‘భగవంతం కోసం’ కథపై రామమోహన్ రాయ్ అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘భగవంతం కోసం’ కథపై రామమోహన్ రాయ్ గారి అభిప్రాయం చదవండి.

* * *

“ఇంటలెక్చువల్స్‌గా చెప్పుకోదగిన తెలుగు కథా రచయితలు తక్కువ. అంతర్జాతీయ స్థాయిలో ఇవి మా తెలుగు కథలని మనం అందించగలిగినవీ తక్కువ. శ్రీ ‘త్రిపుర’ ను giant among the intellectual writers అని గట్టిగా చెప్పవచ్చు. ‘భగవంతం కోసం’ కథానిక ఇతివృత్తమూ, శిల్పమూ చక్కగా సమ్మిశ్రితమైన కళాఖండం.

శ్రీ ‘త్రిపుర’ యీ కథానికలో మనస్సు లోలోతులకు అట్టడుగున వున్న ఆణి ముత్యాల్ని, అసందర్భపుటా లోచనల్ని, ఒంటరితనపు భయంకరత్వాన్ని, మనిషి ఎవరికీ ఏమీ కాని ఏకాంతంలోని నిశ్శబ్దాన్ని పట్టుకున్నారు. మనస్తత్వ చిత్రణలో తెలుగులో ఇంతవరకూ వచ్చిన కథానికల్లో ‘భగవంతం కోసం’ ‘ది బెస్ట్ స్టోరీ’ అని నా నమ్మకం. ‘భగవంతం కోసం’ కథను నిశితంగా పరిశీలించి చూస్తే ఎన్నెన్ని అద్భుతాలు!

బలిసిన ఊరకుక్కలాంటి బస్సు, లెప్పర్ గాంగ్ పాటలు పాడుతూ చేపలని పట్టె వలలాగ పోవటమూ, రూపం పొందిన న్యుమోనియాలాంటి యిల్లు, గోడలమీద సర్రియలిస్టిక్ మచ్చలు, ఆశాకిరణంలా అరటి చెట్టు – ధైర్యంగా , అమాయకంగా, పిచ్చిది, గాజు పెంకులు రుద్దినట్లున్న మేనేజర్ ముఖం. గొంగళి పురుగులు కనిపిస్తే చాలు – చేత్తోనే అలా నలిపే బుజ్జిగాడు, హోటల్ వెనక రౌరవం, బరువైన రెప్పల కింద రెండు బలిసిన కుక్కలు, కళ్ళుమూస్తే పెద్ద గబ్బిలాల రెక్కలు, ప్రపంచపు అరటి పండుని వొలిచి చేతులో పెడ్తున్న అనుభూతి, ఆకాశంలో నక్షత్రపు జల్లు – ఎన్నెన్ని పదచిత్రాలు! వీటితో పాటు మనస్సును కోసేస్తూ మెత్తగా దూసుకుపోయే భావనాపటిమా మన అస్థిగతమై ‘కడదాకా’ మనతో వచ్చేస్తాయి.

భగవంతం పేరు వినగానే పిలకలు, కిఱ్ఱు చెప్పులు, చెవులకి కుండలాలూ, అరవేసిన అంగవస్త్రాలూ కన్పించటం – ఉన్నిథన్ పేరులో కొబ్బరితోటలు, మెల్లగా బేక్ వాటర్స్‌లో బరువుగా పోయే పడవలు – నల్లటి వంకుల జుత్తుల మెరుపులు, లవంగాలు, ఏలకులు, కోప్రా సుగంధాలు మనస్సులో మెదలటం, మనస్సులో మెదిలే అస్పష్ట భావ సంచలనానికి గొప్ప రూప చిత్రాలు. హోటల్లో చుట్టూవున్న మనుష్యుల మాటల్లో అర్థరహితమైన, అర్థవంతమైన అసందర్భపు ప్రేలాపనలు చుట్టు ముట్టేసి గుండెకు గాలం వేసి లాగేస్తాయి.

కథలో వచ్చిన కాఫీ – కాఫీ కాదు – మొదట అది “ఉత్తవేడిగా ఉన్న గోధుమరంగు” – ఆ తర్వాత అది “ఉత్తవేడి రంగు గోధుమ ఊహ”- ఇంత సర్రియలిస్టిక్‌గా వచ్చిన కథానిక మరేదీ తెలుగులో! సెమికోలన్ ఎక్స్‌క్లమేషన్ మార్కులూ విడదీసి రమ్మనటం, హెమింగ్‌వే వాక్యం లాగ నీట్‌గా- బ్రిస్క్‌గా- వోవర్‌టోన్స్ యేమీ లేకుండా వెళ్ళాడనటం ‘త్రిపుర’ గారి శిల్ప నైపుణ్యానికి గొప్ప నిదర్శనాలు.

“చెత్తని మెక్కి కప్పల్ని తిన్న పాముల్లా పోయే జనాన్ని చూస్తే అసహ్యం- ఈ పుట్టే అసహ్యం అంటే ఎంతో ఇష్టం” ఈ మాటల్ని బట్టి ‘త్రిపుర’ cynic అనీ, frustrated అనీ అనుకొనే ప్రమాదముంది. కాని మనిషిని ద్వేషిస్తూ ప్రేమించే గుణం – పిల్లల్ని బుగ్గలు సాగదీసి ఏడ్పించి ముద్దు పెట్టుకునే తత్వం ‘త్రిపుర’ కథల్లో వుంది.

మంచి కథకు, కవిత్వానికీ భేదముంటుందనుకోవటం భ్రమ. ‘త్రిపుర’ గారి కథానికలు అజంతా, బైరాగి, పఠాభి వంటి ఉత్తమ కవుల కవితల్ని చదువుతున్న అనుభూతి కలిగిస్తాయి. ‘త్రిపుర’ ఊహ నైశిత్యం తళత్తళల బాకులా గుండెల్లో గునపం పోటై గుచ్చుకుంటుంది. “తట్టుకోగల చావ వుంటే” త్రిపుర గారి భావనా పరిధిలోకి ప్రవేశించండి. సుందర సురూప ప్రపంచాన్ని కాక మామూలు రచయిత లెవ్వరూ కలలోనైనా కానని చీకటి కోణాలను, మనిషిలోని వెధవాయత్వాన్ని, అశక్తతనూ యేమైనా అతన్ని వీడని మానవత్వాన్ని దర్శించండి. ‘త్రిపుర’ కథలు చదివాక మనిషింటే కథాసాహిత్యమంటే పిచ్చి ఇష్టం కలుగుతుంది.”

రామమోహన్ రాయ్

త్రిపుర కథలు On Kinige

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>