“ఊహాచిత్రం” పుస్తకం పై సమీక్ష

“తెలుగు భాషను మరుగుపరుస్తున్నారన్న అపవాదును మోసే తరంలోనివాడిని. ఆంగ్ల మాధ్యమంలో చదువులు, కార్పొరేట్ ఉద్యోగాల పరుగుల మధ్యలో తెలుగు భాషాభిమానాన్ని, సాహితీ ఆసక్తిని సజీవంగా ఉంచుకోవచ్చని చెప్పడానికి నేను ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.. రేపటి తరానికి రెండు కథలు, నాలుగు పద్యాలు, కాసిన్ని సామెతలు చెప్పి తెలుగు భాషని రుచి చూపించండి. ఆ తరువాత పఠనాసక్తిని కలిగించి వదిలిపెట్టండి. ఏ మాధ్యమంలో చదివినా, జీవనానికి మరే భాష అవసరం అయినా తెలుగు మీద మక్కువ ఎక్కడికీ పోదు. అందుకు నేనే సాక్ష్యం..” అంటున్నారు ఊహాచిత్రం కథల సంపుటి రచయిత అరిపిరాల సత్యప్రసాద్.
ఆయన అన్నది అక్షరసత్యం. వెనుకటి ఏడు తరాలు చూసుకున్నా కలికాలానిక్కూడా రచయితలు అనేవారు లేని కుటుంబ నేపథ్యంలో పుట్టిన రచయితలో సాహిత్యాభిలాష పుట్టడానికి కన్నతల్లి తొలి పునాది వేశారు. అమ్మ అంటే ఇప్పుడాయనకు ఒకటే జ్ఞాపకం. పాత సినిమా పాటలు, లలిత సంగీతం, రేడియో పాటలు. నిత్యం పని చేసుకుంటూ ఆమె వీటి మధ్యే బతికిన రోజులు రచయిత జీవితంలోనే అత్యంత సంతోషకరమైన జ్ఞాపకాలలో ఒకటి. తర్వాత నాన్న రాత్రిపూట రేడియోలో వినే కర్నాటక సంగీతం. త్యాగరాజు, శ్యామదాసు, పురంధరదాసు, సుబ్బలక్ష్మి, శమ్మంగుడి, పట్టమ్మాళ్. వీళ్లంతా నాన్న సేకరించిన వందలాది సంగీతం క్యాసెట్ల రూపంలో రచయిత బాల్యంలో మెరిసిన సంగీత సామ్రాట్టులు. అమ్మ సాహిత్య, సంగీతాభిరుచి, నాన్న సంగీత రికార్డుల సేకరణ.. కళల గురించి ఏ ఇంట్లోనయినా ఆసక్తి కలగడానికి ఇవి చాలవా?
ఇక మేనత్త పరిచయం చేసిన పోతన పద్యాలు, బాల్య జీవితాన్ని పద్యమయం చేసేశాయి. తెల్లవారు జామున చెట్టుమీది పూలు కోస్తూ, ఆమె పాడిన పద్యాలు, శ్లోకాలు రచయితకు నేటికీ నందివర్ధనం చెట్టు మీద నుంచి రాలిపడిన మంచుబిందువులంత స్పష్టంగా గుర్తుకొస్తూనే ఉన్నాయి. ఇక నాన్నమ్మ చెప్పిన పూటకూళ్ల పెద్దమ్మ కథలు, కాశీమజిలీలు, భోజరాజు కథలు, విక్రమార్కుడు, రామాయణ, మహాభారత కథలు, రమణీయ బాల్యంలో మెరిసిన రసరమ్య గీతాలు.
లోహితా లోహితా అంటూ హరిశ్చంద్రుడు ఎంత ఏడ్చాడో కానీ, నానమ్మ ఆ కథ చెప్పిన ప్రతిసారీ ఏడవడం ఆశ్చర్యకరమైన, మర్చిపోని జ్ఞాపకమైతే, కథతో, అందులో ఉండాల్సిన ఎమోషన్‌తో తొలి పరిచయం అప్పుడే ఏర్పడిపోయిందట.
