సరిహద్దు

సరిహద్దు అనే ఈ పుస్తకంలోని కథలు గొర్తి సాయి బ్రహ్మానందం రాసారు. పుట్టింది ఆంధ్రదేశంలోనైనా, వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. రాజ్యాలేలే రాజైనా , రాళ్ళెత్తే కూలీ అయినా ప్రతీ మనిషికి కథ ఉంటుందని, కథగా చెప్పితీరాలన్న సంఘటనలు ఎదురైనప్పుడు వాటిని కథలుగా మలచడం తనకిష్టమని రచయిత అంటారు.

సరిహద్దు On Kinige

ఈ సంకలనంలోని కొన్ని కథలను పరిచయం చేసుకుందాం.

అతను: అమెరికా వచ్చిన ప్రతీ అమ్మాయి చేసే మొదటి పని ఉద్యోగం వెతుక్కోడం. అలాంటిది డాక్టరు చదివిన ఉత్పల, ఉద్యోగం చేయకుండా అమెరికాలో ఎందుకు ఖాళీగా ఉంది? కూతురిని సైతం వదిలేసి, ఎందుకు ఇండియాకి తిరుగు ప్రయాణం కట్టింది? ఆమె భర్త ఉద్యోగం చేయొద్దని అనడంలో అసలు కారణం ఏమిటి? భార్య మీద ప్రేమా? పురుషాహంకారమా? ఉత్పల తీసుకున్న నిర్ణయం సరైనదేనా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే, ఈ కథ చదవాల్సిందే.

ఒంటరి విహంగం: చుట్టపు చూపుగా కొడుకు హరి ఇంటికి వచ్చిన రాజారావు ప్రతీదానికి ఫార్మాలిటీస్ పాటించే ఆ దేశంలో ఇమడలేకపోతాడు. తండ్రి బిడ్డకి థాంక్యూ చెప్పడం, అమ్మానాన్నలు కొడుకులకి సారీ చెప్పడం వంటివి రాజారావుకి కృతకంగా అనిపిస్తే, హరి వాటిని సమర్ధిస్తాడు. “ఏ అలవాటైనా మొదట అమ్మానాన్నలతోనే మొదలవుతుంది. మన ఇంట్లో వాళ్ళ దగ్గరే లేని సభ్యత సంస్కారాలు ఇతరుల దగ్గెరలా వస్తాయి?” అంటాడు. తన బాస్ భార్య చనిపోయి, దుఃఖంలో ఉంటే, మరో పెళ్ళి చేసుకోమని సలహా ఇచ్చిన హరి, అదే పని తన తండ్రి చేస్తే ఎందుకు హర్షించలేకపోతాడు? మానవ స్వభావాలని ప్రశ్నిస్తుందీ కథ.

సైన్యం: తన భార్యని శారీరకంగా మానసికంగా హింసిస్తూ, ఆమె ఎదుటే పరాయి ఆడవాళ్ళతో కులుకుతూండే రామిరెడ్డిని ఎవరు హత్య చేసారు? ఆ రాత్రి అతనితో గడపడానికి వచ్చిన పరాయి స్త్రీయా?లేక విసిగి వేసారిపోయిన అతని భార్యా? లేక ఒప్పుకున్న పనిని పూర్తి చేయనందుకు అతని యజమాని చంపాడా? ఆసక్తికరంగా సాగుతుందీ కథ.

వానప్రస్థం: జీవితంలో ఆనందానికి రహస్యం ఏమిటో ఈ కథలో తెలుస్తుంది. ఒకరినుంచి ఆశించకపోవడమే ఆ రహస్యం అని ఈ కథ చెబుతుంది. ఎక్స్‌పెక్టేషన్ అనేది నిన్నూ, నీ చుట్టూ ఉన్నవాళ్ళని కాన్సర్‍‌లా కనిపించకుండా దహించేస్తుందని చెబుతుందీ కథ. తల్లిదండ్రులు పిల్లలు తమని గౌరవించాలని ఆశించకుండా, ప్రేమించాలని కోరుకోవాలని ఈ కథ చెబుతుంది.

