ఉత్సవకానుక

ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు రాసిన కథల సంకలనం “ఉత్సవకానుక”. తన కథలకు ప్రేరణ సమాజం, సమాజంలోని వ్యక్తులు, వారి ప్రవర్తన అని రచయిత అంటారు. మూర్తిగారు అన్ని ప్రక్రియలలోనూ రచనలు చేసినా, తనకి నచ్చిన ప్రక్రియ మాత్రం కథేనని ఆయనంటారు.

ఈ సంకలనంలోని కొన్ని కథలను పరిచయం చేసుకుందాం.

ఉత్సవకానుక: తాను ప్రాణంగా ప్రేమించే శాస్త్రీయ సంగీతాన్ని విని తరించడానికి దీక్షితులు అనే అనే ఓ పేద వ్యక్తి దాదాపుగా 160 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓ ఆరాధనా ఉత్సవానికి హాజరవుతాడు. రాత్రి బస కోసం, నిర్వాహకులను బిడియపడుతూ అడుగుతాడు. ఉన్నన్ని రోజులు పిల్లలు పాడినా, పెద్దలు పాడిన ఎంతో శ్రద్ధగా విని తన్మయుడవుతాడు. ఉత్సవం ముగింపు కొచ్చేసరికి అందరూ ఎంతో కొంత మొత్తాన్ని విరాళంగా ఇస్తుంటే, ఎటువంటి ఆడంబరాలకు పోకుండా ఓ చిన్న కవర్‌ని హుండీలో వేసి మౌనంగా నిష్ర్కమిస్తాడు దీక్షితులు. అదే ఉత్సవ కానుక.

అమ్మాయి పెళ్ళి: తన కూతురికి అమెరికా సంబంధమే చేసి నలుగురిలో గొప్ప అనిపించుకోవాలనే తపన ఓ తల్లిది. మధ్యతరగతి వారైనా, ఎలాగొలా ధనవంతుల సంబంధం చేసి కూతుర్ని విదేశాలకి పంపితే, ఆ తర్వాత తను కూడా విదేశాలకి వెళ్ళచ్చనే ఆశ అనంతలక్ష్మిది. మ్యారేజి బ్యూరో వారి దరఖాస్తు నింపిస్తుంది, మూడువేలు చదివించుకుంటుంది. వాళ్ళు చెప్పిన ఫోటో స్టూడియోలోనే అమ్మాయి ఫోటోలు తీయిస్తుంది. రెండేళ్ళు గడచినా ఒక్క సంబంధమూ రాలేదు. ఆ తరువాత వచ్చిన ఒకటి రెండు సంబంధాలు పెళ్ళిచూపుల వరకు రాకుండానే, వీగిపోయాయి. ఈ లోపల కూతురు తనతో పాటే పని చేసే లెక్చరర్‌ని పెళ్ళి చేసుకుంటానని చెబుతుంది. ఈడూజోడూ, కులం, గోత్రం అన్నీ సరిపోవడంతో తండ్రి ఒప్పేసుకుంటాడు. కూతురి పెళ్ళి గురించి తాను కన్న కలలన్నీ నీటి బుడగల్లా పేలిపోగా, అనంతలక్ష్మి తలపట్టుకుని కూర్చుట్టుంది.

తెరవు: ఓ పెద్దాయన మంగ అనే చిన్న పిల్లని తన ఇంట్లో ఉంచుకుని పని చేయిస్తున్నాడనే కారణంతో బాలకార్మికుల నిషేధం గురించి మాట్లాడి మంగకి ‘స్వేచ్ఛ’ కల్పిస్తుంది వసుంధర. మంగ జీవితం నాశనం కాకుండా కాపాడానని ఆమె భావిస్తుంది. కానీ అసలు విషయం వేరు. పేద పిల్లయిన మంగకి శుభ్రమైన బట్టలివ్వడం, మూడు పూటలా భోజనం పెట్టడం, చదువు నేర్పడం వంటివి చేసారా పెద్దాయన. వాళ్ళ కుటుంబానికి రావల్సిన డబ్బేదో ఉంటే దాన్ని కూడా ఇప్పించారాయన. ఇవన్నీ ఆయన చనిపోయాక, వసుంధరకి తెలుస్తాయి. అప్పట్నించి మంగ బాధ్యత తను తీసుకుంటుంది.

పాత బంగారు లోకం: ఆనందరావు, అమృతలది అన్యోన్య దాంపత్యం. చిన్ననాటి నుంచి ఉన్న ఊర్లోనే ఉండడంతో, అమృతకి విసుగ్గా ఉంటుంది. భర్తకి వేరే ఊరిలో ఉద్యోగం వస్తే బాగుండనుకుంటుంది. తమ ఇంట్లో ఉన్న పాత సామాన్లను వదిలించుకుని, కొత్త ఊర్లో కొత్త వస్తువలతో హాయిగా ఉండచ్చని అనుకుంటుంది. ఆమె కోరుకున్నట్లే భర్త కొత్త ఉద్యోగంలో చేరుతాడు, కాని ఇక్కడే వచ్చిందో చిక్కు. అతనిని ఉన్న ఊర్లోనే నియమిస్తుంది కొత్త కంపెనీ !!

