‘పాము’ కథపై చాగంటి తులసి అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘పాము’ కథపై ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి గారి అభిప్రాయం చదవండి.

* * *

” త్రిపుర రాసిన ఈ కథలో పాత్ర శేషాచలపతిరావు బతుక్కి అర్థం కనపడక, అంతా శూన్యం అనిపించి, క్షణానికి క్షణానికీ, మధ్య సంబంధం లేకుండా, చేసే ఓ పనికి మరో పనికీ పొంతన లేక బతుకుతూ బాల్య స్మృతులు వెంట తరుముతూ ఉంటే తిరిగి ఆ బాల్యంలోకి వెళ్ళి పోవాలని అనుకుంటూ విషపూరితమైన పాములా చుట్టూ వున్న వాళ్ళని కాటేస్తూ ఉంటాడు. మోసం చేస్తాడు. దగా చేస్తాడు. ఇంఫాల్ లో మార్షల్ అయి ముప్ఫై యేళ్ళొచ్చినా బతుకులో యే స్థిరత్వం కనపడక, డబ్బులేక, ఉద్యోగం చేసే టెంపర్‌మెంట్ లేక యేదో పేరుకి మాత్రం యూనివర్సిటీలో చదువుకోడానికి చేరతాడు. అతనిలో హింసా ప్రవృత్తి అందర్నీ హతమార్చాలన్న కసి, కోసం గట్టిగా ఉంటాయి. హిట్లరులా నియంతలా ప్రవర్తించాలని అనుకుంటాడు. బెలూచిస్తాను, జర్మనీ తన స్పిరిట్యుయల్ హోమ్స్ అనుకుంటాడు. రోజుకో కొత్త మనస్థత్వంతో కొత్త వేషంతో చుట్టూ ఉన్న వాళ్ళని మోసం చేస్తూ ఉంటాడు.

ఆ వేళ ‘అలఖ్ నిరంజన్’గా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఛాసర్ పుస్తకాన్ని దొంగిలించి తన జూనియర్ ఉమాడేకి యిస్తాడు. బైరంఖానుగా అమెరికన్ దంపతులను కాశీలో గల్లీలు తిప్పుతూ వాళ్ళ వాలెట్‌ని కొట్టేస్తాడు. బారుకి వెళ్ళి చిత్తుగా తాగుతాడు. అలఖ్ నిరంజన్ అవతారం అయిపోయింది. ఇంక రేపు సాల్వడార్ డాలీని అవుతాను అనుకుంటాడు. (“సాల్వడార్ డాలీ” అధి వాస్తవిక చిత్రకారుడు).

ధనస్వామ్యంలో మనుష్యుల్లో ఉన్న ఎక్కువ తక్కువలను బట్టి ఇలాంటి విష ప్రవృత్తి అనేకుల్లో వృద్ధి చెందుతున్నాది. ఈ నాగరికతలో మరో స్వభావంగా, ఇంకో అవలక్షణంగా హిప్పీలుగా మారడం కనబడుతుంది. ఎల్. ఎస్. డి. వంటి మత్తు పదార్ధాలు తిండం, నేరస్తుడిగా మారడం, నేర ప్రవృత్తిని పెంచుకోవడం ప్రపంచంలో సామాన్యంగా కనబడుతుంది. ఈ కథలో శేషాచలపతిరావులోని పాములాంటి ప్రవృత్తి బహు చక్కగా నిరూపించబడ్డాది. ఈ విధమైన మానసిక విశ్లేషణాత్మకమైన రచనలు తెలుగులో బహు తక్కువగా ఉన్నాయి. అయితే మానవ ప్రవృత్తి ఈ విధంగా ఎందుకు అయిందో, ఆ స్వభావానికి కల కారణాలేమిటోనని ఆ మూల కారణాల్లోకి పోయి రాస్తే ఇటువంటి కథలు సమాజంలో మార్పుకి, అలాంటి మానవ స్వభావాన్ని సరిదిద్దడానికి తప్పకుండా ఎంతో ఉపయోగపడతాయి. శేషాచలపతిరావు ప్రవృత్తి అలా తయారవడానికి మూలకారణాల్లోకి పోయి కథ రాసి ఉంటే ఈ కథ విలువ ఇంకా అనేక రెట్లు పెరిగి ఉండేది.

విదేశీయులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ముక్కూ మొహం తెలియని బైరంఖానుకి తమ డబ్బున్న వాలెట్ ఎంతమాత్రం యివ్వరు. జనం రద్దీ తోపులాటలో ఆ అమెరికన్ జేబులోంచి వాలెట్‌ని కొట్టేసినట్టు రాస్తే సరిగా ఉండేది.

బాల్యం మంచిదిగా తర్వాత జీవితం చెడ్డదిగా శేషాచలపతికి కన్పట్టుతున్నట్టు కథలో స్పష్టంగా ఉంది. బాల్యంలోకి పోవాలన్న తపన కనపడుతుంది. బాల్య జీవితంలో తనని సంతుష్టి పరిచినది యేదో, తర్వాత జీవితం ఎందుకు ఎడారిలాంటి యదార్థం అయిందో పాఠకులకి తెలియచెపితే కథకి ఇంకా విలువ పెరిగి ఉండేది.

ఈ పాము స్వభావం కల మనుషులు లోకంలో ఉన్నమాట వాస్తవం. యదార్థ జీవితంలో కనిపించే ఆ పాత్రని రచయిత సరిగ్గానే పట్టుకున్నారు”.

చాగంటి తులసి

త్రిపుర కథలు On Kinige

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>