ఆ తర్వాత కనపడ్డ పుస్తకమల్లా చదవటం, ఇంగ్లీషు, తెలుగు, కాలక్షేప నవలలు, సీరియస్ రచయితలు ఇలా కిరాణా కొట్టులో కట్టిచ్చిన పొట్లాల కాగితంతో సహా కనబడ్డ పుస్తకమల్లా చదివి నమిలేస్తున్న క్రమంలో శ్రీశ్రీ కవిత్వంతో పరిచయం మయూరి వారపత్రికలో కలం కల కవితగా పరిణమించింది. ఆ పునాది 1995 ఆంధ్రప్రభ ఆదివారం పత్రికలో దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు బాట వేసింది.
మీకంటూ ఒక శైలి ఏర్పడాలంటే ఇంకా ఎక్కువగా చదవాలంటూ రచయిత, సాహితీ విమర్శకులు వసుంధర సలహాతో ఆరేడు సంవత్సరాలు ఏమీ రాయకుండా అజ్ఞాతవాసంలో ఉంటున్నట్లుగా అధ్యయనంలో మునిగిపోవడం. ముళ్లపూడి, కొకు, బుచ్చిబాబు, చలం , షిడ్నీ షెల్డన్, అగాథా క్రిస్టీ వంటి మహామహుల రచనలు చదువుతున్న కొద్దీ కుంచించుకుపోయి నేను రాసినవి కథలేనా అనే అనుభూతితో అలా చదువుతూ పోవడం… గుజరాత్‌లో చదువులు, కార్పొరేట్ ఉద్యోగాలు, ఉజ్జయని మంచినీటి కటకట ప్రభావంతో మళ్లీ కలం కదలిక. ఈ క్రమంలో కొత్తగా పరిచయమైన టెక్నాలజీ సాయం తీసుకుని బ్లాగులు, అంతర్జాలంతో మొదలై ఇప్పుడు వివిధ పత్రికలు, ఆన్‌లైన్ పత్రికలలో రచనల పరంపర.
ఇదీ 35 సంవత్సరాల ఆధునిక విద్యాధిక యువకుడి జీవిత సాహిత్య నేపధ్యం. ఈయన తొలి కథల సంపుటి ‘ఊహాచిత్రం‘ తెలుగు సాహిత్యానికి ఒక సత్యప్రసాదం. తెలుగుభాష త్వరలో అంతరించనుందన్న అనుమానం అంతర్జాతీయ ప్రచారమవుతూ భయపడుతున్న కాలంలో ఇలాంటి నమ్మకాల్ని, అతి ప్రచారాలాను, అనుమానాలను నిర్ద్వంద్వంగా తొలగించే శక్తివంతమైన కథల గుచ్చమే ఊహాచిత్రం. ఈ సంపుటిలోని 13 కథలు మళ్లీ మనముందుకు కొకు, రాచకొండ, రంగనాయకమ్మ, మల్లాది, యండమూరి.. ఇలా సమకాలీనంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న మహాకథకులందర్నీ మరోసారి గుర్తుచేస్తూ జీవితాన్ని కాచి వడపోసిన  అరిపిరాల కథలు. తెలుగు తెలతెలబోతోంది, తెలుగుకు భావి లేదు అనే రాతల్ని, కూతల్ని కూడా అభాసగా మారుస్తున్న కథలను ఈసంపుటిలో మనం చూడవచ్చు.
