వీరభద్రారెడ్డి (Veerabhadrareddy) Madhubabu latest novel is now online…

డైనమిక్ రైటర్ మధుబాబు లేటెస్ట్ తెలుగు నవల వీరభద్రారెడ్డి ఇప్పుడు కినిగెలో లభిస్తుంది. ఈ లింకు నొక్కి మరిన్ని వివరాలు చూడండి.

నేటి తెలుగు దేశాన్నంతటినీ ఏకఛత్రాధిపత్యంగా క్రీ.శ.1200వ సంవత్సరం నుంచీ 1325 వరకూ పరిపాలించిన వంశం – కాకతీయ వంశం.

కాకతీయ సామ్రాట్టయిన శ్రీశ్రీశ్రీ గణపతి దేవుడికి పురుష సంతానం లేకపోవడం వల్ల, తన కుమార్తె అయిన రుద్రమదేవిని తన తరువాత కాకతీయ సామ్రాజ్యానికి వారసురాలిగా ప్రకటించాడు.

ఒక ఆడది రాజ్యాన్ని పరిపాలించడం అవమానమని భావించి, తిరుగుబాటు బావుటాని ఎగురవేసారు ఎంతోమంది. కళింగం నుంచి, దేవగిరినుంచి, కొంకణం నుంచి, పాండ్యనాడు నుంచి శత్రువులు ఒకరొకరు గానూ, ఒక్కుమ్మడిగాను సామ్రాజ్యం మీదకి దండెత్తి వచ్చారు.

రాజ్యంలో శాంతిభద్రతలు క్షీణించాయి. గ్రామసీమలు శత్రువుల దురంతాలకు, దురాగతాలకు గురికాజొచ్చాయి. అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు విచ్చలవిడి అయిపోయాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని విపత్కర పరిస్థితి. ఎటుచూసినా అశాంతి, అల్లరి… ముఖ్యంగా నమ్మకద్రోహం.

ఈ సమయంలో భువనగిరి ప్రాంతాన్ని పరిపాలించే గోనగన్నారెడ్డి, శ్రీకాకుళ ప్రదేశానికి ప్రభువులైన ఐదులూరి అన్నయమంత్రి, కొలను రుద్రదేవుడు –

కాయస్త సేనానాయకుడైన జన్నిగదేవ, అంబదేవ త్రిపురాంతకాలు, ఆ తరువాత ప్రధాన దండనాయకుడైనటువంటి ప్రసాదిత్య నాయకుడు మొదలైన వారందరూ తమ తమ శక్తిమేరకు దేశాన్ని సుభిక్షం చేయడంలో రుద్రమదేవికి తోడ్పడ్డారు. ఇదిగో… ఈ గొడవల మధ్య ప్రారంభం అవుతుంది నా ఈ వీరభద్రారెడ్డి.

వీరభద్రారెడ్డి On Kinige

Related Posts:

బైరాగి – మధుబాబు నవల


ఉదయం ఆరుగంటల సమయంలో వచ్చి రవిబాబు రూమ్‌ తలుపులు తట్టాడు హౌస్‌ ఓనర్‌. “ఊరు ఊరంతా నిద్రలేచి గంటకుపైనే అయింది. నీకు మాత్రం ఇంకా తెల్లవారలేదా నాయనా?” వెక్కిరింపుగా అడిగాడు.

“మీరా సార్‌? లోపలికి రండి…” అంటూ తలుపుల్ని బార్లాతెరిచి లోపలికాహ్వానించాడు రవిబాబు.

“మర్యాదలు తర్వాత. ముందు నువ్వివ్వాల్సిన అద్దె డబ్బులు నా ముఖం మీద పడేయ్‌” సినిమా విలన్‌ మాదిరి వంకరగా నిలబడుతూ కోరగా అడిగాడు హౌస్‌ ఓనర్‌.

పచ్చి వెలక్కాయ గొంతుకు అడ్డం పడినట్లయింది రవిబాబుకి. “సార్‌ అదీ నా దగ్గిర ట్యూషన్‌ చెప్పించుకుంటున్న వాళ్ళు ఈ నెల ట్యూషన్‌ ఫీజు ఇవ్వలేదు. ఇవ్వగానే అద్దె డబ్బులు మీకు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను” వినయంగా సమాధానమిచ్చాడు.

అతను ఏ విధమైన సమాధానం చెప్పినా వినపించుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటానికి సిద్ధపడేవచ్చాడు హౌస్‌ఓనర్‌.

“ఇదిగో రవిబాబూ… నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపు సాయంత్రానికల్లా నా అద్దె నాకు ఇచ్చి తీరాలి. లేకపోతే ఇల్లు ఖాళీ చేసేయాలి. అర్థమైందా?” గంభీరంగా ముఖం పెట్టి గబగబా అన్నాడు. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా అక్కడ వుండకుండా వెళ్ళిపోయాడు.

ప్రపంచాన్ని దడదడలాడించడానికి వచ్చిన తుఫాను వెలిసిపోయినట్టు తేలికగా నిట్టూర్చి రూమ్‌లోకి పోయాడు రవిబాబు. చకచకా కాలకృత్యాలు తీర్చుకున్నాడు.

రెండు నిమిషాల్లో డ్రెసప్‌ అయి బయటికి వచ్చాడు.

గబగబా అడుగులు వేసి తన రెగ్యులర్‌గా టిఫిన్‌ చేసే టిఫిన్‌ సెంటర్‌ దగ్గిరికి పోయాడతను.

అల్లంత దూరంలో వుండగానే అతన్ని చూసి, “ఏందిది రవిబాబూ? ఎప్పుడూ ఠంచన్‌గా ఫస్టు తారీఖుకల్లా టిఫిన్‌ బిల్లు కట్టేవాడివి… ఇప్పుడు పదో తారీఖు కూడా దాటిపోయింది. ఎప్పుడబ్బా డబ్బులు ఇచ్చేది?’ అని అడిగాడు టిఫిన్‌ సెంటర్‌ ఓనర్‌.

“ట్యూషన్‌ ఫీజులు ఇంకా రాలేదు నాయరూ.. రేపు ఎల్లుండిలో వస్తాయ్‌.. రాగానే తీసుకొచ్చికట్టేస్తాను” అనీజీగా చూస్తూ చెప్పాడు రవిబాబు.

“అవి ఎప్పుడొస్తయ్యో నువ్వు ఎప్పుడు కడతావో… అదంతా నాకు తెలియదు రవిబాబూ.. రేపు పొద్దునకల్లా నా డబ్బులు నాకు ఇచ్చేయ్‌. ఇవ్వకపోతే టిఫిన్‌, కాఫీ బంద్‌… ముందుగానే చెప్తున్నా… తర్వాత నన్ను తిట్టుకోవద్దు” ఘాటుగా వార్నింగ్‌ ఇచ్చాడు ఓనర్‌.

తలవంచుకుని లోపలికిపోయాడు రవిబాబు. టిఫిన్‌ సర్వ్‌ చేసే వెయిటర్స్‌ తన వంక చూసి నవ్వుతున్నట్టు అనిపించినా, పట్టించుకోకుండా రెండు ఇడ్లీలు తిని కాఫీ తాగాడు. టిఫిన్‌ సెంటర్‌కి పక్కనే వుంది కిళ్ళీబడ్డీ… అతనూ పాతబాకీ గురించి మాట్లాడితే పరిస్థితి ఎలా వుంటుందో ఆలోచిస్తూ అక్కడికెళ్ళాడు.

అరవై ఏళ్ళు వుంటాయి కిళ్ళీబడ్డీని నడుపుతున్న ఆర్ముగానికి. ఎప్పుడో నలభై ఏళ్ళక్రితం సిటీకి వచ్చి హ్యాపీగా కిళ్ళీ బడ్డీ బిజినెస్‌లో సెటిల్‌ అయ్యాడు.

“ఏంది రవిబాబూ… నాయరు నీ మీద అలా అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నాడేంటీ?” అతన్ని చూడగానే ఒక సిగరెట్‌ని తీసి ఇస్తూ అడిగాడు.

నాయర్‌ అగ్గి మీద గుగ్గిలం ఎందుకు అవుతున్నాడో దాచకుండా చెప్పేశాడు రవిబాబు.

“నీకు ట్యూషన్‌ ఫీజులు ఈ నెల నించీ రావు.. నువ్వు ట్యూషన్‌ చెప్తున్న ఇళ్ళు పోయిన నెల్లోనే ఖాళీ అయిపోయినయ్‌….” గుంభనంగా నవ్వుతూ అన్నాడు ఆర్ముగం.

అతనిచ్చిన సిగెరెట్‌ని వెలిగించుకుంటూ గాఢంగా నిట్టూర్చాడు రవిబాబు. అబద్ధం కాదు ఆ మాట… అక్షరాలా నిజం. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో వున్న బ్యాంకర్స్‌ కాలనీలో రెండు ఇళ్ళలో నలుగురు పిల్లలకి ట్యూషన్‌ చెప్తున్నాడు తను. నెలకు ఎనిమిది వందల రూపాయలు ఠంచన్‌గా చేతుల్లో పడేవి. అవి ఇంటి అద్దెకి, టిఫిన్‌ ఖర్చులకి సరిగ్గా సరిపోయేవి.

ఆ పిల్లల పేరెంట్స్‌కి ట్రాన్స్‌ఫర్స్‌ వచ్చాయి. వాళ్ళు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దాంతో ఠంచన్‌గా వచ్చే తన ఆదాయానికి బ్రేక్‌ పడింది.

ఫస్ట్‌క్లాసులో పాస్‌ అయిన డిగ్రీ పరీక్ష తనకు వేరే ఉద్యోగాన్ని చూపించడం లేదు. ఉదయం పది గంటల నించి సాయంత్రం ఐదువరకూ ఎక్కడికిపోయినా, ఎవర్ని దేబిరించినా ఖాళీలు లేవనే అంటున్నారు తప్ప, అటెండర్‌ పని కూడా ఎవరూ ఇవ్వడం లేదు.

నోటికి వచ్చిన సమాధానాలు చెప్పి హౌస్‌ ఓనర్‌కి, టిఫిన్‌ సెంటర్‌ నాయర్‌ని మభ్యపెడుతున్నాడు తను. ఇప్పటివరకూ ఎలాగో ఓపికపట్టారు వాళ్ళు.

ఇకముందు ఆపని చేయడం చాలా కష్టం.

