వారణాసి నాగలక్ష్మి గారి కథా సంపుటి “ఆసరా”కి ముందుమాటగా ప్రముఖ అనువాదకురాలు శాంతసుందరి గారు ఇలా రాసారు.
* * *
వారణాసి నాగలక్ష్మితో నాకు పరిచయమై నాలుగేళ్ళయింది. అప్పట్లో కథా రచయిత్రిగా పరిచయమైన నాగలక్ష్మి మొదటి పుస్తకం ‘ఆలంబన’ నన్ను బాగా ఆకట్టుకుంది.’భూమిక’ సంస్థ చేపట్టిన హిందీ అనువాదాల కోసం ఆ పుస్తకం మొత్తం చదివాను.
ఆ తరువాత ఆమె కవితలూ, పాటలూ,గేయాలూ రాస్తుందనీ, ఇంకా చిత్రాలు కూడా వేస్తుందనీ తెలిసింది. ఇంత చిన్నవయసులో అంత బహుముఖమైన ప్రజ్ఞని సాధించటం చూసి చాలా సంతోషం వేసింది. ఇవన్నీ ఆమెలోని కళాకారిణిని నాకు పరిచయం చేశాయి. అటు చదువులో కూడా అద్భుతమైన విజయాలు సాధించిందని తెలిసి అబ్బురపడ్డాను. ఎవరైనా తల్చుకోవాలేగాని, దేన్నైనా సాధించేందుకు ఎంతటి ప్రయత్నమైనా చెయ్యగలరు అనటానికి నాగలక్ష్మి ఒక ఉదాహరణ. ఇంత ప్రతిభ ఉండి కూడా నాగలక్ష్మిలోని గాంభీర్యం, అదే సమయంలో సరళంగా అందరితో కలిసిపోయే స్వభావం మా ఇద్దరి మధ్యా ఆత్మీయమైన స్నేహానికి దారి తీసింది.
నాగలక్ష్మి కథలన్నీ పత్రికల్లోనూ, వెబ్ పత్రికల్లోనూ ఎంతోమంది చదివే ఉంటారు. ఇతర ప్రక్రియల్లో కలం సారించినప్పటికీ, ఆమెకి బాగా గుర్తింపు తెచ్చినవి కథలేనని నా అభిప్రాయం. కథల్లో నేపథ్యం తెలుగువారి జీవితాలే, కానీ ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్న రచయిత్రి కావటం వల్ల, ఆమె కథల కాన్వాసు పెద్దదిగా కనిపిస్తుంది. సైన్స్ విద్యార్థిని కాబట్టి దానికి సంబంధించిన ప్రస్తావన కూడా, కథావస్తువునుబట్టి కనిపిస్తుంది- ఈ కోవకి చెందిన కథలే.
కవయిత్రీ, పాటల రచయిత్రీ నాగలక్ష్మి వచనంలో కూడా ఆ లక్షణాలు సందర్భానుగుణంగా కనిపిస్తూ ఉంటాయి. నాగలక్ష్మి రచనా శైలిలోని విశిష్టత చెప్పాలంటే, కథ చెప్పే విధానం స్పష్టంగా, సామాన్య పాఠకుడికి కూడా సులభంగా అర్థమయ్యేలా చెప్పగలదు. పాఠకుడు కథ చదవటం మొదలు పెట్టాడంటే మధ్యలో ఆపే ప్రసక్తే లేదు. అందువల్లనేమో నాగలక్ష్మి కథలకి ఎక్కువగా పోటీల్లో బహుమతులు లభిస్తూ ఉంటాయి. కథావస్తువులో వైవిధ్యం, కథ చెప్పటంలో నైపుణ్యం, మంచి భాషా శైలీ నాగలక్ష్మి కథల్లోని ప్రత్యేకత.
నాగలక్ష్మి నన్ను తన కథల పుస్తకానికి ముందుమాట రాయమన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నేను కథా రచయిత్రినీ, విమర్శకురాలినీ కాను, కేవలం అనువాదకురాలిని. కానీ ఎంతో ఆప్యాయంగా, మా స్నేహాన్ని కారణంగా అనుకుని ఈ నాలుగు మాటలూ, నాకు తోచినవి రాశాను. స్నేహితుల కోరికని ఎవరైనా తోసిపుచ్చగలరా మరి?
ఆర్. శాంత సుందరి
* * *
ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మీ కాపీని నేడే సొంతం చేసుకోండి.