ఊహాచిత్రం, స్వప్న శేషం, తుది బంధం, ఐదువందల రూపాయల నోటు, చిరాకు రామనాథం, ఏడు తరవాత, మంత్రిగారి సమాధి, చినుకులా రాలి, వానర వీరుడు, చిలక రాయబారం, మబ్బుతునక, ఈరేశంగాడి ముచ్చట, ఓపెన్ టైప్, మేరా భారత్ మహాన్, పద్మావతీ శ్రీనివాసం, మంచినీళ్ల బావి, కలిసివచ్చిన ఇల్లు, భూదేవతమ్మ ఇవీ ఈ సంపుటిలోని 13 కథలు. నేల మీద జీవధారల్ని కాలుష్యం చేసి తన మనుగడకే ముప్పు తెచ్చుకుంటున్న మనిషి తీరు పట్ల తీవ్ర అభ్యంతరం,  ఆధునిక దాంపత్యానికి అపరూప విశ్లేషణ, డబ్బే సర్వస్యమనుకునే నేటి తరం తీరుపై అపూర్వ స్పందన, తనను నచ్చే ప్రపంచం, తానుండే ప్రపంచం ఒకటి కాని స్థితిలో భావుకుల స్వప్నశేషాలు. కార్పొరేట్ ఉద్యోగుల జీవితాల్లో పద్మావతీ శ్రీనివాసం, కళ్లకు కట్టిన మనోవిశ్లేషణ, మంచినీరు తాగునీరుగా, అమ్మకపు నీరుగా మారిన వ్యాపారీకరణ, జీవన వేదాంతాన్ని ఇమిడ్చిన అద్బుతమైన కథన కౌశలం, ఇవన్నీ కలిస్తే అరిపిరాల కథలు..
కంపెనీ కొన్నప్పుడు ఆ కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చిన ఉద్యోగస్థులు ఆ కంపెనీలో భాగం కాకుండా పోతారా (ఉద్యోగం పోగొట్టుకున్న వాడి ఆవేదన). ‘పొలం భూదేవత. తల్లితో సమానం. అమ్మనెలా అమ్మమంటావ్? భూదేవతంటే లక్ష్మీదేవి కాదు. అన్నపూర్ణ, పదిమందికి అన్నం పెట్టే తల్లి’ తోటి సైనికుడు చనిపోతే కనీసం అటువైపు చూడనైనా చూడకుండా యుద్ధంలోకి పరుగెత్తే సైనికుల్లా కొలీగ్స్..  ‘సంసార కాలం మొత్తం ముళ్లు ఏరిపారెయ్యడానికే సరిపోయింది. పూలదారులు పక్కనే ఉన్నా ముళ్లు ఏరే పనిలో వాటిని గుర్తించనే లేదు’.
కుప్పిలి పద్మగారన్నట్లు ‘ఈ కథలు మనలని గాభరాలో ముంచెత్తవు, నిద్రపుచ్చవు, నిర్లిప్తంగా కూడా ఉంచవు కాని, మన చుట్టూ ఉన్న మనుష్యులని ఆరోపణలతో కాక, ఆత్మీయంగా అర్థం చేసుకునే వైపు మనల్ని నడిపించే పాజిటివ్ కథలు. మనకు ఊహ తెలిసిన నాటి నుంచి మనం తెలవారుఝామున వినే చరిపరిచిత స్వరాన్ని ఈ కథలు తిరిగి మనలోకి ప్రవహింపచేస్తాయి.’ ఆధునిక జీవితంలోని డొల్లతనాన్ని, కపటత్వాన్ని ఆవిష్కరిస్తూనే మనిషి మనిషిగా బతకడం లోని ఆనందాన్ని కూడా వివరించే కథలివి. సత్యం కోసమో. జీవితానికి అర్థం కోసమో.. లేక తనకే తెలియిని ఒక జ్ఞాపకం కోసమో రచయిత సాగించిన వెతుకులాటను ఈ కథల్లో చూసిన తర్వాత మనం కూడా కాస్త ఆలోచనలో పడతాం.
ఇంతకుమించి ఏ కథకుడికైనా కావలసింది ఏమిటి? అరిపిరాల సత్యప్రసాద్ గారి కథలను మనమూ చదువుదామా మరి.

