇంకోచోట ఇంతమంది త్యాగాలతో తెలంగాణ ఏర్పడటం అవసరమా? అని తెలంగాణ వ్యతిరేక గళాన్ని వినిపిస్తాడు. పుస్తకం చివర్లో పవన్ కళ్యాణ్ ప్రసంగ పాఠాలను రచయిత యథాతథంగా జతచేయడం వల్ల పాఠకుడికి సులువుగా పవనిజం పరిణామక్రమాన్ని, అందలి అపసవ్య ధోరణిని అర్థం చేసుకునే అవకాశం కల్పించాడు రచయిత. ప్రశ్నించడానికే వచ్చానన్న పవన్ ఎన్నికల తర్వాత ఆయన పార్టీ ప్రశ్నలా ఎందుకు మిగిలిపోయింది? వంటి మంచి ప్రశ్నలు వేసిన ఈ రచయిత పుస్తకాలు మొన్నటి హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అందుకు ఈ పుస్తకం రెండో భాగంలో మరి శ్రీనివాస్ ఏం రాస్తాడో చూడాలి. అయితే సంచలనం కోసం కాకుండా సావధానంగా పవనిజంలోని అబద్దాలను మరింత విశ్లేషణాత్మకంగా రాయడానికి రచయిత పలువురిని ఇంటర్వ్యూ చేసి విషయాన్ని సంగ్రహిస్తే ఇంకా బాగుండేది. ఏమైనా, ఒక యువకుడి సాహసానికి ముచ్చటేస్తుంది. ఇలా, తెలంగాణ యువతరం -మన దగ్గరే ఉంటూ మనల్ని విమర్శించే వాళ్లను, అప్రజాస్వామిక తీరుతెన్నులతో రెచ్చిపోయే వాళ్లను- ఒక పద్ధతిగా ఎండగట్టేందుకు, కోపాన్ని నిగ్రహించుకుంటూ రచనల్నే సాధనంగా ఎంచుకుని ముందుకు సాగడం మంచి పరిణామం. అభినందించదగ్గ విషయం.
-నమస్తే తెలంగాణ-బతుకమ్మ , 04-01-2015
“పవన్ కల్యాణ్ హటావో… పాలిటిక్స్ బచావో…” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి..