‘వంతెనలు’ కథపై వి. మోహనప్రసాద్ అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘వంతెనలు’ కథపై వి. మోహనప్రసాద్ గారి అభిప్రాయం చదవండి.

* * *

ఆర్. వి. టి. కె. రావ్ గారూ,

మీ కథ ‘వంతెనలు’ నాకెందుకు నచ్చిందంటే ఇది తెలుగు కథ కాదు కావున. ఏదో ఇటాలియన్ కాసిల్ పురాతన సాలె గూళ్ళ శూన్య అస్థిపంజరాల్లోకి తీసికెళ్ళింది కావున. వారణాసిలో వున్నప్పుడు గులాబీలు మంచు జడికి తడిసినపుడు నా రైన్ కోట్‌లో నేనూ ఒక ఉత్తరం కుక్కుకుని డబ్బాలో పడేయటానికి వెళ్తూన్న ఆ రాత్రులు గుర్తుకుతెచ్చింది గావున.

కవి కాని వాడు, జీవితంలో కవి కాని వాడు కథ రాయకూడదు. ఒకానొక వాతావరణాన్ని సృష్టించడానికే. సి. విటమిన్ మాత్రల గార్బినాల్ టాబ్లెట్ల ఖుర్కీ పదున్ల కవర్ ఎప్పుడో పోయిన పిస్టల్ గురి తప్పని cogito, ergo sum ల అనాచ్ఛాదిత ఆత్మ పోరాటపు affaire de coer ని చిత్రించారు. ఆ చీకటి, ఉంటుందనుకొన్న లేని వెన్నెల, మంచు, జడివాన, వెదుళ్ళ వంతెన, జవహర్ వంతెన కావల ఈవల, గోనె సంచుల కాపరాలు, చీకట్లో మెరుపు, ఇలాంటి వాతావరణాన్ని ఆవరణని మనసులో కొద్దిమందే-బుచ్చిబాబు చండీదాస్. కొలకలూరి. స్మైల్, బీనాదేవి నగ్నముని చిత్రించగలరు. మీరు కథ చెపుతున్నప్పుడు చెవులకు కళ్లుంటాయి. కళ్లకి చెవులుంటాయి. కృష్ణ బలదేవ్ వైద్ ఒకడు అలా చెప్తాడు.

అవును. మీరు కైన్, రాజు ఏబెల్. అందుకనే మీర్రాసిన ఆ ఉత్తరం – రాజుని తిడ్తూ – విమల ప్రభాదేవి బంగళాలో ఉండిపోయింది. ‘Am I my brother’s keeper?’ తిట్టుకుని రాసిన ఆ ఉత్తరం ఆ ‘రాజు’ కిపుడేమవుతూందో పది సంవత్సరాల తర్వాత మీ భవిష్యద్వాణి ఎపుడో చెప్పింది.

“I did not know then what was burning my brother and into what dreams he was pouring his life” అన్నారు మీరే మీ ‘segments’ లో.
‘వంతెనలు’ కథలో ఘటన, సంఘటనల కంటే సంఘర్షణ ముఖ్యం. భావ పర్యవసన్నత ముఖ్యం. ప్రేరణ జీవితంలోంచి వచ్చిందే. భ్రమ ఎలానో వాస్తవికత కూడా కెలిడియోస్కోప్ లాంటిదే. history లోంచి వచ్చిన storyకి మీరిచ్చిన ట్రీట్‌మెంట్ మెటానిమిక్ ట్రీట్‌మెంట్. మీ కథంతా ఒక expression of character. ఇందుకు సాక్ష్యమా!

“setting may be the expression of human will. It may, if it is a natural setting, be a projection of the will. Between man and nature there are obvious correlatives” (Rene Vellek & Austin warren)

అదండీ కథ!

