వొడువని ముచ్చట

ఈ పుస్తకానికి సేత తెలంగాణా సిద్దాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్, వ్రాత కొంపల్లి వెంకట్ గౌడ్.

తెలంగాణా చరిత్రలో ఒక కాన్సెప్ట్ కోసం పూర్తి జీవితాన్ని పణంగా పెట్టి పనిజేసిన జయశంకర్  సార్ అనుభవాలు రికార్డ్ చేసి అందించారు వెంకట్ గౌడ్.

పుస్తకం ఎట్లుండాలంటె… అని చెబుతూ, “నేను రాస్తే ఎట్లుంటది అంటే ప్రతి అక్షరం చెక్కినట్లు వుంటది. రాసే ప్రతీ పదం చదివేవాల్లను ఆలోజింపజేయాలె” అని అంటారు సార్.

జయశంకర్ గారు విద్యార్థిగా, ఉద్యోగిగా, టీచరుగా, పదవిలో ఉన్నా లేకున్నా తెలంగాణ సమస్యతోనే జీవితం పెన వేసుకున్న స్వచ్ఛంద కార్యకర్త. ఆయనకు ఏ రాజకీయ పార్టీలతో గాని, వేదికలతో గానీ, వాటిల్లో సభ్యత్వం గానీ లేవు. తెలంగాణా గురించి ఎవరు పనిచేసినా వారితో మమేకమై పని చేసారు. తను తెలంగాణా సిద్ధాంత కర్తను కానని, మొదట ఇంగ్లీషు మీడియాలో తెలంగాణా ఐడియలాగ్ అని రాయడం మొదలు పెట్టారని, కాలక్రమంలో దాన్నే తెలుగు మీడియా ‘సిద్ధాంతకర్త’గా అనువదించి ప్రాచుర్యం కల్పించిందని ఆయన వివరించారు.

ఇప్పుడు నడుస్తున్న ఉద్యమం ఎలా రివైవ్ అయిందో ఈ పుస్తకంలో తెలియజేసారు సార్.

‘తెలంగాణాలో ఏం జరుగుతోంది’ అనే పుస్తకానికి వచ్చిన ప్రాచుర్యం ఏ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేదని అంటారాయన.

అమెరికాలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం అనే సంస్థ ఎలా ఏర్పడిందో సార్ వివరంగా చెప్పారు. దాని కోసం జయశంకర్ గారు అమెరికాలో విస్తృతంగా ప్రయాణించి ఎన్నో ఉపన్యాసాలిచ్చారు.

కెసీఆర్ తో తానెందుకు ఇంప్రెస్ అయ్యారో జయశంకర్ గారు చెబుతూ, కెసీఆర్ కాన్సెప్టులలో లోతుగా వెళ్ళి, విశ్లేషించి క్రిటికల్‌గా చర్చించేవారని అన్నారు. విషయ అవగాహన ఉండి తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ప్రజల భాషలో నుడికారంలో తీసుకుపోయేటువంటి వ్యక్తి కెసీఆర్ అని సార్ భావించారు.

తెలంగాణవాదులని పరస్పరం కలవమని లక్ష్యం కోసం కలిసి పని చేయమని, అప్పుడే ఉద్యమం స్ట్రెన్తెన్ అవుతుందని జయశంకర్ చెప్పేవారు.

తనను ఎవరైనా విమర్శించినా, ప్రతి విమర్శ చేయనని చెబుతూ, “నాకు చేతనైంది చేస్తనయ్యా, తప్పైతే తప్పు, ఒప్పైతే ఒప్పు. …కాలం నిర్ణయిస్తది… ఎవరి పాత్ర ఏంది” అని అంటారు.

ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు మూడు భాషలు తెలిసుండం తెలంగాణా కాంటెక్ట్స్‌లో చాల అవసరమని, తనకున్న అడ్వాంటేజ్ అదేనని సార్ అంటారు.

కళారూపాలు ఉద్యమంపై చూపిన ప్రభావం గురించి చెబుతూ, సాంస్కృతిక దాడికి వ్యతిరేకంగా కల్చరల్ డైమెన్షన్ రావడానికి, తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవనానికి కళారూపాలు ఎంతో దోహదం చేసాయని చెప్పారు.

తెలంగాణను తప్పకుండా జూస్తనని నమ్మిన వ్యక్తి జయశంకర్ గారు. తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి కోసం అన్నీ సాధ్యమవుతాయని ఆయన నమ్మారు.

బి.సి.లలో ఐక్యత లేదని, అదే తెలంగాణ ప్రాంతంలో సామాజిక న్యాయానికి ప్రతిబంధకం అని ఆయన భావించారు. రాష్త్రం ఏర్పడితే సామాజిక న్యాయం సంభవం అవుతుందని చెబుతూ, ఇక్కడి బలహీన వర్గాలలో చైతన్యస్థాయి పెరిగిందని, ఆ చైతన్యమే రాబోయే రాష్ట్రాన్ని కాపాడుతుందని ఆయన భావించారు.

కాకతీయ యూనివర్సిటీలో పనిచేసిన మూడేండ్లలో తను చేపట్టిన మార్పుల గురించి చెప్పారు సార్ ఈ పుస్తకంలో. ‘నేను చేసేపనిలో ఓపెన్‌నెస్ వుంటది, గుసగుసలు ఉండవు’ అంటారాయన.