సిగరెట్‌ పొగని గుండెలనిండా పీల్చుకుంటూ శిలావిగ్రహంలా నిలబడిపోయిన రవిబాబు వంక సానుభూతిగా చూశాడు ఆర్ముగం.

“నీలా ముక్కుకు సూటిగా పోయేవాళ్ళు ఈ సిటీలో బతకడం చాలా కష్టం రవిబాబూ. కావాలంటే దారి ఖర్చులకు ఓ యాభై ఇస్తాను. ఇంటికి వెళ్ళిపో… అక్కడే ఏదైనా పని వెతుక్కో… పనీ దొరక్క, ట్యూషన్లు చెప్పక రోజులు గడవ్వు.. అడ్డమైన వాళ్ళతో అనవసరంగా మాటలు పడటం దేనికి?” ముందుకు వంగి ఆప్యాయంగా అన్నాడు.

*** *** ***

ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా అతను మాత్రం అలా చనువుగా మాట్లాడటానికి పెద్ద కారణమే ఒకటి వుంది. అంతకుముందు సరిగ్గా ఒక సంవత్సరం క్రితం సైకిల్‌ మీద వెళుతున్న ఆర్ముగం, ఖర్మ కాలి సిటీబస్‌కింద పడ్డాడు. దెబ్బలు బలంగా తగిలినయ్‌. బోలెడంత రక్తం పోయింది. అతనికి సరిపడే రక్తం దొరక్క అతని భార్యాపిల్లలు గావురుగావురుమంటున్న సమయంలో తనదీ అదే బ్లడ్‌గ్రూప్‌ కావడంతో, కావాల్సిన రక్తాన్ని హేపీగా డొనేట్‌ చేశాడు రవిబాబు.

అందరి మాదిరిగా కాకుండా ఆ సహాయాన్ని మర్చిపోకుండా మనసులో పెట్టుకున్నాడు ఆర్ముగం. సిగరెట్‌ ఖాతా చెల్లింపుల్లో కొంచెం ఆలస్యమైనా అరిచి కేకలు పెట్టకుండా ఇచ్చేంతవరకూ ఆగుతున్నాడు. ఇప్పుడు మరికొంచెం ముందుకుపోయి ఇంటికి వెళ్ళేందుకు దారి ఖర్చులు కూడా ఇస్తానని అంటున్నాడు.

నిలబడటానికి ఓపికలేనట్టు కిళ్ళీబడ్డీ పక్కనే వున్న కరెంట్‌పోల్‌ని అనుకుని నిలబడ్డాడు రవిబాబు. ఆర్ముగం దారి ఖర్చులకి డబ్బులిస్తాను అనడం వరకూ బాగానే వుంది. వెళ్ళడానికి తనకి దారి అంటూ ఏమీలేదు.

ఎవరు కన్నారో, ఎక్కడ జన్మ ఇచ్చారో తెలియని అనాథ తను. రోడ్డు పక్కన పొదల్లో ఏడుస్తూ పడివుంటే ఎవరో ధర్మాత్ములు చూసి అనాథ శరణాలయంలో చేర్పించారు. శరణాలయంలో పనిచేసే ఉద్యోగస్తుల్నే తల్లిదండ్రులుగా భావిస్తూ పెద్దవాడయ్యాడు తను. పెద్దవాడైన తర్వాత బయటికి పంపించేశారు వాళ్ళు. ‘నీ బతుకేదో నువ్వే బతుక్కో…’ అంటూ చేతులు దులిపేసుకున్నారు.

గవర్నమెంట్‌ ఇచ్చిన స్కాలర్‌షిప్పుల సహాయంతో డిగ్రీ పూర్తయింది.

ముందు వెనుక ఎవ్వరూ లేకపోవడం, తల్లీతండ్రీ ఎవరో తెలియకపోవడం ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి అడ్డంకులుగా తయారైనాయి. చిల్లర కొట్లో పొట్లాలు కట్టే పనికోసం కూడా పుట్టుపూర్వోత్తరాలు అవసరం అవుతున్నాయి. ఆ సంగతి ఆర్ముగానికి తెలియచెప్పడం ఎలా??

“ఏంటి రవిబాబూ? ఏంటి ఆలోచిస్తున్నావ్‌? ఇంటిదగ్గిర ఏదైనా గొడవపడి చెప్పకుండా పారిపోయి వచ్చేశావా? తిరిగి వెళ్ళడానికి నామోషీగా వుందా?” అతని మౌనానికి తనంతట తానే కారణాన్ని ఊహించుకుంటూ అడిగాడు ఆర్ముగం.

అప్పటికప్పుడు సమాధానం చెప్పడానికి అంతకంటె మంచి కారణం మరొకటి దొరకదని వెంటనే అనిపించింది రవిబాబుకి.

“అవును… నా అంతట నేను మంచి ఉద్యోగం సంపాదించుకుంటానని చెప్పి వచ్చేశా… ఇప్పుడు దేబె ముఖం వేసుకుని వెళ్ళడం బాగోదు కదా” జాగ్రత్తగా మాటల్ని ఎంచుకుంటూ అన్నాడు.

“అదీ నిజమే. మాట అన్నామంటే దాని మీద నిలబడాలి. మరి ఇప్పుడేం చేస్తావ్‌?” సానుభూతిగా అడిగాడు ఆర్ముగం.

“ప్రత్యేకంగా చేసేది ఏముంది? ప్రతిరోజూ చేసేదే ఇవ్వాళ కూడా చేస్తాను. ఎక్కడయినా పని దొరుకుతుందేమో ప్రయత్నించి చూస్తాను” అంటూ ముందుకు అడుగువేయబోయిన అతన్ని “నామోషీ అనుకోకపోతే, నాకు తెలిసిన మనిషి ఒకడు వున్నాడు. మన సిటీలోనే ఫోర్త్‌ టౌన్లో చెత్తని కలెక్ట్‌ చేయించే కంట్రాక్టర్‌… కావాలంటే అతనికి ఫోన్‌ చేసి చెపుతాను. నీకు ఇష్టమైతేనే సుమా… ఇంత చదువు చదివి ఆఖరికి చేయాల్సిన పని ఇదా అని నువ్వు బాధ పడకూడదు” అన్నాడు ఆర్ముగం.

బాధపడకూడదని అనడమైతే అన్నాడు గాని, అనడానికి అతను బాధపడ్డాడు. వినడానికి రవిబాబుకి కూడా చాలా బాధగానే అనిపించింది. నిజమే… తను చదివిన చదువేమిటి? ఆఫర్‌ చేయబడిన పనేమిటి?? కాని ఆ పరిస్థితిలో అంతకంటే వేరే మార్గం ఏమైనా వున్నదా?

రెండే రెండు క్షణాలు ఆలోచించాడు రవిబాబు. మూడో క్షణంలో మనసు గట్టి చేసుకుని తల ఊపాడు.

“ఫోర్త్‌ టౌన్‌ సెంటర్లో దివ్యా బిల్డింగ్‌ అని మూడంతస్తుల మేడ… మధ్య పోర్షన్లో వుంటాడు. నవ్వు వెళ్ళే లోపల నేను ఫోన్‌ చేస్తాను” వెంటనే చెప్పాడు ఆర్ముగం.

రెండో ఆలోచన లేకుండా లెఫ్ట్‌రైట్‌ మొదలుపెట్టాడు రవిబాబు…… సరిగ్గా ఒక గంట తర్వాత ఆర్ముగం చెప్పిన బిల్డింగ్‌లోకి ఎంటరై, కాలింగ్‌బెల్‌ మోగించాడు.

2

“చూట్టానికి స్టూడెంట్‌లా వున్నావ్‌. ఈ పని చేయగలవా?” అనడిగాడు తలుపులు తెరిచి అతణ్ణి చూసిన వెంటనే, ఆర్ముగానికి బాగా తెలిసిన ఆ మనిషి.

“చెయ్యగలను సార్‌. ఈ పని చెయ్యడానికి చదువు అవసరం లేదుగా” నిర్లిప్తంగా అన్నాడు రవిబాబు.

“ఆర్ముగం చెప్పాడు కాబట్టి పనిలో పెట్టుకుంటా…. రేపు ఉదయం నించీ నువ్వు శ్యామలా అపార్ట్‌మెంట్స్‌లో, స్వదేశీ బిల్డింగ్స్‌లో చెత్తను కలెక్ట్‌చెయ్యాలి…. ఓకేనా?” అన్నాడు ఆ మనిషి.

ఓకే అన్నట్టు తలవూపాడు రవిబాబు.

“నీకు ఏమైనా అడ్వాన్సు ఇస్తే బాగుంటుందని ఆర్ముగం చెప్పాడు. అందుకే మూడువందలు ఇస్తున్నా. డబ్బులు తీసుకుని పని ఎగకొడితే ఎక్కడున్నా పట్టుకుంటా… మక్కెలు విరగకొడతా…” అంటూ అప్పటికప్పుడు మూడువందలు రవిబాబు చేతిలో పెట్టాడు ఆ మనిషి.

ముఫ్పై వేలు తన చేతిలోపడిన ఫీలింగ్‌ రవిబాబుకి కలిగింది. ఇంటద్దె ప్రాబ్లం తీరిపోయింది. టిఫిన్‌ సెంటర్‌ ప్రాబ్లం మాత్రమే మిగిలింది. పొద్దుపోయేలోపల ఇంకో పని ఏదయినా దొరక్కపోతుందా?? దొరికింది చెత్తను కలెక్ట్‌ చేసే పనే అయినా, ఆ రోజుతో ఎందుకనో తన ప్రాబ్లమ్స్‌ అన్నీ సాల్వ్‌ అయిపోతాయనే హేపీ ఆలోచనలు రవిబాబు మనసులోకి వేగంగా ఎంటర్‌ అయినాయి.

*** *** ***

ఆర్ముగం ఫ్రెండ్‌ ఇచ్చిన నోట్లను జేబులో పెట్టుకుని హుషారుగా బిల్డింగ్‌ బయటికి వచ్చాడు. వేగంగా అడుగులు వేసి రోడ్డును క్రాస్‌ చేస్తుండగా అతని దారికి అడ్డం వచ్చారు నలుగురు దృఢకాయులు.

ప్రతిరోజూ జిమ్‌కి వెళ్ళి గంటలు తరబడి వ్యాయామం చేస్తున్నారు కాబోలు, కండలు తిరిగి వున్నాయి వారి శరీరాలు. దువ్వుకోకుండా ఊరికే వదిలేయడం ఫ్యాషన్‌ అయినట్టు, చెల్లాచెదరుగా ముఖం మీదపడుతోంది జుట్టు.

