నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు

ఆకాశవాణిలో వివిధ హోదాలలో ….. ఆర్టిస్ట్‌గా, ప్రయోక్తగా, నిర్మాతగా పని చేసిన శారదా శ్రీనివాసన్‌ గారు సుధీర్ఘమైన కెరీర్‌లోని అనుభవాలను, జ్ఞాపకాలను అందించారీ పుస్తకంలో.

అప్పటికే ప్రసిద్ధులైన తొలితరం పెద్దలు సర్వశ్రీ స్థానం, కృష్ణశాస్త్రి, గోపీచంద్, బుచ్చిబాబు, దాశరథి, రజని, మునిమాణిక్యం, నాయని, భాస్కరభట్ల, కేశవపంతుల నరసింహ శాస్త్రి మున్నగువారితో కలిసి పనిచేసిన శారదగారు అలనాటి రేడియో తీరుతెన్నులను ఈ పుస్తకంలో పాఠకుల ముందుంచారు.

ఎంచుకున్న పనిని అంకితభావంతో చేయడం, సంస్థ పట్ల నిబద్ధత కలిగి ఉండడం, ఇతర సిబ్బంది చేసే కార్యక్రమాలలోనూ మనస్ఫూర్తిగా పాలుపంచుకుని అవి విజయవంతం అయ్యేలా చేయడం శారదగారి స్వభావం.

పెద్దల నుంచీ, పిన్నల నుంచీ సైతం నేర్చుకునే తత్వం ఆవిడ కెరీర్‌కి సోపానాలు కల్పించింది. వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి, చక్కని స్వరం, సంభాషణలు పలికే తీరు మొదలైనవన్నీ ఆవిడ ఆకాశవాణిలో రాణించడానికి దోహదం చేసాయి. పెద్దల పట్ల గౌరవం, కళాకారుల పట్ల శ్రద్ధ, సాటి సిబ్బంది పట్ల సహానుభూతి ఆవిడని అందరికీ ఇష్టురాలిని చేసాయి.

ఫామిలీ ప్లానింగ్, గ్రామసీమలు, కార్మికుల కార్యక్రమం, స్త్రీల కార్యక్రమం….. ఇలా రేడియోలో ఏ కార్యక్రమమైనా ఆవిడ పాత్ర లేదా ప్రమేయం లేకుండా లేవు. చిన్నా పెద్దా కలిపి కొన్ని వేల నాటకాలు వేసారావిడ.

“ఏ వేషం వేయమన్నా ఇది నాకు రాదని, నాకు తగదని, నేను చెయ్యలేనని ఎప్పుడూ చెప్పలేదు. అది నా డ్యూటీ అని కాకుండా ఏదైనా చేసి ఔననిపించుకోవాలి. ఓడిపోయానని కాకుండా, చదవలేక పాడు చేసానని అనిపించుకోకుండా, చదివి, బాగా చదివానని అనిపించుకోవాలన్న పట్టుదల ఉండేది” అంటారు శారద గారు. ఉన్నత స్థానాలకి ఎదగాలనుకునేవారికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణమిది.

గడిచిన 50 సంవత్సరాల కాలంలో నలుదిక్కులా కాంతులు వెదజల్లిన సంగీత/సాహిత్య రంగాలలోని దీపస్తంభాల వంటి మహామహుల గురించి శారద గారు గొప్పగా చెప్పారు. వారంతా ప్రాతఃస్మరణీయులు.

రేడియో నాటకం గురించి చెబుతూ, రేడియో నాటకం శ్రోతల ఊహలకి పదును పెడుతుందని అంటారు. దృశ్యంలోని రూపాన్ని చూపరి పెంచలేడు, తగ్గించలేడు; అదే శబ్దాన్ని శ్రవ్యమాధ్యమంలో వాడితే, ఊహలకి ఎల్లలుండవని ఆవిడ అంటారు. చిత్రం వర్ణనైతే, శబ్దం దృశ్యమవుతుంది.

రేడియోలో పాత్ర స్వభావాన్ని తెలియజేయడానికి కంఠమాధుర్యం ముఖ్యమని చెబుతూ, సంగీతానికే కాదు….మాటలకీ ఉంటాయి శ్రుతిలయలు – వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించాలని అంటారు.

“ఒక ఆర్టిస్టు మంచి ఆర్టిస్టుగా ఎదగాలంటే నిరంతరం జీవితాన్ని చదువుతునే ఉండాలి. అదే ఆర్టిస్టుని నిలబెడుతుంది. పది కాలాలు బతికేలా చేస్తుంది.” అని అంటారావిడ.

రేడియో అందించిన సేవల గురించి చెబుతూ, వ్యవసాయాభివృద్ధి, కుటుంబనియంత్రణ, అంటరానితనం, మూఢాచారాలు, పొదుపు, పరిశుభ్రత…మొదలైన అంశాల గురించి రేడియో ప్రసారం చేసినట్లు మరెవ్వరూ చేయలేదని చెప్పారు.

రేడియో కార్యక్రమాలపై ఇప్పుడొస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, కార్యక్రమాలను శ్రద్ధగా వినాలని సూచిస్తారు. ఏ ప్రోగ్రామైనా విన్నప్పుడు ‘బాగుందని’ ఓ ఉత్తరం ముక్క రాయాలి లేదా ఓ ఫోన్ చేసి చెప్పాలని సూచిస్తారు. బాగా ఉన్నదానిని మనం మనస్పూర్తిగా ఒప్పుకోవాలి, ఎక్కడో చిన్న లోపం ఉందని, మొత్తం ప్రోగ్రామ్‌నే తీసి పాడేయకూడదని అంటారు.

ప్రజలకు సమాచారం అందించడం, వినోద విజ్ఞానాలతో పాటు, సామాజిక అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు రూపొందించి, వైవిధ్యభరితంగా ప్రసారం చేయడం రేడియో కర్తవ్యమని, ఆ పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, రేడియో తన పూర్వవైభవాన్ని సాఢించాలని ఆవిడ కోరుకుంటారు.

దైవదత్తమైన ప్రతిభని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుని, శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు శారదా శ్రీనివాసన్.

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ. 112/- . నెలకి రూ. 30/- అద్దెతో కూడా చదువుకోవచ్చు.

నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

  • No Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>