అక్షరమే ‘ప్రపంచం’గా మారిన వేళ…’మన ప్రపంచం’ పుస్తకంపై సమీక్ష

అంశం ఏదైనా అది అక్షరాల వెలుగులో వ్యాస రూపం ధరిస్తే దాని ప్రభావ తీవ్ర తాకిడే వేరు. మనసుల్ని భావోద్వేగంతో కుదిపేస్తుంది. మనుషుల్ని అమితంగా ఆలోచింపజేసి కలచివేస్తుంది. ఈ వేదనకు మూలం వర్తమాన ప్రపంచాన్ని అనుభవంతో కాచి వడబోయడం. సామాజిక వ్యవస్థలోని సంఘర్షణల్ని ఉక్కపోత రూపంలో ఆరబెట్టడం. అలా చెలరేగిన కఠోర వాస్తవ దృశ్యరూపాల మంటలే జీవన సత్యాలుగా ఊపిరిపోసుకుంటాయి. ఇలాంటి సందర్భకోణాల్లోంచి చిత్రికపట్టిన శీర్షికా వ్యాసాల కలబోత నేపథ్యమే ఈ పుస్తక పరిచయ ముఖ చిత్రమైంది. దీని రచయిత దుప్పల రవికుమార్. వ్యాస రచనలో చెయ్యి తిరిగి అనుభవశాలి. ‘సత్యం’ సాయంకాల దినపత్రికలో రెండేళ్ళపాటు ‘వీక్లీకాలమ్’గా ధారావాహికంగా ప్రచురింపబడిన వ్యాస సంకలనమే ఈ ‘‘మన ప్రపంచం’’అనే వ్యాఖ్యాన పుస్తకం. కళింగాంధ్ర గుండె చప్పుడుగా అభివర్ణించే ఈ అక్షర లక్షల సముదాయాన్ని సిక్కోలు బుక్‌ట్రస్ట్ తొలి ప్రచురణగా జనం మధ్యకు దీనిని తీసుకొచ్చి పరిచయం చేసింది. ఈ ప్రయత్నంలో భాగంగా రవికుమార్‌గారు చేసిన అక్షర కృషి అంతాఇంతా కాదు. నైతిక విలువలు సమూలంగా అంతరించిపోతున్న సామాజిక వ్యవస్థలో ఒక లక్ష్యానికి కట్టుబడి నిలబడటం అంత తేలిక్కాదు. వృత్తి- ప్రవృత్తిరీత్యా నిబద్ధతను పాటిస్తూ తట్టుకొని ఏటికి ఎదురీదడం సాధారణ విషయం కాదు. చేసే పనిలో విషయముంటేనే అది సాధ్యపడుతుంది. అది రవికుమార్ లాంటి అరుదైన వ్యక్తులకు మాత్రమే రచయితగా చెల్లుతుంది.
మొత్తం 59 వ్యాసాలున్న ఈ సంకలనంలో రవికుమార్‌గారు స్పృశించని అంశంలేదు. సంఘర్షించని సందర్భక్షణం లేదు. చూసి స్పందించని దృశ్యం లేదు. అంతా ఒక ప్రణాళికాబద్ధంగా, వడపోతతో విశే్లణాత్మకంగా సమస్తాన్ని కళ్ళకి కట్టించే ప్రయత్నం చేశారు. అవసరమైనచోట చురుకైన వాతలు పెట్టారు. నిరంతర మెలకువతో చైతన్యపరిచి అంతర్లీనంగా ఉత్తేజితుల్ని చేశారు. ‘వాళ్లంతే’ శీర్షికా వ్యాసంలో ‘‘కేవలం రూపాయి నలిపి వాసన చూపిస్తే మనశ్శరీరాలు అప్పగించే నేటి తరపు జర్నలిస్టుల దౌర్బల్యాన్ని భరించి తీరాలని’’ పత్రికాముఖంగా రచయిత బాహాటంగా ప్రకటించినపుడు రవికుమార్‌లోని అంతర్విముఖత అతనిలోని ‘గట్స్’ని తేటతెల్లపరుస్తుంది.
ఆధ్యాత్మిక గురువులు సచ్చిదానంద, చినజియర్ స్వామి, రవిశంకర్ లాంటి వాళ్ళను ఉదాహరిస్తారు. పాలక-సంపన్న వర్గాలకు వ్యతిరేకంగా గొంతెత్తి, ఆదివాసుల పక్షాన హక్కులకోసం పోరాటం సలిపి, గుజరాత్ మారణకాండ బాధితుల తరఫున కొమ్ముకాసి నిలబడ్డ బాబాలెంతమంది ఉన్నారని నిలదీస్తారు. ఈ నిబద్ధత వెనుక నిక్కచ్చితనం ప్రతిబింబిస్తుంది. కాకరాపల్లి, సోంపేట వద్ద జరిపిన ప్రజాపోరాటాల స్ఫూర్తిని చైతన్యవాహికగా ప్రవహింపజెయ్యడంలో అందెవేసినతనం కనిపిస్తుంది. అభివృద్ధిపేరుతో ప్రభుత్వం ఆడుతున్న జూదం థర్మల్ విద్యుత్ కేంద్రాలతో ధర్మాన మూటగట్టుకున్న అపఖ్యాతిని బట్టబయలు చేస్తారు. ఉన్నదున్నట్టుగా కుండబద్దలుకొట్టి నిజాల్ని నిర్భయంగా వెల్లడిచేయడం ఇతని సహజ నైజాన్ని అద్దంపట్టిస్తుంది. పేదాగొప్పల మధ్య తారతమ్యాన్ని ఆర్థిక అసమానత్వం ద్వారా చాటిచెప్పే ప్రయత్నంచేస్తారు రచయిత.