 ఆంధ్రప్రభ , 7 మే 2014 .

ఊహాచిత్రండిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.  మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

ఊహాచిత్రం on kinige

 

OohaChitram600

 

Related Posts:

స్వయం ప్రకాశం

ప్రముఖ రచయిత్రి టి. శ్రీవల్లీరాధిక రచించిన కథల సంపుటం “స్వయం ప్రకాశం“. ఇందులో పన్నెండు కథలు ఉన్నాయి. ఈ పుస్తకంలోని కొన్ని కథలను పరిచయం చేసుకుందాం.

మనుష్యులకి ఈర్ష్య ఉండడం సహజమే. ఎవరైనా నాకు ఈర్ష్య లేదు అని చెబితే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నమ్ముతారా? సమాజం నమ్ముతుందా? తోటివాళ్ళు సాధారణంగా ఏ విషయాలకి సంతోషిస్తారో… గర్వపడతారో, వాటి పట్ల ఉత్సాహం చూపని, ఉద్వేగం ప్రదర్శించని ఓ మహిళని ఈర్ష్శ్యాళువుగా ముద్ర వేస్తారు. అవతలివారికి తనని తాను అర్థమయ్యేలా చెప్పడంలో కథకురాలు విఫలమై, వారంతా ఆమెని చూసి ఈర్ష్య పడే స్థితి తెచ్చుకుంటుంది. ఫలితంగా ఆమె మళ్ళీ మౌనాన్ని ఆశ్రయిస్తుంది. ఏం మాట్లాడాలన్నా భయపడుతుంది. చివరికి తన సొంత విజయాల పట్ల కూడా ఉత్సాహం చూపదు. అలాంటి స్థితిలో ఆమెకి తన సమస్యకి పరిష్కారం తన పిల్లల సంభాషణలో దొరుకుతుంది. ఆలోజింపచేసే కథ “ఈర్ష్య”.

కథకురాలు తన భర్తతో కలసి మైసూరు పరిసర ప్రాంతాలలో ఉండే పుణ్యక్షేత్రాల సందర్శనకి వెడుతుంది. అన్నీ చూసాకా, తిరుగు ప్రయాణం రోజున ఇంకా కాస్త సమయం దొరికే సరికి, మైసూర్‌కి దగ్గర్లోని సోమనాధపురం వెడతారు. అక్కడ గుడిలో ఓ ప్రవాస భారతీయుడు పరిచయం అవుతాడు. కథకురాలి భర్త చేసే పనులన్నీ అతనికి తప్పుల్లానే కనిపిస్తాయి. అతను తన సామర్ధ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం లేదని, డబ్బు విలువ తెలుసుకోడం లేదని అంటూ, తన గురించి తాను చెప్పుకుంటూ తన తెలివితేటలని ప్రదర్శిస్తాడు. అయితే అతని లోని లోపమేంటే వివరిస్తుంది కథకురాలు. అక్కడి వారు మిగుల్చుకోడానికి చూస్తే, ఇక్కడి వారు పంచుకోడానికి చూస్తారని, ‘పుణ్యం – పురుషార్థం’ అవేనని చెబుతుంది.

మగవాళ్ళ దృష్టిలో స్త్రీ వ్యక్తిత్వం అంటే ఏమిటో చెబుతుంది కథకురాలు. పురుషుల దృష్టిలో మాహిళల వ్యక్తిత్వం అంటే… డబ్బు సంపాదించగల సామర్థ్యం, భర్త సంపాదించి తెచ్చినా…. తేకపోయినా బాధ్యతలు నెత్తికెత్తుకోగల ప్రయోజకత్వం, భర్త నుంచీ ఏమీ ఆశించని, అతని మీధ ఆధారపడని ధీరత్వం…వాటితో పాటు అతనికి అణిగిమణిగి ఉండే సహనశీలత…. అతడు కొట్టినా, తిట్టినా చిరునవ్వుతో చూడగల స్థితప్రజ్ఞత. ఇది వ్యక్తిత్వమా? ‘భార్యాత్వం’ కదూ?