“నటేశం దగ్గిరికి పోయి వస్తున్నావా?” ముందుకు పోనీయకుండా చెయ్య అడ్డం పెట్టి రవిబాబును ఆపుతూ అడిగాడు వారిలో ఒకతను.

నటేశం అంటే ఆర్ముగం ఫ్రెండ్‌. తనకు పనితో పాటు అడ్వాన్సు కూడా ఇచ్చిన పెద్దమనిషి. అతని ఔదార్యాన్ని తలుచుకుంటూ తల ఊపాడు రవిబాబు.

“ఎక్కడినించో వచ్చాడు. ఇక్కడ పుట్టి, ఇక్కడే పెరిగిన మమ్మల్ని కాదని దందాలు చేస్తున్నాడు. ఈ ఏరియాలో కాంట్రాక్టు పనులన్నీ మావే.. బయటివాళ్ళు చేయకూడదు… వాడు నీకు ఎంతిచ్చాడు?” దురుసుగా అడిగాడు వారిలో రెండో మనిషి.

ఆర్ముగం ఫోన్‌ చెయ్యగానే, అతని ఫ్రెండ్‌ తనకి పని ఇవ్వడమే కాకుండా, అడ్వాన్సు ఇవ్వడంలో ఏదో మతలబు వుందని వెంటనే అర్థం అయింది రవిబాబుకి.

“ఇప్పుడేమీ ఇవ్వలేదు. రేపు పనిలోకి వచ్చిన తర్వాత ఇస్తానని అన్నాడు” తడుముకోకుండా నోటికివచ్చిన సమాధానాన్ని అతనికి వినిపించాడు.

“రేపు నువ్వ పనిలోకి రావడం లేదు బే.. వచ్చావంటే కాళ్ళు విరిగిపోతయ్‌.. వెళ్ళిపో” అంటూ తన గుండెలమీద చెయ్యివేసి బలంగా నెట్టాడు మూడోమనిషి.

ఆ చుట్టుపట్ల వున్న వాళ్లందరూ తనకేసి వింతగా చూస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా, ముందుకు అడుగువేశాడు రవిబాబు.

*** *** ***

టైము గడుస్తున్న కొద్దీ ఎండ వేడెక్కడం మొదలయింది. దారుణమైన ఉక్కపోతతో పాటు, చెమటలు అధికం అయ్యాయి. దాహం కూడా స్టార్ట్‌ అయింది. అటుగా వచ్చే ముందు తిన్న రెండు ఇడ్లీలు ఎప్పుడో అరిగిపోయి ఆకలి మొదలయింది.

ఇంకో రెండు ఫర్లాంగులు పోయిన తర్వాత సడెన్‌గా ఒక సందులో అతనికి కనిపించింది ఒక కారు. నడుస్తూ నడుస్తూ ఏదో ట్రబుల్‌ ఇచ్చింది కాబోలు, బానెట్‌ ఎత్తి చికాకుగా ఇంజన్‌వంక చూస్తున్నాడు ఓనర్‌.

కార్లు రిపేర్‌ చేయడం రవిబాబుకి తెలియదు. అయినా సరే, ఆ మనిషి ముఖంలో తాండవిస్తున్న ఏదో నిస్సహాయత అతన్ని అటుగా లాక్కుపోయింది.

“ఏమయింది సార్‌? ఎనీ ప్రాబ్లమ్‌?” అతని దగ్గర నిలబడుతూ అడిగాడు రవిబాబు.

“ప్రాబ్లం ఏమిటో నాకు అర్థంకావడం లేదు. అర్జంటు పనిమీద పోతున్నా… మధ్యలో ఇది తకరారు చేస్తోంది” విసుగునిండిన కంఠంతో చెప్పాడు మనిషి.

“మెకానిక్‌ షెడ్‌కి ఫోన్‌ చేయండి సార్‌…. ఎవరో ఒకరు మీకు తెలిసే వుంటారుకదా…” సలహా ఇచ్చాడు రవిబాబు.

“నాకు తెలియదా ఆ మాట? మెకానిక్స్‌ అందరూ బిజీ అంట. కుర్రాళ్ళు ఎవరూ ఖాళీగా లేరట. మీరే ఎవరినయినా పెట్టుకుని తోసుకు రమ్మంటున్నారు” బానెట్‌ని మూసి చుట్టూ చూస్తూ చెప్పాడా వ్యక్తి.

“ఎంత దూరంలో వుంటుంది సార్‌ మెకానిక్‌ షెడ్డు?” అడిగాడు రవిబాబు.

“మూడు కిలోమీటర్లు… త్రీటవున్‌ చివర్లో వుంటుంది. అంతదూరం ఈ వెహికల్‌ని నెట్టేవాళ్ళు ఎవరు దొరుకుతారు?” అసహనంగా అన్నాడా వ్యక్తి.

“నేను నెడతాను సార్‌. ఎంతిస్తారు?” నిర్మొహమాటంగా అడిగాడు రవిబాబు.

గప్పున వెలిగింది ఆ మనిషి ముఖం.

“వంద ఇస్తాను… నిజంగానే నెడతావా?” అనడిగాడు.

“మీరు కార్లో కూర్చోండి సార్‌” అంటూ కారు వెనక్కి పోయాడు రవిబాబు. ఆనందంగా స్టీరింగ్‌ ముందు కూర్చున్నాడు కారు ఓనర్‌. వెనుకనించి బలమంతా ఉపయోగించి నెట్టడం మొదలుపెట్టాడు.

సందులోనుంచి మెయిన్‌ రోడ్డు మీదికొచ్చింది కారు. నెమ్మదిగా త్రీ టౌన్‌వైపు కదలడం మొదలుపెట్టింది. పైన ఎండ.. ఎదుట బహు భారమైన పని… విపరీతమైన దాహం.. ట్యాప్‌ కింద కూర్చుంటే తడిసిపోయినట్టు చెమటలతో తడిసిపోయింది రవిబాబు శరీరం.

అలవాటులేని పని కావడంతో ఆయాసం కూడా అధికం అయింది అతనికి. అయినా సరే పళ్ళు బిగపట్టి అలా నెట్టుకుంటూనే పోయాడు.

*** *** ***

సరిగ్గా ఒక గంటన్నర తర్వాత మెకానిక్‌ షెడ్‌ కనిపించింది. “సరయిన సమయానికి వచ్చి చాలా హెల్ప్‌ చేశావ్‌. థేంక్యూ వెరీమచ్‌” అంటూ ప్యాంటు జేబులోనుంచి ఒక వంద రూపాయల కాయితాన్ని తీసి అతనికి ఇచ్చి, షెడ్లోకి వెళ్ళిపోయాడు కారు ఓనర్‌.

అంతవరకూ పడిన శ్రమను మరిచిపోయాడు రవిబాబు. అంతవరకూ తనని బాధించిన దాహం కూడా మాయమైనట్టు అనిపించింది అతనికి.

విపరీతమైన ఎండ కూడా తన వేడిని కోల్పోయి వాతావరణం చల్లగా వున్నట్టు కనిపించింది.

‘నాయర్‌ హోటల్లో టిఫిన్‌ బిల్లు పూర్తిగా కాకపోయినా కొంచెంగానైనా చెల్లువేయవచ్చు. ఇంటి అద్దె ప్రాబ్లమ్‌, టిఫిన్‌ సెంటర్‌ ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అయిపోయినట్టే… హేపీ హేపీ’ అనుకుంటూ ముందుకు అడుగువేశాడు.

రవిబాబు పాతిక అడుగులే వేశాడు.

మరో అడుగు వేయబోతుండగా అతని దారికి అడ్డంగా ప్రత్యక్షం అయ్యారు ఇద్దరు వ్యక్తులు.

“నువ్వు ఈ ఏరియాలో వాడివి కాదు. మా పర్మిషన్‌ లేకుండా ఇక్కడ పనెందుకు చేస్తున్నావ్‌?” క్రూరంగా చూస్తూ అడిగాడు వారిలో ఒకతను.

“చూడు భాయీ… ఎక్కడో మొదలుపెట్టిన పనిని ఇక్కడ పూర్తి చేశాను. మీరెవరో ఎక్కడవుంటారో నాకు తెలియదు. తెలిస్తే ముందుగానే వచ్చి మీ పర్మిషన్‌ తీసుకునే వాడిని. ఈ ఒక్కసారికి క్షమించేయండి. ఇంకెప్పుడూ ఇక్కడికి రాను” చాలా మర్యాదగా అంటూ అతని చేతిని వదిలించుకోవటానికి ట్రై చేశాడు రవిబాబు.

“ఇంకోసారి ఇలా వస్తే మాటల్లో చెప్పం బే… మక్కెలు విరిచేసి పంపిస్తాం, ఛలో…ఎంతిచ్చాడు ఆ సేటు?” షర్టును వదిలిపెడుతూ అడిగాడు ఆ వ్యక్తి. “వందిచ్చాడు” నిజాయితీగా చెప్పాడు రవిబాబు.

“యాభై మాకిచ్చేయ్‌. యాభై నువ్వుంచుకో…. ఛలో పైసల్‌ తీయ్‌…” తొందరపెట్టాడా మనిషి.

“అదికాదు భాయ్‌… నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే…” అంటూ మాటలు మొదలుపెట్టబోయాడు రవిబాబు.

“పైసలు బయటికి తియ్యమంటుంటే నకరాలు పోతావేందిరా? తియ్‌” అంటూ చాచిపెట్టి కొట్టాడు చెంపమీద ఆ మనిషి.

పట్టపగలే రవిబాబుకి కనిపించినయ్‌.. తళతళ మెరుస్తున్న నక్షత్రాలు. జివ్వుమన్నయ్‌ నరాలు. ఎర్రబడి పోయింది చెంప. పెదవులు తెగి వెచ్చటి రక్తం చుబుకం మీదికి జారడం మొదలుపెట్టింది. “వాడితో మాటలేందన్నా? జేబులో చూడు” ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని చాలా ఖుషీగా సలహా ఇచ్చాడు రెండో మనిషి. రాక్షసుడిలా నవ్వుతూ రవిబాబు జేబులో చేయిపెట్టబోయాడు మొదటి మనిషి.

ఏమాత్రం ఆలస్యం చేసినా అక్కడ తను కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో పాటు, అంతకు ముందు తీసుకున్న అడ్వాన్సు ఎమౌంట్‌ కూడా గల్లంతయిపోవడం గ్యారెంటీ అని అర్థం అయింది రవిబాబుకి.

తనకి తెలియకుండానే రియాక్ట్‌ అయ్యాడు. తన జేబులమీదికి వచ్చిన చేతిని చాలా రఫ్‌గా అవతలికి విదిలించేశాడు.

“ఏందిరా ఇది? నన్నే ఎదిరించేటంతటి దాదావా నువ్వు?” అశ్చర్యంగా అడిగాడు ఆ మనిషి.

“అంతసేపు ఆడితో మాటలేందన్నా? వేసేయ్‌ దెబ్బ. కొట్టేయ్‌ ముఖం మీద” అంటూ పిడికిలి బిగించి బలంగా చేతిని ముందుకు విసిరాడు రెండో మనిషి.

“అంతసేపు ఆడితో మాటలేందన్నా? వేసేయ్‌ దెబ్బ. కొట్టేయ్‌ ముఖం మీద” అంటూ పిడికిలి బిగించి బలంగా చేతిని ముందుకు విసిరాడు రెండో మనిషి.

ఎదురు తిరగదలుచుకున్న తర్వాత, మాటలతో పని జరగదని రవిబాబుకి తెలుసు. పక్కకు జరిగి తన కుడిచేతిని స్పీడ్‌గా ముందుకు విసిరాడు.

వేగంగా పోయి అతని ముఖానికి కనెక్ట్‌ అయింది రవిబాబు చెయ్యి.

గావురుమని అరిచాడతను. ముఖాన్ని చేతులతో కప్పుకుంటూ రోడ్డుమీద చతికిలపడ్డాడు.

నోరు తెరుచుకు చూస్తున్న మొదటి మనిషి గుండెల మీద ఎడమచేత్తో కొట్టాడు రవిబాబు.

అతను కూడా వెనక్కి తూలి రోడ్డు మీద కూర్చోబడుతుండగా, మోకాలితో నోటిమీద పొడిచాడు.

ముందు వరుసలో వున్న దంతాల్లో ఒకటి రెండు దంతాలు ఊడిపోయినంత పనైనట్లుగా, చెవులు చిల్లులు పడిపోయేటట్టు బిగ్గిరిగా అరిచాడా పెద్దమనిషి.

చిమచిమలాడుతున్న చేతుల్ని ప్యాంటుకేసి రుద్దుకుంటూ క్రూరంగా వారికేసి చూశాడు రవిబాబు.

“ఇంకెప్పుడైనా నాకు కనిపిస్తే మీ తలలు పగిలిపోతయ్‌. అన్యాయంగా చచ్చిపోతారు… ఖబడ్దార్‌” అని హెచ్చరించి, మెయిన్‌రోడ్డు వైపు అడుగువేశాడు.

రకరకాల ఆలోచనలు కందిరీగల మాదిరి తన అంతరంగాన్ని అల్లకల్లోలం చేస్తుండగా, గబగబా నడిచి నాయర్‌ హోటల్‌ దగ్గిరికి వచ్చేశాడతను.

దూరంలో వుండగానే చూశాడు ఆర్ముగం. “పనైపోయింది గదా రవిబాబూ… నటేశం నీకు అడ్వాన్సు ఇచ్చానని చెప్పాడు. టిఫిన్‌ బిల్లు తరువాత కడుదువు గాని ముందు ఇంటి రెంటు ఇచ్చేసిరా. మంచిగా కాఫీ తాగుదామిద్దరం” అంటూ ఒక సలహా ఇచ్చాడు.

“రెంటు తరువాత కడతాను. ముందు నాయర్‌కి టిఫిన్‌ బిల్లు డబ్బులు ఇచ్చేస్తా” అంటూ కారును నెట్టి సంపాదించుకున్న డబ్బులో నుంచి ఎనభై రూపాయలు తీసి నాయర్‌కి అందించాడు రవిబాబు.

“బాకీ అడిగానని కోపం వచ్చిందా రవిబాబూ? అప్పుతెచ్చావా?” డబ్బులు తీసుకుంటూనే అడిగాడు నాయర్‌. అంతటితో ఆగలేదు “మిగతా తొంభై రూపాయలు రేపు ఎల్లుండిల్లో ఇచ్చేయ్‌” అని కూడా అన్నాడు.

“ఇదిగో నాయరూ నా ఎకౌంట్‌లో నాకూ, రవిబాబుకి కాఫీ పంపించు” అరిచాడు ఆర్ముగం.

*** *** ***

నెమ్మదిగా నడిచి తన రూమ్‌కి చేరుకున్నాడు రవిబాబు. రూమా అది? రెండంతస్థుల భవనంలో ఎనిమిది పోర్షన్స్‌ చేసి రెంట్‌కి ఇచ్చాడు ఓనర్‌. బిల్డింగ్‌ వెనకాల వాస్తు శాస్త్రానికి విరుద్ధంగా పన్నెండడుగుల వెడల్పున్న కొంచెం జాగా మిగిలితే ఆస్బెస్టాస్‌ సిమెంట్‌ రేకులతో చిన్నగదిని తయారుచేసి రవిబాబుకి ఇచ్చాడు. వర్షాకాలంలో పైనుండి నీళ్ళు ఆ రేకుల మీదే పడతయ్‌… వేసవికాలంలో వేడి దారుణంగా వుంటుంది.

తన పోర్షన్‌లో ఫ్యాన్‌ కింద కూర్చుని వున్న ఓనర్‌ దగ్గిరికిపోయి, ఎమౌంట్‌ని అతని చేతిలో పెట్టాడు.

“ఇందాక చెప్పడం మర్చిపోయా… వచ్చేనెల నించీ రెంటు ఇంకో యాభై పెంచుతున్నా” నిర్వికారంగా ఏదో మంచిమాట చెప్పడం మర్చిపోయినట్టు ఎనౌన్స్‌ చేశాడు ఓనర్‌. ఛట్‌ మని తల ఎత్తబోయి, ఆఖరిక్షణంలో తనను తాను కంట్రోల్‌ చేసుకున్నాడు రవిబాబు. అతని అభిప్రాయంతో తనకు నిమిత్తం లేనట్టు “వెళ్ళు.. వెళ్ళు నీ పని చూసుకో…” అతనిచ్చిన నోట్లను జేబులో పెట్టుకుంటూ చెప్పాడు హౌస్‌ఓనర్‌.

వెనుతిరిగి రూమ్‌గా చెప్పుకునే తన రేకుల కిందికి వచ్చేశాడు రవిబాబు. రెండు గుప్పిళ్ళు మాత్రమే వున్నయ్‌ బియ్యం. పావు లీటరు కంటే కొంచెం తక్కువగానే వుంది స్టౌవ్‌లో కిరోసిన్‌. కుండలోవున్న నీటితో బియ్యాన్ని కడిగి, స్టవ్‌ మీద పడేశాడతను. ఎండిపోవడానికి సిద్ధంగా వున్న రెండు ఉల్లిపాయల్ని, మిరపకాయల్ని కూడా వేసి కొంచెం ఉప్పును కలిపాడు. ఇరవైనిమిషాల తరువాత తయారైన సంకీర్ణ పదార్థాన్ని ప్లేటులోకి వంపుకుని, కొంచెం కొంచెంగా ఆరగించాడు.

మూడు కిలోమీటర్ల దూరం కారుని నెట్టడం వల్ల అలిసిపోయినట్టు అనిపించినా, అసలు అలసట ఆ తర్వాత జరిగిన సంఘటన మూలకంగా వచ్చినట్టు అర్థం అవుతూనే వుంది.

ఏం చేస్తూ వుంటారు దెబ్బలు తిన్న ఆ దేబెముఖాలు? తన కోసం వెతకుతూ వుంటారా? ఎంత ఆలోచించినా సమాధానం లభించకపోవడంతో, విసుగ్గా తల విదిలించి, చాప మీద మేనువాల్చాడు రవిబాబు. అలసిపోవడంతో అతనికి తెలియకుండానే వచ్చేసింది నిద్ర.

*** *** ***

ఉదయం ఆరుగంటలకల్లా శ్యామలా అపార్ట్‌మెంట్స్‌ దగ్గిర హాజరయ్యాడు రవిబాబు. చెత్త కాంట్రాక్టర్‌ ఇచ్చిన రిక్షాని రోడ్డుమీద ఆపి, మందపాటి గోనెసంచిని భుజం మీద వేసుకుని పని స్టార్ట్‌ చేశాడు రవిబాబు.

ఇళ్ళు శుభ్రం చేస్తుండగా వచ్చిన చెత్తతో పాటు, వంటా వార్పులకు సంబంధించిన వేస్ట్‌ని కూడా కలిపి, ప్లాస్టిక్‌ బక్కెట్స్‌లో పోసి తమ తమ ముఖద్వారాల దగ్గిర పెడ్తారు ఓనర్స్‌.

ఆ బక్కెట్స్‌లోని వ్యర్థపదార్థాలన్నింటినీ, గోనెలోకి నింపుకుని, బైటికి తీసుకురావాలి…. రిక్షాలో పడేసి దూరంగా వున్న డంపింగ్‌యార్డ్‌ దగ్గిరికి తీసుకుపోవాలి.

వెగటు కలిగించే వేస్ట్‌ మెటీరియల్‌ నుంచి వాసనలు వెలువడు తూంటాయి. వాటినన్నింటినీ పట్టించుకోకుండా, నిర్వికారంగా, నిరా మయంగా పని చేయాలి.

రెండు గంటలు పట్టిందతనికి శ్యామలా అపార్ట్‌మెంట్‌లోనించి బయటపడటానికి, పక్కనే వున్న స్వదేశీ బిల్డింగ్స్‌లోకి ఎంటరైన వెంటనే మొదలైనాయి కంప్లయింట్స్‌…

‘తెల్లారక ముందే క్లీన్‌ అయిపోవాలి. ఎనిమిదింటి వరకూ గుమ్మం ముందు చెత్త వుంటే ఎలా? ఊరికే వస్తున్నావా? నెలకు నలభై రూపాయలు కడుతన్నాం. డబ్బులు మాకు బజార్లో దొరుకుతున్నయ్యా’… వాళ్ళ ఇంట్లోనించి వచ్చిన వేస్ట్‌ వాళ్ళ గుమ్మం ముందు వుంటే, పరాయివాళ్ళెవరో తీసుకువచ్చి పెట్టినట్టు అలా నోరుపారేసుకుంటున్న ఆ ఓనర్స్‌ని చూసి ఎలా రియాక్ట్‌ అవ్వాలో రవిబాబుకి తెలియలేదు.

