మిశ్రమ భావోద్వేగాల సమాహారం

కరువు కురిసిన మేఘం” వై. హెచ్. కె. మోహన్‌రావు గారు రాసిన కవితా సంకలనం. ఇందులో 37 కవితలున్నాయి.

“విభిన్నమైన అంశాలపై కవితలున్నా, వాటిల్లో అంతర్లీనంగా ఉన్న వేదనంతా, మనిషి మనిషి కాకుండా పోతున్నాడనే” అని అంటారు శ్రీ శివారెడ్డి ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో.

మోహన్‌రావు గారు తన గురించి చెబుతూ, తనది “క్రింద పడిపోయినవాడి పక్షాన నిలిచే తత్వమని” అన్నారు. తెలుసుకోవాలనే తపన, సాహిత్య పఠనం తనని కవిత్వం రాసే దిశకు నడిపించాయని చెప్పారు.

ఈ సంకలనంలోని ఎక్కువ కవితల్లో రైతుల కడగండ్లను గురించి వర్ణించారు. వాటిల్లో కొన్ని “కరువు కురిసిన మేఘం”, “స్వేదం సహనం వీడక ముందే”, “హాలా’హలధరు’డై”, “పల్లె మేల్కొంటునట్లు…..” “సుంకురాలిన కంకి”.

కరువుకురిసిన మేఘం” కవితలో, “చల్లగా వర్షించే మేఘం నలుపు/మృత్యు సంకేతమని/అది కరువును కురిసిన తరువాత తెలిసింది” అని అంటారు. “పంట పొలాల్లో/పైరుకు జీవంపోసే నది/చుక్క జారకుండా/ప్రాణాలు తీయడం కూడా /నేర్చిందని తెలిసింది” అని రైతుల వ్యధని వ్యక్తం చేసారు.

స్వేదం సహనం వీడక ముందే” అనే కవితలో, కాడిజారిన సేద్యం గురించి బాధ పడుతూ, “అదేమిటో ఎంత వెదికినా/మేఘంలో చిరునామా దొరకని వాన చినుకు/కంటిలో కన్నీరై కనిపించింది/పాతాళం దాకా ఆనవాలు చిక్కని నీటిచుక్క అడ్రస్సూ/అక్కడే దొరికింది” ఎంత ఆర్ద్రత! మనసు చెమ్మగిల్లించే పదాలు ఇవి.

హాలా’హలధరు’డై” అనే కవితలో – సకాలంలో వర్షాలు కురవక రైతులు ఎదుర్కునే ఇబ్బందులను ప్రస్తావిస్తారు, “చినుకు కోసం ఎదురుచూసే ఆ కళ్లు/చేను దు:ఖానికి చెమరిస్తాయి/వర్షించని మేఘాన్ని చూసి కన్నీళ్లు కురుస్తాయి” అని అంటారు. అదే వరదలొచ్చి రైతులు నష్టపోతే, ” పుట్లెన్ని పండించినా ఉట్టిమీదకు పెడ్డరాదు” అని అంటారు.

సుంకురాలిన కంకి” అనే కవితలో “నాగలి తప్ప నాగరికం తెలియని తల్లి/కరువురాగం శృతి చేసుకుంది !” అని చెబుతూ, “గుండె పగిలిన పత్తి/రైతు బ్రతుకును వత్తినిచేస్తే/తలగుడ్డ ‘పాశమై’ వెక్కిరించింది” అంటూ బాధ పడతారు. ఏం చేస్తే సంక్రాంతి పండుగ రైతుల్లో ఉత్సాహం నింపుతుందో ఈ కవితలో చెబుతారు కవి.

పల్లె మేల్కొంటునట్లు…..” అనే కవితలో కష్టాలు పడుతున్న రైతులు చైతన్యవంతులై పట్టణ వీధుల్లో నకిలీమందుల్ని, అందిరాని ధరల్ని నిలదీయాలని చెబుతారు.

ప్రపంచీకరణ ముప్పు గురించి రాసిన కవితలు – “ఒక విధ్వంసానంతరం”, “మనీ+మనీ=మనిషి”, “విషాదాంతం”.

ఒక విధ్వంసానంతరం” అనే కవితలో ప్రపంచీకరణ కొండచిలువలా మింగేసిన తర్వాత, “బ్రతుక్కీ చావుకీ తేడా తెలియని అవాంఛిత స్థితులే గాని/నాలుగు నవ్వులు పూచే ముఖాలేవి ?” అని ప్రశ్నిస్తారు. “ఎక్కడ చూసినా కరెన్సీ కట్టల అభ్యంగనాలే తప్ప/కాస్త ఊరటనిచ్చే ఆలింగనాలే కరువయ్యాయి” అని వాపోతారు.