మగవాళ్ళు చాలా సులభంగా వాడే మాటలని ఆడవాళ్ళు ఎందుకని అంత సులభంగా తీసుకోలేరు? ఎందుకంత గుంజాటన పడతారు?బాధ ఎందుకు పడతారు? ఆ మగవాడు భర్తయి, ఆ స్త్రీ భార్య అయితే ఆమె మనః స్థితి ఎలా ఉంటుంది? అందునా ఆ బంధం విఫలమైనప్పుడు స్త్రీ తను వేసిన అడుగుని వెనక్కి తీసుకోలేని తన అశక్తత పట్ల బాధ పడుతుంది. అలాంటి బాధనే మగవాడికీ కలిగిస్తే గాని తనకి ఉపశమనం లభించదనుకుంటుంది. వాడుకుని వదిలేస్తే కలిగే బాధని భర్తలో కూడా కలిగించిన ఓ భార్య కథ – ‘అలక్ష్యం’.

తనతో బామ్మ ఎందుకు అబద్ధం చెప్పిందో.. తను పెద్దయి; తన మనవరాలి పెళ్ళినాటికి కూడా వేణుగోపాల్‌కి అర్థం కాదు. ఎందుకో ఏదో కోల్పోయిన భావన. ఇంట్లో పెళ్ళి సంబరం ఏదీ ఉన్నట్లు అతని అనిపించదు. పెళ్ళంటే ఇలా ఉంటుందని చిన్నప్పుడు బామ్మ చెప్పిన మాటలు అబద్ధాలేమోనన్న సంశయం అతనిలో తీరదు. చివరికి అతని సంశయాలని, సందేహాలని అతని అక్క తీరుస్తుంది. బామ్మ లాంటి మంచి గురువుని తాను సరిగా ఉపయోగించుకోలేకపోయాననిపిస్తుందతనికి. ‘మాటలు కాదు’ చక్కని కథ.

తాను అమిత ధైర్యశాలిని అనుకునే మనవరాలికి, నిజమైన ధైర్యం అంటే ఏమిటో ఆమె బామ్మ చెబుతుంది. ప్రమాదంలో నుంచి త్వరగా బయటపడడం… దాని గురించి బాధ పడకపోవడం… ధైర్యం. అలా ఉండగలిగినవారే నిజమైన ‘సాహసి’ అని మనవరాలు గ్రహిస్తుంది.

పెద్దలకి, పిల్లలకి మధ్య ఉండే తేడాని అద్భుతంగా చెప్పిన కథ ‘ధారణ’. ఓ ఫాన్సీ డ్రెస్ పోటీ నేపధ్యంలో పిల్లల తల్లిదండ్రులు రకరకాల దుస్తులు అమ్మే కొట్టు చుట్తూ తిరగడం, పిల్లలు ఆయా దుస్తులలో ప్రదర్శనివ్వడం గురించి చెబుతుందీ కథ. బాల్యానికి దగ్గరగా ఉండే కిటుకేమిటో ఈ కథ చెబుతుంది.

ఈ కథల సంపుటికి శీర్షిక అయిన కథ ‘స్వయం ప్రకాశం’. ఈ సంకలనానికి తలమానికమైన కథ. కష్టం రావడానికీ, కష్టపడడానికి మద్య ఉండే తేడాని విశదీకరిస్తుందీ కథ. మన కష్టాలని చూసి మనమే బాధపడడం అనవసరమైతే… ఎదుటివాళ్ళు బాధపడాలని కోరుకోడం అసహ్యమని చెబుతుందీ కథ.