మహారాజు కుమార్ బహదూర్, విమల ప్రభాదేవి బ్లూమూన్ బంగళా పోరికో ముందు డాంటీ ఇన్ఫ్‌ర్నో ముందు ‘Ia sciate ogni speranza voich’ entrate’ రాసినట్లుగా (ఇందులో కాలిడిన వాళ్ళు చచ్చారే!) ఉంది మీ ఆశ.

జాహ్నవి ముందే, సీజర్ ముందే విమ్మీని en deshabille (నగ్నంగా) చూపిస్తే బావుండేది. అపుడే మీకున్న కసి, అసహనం, (అయిష్టం) చచ్చిపోలేదు గాని జీవితంలో మిగిలింది ఏమీ లేదు. chere hezila femme (చూడు హృదయపు లోతుల్లో మునిగిన అమ్మాయిని) అందేది.

‘విరబోసుకున్న జుత్తు భుజాల మీంచి నల్లటి జలపాతం లాగా మెరుస్తూ వెర్రిగా పడుతూన్న’ జుట్టుని కొప్పట్టుకుని లాగి చిక్కటి చీకటి వానలోకి లాగి పారేస్తే వంతెన లుండవు గార్డినాల్ టాబ్లెట్లు, విస్కీ సీసాలు, ఖుర్కీలు, పిస్టల్స్ ఉండవు. లక్షల చేసే అందం, 20 ఏళ్ళ కిందట ఊరికే వచ్చిన అందం, రెండుసార్లోడిపోయిన మూడోసారి గెల్చిన రాజకీయ శక్తి, 17 సంవత్సరాల జాహ్నవికున్న – మీకు సంశయమైన సోల్, మీరే గొప్పయి విమ్మీ తల్లి కూడా కాని రంజన్ ఏమీ ఉండవు. ఇదంతా ఒట్టి నిరర్ధకమైన ఆత్మ పోరాటం. మీ అంతట మీరనవసరంగా మీలోకి ఖుర్కీ పొడుచుకున్నారు. నిష్కారణమైన offaire d’ honneur. అందమైన వాళ్ళని వికృతంగా చంపాలి. పోన్లెండి ఆ బ్లూమూన్‌లో విమ్మీ, మహారాజు కుమార్‌లు చేతుల్లో విస్కీ గ్లాసుల్తో నిదానంగా వాళ్లని వాళ్ళే మెత్తగా పొడుచుకు చస్తున్నారు.

Aristocracy సాలెగూళ్లోకి ఇరుక్కు పోయిన యే రచయితయినా సుఖవ్యాధుల్తో తీసుకు చచ్చిపోయిన బాదెలేర్ లానే “అద్దం ఎదురుగా నిలబడి నిన్ను నేనే పోల్చుకుని ఇది నువ్వు అని సందేహం లేకుండా చెప్పలేని” స్థితిలోకి, “చీకటికీ వెల్తురుకి మధ్యన వంతెన ఉంటుందో లేదో” ననే సందేహ స్థితిలోకీ వచ్చి వంతెన కింద చీకట్లో ప్రవహిస్తున్న చిక్కటి నెత్తురు ప్రవాహాన్ని చూస్తూ నిల్చుంటాడు.

34 ఏళ్ళ క్రితం ఒరిస్సా కొండల్లో నాన్న తన ప్రియురాలు పద్మాలయని చంపింది మీ చేత సొర బీడీ కాల్పించినందుకు; విమ్మీ తన 8దో ఏట సాధువు చేత చురక వేయించుకున్నదీ తను సిగరెట్ కాల్చినందుకు. ఈ కథని తెలుగు పాఠకులు అర్థం చేసుకుంటారా?

‘వంతెనలు’ కథ వ్యక్తిగత సామాజిక నేర భావాల మధ్య ఊగులాడుతూంటుంది. అది కూలిపోయే వంతెన, కింద నెత్తురు వాగు, నీడల్లో ధ్వజమెత్తిన ‘రాజు’ లాంటి వీరులదా రక్తం.

వి. మోహనప్రసాద్

త్రిపుర కథలు On Kinige

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>