రాజ్యాలను కూల్చడంలో అమెరికా పాశవిక చర్యలను వ్యాసంలో ఎండగడతారు. ఉగ్రవాదం, కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చెయ్యడం, నిరుద్యోగం, పేదరికం లాంటి అంశాలకు జవాబుదారీతనం వహించాల్సి రావడాన్ని గుర్తుచేస్తారు. భాజపా, కాంగ్రెస్, టిడిపి, తెరాస, లోక్‌సత్తాల వైఖరిని ప్రస్ఫుటంగా ప్రతిఫలింపజేస్తారు. మద్యం సిండికేట్, కాంట్రాక్టింగ్, కోస్టల్ కారిడార్, బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు, గ్రానైట్ అక్రమ తరలింపు చర్యలు, మత్స్యసంపదల గురించి పూసగుచ్చినట్టు కళ్ళకు కట్టిస్తారు. దేశవ్యాప్త కుంభకోణాలకు అక్షర రూపమిస్తారు. వ్యాపార-మావోయిస్టు వర్గాల కార్యకలాపాలతో ప్రభుత్వ పాలనపై కొరడా ఝుళిపిస్తారు. ప్రపంచీకరణ మనిషిజంపై ఎలాంటి మార్పులను తీసుకొచ్చిందో- నైజీరియన్ రచయిత చినువా అచ్‌బె మాటల్లో వివరిస్తారు. పరారుూకరణ తీరును వ్యక్తీకరిస్తారు. వస్తు సంస్కృతి మోజులో వర్తమాన ప్రపంచ పోకడల తీరును హృద్యంగా ఆవిష్కరిస్తారు. మాతృభాష సంరక్షణోద్యమం ఆవశ్యకతను అంతర్లీనంగా నొక్కిచెబుతారు. శ్రీకాకుళ విప్లవ పోరాటస్ఫూర్తినీ, కథానిలయం ప్రాముఖ్యతనీ ప్రస్తావిస్తారు.
ఇంకా ప్రముఖుల పుస్తక రచనల గురించి వివరణ సాల్మన్ రష్డీ, తస్లీమా నస్రీన్, రెజాఅస్లాన్, వెండీ డోనిగర్, జితేందర్ భార్గవ, హమీష్ మెక్ డోనాల్డ్‌లతో పూర్తిచేస్తారు వ్యాసకర్త రవికుమార్. ఆంధ్రా- తెలంగాణాలు విడిపోయిన సందర్భాన్ని చారిత్రాత్మక ఘట్టంగాకాక, ఆలోచనాత్మకంగా విశ్లేషించుకోవాల్సిన తీరుతో మన మేథస్సుకు పదును పెడతారు.
అర్థశాస్త్రంలోని కౌటిల్యుడి మాటగా మనకు ఉద్బోధిస్తారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇందులో ఇంకా ఊహకి అందని ప్రశ్నలు, ప్రస్తావించని సందర్భాలు కోకొల్లలుగా మిగిలిపోయాయి. వీటి మూలాల లోతుల్లోకి వెళ్లగలిగితే కంటికి కనిపించని అట్టడుగు చీకటి కోణాలు ఎన్నో బయల్పడే అవకాశముంది. ఈ రచయిత లోచూపుకీ, దిశానిర్దేశత్వానికీ భవిష్యత్తు ఆశావహ దృక్పథంగా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి కనిపించదు. భిన్న కోణాల్లో వ్యాసాలు రాయడంలో ఆరితేరిన దుప్పల రవికుమార్‌గారి సునిశిత పరిశీలనా దృష్టికి, విశ్లేషణా సామర్థ్యానికి ఎలాంటివారైనా దాసోహం పలకాల్సిందే. ఈ పుస్తకాన్ని చదివిన వారందరికి ఆ రకమైన అనుభవం అనుభూతిగా మిగిలిపోతుంది. సులభశైలిలో సరళ భాషలో రాయడంవలన అటు పాఠకుల మెప్పునూ, ఇటు విమర్శకుల ప్రశంసలనూ సమపాళ్ళలో అందుకోగలిగారు రచయిత.

–  రాజా, ఆంధ్రభూమి-అక్షర, 14/03/2015.

మన ప్రపంచం” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి..

మన ప్రపంచం on kinige

ManaPrapamcham600

 

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>