కోరికలు, ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నంత కాలం అనుభవమూ, పాండిత్యమూ పనిచేయవు. ఆశ ఉన్న చోట అవి నిర్వీర్యమైపోతాయని చెబుతుంది ‘ఆశ’ కథ. ఒక విషయానికి స్పందిస్తున్నంత కాలం, దాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేమని, స్థితప్రజ్ఞత అలవడ్డాకే నిజమైన జ్ఞానం లభిస్తుందని చెబుతుంది ఈ కథ.

సమర్థతని, నిగ్రహంతో కూడిన ప్రవర్తనకి ముడిపెట్టిన ఓ మేనేజరు ఆ రెండిటికి అసలు సంబంధమే లేదని తెలుసుకుంటుంది. సమర్థత కేవలం ఆసక్తికి సంబంధించిన విషయమని, ఆసక్తి ఉన్న రంగాలలో వ్యక్తుల సామర్థ్యం స్పష్టం అవుతుంది. ఈ విషయాలు తను నిర్దేశించినవీ, తనకి అనుకూలమైనవి అయితే ఆ వ్యక్తులు సమర్థులు, మర్యాదస్తులని అంటుంది సమాజం. దీనికి వ్యతిరేకమైతే, సామర్థ్యం కూడా అసమర్థతగానే పరిగణించబడుతుంది. మనలాగా ప్రవర్తించే వాళ్ళని మాత్రం సమర్థులుగానూ, మనకి అనాసక్తమైన పనులు చేసేవారిని అసమర్థులుగాను భావించకూడదని చెబుతుంది ‘యోగ్యత’ కథ.

ఈ సంపుటిలో కథలకి మనుషులకు సహజంగా ఉండే లక్షణాలను, వేటిని అలవర్చుకుంటే తాము ఆనందంటూ ఉంటూ ఇతరులని సైతం సంతోషంగా ఉంచగలుగుతారో ఆ లక్షణాలను శీర్షికలుగా ఉంచడం బావుంది. దాదాపుగా అన్ని కథలలోనూ మనుషుల ప్రవర్తనను, కుటుంబ సభ్యుల సంబంధ బాంధవ్యాలను చక్కగా ప్రస్తావించారు రచయిత్రి. పాత్రల మనస్తత్వాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణించడం వలన అన్ని కథలకు నిండుదనం వచ్చింది. పాత్రోచితమైన సంభాషణలు కథకి ఎంచుకున్న ఇతివృత్తానికి బలాన్ని చేకూర్చాయి. వెరసి పాఠకులని నిరాశపరచని పుస్తకం ” స్వయం ప్రకాశం”.

ఈ కథాసంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

స్వయం ప్రకాశం On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

“మహార్ణవం” కథాసంపుటికి పురస్కారం

కొల్‌కతాలోని భారతీయ భాషా పరిషద్ 1974లో స్థాపించబడింది.

భారతీయ సాహిత్యం కోసం ఎనలేని సేవ చేస్తున్న సంస్థ ఇది. ఒక భాషలో వెలువడిన పుస్తకాన్నిఇతర భాషలలోకి అనువదింపజేసి, ఆ పుస్తకాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం ఈ సంస్థ లక్ష్యాలలో ఒకటి.

అన్ని భారతీయ భాషలలోని సాహిత్యకారులను ఒక వేదిక మీదకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా, ఈ సంస్థ 1980 నుంచి వార్షిక పురస్కారాలను అందిస్తోంది.

2011 వ సంవత్సరానికి భారతీయ భాషా పరిషద్, కలకత్తా వారి పురస్కారం – తెలుగులో- సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి టి.శ్రీవల్లీరాధిక రచించిన “మహార్ణవం” కథాసంపుటికి – ప్రకటించబడింది.

ది 18 – 19 ఫిభ్రవరి 2012 తేదీలలో జరిగిన కార్యక్రమంలో రచయిత్రి ఈ అవార్డుని స్వీకరించారు. రచయిత్రికి అభినందనలు.

మహర్ణవం కథా సంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

మహార్ణవం On Kinige

Related Posts: