బాపు బొమ్మల కొలువు

బాపు బొమ్మల కొలువు అనే ఈ పుస్తకాన్ని రూపొందించింది ముఖీ మీడియా వారు. మన సంగీత, సాహిత్య, లలిత కళల పట్ల అవగాహనని, సంస్కృతి మీద గౌరవాన్ని పెంపొందించేందుకు దోహదపడిన ఎందరో ప్రముఖుల, పెద్దల ఋణం కొంతైనా తీర్చుకోవాలనే సత్సంకల్పంతో ముఖీ మీడియా పనిచేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా వారు బాపు బొమ్మల ప్రదర్శనని ఏర్పాటు చేయడమే కాకుండా, వాటిని అందంగా పుస్తక రూపంలోకి తీసుకువచ్చారు. వారికి అభినందనలు.

ఈ పుస్తకంలో బాపు గారి బొమ్మలతో పాటు ఆయన గురించి ముళ్ళపూడి వెంకటరమణ, ఆరుద్ర, కొడవటిగంటి కుటుంబరావు, నండూరి పార్థసారథి, బి.వి. ఎస్. రామారావు వంటి ఎందరో ప్రముఖులు రాసిన వ్యాసాలు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వర రావు, డా. సి. నారాయణ రెడ్డి, చిరంజీవి వంటి వారు బాపు గారిని అద్దంలో చూపించారు. బాపుగారి స్క్రిప్ట్ బుక్ చూస్తూ కాలం గడిపానని విజయశాంతి గారు అంటారు.

సాధారణంగా రమణగారు రాస్తారని, బాపు గారు గీస్తారని ప్రతీతి. కానీ ఈ పుస్తకం ద్వారా బాపుగారు రాస్తారని కూడా మనకి తెలుస్తుంది “నా గాడ్‌ఫాదర్…..గురించి కాస్త, నా బొమ్మల కథ మరి కాస్త…” అనే శీర్షికతో 9 పేజీలలో వివరంగా మినీ ఆత్మకథ రాసారు బాపు గారు.

ఈ పుస్తకంలో ప్రముఖ నవలల, పుస్తకాలకు బాపు గారు వేసిన ముఖచిత్రాలు ఉన్నాయి. ఉదాహరణకి, ఆరుద్ర గారి కూనలమ్మ పదాలు, వాసిరెడ్డి సీతాదేవి గారి సావేరి, గోపీచంద్ గారి గతించని గతం, సలీం గారి కాలుతున్న పూలతోట, పరిమళా సోమేశ్వర్ గారి గాజుపెంకులు, శ్రీపాద సుబ్రహ్మణ్యంగారి కథా సంపుటి వడ్లగింజలు, వంశీ మా పసలపూడి కథలు వంటివి. ఇప్పటి తరం పాఠకులు తమకి తెలియని పాత కాలం నాటి మంచి పుస్తకాల వివరాలు తెలుసుకోవాలంటే ఈ పుస్తకంలో బాపు గారు వేసిన బొమ్మలను చూస్తే తెలుస్తాయి.

ప్రముఖ దర్శకుడు వంశీ కథలకి బాపు గారు వేసిన బొమ్మలు హాలీవుడ్ నాణ్యత గల సినిమా చూస్తున్నట్లనిపిస్తుంది. భానుమతి రామకృష్ణ గారి అత్తగారూ, ఆవు నెం.23 బొమ్మ రమ్యంగా ఉంది. అలాగే పౌరాణిక గాథలకి బాపు గారు వేసిన బొమ్మలను చూస్తుంటే పాఠకులు కూడా దేవతల్లా అనిమేషులై పోతారు. రంగులలో ఉన్న బొమ్మలు ఎంతగా ఆకట్టుకుంటాయో, నలుపుతెలుపులలో ఉన్న బొమ్మలు సైతం అంతే ఆకర్షిస్తాయి.

కొన్ని బొమ్మలను చూస్తుంటే కథానుసారంగా బొమ్మ గీసారా లేక, బొమ్మకి వర్తించేలా కథ రాసారా అనే సందేహం తలెత్తక మానదు. ఒకానొక కాలంలో రచయిత్రులు, రచయితలు తమ రచనలకు బాపుగారితో బొమ్మలు గీయించమని సంపాదకులను కోరుకునేవారుట!

ఈ పుస్తకంలో కొందరు ప్రముఖుల చిత్రాలు ఉన్నాయి. మాలతీ చందూర్ గారి బొమ్మ చూస్తుంటే, వారి ఫోటోనే చూస్తున్నట్లుంటుంది.

బాపు బొమ్మలని తెలుగువారికి పరిచయం చేయడమంటే, ముంజేతి కంకణం చూసుకోడానికి అద్దం ఉపయోగించడమే అని మాకు తెలుసు. కానీ ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుందన్న సువార్తని అందరితో పంచుకోడం కోసమే ఈ చిన్న ప్రయత్నం.

బాపు బొమ్మల కొలువు On Kinige

చావా కిరణ్, సోమ శంకర్

Related Posts:

  • No Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>