ఒంటరి శరీరం

సుప్రసిద్ధ రచయిత సలీం రాసిన కథల సంకలనం ఇది. ఆయన సాహిత్య స్వభావం మానవతావాదం. మానవ సంబంధాలలోని మంచినీ, చెడుని, కథలుగా మలుస్తారు. వాదాల జోలికిపోని రచయిత సలీం. మనిషే ఆయన వస్తువు. ఆయన రాసిన ‘కాలుతున్న పూలతోట‘ అనే నవలకి 2010 సంవత్సరపు కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

సలీం రాసిన ‘ఒంటరి శరీరం’ అనే ఈ కథా సంపుటిలో పద్దెనిమిది కథలున్నాయి. ఇందులోని కొన్ని కథలను పరిచయం చేసుకుందాం:

తలుపు: ఈ కథ రెండు రకాల దూరాలను తెలుపుతుంది. ఎదిగి, విదేశాలకు ఎగిరిపోయిన పిల్లలు ముసలి తల్లిదండ్రులకు భౌతికంగా దూరమవుతే, ఒకే ఇంట్లో ఉంటూ, తల్లిదండ్రులకి మానసికంగా దూరమవుతుంది ఓ యువతి. అమ్మానాన్నలకి, పిల్లలకీ మధ్య ప్రైవసీ అడ్డుగోడగా మారిన వైనాన్ని చెబుతుందీ కథ.

ఖులా: బిడ్డని అమితంగా ప్రేమించే ఫాతిమాది పేద కుటుంబం. భర్త తాగుబోతు. పెద్ద కూతురి వైవాహిక జీవితం విఫలమైంది. చిన్న కూతురిని ఓ కామాంధుడు అత్యాచారం చేసి చంపేస్తే, భర్త డబ్బుకోసం వాళ్ళతో రాజీపడిపోతాడు. భర్తపై తిరగబడుతుంది ఫాతిమా.

ఒంటరి శరీరం : స్పర్శ కలిగించే ఆనందపు అనుభూతిని రమ్యంగా ఆవిష్కరించింది ఈ కథ . ఎంత వయసు వచ్చినా మనసు, శరీరం స్పర్శ కోసం ఎందుకు ఆరాటపడతాయో ఈ కథ చెబుతుంది. ఆత్మీయ స్పర్శ ఒంటరితనాన్ని దూరం చేస్తుందని చెబుతూ, ఆలంబనతో కూడిన అటువంటి స్పర్శ లభించినప్పుడు శరీరం ఇకపై ఏ మాత్రం ఒంటరిది కాదని ఈ కథ తెలియజేస్తుంది.

విషం: పర్యావరణానికి ప్లాస్టిక్ వస్తువులు ఏ విధంగా నష్టం కలిగిస్తున్నాయో ఈ కథ చెబుతుంది. అంతేకాకుండా ప్లాస్టిక్ కవర్ల వలన మూగ జీవాల ప్రాణాలకు ఎలా ప్రమాదం ఏర్పడుతుందో ఈ కథ తెలియజేస్తుంది.

అమ్మ: అల్జీమీర్స్ వ్యాధితో బాధపడుతున్న తల్లికి తానే అమ్మ అయిన ఓ కూతురి కథ ఇది. తప్పని సరిగా చదవాల్సిన కథ.

ఆకలి: ఎవరి అమ్మయినా ఒకటే.. పిల్లల కోసం కరిగిపోయే కొవ్వొత్తి అనే నిజాన్ని మరోసారి నిరూపిస్తూందీ కథ.

పుట్ట: మతం పేరుతో జరిగే మారణ కాండలో సాటి హిందూ ముస్లిం సోదరులు హతం కావడం, రక్తపాతం సృష్టించి, ఎంతో మందిని ఏడిపించి సాధించేదేమిటనీ ప్రశ్నిస్తుంది ఈ కథ. ఆలోచనలను రేకిత్తిస్తుంది.

సూపర్ సిండ్రోమ్: పెద్దపెద్ద సూపర్‌మార్కెట్లు చిన్న కొట్లని మింగేస్తున్న వైనాన్ని, హోదాల పేరుతో మనుషులు ఒకరికొకరు ఎలా దూరమవుతున్నారో ఈ కథ చెబుతుంది.

దొంగలు: నిలకడగా ఏ ఉద్యోగం చేయకుండా, ఇతరులపై దొంగతనం మోపి, వాళ్ళని పోలీసుస్టేషన్ చుట్టూ తిప్పి డబ్బులు లాగే వ్యక్తి కథ ఇది. నిజమైన దొంగ ఎవరని పాఠకులు ఆలోచిస్తారు.

కొండయ్యమ్మ: ఆడామగాకు చెందని హిజ్రాల తరహాకు చెందిన వారి కథ ఇది. అటువంటివారిలోనూ ఉండే మాతృ హృదయాన్ని సలీం సున్నితంగా వ్యక్తం చేసారు. చదువరుల గుండె బరువెక్కుతుంది.

మాంసాహార మొక్కలు: ఈ కథ నేటి యువతలో ప్రబలుతున్న విషసంస్కృతిని తెలియజేస్తుంది.

మురికి: మాములు దుమ్ము, ధూళి, చెత్తా చెదారం కన్నా మనోమాలిన్యం ప్రమాదకరమని ఈ కథ చెబుతుంది.

ఆరోవేలు: వస్తువినిమయ వ్యామోహంలో పడిన యువత ఏ విధంగా పెడదారులు పడుతుందో ఈ కథలో చెబుతారు రచయిత. యువతలో నేరప్రవృత్తికి కారణమవుతున్న వినిమయ సంస్కృతి, దాని పర్యవసానాలను ప్రస్తవిస్తుంది ఈ కథ.

నెగటివ్: శాస్త్రవేత్తలు ఏం చేసినా మొత్తం మానవాళికి ఉపకరించేలా ఉండాలి కానీ, రాబోయే అవాంతరాలను పరిగణలోకి తీసుకోకుండా తొందరపడకూడదని ఈ కథ చెబుతుంది.

నూటికి నూరు మార్కులు: ఎంసెట్లో మార్కులు తక్కువ తెచ్చుకున్నా, కుటుంబ ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకుని అమ్మానాన్నలని ప్రేమించే కొడుకుగా వందశాతం మార్కులు పొందిన అమిత్ కథ ఇది.

పిచ్చోడు: పెద్ద మొత్తంలో ధనానికి ఆశపడి వ్యవసాయ భూములను ఇళ్లస్థలాలు చేసి అమ్మేసుకుని, భావి తరాల వారికి ఆహారమే లభించని దుస్ఠితికి నెడుతున్న విధానాన్ని ఈ కథ వర్ణిస్తుంది. దానికి ఎదురుతిరిగిన వ్యక్తులను పిచ్చివాడుగా ముద్రవేస్తుందీ లోకం. కాని నిజానికి ఎవరిది పిచ్చితనం? పాఠకులని ఆలోజింపజేస్తుందీ కథ.

చక్కని కథల ఈ సంకలనం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ. 90/-. నెలకి రూ. 30/- అద్దెతో కూడా ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు.

ఒంటరి శరీరం On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

  • No Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>