మనీ+మనీ=మనిషి” అనే కవితలో అంతరించిపోతున్న మానవ సంబంధాల గురించి చెబుతూ, “ప్రపంచం దగ్గరౌతున్న కొద్దీ/మనిషి మార్కెట్‌సరుకులా మారుతున్నాడు/మనిషి కొనుగోలు వస్తువులా మారిన తరువాత/తాను వస్తువుతోనే జీవనం సాగిస్తున్నాడు”అని అంటారు. సున్నితత్వాన్ని కోల్పోడాన్ని చక్కగా వర్ణించారు కవి.

విషాదాంతం” అనే కవితలో ప్రపంచీకరణ గురించి చెబుతూ, “‘’గ్లోబ్’ అంతా కుగ్రామం కావడమంటే బ్రతుకును పాతాళానికి తొక్కడమేనా?” అని ప్రశ్నిస్తారు. “గ్లోబలైజేషన్‌దోపిడి పర్యాయం/పేద దేశాల కొల్లగొట్టే బహిర్‌మార్గం/ప్రపంచీకరణ పరదాస్యమే” అని అంటారు.

అమ్మ ప్రేమ గురించి, మాతృవాత్సల్యం గురించి రాసినవి – “కొంగు సాక్షిగా”, “మమకారానికి సాకారం”.

కొంగు సాక్షిగా” అనే కవిత అమ్మకంటే సొమ్మే విలువని భావించే వారి గురించి రాసినది. ” అమ్మంటే రెండక్షరాల కూర్పు కాదు/కడుపుతీపిలో కారుణ్యం కలిస్తే అమ్మ” అంటూ అద్భుతమైన నిర్వచనం చెప్పారు.

మమకారానికి సాకారం” అనే కవిత అమ్మ గురించి గొప్పగా చెప్పిన మరో కవిత. “అమ్మకు భాష్యం అమ్మే / అమ్మను మించిన జన్మలేదు” అని అంటారు. పిల్లల కోసం తల్లి ఎంతగా ఆరాటపడుతుందో చెబుతూ “నా బ్రతుకుకోసం, ఆమెచేతులెపుడూ పనితో పోటీ పడేవి” అని అంటారు.

గాంధీజీ గురించి, గాంధీ తత్వాన్ని గురించి రాసినవి రెండు కవితలు – “మరో సిద్ధార్థుడు”, “రెక్కలు తెగిన భారతం”.

“సత్యానికి శరీరాన్ని తొడిగితే ఆయన/రూపమొస్తుంది/సత్యాగ్రహానికి అక్షర రూపమిస్తే/ఆయన పేరే ధ్వనిస్తుంది” అని అంటారు “మరో సిద్ధార్థుడు” అనే కవితలో. గాంధీజీని ఇంత చక్కగా వర్ణించిన కవిత మరోకటి లేదంటే అతిశయోక్తి కాదు.

జాతిని సమూలంగా మార్చడానికి గాంధీమార్గం అవసరమని చెబుతూ, “రాచపుండులా మారిన జాతి రుగ్మతకు/మరో శస్త్రచికిత్స జరగాలి” అని అంటూ, “గాంధీ మార్గం విశ్వ నాందీవాచకం కావాలి” అని కోరుకుంటారు “రెక్కలు తెగిన భారతం” అనే కవితలో.

కృష్ణా నదితో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ రాసిన కవితలు – “నదీరాగం”, “కృష్ణతరంగిణి”.

“రాగాలు తీయడం కోయిలకే కాదు/’కృష్ణ’మ్మకి కూడా తెలుసు” అంటారు కవి “నదీరాగం” అనే కవితలో. కృష్ణానది తన ప్రవాహదిశలో ఒక్కో చోట ఒక్కో రాగాన్ని పలికిస్తుందని అంటారు.

నదిలో నీటి ప్రవాహం బాగా ఉన్నప్పుడు పల్లెలెలా ఉండేవో వర్ణిస్తారు, “కృష్ణతరంగిణి” అనే కవితలో. నీటి ప్రవాహం తగ్గిపోతే, రైతుల గుండెలు వడబడుతున్నాయని అంటారు. కరువుని త్రోలగ గలగల సాగమని నదిని కోరుకుంటారు కవి.

ఘనీభవిస్తున్న నదులు” అనే కవితలో మతమౌఢ్యాన్ని నిరసిస్తారు.

తెలుగు భాష గురించి, “అమ్మంటే ఏమిటి మమ్మీ!” అనే కవితలో చక్కగా చెప్పారు.

పైర్లను కబళిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి “రియల్ రోగం” అనే కవితలో హృద్యంగా చెప్పారు.

వివిధ పత్రికల్లో ప్రచురితమై, బహుమతులు పొందిన కవితలివి. పాఠకులలో మిశ్రమ భావోద్వేగాలను కలిగించే కవితలివి. కవితావస్తువు సార్వజనీనమై, భాష సరళంగా ఉండడం వలన ఈ కవితలని ఆసాంతం హాయిగా చదువుకోవచ్చు.

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.50/-. నెలకి రూ.30/- అద్దెతో కూడా చదువుకోవచ్చు.

కరువు కురిసిన మేఘం On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>