ఊరట: ఓ కుటుంబంలోని ముగ్గురు తోబుట్టువులలో ఆఖరిది గాయత్రి. ఆమెకి పెళ్ళీడు వచ్చినా, ఆర్ధిక సమస్యల వలన ఇంకా పెళ్ళికాదు. అక్కలిద్దరి పెళ్ళి చేసేసరికే తండ్రి అప్పుల పాలవుతాడు. తల్లి మరణించడంతో తండ్రి అవసరాలన్నీ తనే చూస్తుంటుంది గాయత్రి. తనకీ పెళ్ళయి వెళ్ళిపోతే తండ్రి పరిస్థితి ఏమిటని బాధ పడుతుంటుంది. చివరికో సంబంధం కుదురుతుంది. పెళ్ళికొడుకు రూపసి కాకపోయినా, సంస్కారవంతుడు కావడంతో ఊరట చెందుతుంది గాయత్రి.

చిలకాకుపచ్చ రంగు జరీ చీర: వ్యాపారం కోసం సంస్థలు జనాలని ఏ విధంగా మోసం చేస్తున్నాయో ఈ కథ చెబుతుంది. తనకిష్టమైన చిలకాకుపచ్చ రంగు జరీ చీర కొనడానికి అనంతలక్ష్మి ఎన్నో తిప్పలు పడుతుంది. తన పాత చీరలు కొన్ని, అయిదు డిస్కౌంటు కూపన్లు పట్టుకుని షాపుకి వెడుతుంది. ఆమెకి కావల్సిన చీర సుమారుగా ఐదు వేల రూపాయలలో ఉంటుంది. ఆమె పట్టుకువెళ్ళిన చీరలకి, కూపన్లకి ఐదు వందల రూపాయల విలువ కడతాడు సేల్స్‌మాన్. చివరికి వేర్వేరు రకాల చీరలు చూసి, తనకి కావల్సిన చీరని రెండువేల ఏడొందల రూపాయలు పెట్టి కొనుక్కుంటుంది. మర్నాడు పొద్దున్నే వాళ్ళమ్మ ఊర్నుంచి వస్తూ అనంతలక్ష్మికి పుట్టిన రోజు కానుకగా చిలకాకుపచ్చ రంగు జరీ చీర తెస్తుంది. ఆవిడ దాన్ని మగ్గాల నుంచి నేరుగా కొని డిస్కౌంటు ఇస్తున్న కొత్త షాపులో రెండువేల రూపాయలకే కొందని తెలిసి అనంతలక్ష్మి గతుక్కుమంటుంది.

వృత్తిధర్మం: వృత్తులన్నీ వ్యాపారరీతిలో నడుస్తున్న ఈ రోజులలో తన వృత్తి అయిన పౌరోహిత్యాన్ని ఎంతో నిజాయితీగా నిర్వహిస్తూ వచ్చిన కొద్దిపాటీ పైకంతోనే రోజులు నెట్టుకొట్టుస్తూంటాడు గణపతిశాస్త్రి. ఓ పేదింటి పిల్ల వివాహం అతి తక్కువ ఖర్చుతో చేయించి, ఆ కుటుంబానికి సాయం చేస్తాడాయన. “పసుపు తాడైనా, పసిడి పుస్తైనా అవి మనుషులని, మనసులనీ ముడివేసే బంధాలే” అని ఆయన విశ్వాసం. కథ చివర్లో ఆయన కష్టాలు తీరే మార్గం దొరుకుతుంది.

అంతరాలు: ఇది ఇద్దరు తమ్ముళ్ళ కథ. తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకి కూడా వాటా ఉందని తెలిసి లక్షల ఆస్తిలో వాటాకి బదులుగా, చాలా తక్కువ మొత్తం అక్కకి వచ్చేలా చేద్దామని ఒక తమ్ముడు ఆలోచిస్తే; తను పేదవాడైనా, రోజుకూలీ అయినా, అక్క రాకరాక ఇంటికి వస్తే చీరపెట్టడానికి అప్పు చేస్తాడు మరో తమ్ముడు. వీరిద్దరి మధ్య అంతరాన్ని చూపుతుందీ కథ.

సంసారంలో హింసానాదం: ఈ కథ మధ్యతరగతి సంసారాల్లోని ఓ పెద్ద గండం గురించి చెబుతుంది. అదేంటంటే….అతిధులుగా వచ్చిన చుట్టాలు ఎన్ని రోజులైనా తిరుగు ప్రయాణం మాటెత్తకపోడం. అసలే అంతంత మాత్రంగా ఉండే ఆర్థిక పరిస్థితులలో గుట్టుగా నడిచే సంసారాలు…ఇలాంటి రా’బంధువు’ల వలన వీధినపడుతూంటుంది. “రెండే రాత్రుళ్ళుంటాం…… శివరాత్రి నుంచి సంకురాత్రి వరకు….” అనే పాతకాలం సామెత గుర్తొస్తుంది ఈ కథ చదివాక.

గోరింట పండింది: “కొత్త పెళ్ళికొడుకు బుగ్గ గోరింటతో పండేదెప్పుడు?” అనే ప్రశ్నకి సమాధానం ఈ కథలో దొరుకుతుంది. గోరింట తను పండడమే కాకుండా ఓ జీవితాన్నీ పండిస్తుందీ కథలో. అద్భుతమైన కథ ఇది.

సాఫీగా హాయిగా సాగే ఓ జలప్రవాహంలా సాగిపోయే 15 కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. మూర్తిగారి కథలలో “వాస్తవికత, భావుకత గణనీయంగా ఉంటాయని” డా. సి. నారాయణ రెడ్డి గారు వ్యక్తం చేసిన అభిప్రాయం నూటికి నూరు పాళ్ళు సరైనదనేని ఈ కథలు చదివితే అనిపిస్తుంది. రూ. 50/- ఖరీదున్న ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. నెలకు రూ. 30/- అద్దెతో కూడా చదువుకోవచ్చు.

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>