‘హోటల్లో’ కథపై అబ్బూరి గోపాలకృష్ణ అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘హోటల్లో’ కథపై అబ్బూరి గోపాలకృష్ణ గారి అభిప్రాయం చదవండి.

* * *

” ‘హోటల్లో’ అన్న యీ రచన నిజానికి కథ గాని కథ. కదలకుండా కదిలించే కథ.

చాలా మామూలుగా – మనం నిత్యం జీవితంలో చూసే దృశ్యాలనే అతి మామూలుగా చూపించడం ఈ కథలోని ప్రత్యేకత.

ఈ కథలో కనిపించే హోటల్లో ఎన్ని బల్లలున్నాయో వక్కయొక్క బల్ల దగ్గర ఎంతమంది భోక్తలున్నారో, వాళ్ళ తీరని ఆకలి – అంటే ఎంత తిన్నా తీరని ఆకలి. సర్వర్లూ, ప్లేట్ల గ్లాసుల గలగలలూ, ఇవే చూపిస్తున్నాడు రచయిత.

సాహిత్యం, రాజకీయాలు, పాలనా యంత్రాంగంలోని అవినీతి అన్నీ వినబడతాయి – హోటల్లో కూర్చున్న మనుషుల నోళ్ళల్లో నలుగుతూన్న పలహారాల మూలుగుల్లో-

అన్నీ దృశ్యాలే – కొండని దగ్గర్నుంచి మరీ దగ్గర్నుంచి చూస్తే కొండలో కొంత భాగమే చూడగలం. కొండ ఆకారాన్ని అంచనా కట్టాలంటే బాగా దూరంగా పోవాలి. రచయిత మనల్ని హోటలుకు మరీ దగ్గరగా – ఉహూఁ హోటల్లోకే సరాసరి పాఠకుల్ని తీసుకెళ్ళాడు. సీటు లేని ప్లేటు లేని అగంతకులం మనం.

రష్యన్ మహా చలన చిత్రకారులు పుడోవ్కిన్, ఐసెన్ స్టీన్ తమ చిత్రాలలో వాడిన ‘మాన్తాజ్’ (Montage) టెక్నిక్ ఈ కథ చదువుతూంటే గుర్తుకొస్తుంది.

పరస్పర విరుద్ధాలయిన రెండు దృశ్యాలను వొకదాని తరవాత వొకటిగా చూపించడమో, వొక దృశ్యం మీద మరొక దృశ్యాన్ని ఆరోపించడమో చేసి – చూపిన దృశ్యాలకు విరుద్ధమయిన భావాన్ని కలిగించడం ఈ టెక్నిక్ లోని ప్రత్యేకత.

ఈ కథలో కనిపించే అలాంటి భావం యేదో నేను చెప్పను.

కాని కథకుడు చెప్పేశాడు వొకచోట. దాన్ని వెతికి పట్టుకోవలసిన బాధ్యత పాఠకులదే. అందుకు పాండిత్యమూ, సహృదయతా ససేమిరా పనికిరావు. మానవత్వం కావాలి అదొక్కటే దీపం ఈ కథలో ప్రయాణించడానికి”.

అబ్బూరి గోపాలకృష్ణ

త్రిపుర కథలు On Kinige

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>