సరిహద్దు: మెక్సికో సరిహద్దు దాటి చట్టవిరుద్ధంగా అమెరికాలో ప్రవేశించిన హేవియర్ అనే ఓ వ్యక్తి కథ ఇది. స్వదేశంలో ఇంటి దగ్గర చిన్నచిన్న పనులైనా చేసి ఎరుగని వ్యక్తి అమెరికాలో జానిటర్‌గా పనిచేస్తాడు. అమెరికన్లు తలచుకుంటే ఇల్లీగల్‌గా దేశంలో ఉంటున్న వారిని ఏరేయడం పెద్ద కష్టం కాదు, కానీ మరెందుకు అలా చేయడం లేదు? దాని వెనుక ఉన్న చీకటి కోణం ఏమిటి? ఈ అమెరికా అన్నది ఓ మాయాజాలమని, వయసులో ఉన్న కుర్రాడు అందమైన అమ్మాయి మోహంలో పడ్డట్టు అందరూ ఈ దేశపు మాయలో పడిపోతారంటాడు హేవియర్. మనసు భారమైపోతుందీ కథ చదివాకా.

అంటే ఏమిటి? : ఈ కథ తన తల్లిదండ్రులతో అమెరికాలో ఉంటున్న చైతుకు వచ్చిన సందేహాల గురించి చెబుతుంది. అమెరికాలోని వ్యక్తుల వ్యవహారశైలి పిల్లల మనసులపై ఏ విధమైన ముద్ర వేస్తుంది? పిల్లల కొచ్చే సందేహాలు వారినెలా భయభ్రాంతులను చేస్తాయి? తల్లిదండ్రలు ఎలా ప్రవర్తించాలి? ఈ కథ ఆలోచింపజేస్తుంది.

స్వేచ్ఛ: పెద్ద చదువులు చదవడం కోసం భర్త నుంచి విడిపోవాలనుకున్న కూతురికి ఓ తల్లి రాసిన ఉత్తరం ఇది. మనిషికి స్వేచ్ఛ అవసరమే కానీ, ఆ స్వేచ్ఛని జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోడానికి ఆలంబనగా వాడుకోవాలని ఆ అమ్మ చెబుతుంది. నీకిష్టమైన పని చేసుకోడంలో ఆనందం ఉండచ్చు, కానీ ఆ పని చేయడం వలన కలిగే పరిణామాలు, అది ఇతరుల జీవితాలపై చూపే ప్రభావం వంటి వాటి గురించి కూడా ఆలోచించాలని అంటుందావిడ.

నేను అహల్యని కాను: ఓ నాటక సమాజం కథ ఇది. ఈ కళారూపాలకి ఓ మాయ ఉంది, ఆవగింజంత తెలిసినా ఆకాశమంత తెలుసున్న ఫీలింగ్ కలగజేస్తాయి. ప్రతీ కళాకారుడు ఆ మాయలోనే బ్రతుకుతాడంటుందీ కథ. నాటక సమాజంలోని వ్యక్తుల మధ్య ఉండే పొరపొచ్చాలు, అహంభావాలు, కీర్తికండూతి…మొదలైన వాటిని ప్రస్తావిస్తూ, కథానాయకుడిగా పేరొందిన నటుడి దుష్ప్రవర్తనని నాయిక ఎలా ఎండగట్టిందో చెబుతుందీ కథ.

ఊర్మిళరేఖ: ప్రతిబంధకం వియోగంగా మారి, త్యాగంగా రూపంతరం చెందడం గురించి ఈ కథ చెబుతుంది. సంపాదన కోసం దూరదేశం వెళ్ళిన ఓ వ్యక్తి భార్య మనోగతాన్ని, రామాయణంలోని ఊర్మిళ పాత్రతో పోలుస్తూ రాసిన కథ ఇది.

అతిథి వ్యయోభవ: అమెరికాలోని తెలుగు సంఘాల సమావేశాలకి హాజరయ్యే కొందరు ప్రముఖుల నడవడికలని, ప్రవర్తనని వ్యంగ్యంగా చూపుతుందీ కథ.

జీవనది: ఒకప్పుడు తను ప్రోత్సహించిన రచయిత జీవితాన్ని తనకి తెలియకుండానే నాశనం చేసిన ఓ సాహితీ అభిమాని కథ ఇది. రచయితల గురించి, సాహిత్యం గురించి, ఘోస్ట్ రైటర్ల గురించి ప్రస్తావిస్తుంది ఈ కథ.

నూటికొక్కడు: దైవదర్శనం నుండి, రైలు రిజర్వేషన్ మొదలుకొని…. ఏ చిన్నపని కావలాన్నా చేతులు తడపక తప్పని పరిస్థితిని ప్రస్తావిస్తుందీ కథ. వేలాదిగా ఉన్న అవినీతిపరుల మధ్య కొందరైనా నిజాయితీపరులుంటారని చెబుతుంది ఈ కథ.

బుజ్జి కుక్కపిల్ల: డాలీకి కుక్కపిల్లలంటే చాలా ఇష్టం. ఓ చిన్న కుక్కపిల్లని కొనివ్వమని అమ్మానాన్నలని పోరుతూ ఉంటుంది. చివరికి ఓ రోజు తండ్రి ఓ కుక్కపిల్లని కొనుక్కుని వస్తే, తనకి కుక్కపిల్ల వద్దంటూ, తీసుకెళ్ళి కొన్నవాళ్ళకే ఇచ్చేయమని అంటుంది. డాలీ ఎందుకలా మారిపోయిందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.

అహం: తోటి మనిషికి సాయం చేయడం మంచిదే, కానీ పెద్ద మొత్తంలో డబ్బు సాయం చేసేడప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో. చేసిన సాయాన్ని గురించి పదిమందిలో చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం ఆ వ్యక్తిని తులనాడకుండా ఉంటే చాలు. ఓ చిన్న ఈగో, అహంకారం ముందు ఇరవై ఏళ్ళ స్నేహం ఓడిపోయిన వైనాన్ని చెబుతూ, డబ్బు చాలా చెడ్డదని, అది మనుషుల మధ్య ప్రేమని, స్నేహాలని ఒక్కోసారి తినేస్తుందని ఈ కథ చెబుతుంది.

అబద్ధంలో నిజం: ప్రతీరోజూ అబద్ధాలాడుతూ ఒకరినొకరు నమ్మించుకున్నట్లు భ్రమిస్తున్న భార్యభర్తల కథ ఇది. వారిద్దరికీ అమ్మ నిజం – అత్త అబద్ధం. దృశ్యాలవే, కానీ అబద్ధాలూ నిజాలు తారుమారవుతుంటాయి. వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టిన కథ ఇది.

వీరాభిమాని: రామారావు సంజీవి అనే నటుడికి వీరాభిమాని. సంజీవి ఓ తెలుగు సంఘం ఆహ్వానంపై కెనడా వస్తున్నాడంటే బోలెడు డబ్బుపోసి టికెట్ కొంటాడు. తీరా సభలో సంజీవి ప్రవర్తనకి విరక్తి చెంది అతనిపై అభిమానానికి వీడ్కోలు పలుకుతాడు. ఇంత జరిగాక, సినిమా నటుల పట్ల వల్లమానిన అభిమానాన్ని రామారావు వదులుకున్నట్లేనా? కథ చదివితే తెలుస్తుంది.

వలస జీవితం: ఇరవై ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్న అను తన కొడుకు ఓ అమెరికన్ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాననడం జీర్ణించుకోలేకపోతుంది. స్నేహితురాలితో తన బాధని చెప్పుకుంటే, పిల్లల జీవితాలని వాళ్ళనే నిర్ణయించుకోనిస్తే మంచిదని, తల్లిదండ్రులు కేవలం అడిగితే సలహా ఇచ్చే మార్గదర్శకులవంటి వారని ఆమె చెబుతుంది. మనిషి ప్రవర్తన అలవాట్లు అన్నీ మన చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని అను గ్రహిస్తుంది.

మొత్తం 25 కథలున్న ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ. 90/- రూ. 30/- నెలసరి అద్దెతో కూడా ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు.

సరిహద్దు On Kinige

కొల్లూరి సోమశంకర్

Related Posts:

3 thoughts on “సరిహద్దు

  1. Pingback: సరిహద్దు – పుస్తక సమీక్ష, సాక్షిలో. « వెన్నెల్లో……..

  2. Pingback: సరిహద్దు సమీక్ష, నవ్య వారపత్రికలో « వెన్నెల్లో……..

  3. Pingback: సరిహద్దు సమీక్ష, ఆంధ్రజ్యోతిలో « వెన్నెల్లో……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>