నిజమైన బలహీన వర్గాలంటే ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా నెగ్లెక్ట్ అయినవాళ్ళు తప్ప, ముస్లిమ్సా, దళితులా, బిసిలా అని గాదు…. నెగ్లెక్టెడ్ సెక్షన్స్…అని అభిప్రాయ పడ్డారు జయశంకర్ గారు.

కల్చరల్ మూవ్‌మెంట్, పొలిటికల్ మూవ్‌మెంట్ రెండూ కలిసి సాగాలని, అవి రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయని సార్ భావిస్తారు. సామాజిక న్యాయం దృష్టితో చూస్తే ఇది అత్యవసరమని ఆయన అభిప్రాయం.

పిల్లల ఆత్మహత్యల గురించి వ్యాఖ్యానిస్తూ “ఈ జనరేషన్ యూత్‌లో చాల ప్రస్టేషన్స్ వున్నయ్. అవగాహన లోపం ఉన్నది. ఎక్స్‌పెక్టేషన్స్ వున్నయ్. ఇవన్నీ నాకు గూడ సరిగా అర్థం గావడంలేదు, పిల్లలు ఎందుకిట్ల జేస్తున్నరని. సెల్ఫ్ ఇంబ్యాలెన్, ఇది చాల విచిత్రమైన పరిణామం” అని అన్నారు.

డిసెంబర్ 9 ప్రకటన రావడానికి కెసీఆర్ దీక్ష ట్రిగ్గర్‍లా పనిచేసిందని, లాబీయిస్ట్‌ల కుట్రల వల్ల కేంద్రం వెనక్కి తగ్గిందని చెప్పారు. లాబీయింగ్ గురించి చెబుతూ, మద్రాసు నుంచి విడిపోడానికి లాబీయిస్టులు ఎంత శక్తివంతంగా పనిచేసారో చెప్పి అంతే శక్తితో ప్రస్తుతం పనిచేస్తున్నారని అన్నారు. ఇప్పుడు నడుస్తున్న లాబీయింగ్ లోపల కులాలున్నయ్, ప్రాంతాలున్నయ్, డబ్బుసంచులున్నయ్ అని చెబుతూ, లాబీలో ఉండే వారి కాంబినేషన్ మారచ్చు, కానీ లాబీలవేనని చెప్పారు.

లాండ్ రిఫార్మ్స్ అనేది ప్రత్యేక రాష్ట్రం ఉంటే వెంటనే జరిగిపోయేవని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం వలన ఆనాటి ముఖ్యమంత్రి ప్రవేశబెట్టిన సంస్కరణలు ఆగిపోయాయని చెబుతారు.

తెలంగాణ రచయితల గురించి చెబుతూ…వారిని వాగ్గేయకారులిగా అభివర్ణించారు, కాకపోతే ఈ వాగ్గేయకారులు దేవుని గురించి కాకుండా మనుషుల వెతల గురించి రాసారని అన్నారు.

అధ్యాపక వర్గంలో తెలంగాణ గురించి మంచి అవగాహన ఉందని, కానీ ప్రత్యక్షంగా ఉద్యమంలో దిగి పనిచేయడానికి పరిమితులున్నాయని సార్ భావించారు.

మన్‌‍మోహన్‌సింగ్ భారత ప్రథాని కాకముందు ఆయనతో తనకున్న సంబంధాలని వివరించారు జయశంకర్.

తమది దిగువ మధ్యతరగతి కుటుంబమని చెబుతూ, చిన్నతనంలో తన విద్యాభ్యాసం సాగిన తీరుని వివరించారు. తన లైఫ్ యాంబిషన్ ఎకనామిక్స్‌లో లెక్చరర్ కావడం అని చెబుతూ, దాని సాధన కోసం ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో వివరించారు.

తన జీవిత ప్రస్థానంలో భాగంగా ఏ ఊర్లో అయితే పుట్టారో, అదే ఊర్లో స్కూల్ టీచరుగా పనిచెసి, అదే ఊళ్ళో వైస్ ఛాన్సలర్‌గా పదవీ విరమణ చేసారు జయశంకర్.

దేశం మొత్తం మీద క్షీణిస్తున్న విలువల గురించి ఆందోళన చెందుతూ, కెరీర్, కెరీరిజమ్ పెరిగిపోయాయ్ని, సంపాదన ప్రధాన ధ్యేయమైపోయిందని అన్నారు. అధ్యయనం చేయడం తగ్గిపోతోందని, అధ్యయనం అంటే పుస్తకం చదవడమే కాదు. లైఫంతా అధ్యయనమేనని అన్నారు.

ఇప్పటి వరకు ఏ రచనలో రాని అనుభవాలను, జ్ఞాపకాలను రచయితతో పంచుకున్నారు సార్. అవి ఆయన భాషలోనే వస్తున్న పుస్తకం ఇది. ఇంకా ఎన్నో విషయాలు స్వయంగా జయశంకర్ గారు చెప్పినవి ఈ పుస్తకంలో ఉన్నాయి.

ఇది జయశంకర్ గారి చివరి పుస్తకం. చారిత్రక, సాంస్కృతిక నేపధ్యంలో అతి ముఖ్యమైన పుస్తకం. ఆయన మనసు విప్పి ఎన్నో విషయాలు చెప్పారు ఈ పుస్తకంలో. ఓ రకంగా ఇది ఆయన ఆత్మకథ అని భావించవచ్చు.

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభ్యమవుతుంది. వెల 90/- రూపాయలు. నెలకి 30/- రూపాయల అద్దెతో కూడా చదువుకోవచ్చు.

వొడువని ముచ్చట On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>