విన్నకోట రవిశంకర్ రాసిన ఈ కవితాసంకలనంలో 29 కవితలున్నాయి. “మానవత్వపు సారాంశాలైన జీవితానుభవాలతో స్పందించే కవితలు ఈ పుస్తకం నిండా వున్నాయని, జీవితానుభవమూ, హృదయానుభూతీ – ఈ రెండు ధృవాల్నీ కలిపి కవిత్వ విద్యుచ్చక్తిని సృష్టించాడు కవీ, విద్యుత్ ఇంజనీరూ ఐన రవిశంకర్” అని ముందుమాటలో ఇస్మాయిల్ గారు చెప్పిన మాటలు ఎంతో నిజం అనిపిస్తుంది ఈ కవితలు చదివితే.
ఇందులోని కొన్ని కవితలను పరిచయం చేసుకుందాం.
హోళీ: వసంతోత్సవం పండుగ సందర్భంగా రంగులతో ఆడుకుంటూ తనలోని భేషజాలని వదిలించుకుని, మనిషి తనని తాను చేరుకోడాన్ని; ఆకులు రాల్చిన చెట్టు మళ్ళీ చిగురించి పూలు పూచడంతో పోల్చారు ఈ కవితలో.
ఉదయాలు: చిన్న చిన్న పదాలలో ఎంతో చక్కని భావల్ని నింపిన కవిత ఇది. ఆశనిరాశల మధ్య జరిగే దోబూచులాటని ఈ కవిత వర్ణిస్తుంది. కల అందమైన భ్రమ కాగా, జీవితం కఠినమైన వాస్తవం అని ఈ కవిత చెబుతుంది.
కుండీలో మర్రిచెట్టు: విశాలంగా, ఊడలు దాల్చి పెరిగే మర్రిచెట్టుని, కుండీలో పట్టేడట్టుగా బోన్సయ్గా మార్చేసారని బాధ పడుతూ, నిండైన దాని జీవితాన్ని ఎవరో అపహరించారని వాపోతారు కవి. మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడని, అది ఎదుటివారికే ప్రయోజనకరమని వారిని నమ్మిస్తాడని అనే అర్థం గోచరిస్తుంది ఈ కవితలో.
స్త్రీ పాత్ర: తనున్నచోట తన చుట్టూ ఆర్ద్రత ప్రవేశపెడుతుంది స్త్రీ. మహిళలు లేని పరిసరాలని ఊహించడం కష్టం. “హఠాత్తుగా అసంగతంగా మారిన/అక్కడి వాతావరణానికి/ఆమె అర్థం కల్పిస్తుంది” ఎంతో లోతైన అర్థం ఉందీ కవితలో.
నిద్రానుభవం: రాత్రుళ్ళు నిద్ర పట్టకుండా బాధపడేవారికి, అతి తేలికగా నిద్ర పట్టేసే వాళ్ళకి మధ్య తేడాని ఈ కవిత చూపుతుంది. అతి తేలికైన పదాలతో అలవోకగా సాగిన కవిత ఇది.
రామప్ప సరస్సు: తమకి దూరమైన మిత్రుడి స్మృతిలో ఈ కవిత రాసారు రవిశంకర్. ఎంత అందమైన, క్రూరమైన సరస్సో అని బాధ పడతారు.
జ్ఞాపకం: తరచూ విస్మరించే సన్నిహితులను తలచుకుంటూ రాసిన కవిత ఇది. అమ్మని ఉద్దేశించి రాసినా, దీన్ని మనం విస్మరించే వ్యక్తులకు అన్వయించుకోవచ్చు. బంధాలను పునర్దర్శించేందుకు ఉపకరిస్తుంది ఈ కవిత.
ట్రాన్సిషన్: ఈ కవిత మానవ జీవితానికి అద్దం పడుతుంది. జీవితమంటేనే కొన్నింటిన్ పోగొట్టుకోడం, మరికొన్నింటిని పొందడం. కొన్ని బంధాలను తెంచుకోడం, కొన్నింటిని అల్లుకోడం. మనిషి జీవితమంటా ట్రాన్సిషన్ అని చెప్పడానికి ప్రయత్నిస్తుందీ కవిత.
గాయం: మానవత్వాన్ని మార్పిడి చేసి, అమర్చుకున్న అలసత్వానికి విరుగుడు లేదంటారు కవి. వైద్యవృత్తిలోని లోపాలను అంతర్లీనంగా ప్రశ్నిస్తుంది ఈ కవిత.
భోపాల్: యూనియన్ కార్బైడ్ ఫాక్టరీ ప్రమాదం ఈ కవితకి నేపధ్యం. తన బిడ్డని రక్షించుకోలేని ఓ తల్లి ఆవేదనని ఈ కవిత చిత్రించింది. ఇది చదివాక మనసు మొద్దుబారిపోతుంది.
శివకాశి: ఇతరుల జీవితాలలో పండగ వెలుగులు నింపేందుంకు, తమ బ్రతుకులని మసి చేసుకునే బాల కార్మికులపై రాసిన కవిత ఇది. ” అతని జీవితంలో/అల్లరిలేదు; ఆటల్లేవు;/తప్పటడుగుల్లేవు;/ తడబడే మాటల్లేవు/” చిన్న చిన్న పదాలలో అక్కడి దృశ్యాన్ని కళ్ళముందుంచారు కవి.
గ్లాస్నోస్త్: ఒక్కప్పటి సోవియట్ యూనియన్ సంస్కరణల గురించి రాసిన కవిత ఇది. రష్యా గురించి ప్రజలు ఊహించుకున్న ఘనతంతా నిజం కాదని కవి అంటారు.
“ఇప్పుడు తెర తీసేశారు/ ఇక యే దాపరికమూ లేదు! /ఈ రహస్యం/ ఇంత వికృతంగా ఉంటుందని/ నేననుకోలేదు./ నేనిన్నాళ్ళూ కొలిచిన వేలుపు/ అసలు రూపం ఇదని /నేనూహించను కూడా లేదు” అని అంటారు.
మోళీ: ఇళ్ళలో ఆడవాళ్లపై జరిగే గృహహింసని ప్రస్తావిస్తుంది ఈ కవిత. కాపురం మగాడికి మోళీ ఆటలాంటిదని, అది అద్భుతంగా సాగుతోందని జనాలని నమ్మించడానికి కుటుంబ హింసని ఆయుధంగా వాడుకుంటారని అంటారు కవి.
దూరం: ఈ కవిత స్నేహితుల మధ్య దూరాన్ని ప్రస్తావిస్తుంది. కాలక్రమంలో గాఢమైన స్నేహమైనా బీటలు వారుతుందని, స్నేహితులు పునఃపరిచయం చేసుకోవాల్సిరావచ్చని చెబుతుందీ కవిత. అయినా పాత జ్ఞాపకాలు వాడిపోవని అంటుంది.
చలనచిత్రం: అతి వేగంగా సాగిపోయే జీవితాన్ని కాప్చర్ చేయడం సాధ్యమేనా? జీవితపు కనిపించని ప్రవాహపు కదలికలో ఉన్న అందాన్ని, దేనితో కేప్చర్ చెయ్యమంటావని కవి ప్రశ్నిస్తారు.
ఇంకా ఎన్నో చక్కని కవితలున్న ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ. 30/- మార్మికమైన అనుభూతులను ఆస్వాదించడానికి ఈ పుస్తకాన్ని సొంతం చేసుకోండి.
కొల్లూరి సోమ శంకర్