“నోరు తెరిచి సమాధానం చెప్పవద్దు… వాళ్ళు మాట్లాడేది ఏమిటో వాళ్ళను మాట్లాడనీ… మనం పట్టించుకోకూడదు. మన టైమ్‌ని వేస్ట్‌ చేసుకోకూడదు… “ పనిలోకి దిగకముందు నటేశం చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ, చకచకా పని పూర్తి చేసుకున్నాడు.

నిండిపోయిన గోనెసంచిని రిక్షాలో వేసి, నెమ్మదిగా డంపింగ్‌యార్ట్‌ వైపు రిక్షాని కదిలించాడు.

అతనిలాంటి వాళ్ళే ఒక వందమంది, యార్డ్‌ దగ్గిర తమ రిక్షాల్ని ఖాళీ చేసుకుంటూ కనిపించారు.

“శ్యామలా అపార్ట్‌మెంట్స్‌ దగ్గిర పనా? రమీజ్‌భాయ్‌ కనిపించాడా?” తన రిక్షాలోని వేస్ట్‌ని కిందికి వంపుతూ రవిబాబుని అడిగాడు తోటి పనివాడు.

“రమీజ్‌భాయ్‌ ఎవరు?” అడిగాడు రవిబాబు.

“శ్యామలా అపార్ట్‌మెంట్స్‌ ఉన్న ప్రదేశంలో దాదాగిరీ చేస్తుంటాడు. అతను గనుక కనిపిస్తే ఒళ్ళు దగ్గిరపెట్టుకుని మాట్లాడు. ఎక్‌స్ట్రాలు మాట్లాడితే ఒళ్ళు హూనమైపోతుంది” అడగకముందే సలహా ఇచ్చాడు.

సరిగ్గా రెండు నిముషాల తర్వాత వచ్చి అతని మాదిరిగానే రవిబాబును పలకరించాడు ఇంకోవ్యక్తి.

“కొత్తగా నటేశం దగ్గిర చేరావ్‌ కదా?” అని అడిగాడు.

అతని నోటివెంట ఎలాంటి మాటలు వినాల్సివస్తుందో అనుకుంటూ తల ఊపాడు రవిబాబు.

“సైదయ్య స్వదేశీ అపార్ట్‌మెంట్స్‌లో ఏం చేయాలో చెప్పాడు కదూ?” అని ఇంకోప్రశ్న వేశాడు ఆ వ్యక్తి.

అంతకు ముందు మాట్లాడిన మనిషి పేరు సైదయ్య అని అప్పుడు తెలిసి తల ఊపాడు రవిబాబు.

“సైదయ్యకి శ్యామలా అపార్ట్‌మెంట్స్‌ దగ్గిర వుండే రమీజ్‌దాదాకి స్నేహం. వీడువాడి దగ్గిరికి పోయి ఉన్నవి లేనివి కల్పించి చెపుతాడు.. జాగ్రత్తగా వుండు” అని చెప్పి అవతలికి వెళ్ళిపోయాడా మనిషి.

రిక్షాలో వున్న ఆఖరి గోనెసంచిని కూడా యార్డులో డంప్‌చేసి, వెనక్కి తిరిగాడు రవిబాబు.

తానున్న బిల్డింగ్‌ వెనకాల ఒక పెద్ద ఖాళీస్థలాన్ని లీజుకి తీసుకున్నాడు కాంట్రాక్టర్‌ నటేశం. తన ఆధీనంలో వుండే రిక్షాలన్నిటినీ ఆ స్థలంలో పెట్టిస్తాడు.

అక్కడ కాపలా వుండే వాచ్‌మేన్‌కి రిక్షాని అప్పగించాడు రవిబాబు. ఆ రోజు సాదరు ఖర్చులకి పదిరూపాయలు తీసి అతనికి ఇచ్చాడు వాచ్‌మేన్‌.

*** *** ***

నెలకు పన్నెండు వందలు జీతం. రోజుకి పదిరూపాయలు బేటా. ఒళ్ళొంచి పని చేసుకునేవాడికి జీవితం ఒక మోస్తరు ఖుషీగా వెళ్ళిపోతుందని అనిపించింది రవిబాబుకి. ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని హుషారుగా విజిల్‌ వేస్తూ మెయిన్‌ రోడ్డు మీదికి వచ్చాడు.

తను నివశించే ఏరియా వైపు కదలబోతుండగా, సడన్‌గా అతని దారికి అడ్డంగా ప్రత్యక్షం అయ్యారు అంతకుముందు రోజు రోడ్డు మీదికి నెట్టిన హీరోలు.

“ఇవాళ పనిలోకి రావద్దని చెప్పినా వచ్చావ్‌? నీ గురించి నువ్వు ఏమని అనుకుంటున్నావ్‌ బే? హీరోననుకుంటున్నావా?” కరుకుగా అడిగాడు ఒకతను.

“నేను హీరోని ఎలా అవుతానన్నా? చెత్తను ఎత్తుకునే వాడు హీరో అంటే ఎవరైనా నమ్ముతారా?” చాలా సౌమ్యంగా అడిగాడు రవిబాబు.

“జోకులు వేస్తున్నావా? మేము నవ్వి నిన్ను వదిలేయాలా?” అంటూ చాచిపెట్టి అతని ముఖం మీద కొట్టాడు వాళ్ళల్లో ఒకతను.

తట్టుకోలేక పోయింది రవిబాబు అంతరంగం.

ఎదుట వున్న హీరో తనని కొట్టడానికి చెయ్యి ఎత్తినవెంటనే, తనకు తెలీకుండానే చాలా వైల్డ్‌గా రియాక్ట్‌ అయిపోయాడు. అతని చెయ్యి తన ముఖానికి కనెక్ట్‌ అవకముందే, తన పిడికిలితో అతని ముఖం మీద పొడిచాడు.

అటువంటి రెస్పాన్స్‌ వస్తుందని ఎదురుచూడకపోవడం వల్ల, ఏమరుపాటుగా వున్నాడు ఆ హీరో. ముఖం పగిలి, ఎర్రటి రక్తం వెల్లువలా కారుతూ వుండగా, గావురుమని అరిచి రోడ్డు మీద చతికిలబడిపోయాడు.

ఆ దృశ్యాన్ని చూసి దెబ్బతిన్న పులుల్లా తన మీదికి వచ్చే అవకాశాన్ని మిగిలినవాళ్ళకి ఇవ్వలేదు రవిబాబు. ఛట్‌ఛట్‌మని కొట్టాడు.. వాళ్ళందరినీ ఇసుకమూటల్ని దొర్లించినట్టు రోడ్డు మీదికి దొర్లించాడు. రవిబాబు వంక చాలా ఆశ్చర్యంగా చూశాడు కిందపడిపోయిన వాళ్ళల్లో ఒకతను.

“ఏదో చెత్తను ఎత్తే పనివాడు అనుకుని బెదరకొట్టబోయాం. నువ్వు చెత్తమనిషివి కాదు. ఎవరివి భాయీ?” ప్యాంటుకి అంటిన దుమ్మును వదిలించుకుంటూ పైకి లేచి చాలా మర్యాదగా అడిగాడు.

“నువ్వు ఎవరివి బే? రమీజ్‌వా?” అడిగాడు రవిబాబు.

“కాదన్నా.. రమీజ్‌దాదాకి తమ్ముడిని. నువ్వెవరివన్నా?” మరింత వినయంగా అడిగాడతను.

“రవీజ్‌దాదాని… రమీజ్‌ వస్తే చెప్పు. నా దారికి అడ్డం వస్తే నేను ఊరుకోను. ఏదో ఒకటి చేసేస్తాను. ఆ తర్వాత మీరు బాధపడి ప్రయోజనం లేదు. అరే… తలవంచుకుని నా ఏడుపేదో నేను ఏడుస్తుంటే, మధ్యలో దరిద్రదేవతల్లా ఎందుకు తగులుకుంటారు? మంచీ చెడ్డా అనేవి మీకు తెలియదా? చెపుతావా రమీజ్‌కి?” క్షణక్షణానికి ఎక్కువైపోతున్న కాన్ఫిడెన్స్‌ని కాస్తంత అణగదొక్కి వుంచడానికి విశ్వప్రయత్నం చేస్తూ చెప్పాడు రవిబాబు.

“చెపుతానన్నా… రవీజ్‌దాదా అని కూడా నీ పేరు చెపుతాను… నువ్వెవరివో తెలియక ఏదో కొంచెం ఎగస్ట్రాలు చేశాం. మనసులో పెట్టుకోకు. మంచి ఛాయ్‌ తాగుదాం….రా అన్నా…” అన్నాడు రమీజ్‌ తమ్ముడు.

“ఛోడో తెరీ చాయ్‌కీ” అంతకు ముందెన్నడూ ఉపయోగించని భయంకరమైన తిట్టు పదాన్ని ఉపయోగించి, హుందాగా నడుచుకుంటూ ఇవతలికొచ్చాడు రవిబాబు. వెనకాల వుండిపోయిన వాళ్ళకి తను కనిపించడని అర్థం అవగానే, చటుక్కున చతికిలపడ్డాడు ఫుటపాత్‌ పక్కనే వున్న ఒక చిన్న కాంక్రీట్‌ దిమ్మమీద.

చతికిలపడిన వెంటనే స్టార్ట్‌ అయింది వణుకు. చలిజ్వరం వచ్చినట్టు అతనితో ప్రమేయం లేకుండా గజగజ వణకడం మొదలుపెట్టాయి అవయవాలు.

తను ప్లే చేసిన దాదాగిరీ నాటకం సక్సెస్‌ కాకుండా, కిందపడిన వాళ్ళు లేచి ఇంకోసారి ఎటాక్‌ చెయ్యడానికి వచ్చి వుంటే- తను ఏమయిపోయి వుండే వాడో తలచుకునే సరికి, వెంటనే వచ్చిన రియాక్షన్‌ అది.

ఎంతగా ట్రై చేసినా శరీరాన్ని కుదిపేస్తున్న వణుకును కంట్రోల్‌ చేసుకోవడం చేతకాలేదు అతనికి. పది నిముషాలు.. పావుగంట…. ఇరవై రెండు నిమిషాల తర్వాత కొద్దిగా తగ్గింది వణుకు.

పదిహేను లంకణాలు చేసిన టైఫాయిడ్‌ రోగిమాదిరి తయారైపోయింది అతని ముఖం. దిమ్మ మీది నించి లేచేసరికి గిర్రున తిరిగినయ్‌ కళ్ళు.

“హల్లో రవిబాబూ.. రా, కాఫీ తాగుదాం” అల్లంత దూరంలో వుండగానే అతన్ని చూసి బిగ్గిరిగా పిలిచాడు కిళ్ళీ బడ్డీ ఆర్ముగం. ఎందుకనో వెళ్ళాలని అనిపించలేదు రవిబాబుకి. తరువాత వస్తానన్నట్టుగా చెయ్యి ఊపి సూటిగా తన రూమ్‌ దగ్గరికి వెళ్ళిపోయాడు.

“ఏంటిది రవిబాబూ… పొద్దున వాటర్‌ ట్యాప్‌ తెరిచి కట్టేయకుండా పోతివే.. ఎన్ని నీళ్ళు వేస్ట్‌ అయినయ్యో తెలుసా? వాటర్‌ మీటరు ఎంత స్పీడుగా తిరిగిపోయిందో, ఎవుడిస్తాడు ఆ ఖర్చు? నీ అబ్బగాడిస్తాడా?” అతన్ని చూడగానే గంయ్‌మని అరిచాడు హౌస్‌ఓనర్‌.

తలెత్తి చూడటానికి మనస్కరించలేదు రవిబాబుకి. అలాగే పోయి రూమ్‌లో చాప మీద పడిపోయాడు.

“ఏందిర ఇదీ… నా పాట్న నేను వాగుతూనే వున్నా… నీ లెక్కేంటి అన్నట్టు తన దారిన తను ఎళ్ళిపోయాడు.. ఇట్టా అయితే లాభమే లేదు. ఈసారి గట్టిగా వార్నింగ్‌ ఇచ్చేయాలి” తనలో తను అనుకుంటూ రోడ్డుమీదికి చూసి, కరెంట్‌ షాక్‌ కొట్టినట్టు అదిరిపడ్డాడు ఓనర్‌.

*** *** ***

వేగంగా వచ్చి అతని ఇంటి ముందు రెండు జీప్‌లు ఆగడమే అందుకు కారణం. వాటిల్లోనుంచి దిగి, గబగబా లోపలికి వచ్చారు పదిమంది దృఢకాయులు.

“చెత్త ఎత్తే పనివాడు.. మీ ఇంట్లో వుంటున్నాడుట గదా.. పిలవరా వాడిని. బయటికి రమ్మని పిలువ్‌” కరుకుగా అన్నాడు వారందరికీ లీడర్‌లాగా కనిపిస్తున్న వ్యక్తి.

“చెత్తను ఎత్తేవాళ్ళా? అట్టాంటివాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు?” ఆశ్చర్యంగా అడిగాడు ఓనర్‌.

“మాట అడిగితే సమాధానం చెప్పకుండా సోది చెబుతావేంటిరా.. పిలువ్‌ వాడిని” గట్టిగా అడిగాడు ఆ మనిషి.

రక్తం లేనట్టుగా పాలిపోయింది ఓనర్‌ ముఖం. “అట్టాంటి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు” తడబడుతూ చెప్పాడు.

“ఏరా? ఏంటిరా వాడిపేరు?” వెనక్కి తిరిగి తన వాళ్ళల్లో ఒకతన్ని అడిగాడు ఆ మనిషి.

“రవిబాబు … ఈడనే వుంటాడని టిఫిన్‌ సెంటర్లో చెప్పారు” సమాధానం చెప్పాడతను.

“రవిబాబుని పిలవరా” ఓనర్‌కి చెప్పాడతను.

“రవిబాబు చెత్తను ఎత్తే మనిషి కాదు” అనబోయాడు ఓనర్‌. అంతే… ఫెడీమని పడింది దెబ్బ అతని చెంప మీద.

రెండు అడుగుల దూరం తూలి బ్యాలెన్స్‌ నిలబెట్టుకున్నాడతను. చెంపను అదుముకున్నాడు.

కళ్ళ వెంట గిర్రున తిరిగాయ్‌ నీళ్ళు.

అంతవరకూ తమ పోర్షన్స్‌లో నుంచి బయటికి వచ్చి జరుగుతున్నది వింతగా చూస్తున్న టెనెంట్స్‌ అందరూ గబుక్కున తమ వాటాల్లోకి వెళ్ళిపోయారు.

“పిలవరా.. బద్మాష్‌గాడిని పిలువ్‌… పిలువ్‌…” హౌస్‌ ఓనర్‌ షర్టు పట్టుకుని ఎలుకను పిల్లి ఊపినట్టు ఊపుతూ బిగ్గిరిగా అరిచాడు మొదటి మనిషి.

వణుకు ప్రారంభమైంది ఓనర్‌ కంఠంలో.

“రవిబాబూ.. ఓయ్‌ రవిబాబూ” అంటూ హౌస్‌ ఓనర్‌ పెద్దగా పిలిచాడు వణుకుతూ.

“ఎక్కడ్రా? ఏడి… అరేయ్‌ రవిబాబూ.. రారా బయటికి…రా..” బిగ్గిరిగా అరిచాడు మొదటి మనిషి.

అంతటితో ఆగలేదు ఆ మనిషి.

ఓనరుండే పోర్షన్‌లో ఓనర్‌ ఇష్టంగా కూర్చునే కుర్చీని అమాంతం గాలిలోకి ఎత్తి నేలకేసి కొట్టాడు

“రారా.. రారా బయటికి” అని అరుస్తూ రెండో గదిలోకి ఎంటర్‌ కాబోతుండగా…

“వచ్చాను బే… ఏంటి సంగతి?” అంటూ అక్కడ ప్రత్యక్షం అయ్యాడు రవిబాబు.

అతనిని చూస్తూనే “వీడే… వీడే అన్న.. రవీజ్‌ దాదా అని చెప్పి నా ముఖం పగలగొట్టాడు” వెంటనే అన్నాడు గుంపులో ఉన్న యువకుడు ఒకతను.

రమీజ్‌దాదా తమ్ముడిగా చెప్పుకున్న అతని ముఖం వంక చూసి ఖాండ్రించి నేల మీద ఉమ్మేశాడు రవిబాబు.

“చాయ్‌ తాపిస్తానని చెప్పి వంగి వంగి నమస్కారాలు చేసి ఇప్పుడు జనాల్ని వెంటేసుకు వస్తావా? నేను భయపడి పారిపోతానని అనుకున్నావా? నా దారికి అడ్డం రావద్దని చెప్పానా లేదా?” అంటూ అమాంతం అతని మీదికి ఎగబడి టపాటపా వేసేశాడు రెండు దెబ్బలు.

కీచుగా అరిచి వెనక్కి పారిపోయాడతను.

అంతే.. అక్కడితో భయపడి దూరంగా పారిపోయింది అక్కడ వున్న ప్రశాంత వాతావరణం.

“కొట్టండి.. నరకండి” అని అరుస్తూ రవిబాబు మీద కలబడ్డారు మిగిలినవారందరూ… వంటిమీద, ముఖం మీద వర్షం మాదిరి పడుతున్న దెబ్బల్ని పట్టించుకోవడం మానేశాడు అతను.. పిడికిళ్ళు బిగించి, పూనకం వచ్చినట్టు చెలరేగిపోయాడు.

End of Preview.

Rest of the book can be read @ http://kinige.com/kbook.php?id=196

Related Posts:

టాప్‌ సీక్రెట్‌ – మధు బాబు – నవల

ఒక పెద్ద కుదుపు కుదిపి సడన్‌గా ఆగిపోయింది శ్యామ్‌ సుందర్‌ డ్రయివ్‌ చేస్తున్న అంబాసిడర్‌.

అంతకు వారంరోజుల క్రితమే ఖరీదు చేసిన వెహికల్‌ అది. ఎంత పిచ్చిపిచ్చిగా నడిపినా మరో ఆరు ఏడు నెలలవరకూ ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాదని నొక్కి నొక్కి చెప్పాడు ఆ కారును అంటగట్టిన ఆటో మైబైల్‌ షోరూమ్‌ ఓనర్‌.

నోటికి వచ్చిన ఘాటయిన మాటలన్నిటినీ ఉపయోగించి అతన్ని తిట్టిపోద్దామనుకున్నాడు శ్యామ్‌సుందర్‌. ప్రక్కనే వాసంతి కూర్చుని ఉన్నదనే విషయం గుర్తుకువచ్చి, తన ఇరిటేషన్‌ని తనలోనే అదుముకున్నాడు.

‘మోటార్‌ వెహికల్స్‌నే కాదు, మిరియాల పొడుమునుకూడ బాగా ఆలోచించి ఖరీదు చేయాలి. రోడ్డుమీద నడుస్తూ నడుస్తూ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇదిగో…. ఇలాగే వుంటుంది.’ అతని మనసులోని ఆలోచనల్ని అతి తేలికగా పసికట్టి కూల్‌గా తన అభిప్రాయాల్ని వెల్లడించింది వాసంతి.

సిటీ సెక్యూరిటీ సర్వీసెస్‌ సంస్థలో సెక్రటరీగా పనిచేస్తున్నది ఆమె. ఆ సంస్థకు యజమానులలైన ఇద్దరిలో రెండోవాడు శ్యామ్‌సుందర్‌.

తనకు ఇవ్వవలసిన నాలుగు నెలల జీతంలో ఒక్క పైసా కూడా ఇవ్వకుండా, ఆ కారుకు ఖరీదు చేసి తీసుకు వచ్చిన క్షణంనుంచీ వాసంతి సరయిన అవకాశం కోసం ఎదురు చూస్తోందని అతనికి తెలుసు. అనుకోని విధంగా ఆమె చేతికి దొరికిపోవటం తల కొట్టేసినట్లయింది అతనికి. విసురుగా క్రిందికి దిగి, ఊడి అవతల పడిపోయేటంత గట్టిగా డోర్‌ని మూశాడు.

“అనవసరమైన ఆవేశంలో మునిగి ఇంజన్లో చేతులు పెట్టడం వేస్టు. ఆరునెలల గారెంటీ ఇచ్చాడు ఈ పుష్పక విమానాన్ని మీకు పంపకంచేసిన పెద్దమనిషి. దగ్గిర్లో ఏదయినా ఫోన్‌ వుందేమో చూసి అతనికి కబురు అందించండి….తోసుకు పోవటానికి నలుగురు మనుష్యుల్ని తెచ్చుకోమని చెప్పండి.” తను కూడా క్రిందికి దిగి రోడ్డుకు రెండోప్రక్కన నిలబడుతూ అన్నది వాసంతి.

మరింతగా ఇరిటేట్‌ అయిపోయాడు శ్యామ్‌సుందర్‌. బోనెట్‌ని తెరిచి ఇంజన్లో తల దూర్చాలనే ఆలోచనను వెంటనే విరమించుకొని, అల్లంత దూరంలో అగుపిస్తున్న ఒక వెలుగువైపు అడుగులు వేశాడు

సిటీ సెక్యూరిటీ సర్వీసెస్‌కి సంబంధించిన ఒక ఎస్సైన్‌మెంట్‌ మీద బెంగుళూరు వెళ్ళివస్తున్నాడు అతను, వాసంతి.

అప్పటికి రాత్రి పదిగంటలు అయింది. సిటీ ఇంకో ఆరు గంటల ప్రయాణ దూరంలో వున్నదనగా వచ్చిపడింది ఆ ట్రబుల్‌.

అవటానికి అది మెయిన్‌రోడ్డే అయినా, ఆ సమయంలో తమ గోడును వినిపించుకొని, ఏదయినా హెల్ప్‌ చేయగలవారు చాలా తక్కువ మంది కనిపిస్తారని తెలిసి కూడా ముందుకుపోయాడు శ్యామ్‌సుందర్‌.

కారు దగ్గర వుండగా కనిపించిన వెలుగు, అప్పుడే మూతబడబోతున్న ఒక బడ్డీకొట్లోనుంచి వస్తున్న పెట్రోమాక్స్‌లైటు కాంతి అని అర్థమై మరింత వేగంగా నడిచాడతను. బడ్డీకొట్టు తలుపులు పూర్తిగా మూసుకోక ముందే అడ్డుపడి, యజమానిని పలుకరించాడు.

“ట్రంకురోడ్డుకదా….వచ్చేపోయే వాహనాలు, లారీలు ఏవైనా ఇక్కడ ఆగి సిగరెట్లు, పచ్చిమిరపకాయ బజ్జీలు కొనుగోలు చేస్తారనే ఆశతో ఈ సమయం వరకూ బడ్డీని తెరిచి వుంచుతాను….పెట్రోమాక్స్‌ లైటుకు కావల్సిన కిరసనాయిలు ఖర్చుకూడా గిట్టుబాటు కావటంలేదు….” శ్యామ్‌సుందర్‌ చూపించిన సిగరెట్‌ పాకెట్‌ని తీసిస్తూ, తన గోడును వెళ్ళబోసుకునానడు ఆ బడ్డీ వోనర్‌.

పచ్చిమిరపకాయ బజ్జీల పేరును వినేసరికి నోరు ఊరింది శ్యామ్‌ సుందర్‌కి. ఒక పెద్ద సత్తుపళ్ళెం నిండా పేర్చివున్న ఆ తినుబండారాల వైపు చేయి వూపబోతుండగా, వెనకనుంచి అతని వెన్నుమీద గట్టిగా కొట్టింది వాసంతి.

“నీకు కూడా కావాలా బజ్జీలు? నువ్వుకూడా తింటావా?” అటువంటి పదార్థాలను చూసి ఆమె అసహ్యించుకుంటుందని తెలిసి వుండటం వల్ల, ఆశ్చర్యంగా అడిగాడు శ్యామ్‌సుందర్‌.

“వాటి అవతారాన్ని జాగ్రత్తగా చూడండి….ఖచ్చితంగా మూడు రోజులై వుంటుంది వాటిని తయారుచేసి…..”లోగొంతుకతో అతనికి మాత్రమే వినిపించే టట్లు చెప్పింది వాసంతి.

బజ్జీలను ఆరగించాలనే కోరిక పూర్తిగా నశించిపోయింది ఆ మాటల్ని వినేసరికి శ్యామ్‌సుందర్‌కి.

“ఏదో ఒక అడ్డుపుల్ల వేసి ఎదుటి మనిషి ఉత్సాహంమీద చన్నీళ్ళు చిలకరించటంలో నువ్వు స్పెషలిస్టువి అయిపోయావు…. నిన్ను వెంటబెట్టుకు రావటం చాలా పెద్ద పొరపాటు అయిపోయింది” కచ్చ నిండిన కంఠంతో అంటూ, బడ్డీ యజమానికి తన బాధను గురించి చెప్పుకున్నాడు.

“దయ్యాలు తిరిగే వేళలో రోడ్డుమీద ఆగిపోవటం ఎంత ఇబ్బందిగా వుంటుందో మీకు తెలిసే వుంటుంది. ఏదో ఒక విధంగా సిటీలోకి మన గురించి మెస్సేజి పంపించాలి….దగ్గిర్లో ఫోన్‌ సౌకర్యం ఏదయినా వున్నదా?” అని అడిగాడు.

టెలివిజన్‌ ప్రసారాల్లో అగుపించే క్విజ్‌ ప్రోగ్రాం పార్టీసిపేంట్‌ మాదిరి సీరియస్‌ ముఖం పెట్టి, తన బడ్డీ వెనుక భాగంలోకి చూపించాడు ఆ పెద్దమనిషి.

“నాలుగు కిలోమీటర్ల దూరంలో వుంటుంది మా గ్రామం. మొత్తం నాలుగే నాలుగు టెలిఫోన్లు వున్నాయి. బిల్లులు కట్టలేదని మూడింటికి కనెక్షన్‌ కట్‌ చేశారు. నాలుగో ఫోన్‌ మా గ్రామ సర్పంచ్‌గారిది….పీకల దాకా మందుకొట్టి హాయిగా నిద్రపోతూ వుంటాడు. నిద్రలేపి కూర్చోబెట్ట గలిగే చాతుర్యం మీకు వుంటే నిముషాలమీద పని పూర్తి అయిపోతుంది” అంటూ అసలు విషయాన్ని అతినెమ్మదిగా వివరించి, బడ్డీ తలుపుల్ని లాక్‌ చేసుకున్నాడు.

బడ్డీ వెనుక భాగంలో నిలబెట్టివున్న అతని సైకిల్‌వంకా, అతని వంకా మార్చి మార్చి చూశాడు శ్యామ్‌సుందర్‌. సర్పంచిగారి ఇంటివరకూ లిఫ్ట్‌ ఇస్తాడేమో నని ఆశించాడు.

“వెనుక టైర్లో గాలి చాలా తక్కువగా వుంది. డబుల్స్‌ ఎక్కితే ఢామ్మని ట్యూబ్‌ పేలిపోతుంది….” అంటూ తన నిస్సహాయతను వెల్లడించి అతని సమాధానం కోసం ఎదురుచూడకుండా వెళ్ళిపోయాడు. బడ్డీ యజమాని.

“వెనుక టైరు బాగానే వున్నది. డబుల్సు మాత్రమేకాదు, త్రిబుల్సు ఎక్కినా కూడా ఆ ట్యూబుకు ఏమీ కాదు….” అతను వంద అడుగుల దూరం వెళ్ళిన తరువాత మెల్లిగా కామెంట్‌ చేసింది వాసంతి.

“అంటే నీ ఉద్దేశం ఏమిటి? ఈ మాట నువ్వు నాకు ఎందుకు చెపుతున్నట్టు?” విసుగ్గా ఆమెకేసి తిరుగుతూ అడిగాడు శ్యామ్‌సుందర్‌.

“ఈ చీకటి వేళలో మనకు సహాయపడేవాళ్ళు దొరరు…. ఈ బడ్డీ యజమాని మాటలమీద నమ్మకముంచి గ్రామంలోకి వెళ్ళటం అనవసరం. తాగి తలకు పోసుకుని మత్తుగా పడివుండే సర్పంచిగారిని నిద్ర లేపటం అసంభవం…..” ఆగి ఆగి వీస్తున్న చలిగాలిని తట్టుకోలేక పమిటెచెంగును భుజాల చుట్టూ చుట్టుకుంటూ చెప్పింది వాసంతి.

“అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి?” వెంటనే ప్రశ్నించాడు శ్యామ్‌సుందర్‌.

“నిద్రమత్తులో డ్రయివ్‌ చేసే లారీ డ్రయివర్లు మీ పుష్పక విమానాన్ని ఢీకొట్టకుండా జాగ్రత్తలు తీసుకొని, లెఫ్ట్‌ రైట్‌ అనుకుంటూ నడక మొదలుపెట్టటం చాలా మంచిది. తెల్లవారే సమయానికి సిటీకి దగ్గర్లోకి వెళ్ళిపోవచ్చు. చల్ల బాటు వేళలో కాలినడక ఆరోగ్యానికి చాలా మంచిది” అంటూ వెనక్కు తిరిగి అంబాసిడర్‌ వైపు అడుగులు వేసింది వాసంతి.

ఆ సలహాను ఆచరణలో పెట్టడం కంటె, ఆమెను కార్లో కూర్చోబెట్టి తాను వెనుకనుంచి నెట్టుకుంటూ పోవడమే చాలా మంచిదని శ్యామ్‌సుందర్‌కి తెలుసు.

కాలినడక ఆరోగ్యానికి చాలా మంచిదని అనుకుంటూ, ఆమెను నడిపిస్తే, ఇంకో పది సంవత్సరాలు గడచిన తర్వాత కూడా ఆ ఇన్సిడెంట్‌ని ఆమె మర్చిపోదు. తనను మర్చిపోనీయదు. అవకాశం అభించినప్పుడల్లా ఆగర్భశత్రువు మాదిరి సూటీపోటీ మాటలతో చురలు వేస్తూనే వుంటుంది.

ఆరునెలల గ్యారంటీ విషయాన్ని కొద్దిసేపు ప్రక్కనపెట్టి, ఇంజన్‌ని చెక్‌ చేయాలనే నిర్ణయానికి వచ్చేశాడు శ్యామ్‌సుందర్‌. వడి వడిగా అడుగులు వేస్తూ, అంబాసిడర్‌ని సమీపించి, బోనెట్‌మీద చేయివేయబోతుండగా కలిగింది అతనికి ఆ అనుమానం.

“గెటిన్‌ వాసంతీ….గెటిన్‌…..కమాన్‌ క్విక్‌ !” అని వాసంతిని హెచ్చరిస్తూ, రోడ్డుకు ఆవలివైపున ఎత్తుగా ఎదిగివున్న ఒక చింతచెట్టు దగ్గరికి పరుగుతీశాడు.

అంతకు ముందువరకూ అతనిమాటల్ని, చేతల్ని నిర్మొహమాటంగా ఆక్షేపిస్తూ వచ్చిన వాసంతి, ఈసారి అటువంటి పని చేయలేదు. ఒక్క ఉదుటున డోర్‌ని తెరిచి, అంబాసిడర్‌ వెనుక సీటులోకి జంప్‌ చేసింది. తన హేండ్‌బ్యాగ్‌లో వున్న చిన్న ఫిస్టల్‌ని చేతుల్లోకి తీసుకుంటూ ఊపిరి బిగబట్టి చూసింది.

చింతచెట్టు క్రిందికిపోయి, పాతిక గజాల దూరంలో వున్న ముళ్ళపొదల కేసి పరిశీలనగా చూశాడు శ్యామ్‌సుందర్‌. పది నిమిషాల పాటు చూసిన తరువాత కూడా ఆ పొదల్లో ఎటువంటి కదలికా కనిపించకపోయే సరికి మెల్లగా వెనక్కి వచ్చాడు.

చేతిలోకి తీసుకున్న ఫిస్టల్‌ని హేండ్‌బేగ్‌లోకి నెడుతూ, బిగపట్టిన ఊపిరిని తేలికగా బయటికి వదిలింది వాసంతి.

నిన్న తెరిచిన ఒక పేటిక!

నేడు చదువుతున్న ఒక పుస్తకం!

రేపు ఒక పరమ రహస్యం…..

మృదు స్వరంతో పాట మాదిరి రిధమిక్‌గా అంటూ కారులోంచి దిగి అతని ప్రక్కకు వచ్చింది.

చింత చెట్టుకు ఆవలగా వున్న పొదల్లో ఏవో ఆకారాలు నిలబడి తమను వాచ్‌ చేస్తునట్లు అనిపించి అటుకేసి వెళ్ళాడు శ్యామ్‌సుందర్‌. నీడల్ని చూసి బెదిరే మనిషిగా వెక్కిరిస్తోంది వాసంతి.

వద్దు వద్దని ఎంతగా చెప్పినా ఆమెను తనవెంట, పంపిన తన పార్టనర్‌ వాత్సవమీద కారాలు మిరియాలు నూరుకుంటూ, బోనెట్‌ని ఎత్తి ఇంజన్‌ని చెక్‌ చేశాడు శ్యామ్‌సుందర్‌. ఇరవయ్‌ నిమిషాల పాటు ఆలోచించినా అది ఆగిపోవటానికి కారణం అర్థంకాకపోవటంతో బోనెట్‌ని క్రిందికి దించేశాడు.

ఎడమచేత్తో స్టీరింగ్‌ని మానిప్యులేట్‌చేస్తూ, భుజాన్ని విండో అందుకు ఆనించి కారును రోడ్డు ప్రక్కకు నెట్టాడు.

మరో రెండు మూడు గంటల్లో తెల్లవారుతుందనగా, నిద్రమత్తు ముంచుకు వస్తూ ఉంటుంది ట్రంకురోడ్లమీదా, నేషనల్‌ హైవేస్‌మీదా హెవీ లోడ్‌ వెహికల్స్‌ని నడిపే డ్రైవర్లకు.

అంతకు ముందే వాసంతి హెచ్చరించినట్లు తమ దారికి సమీపములో ఆగిపోయి వున్న వాహనాలను నిర్మొహమాటంగా ఢీకొట్టేస్తూ వుంటారు వాళ్ళు.

రోడ్డు అంచుకు నాలుగు గజాలు అవతలికిపోయిన తర్వాత అంబాసిడర్‌ని ఆపి, డోర్స్‌ అన్నిటినీ జాగ్రత్తగా లాక్‌చేశాడు శ్యామ్‌సుందర్‌. వెనక సీటులో తన బ్రీఫ్‌కేస్‌ను చేతుల్లోకి తీసుకొని లెఫ్ట్‌రైట్‌ మొదలుపెట్టాడు.

“చింతచెట్టు క్రింద నిజంగానే కదలికలు కనిపించాయా?” ఒక పావు కిలోమీటరు దూరం వెళ్ళిన తర్వాత మెల్లగా ప్రశ్నించింది వాసంతి.

ఆ రోడ్డుమీద ప్రయాణం చేసే వెహికల్స్‌ ఏవైనా కనిపిస్తే లిఫ్ట్‌ అడగటా నికి నిశ్చయించుకుంటూ, మౌనంగా తల వూపాడు శ్యామ్‌సుందర్‌.

ఆపైన అనవసరమైన మాటలతో అతన్ని డిస్టర్బ్‌ చేయలేదు వాసంతి. పెద్ద పెద్ద ఇండస్టిృయల్‌ ఎస్టేట్స్‌లో వుండే రకరకాల ఫ్యాక్టరీలకు సెక్యూరిటీ సిస్టమ్స్‌ని అరేంజి చేయటమే కాకుండా, చిన్న చిన్న దొంగతనాల దగ్గర్నుంచి, ఎన్నెన్నో నేరాలనుకూడా ఇన్వెస్టిగేట్‌ చేయటం సిటీ సెక్చూరిటీ సర్వీసెస్‌ స్పెషాలిటీ.

అటువంటి పనుల్లో తలదూర్చటం వల్ల, క్రైమ్‌ వరల్డ్‌లో చాలా మందికి పూర్తిగా గుర్తుండిపోయారు శ్యామ్‌సుందర్‌, అతని పార్టనర్‌ వాత్సవ.

వారి ఇన్వెస్టిగేషన్స్‌ మూలకంగా కటకటాల వెనక్కి వెళ్ళినవాళ్ళు, వాళ్ళ జోక్యం మూలకంగా రకరకాల నష్టాలు ఎదుర్కొన్న వాళ్ళు ఎంతోమంది వున్నారు. ఏమాత్రం అవకాశం లభించినా కక్ష తీర్చుకునే ప్రయత్నాలు చేస్తూనే వుంటారు వాళ్ళు.

గతంలో తము ఫేస్‌చేసిన అటువంటి ఇన్సిడెంట్స్‌ని గుర్తుకు తెచ్చు కొనేసరికి, చుట్టూ వున్న వాతావరణం ఒక్కసారిగా వెచ్చబడిపోయినట్లు, స్వేద బిందువులు ఆవిర్భభవించాయి ఆమె ముఖంమీద.

అనవసరమైన కామెంట్స్‌ చేసి అంబాసిడర్‌ని రిపేరు చేయకుండా తను అడ్డుకోవడం జరిగిందేమోనన్న గిల్టీఫీలింగ్‌ ఆమెను ఆవరించుకున్నది.

ఆ ఆలోచనలతో సతమతం అవుతూ వుండడం వల్ల, ఒక అరగంట గడిచిన తరువాత వున్నట్లుండి శ్యామ్‌సుందర్‌ ఆగిపోవటాన్ని గమనించలేదామె. అతనిమీద పడబోతూ, ఆఖరి క్షణంలో తమాయించుకున్నది. పమిటె చెంగును మరింత టైట్‌గా భుజాలకు చుట్టుకుంటూ ప్రశ్నార్థకంగా అతని ముఖంలోకి చూసింది.

“నా ముఖంలోకి చూసినందువల్ల ఉపయోగం ఏదీ వుండదు…. ముందుకు చూడు” లోగొంతుకతో ఆమెను హెచ్చరిస్తూ, ఆమె చేతిని పట్టుకొని రోడ్డుప్రక్కకు నడిపించాడు శ్యామ్‌సుందర్‌.

అతని కంఠంలో ప్రతిఫలిస్తున్న అదోరకమైన ఎగ్జయిట్‌మెంట్‌ని వెంటనే గుర్తుపట్టి, మరింత ఖంగారుకు గురిఅయింది వాసంతి.

తను చేయదలచుకున్న పనుల్ని సాధించడం కోసం ఎంతమొండిగా ముందుకు దూసుకుపోతాడో, అంతకు రెట్టింపు మొండితనంతో తనకు సంబంధంలేని వ్యవహారాల్లో వేళ్ళు పెడతాడు శ్యామ్‌సుందర్‌.

ఎక్కడయినా, ఏదయినా ట్రబుల్‌ స్టార్ట్‌ అవుతూ వుండటాన్ని తను చూడటం అంటూ జరిగితే రెప్పపాటు కాలంలో అక్కడికి వెళ్ళిపోతాడు.

అతను చూడమన్నట్లు ముందుకు చూస్తూ, తన ఆలోచనలు యదార్థ రూపాన్ని ధరించటానికి ఎంతోవ్యవధి అవసరంలేదని అర్థం చేసుకున్నది వాసంతి.

వారు నిలబడిన ప్రదేశానికి సరిగ్గా వంద గజాల దూరంలో కనిపిస్తోంది ఒక ఎత్తయిన వంతెన.

ఒకరినొకరు నెట్టుకొంటూ, ఒకరితో మరొకరు కుస్తీలు పడుతున్నట్లుగా గుంపుగా కనిపిస్తున్నారు అరడజనుమంది ఆగంతకులు ఆ వంతెన మీద.

“తప్పతాగి, ఆ మైకంలో వళ్ళు తెలియక అలా నెట్టుకుంటున్నారు… .రెండు నిమిషాలపాటు ఓపికపడితే వాళ్ళదారిన వాళ్ళు వెళ్ళిపోతారు” తడి ఆరిపోతున్నట్లు తయారయినా కంఠంతో మెల్లిగా అన్నది వాసంతి.

“తప్పతాగిన బేచ్‌ కాదు అది …. లావుపాటి సూట్‌కేస్‌ను పట్టుకున్న ఒక అమాయకుడిని అడ్డగిస్తున్నారు ఐదుగురు దొంగరాస్కెల్స్‌. అతని సూట్‌కేస్‌ను స్వాధీనం చేసుకొని పారిపోవటానికి ట్రైచేస్తున్నారు వెంటనే చెప్పాడు శ్యామ్‌సుందర్‌.

అతని మాటలు యదార్థమని అరక్షణం తరువాత అవగతమయ్యే సరికి, నోరు మరింతగా తడి ఆరిపోయిన అనుభూతి వాసంతిని ఆవరించుకొన్నది.

“వాళ్ళ గొడవ ఏదో వాళ్ళనే పడనిద్ధాం….తెల్లవారేవరకు లెఫ్ట్‌రైట్‌ కొట్టాలని నిర్ణయించుకున్నాం కాబట్టి, ఒక పదినిముషాలపాటు ఇక్కడే నిలబడితే ఇప్పుడు మనకు రాబోయే నష్టం ఏమీ వుండదు. మనం ఎట్టి పరిస్థితిలోనూ ముందుకు పోవద్దు” ఆందోళనగా అంటూ శ్యామ్‌సుందర్‌ చేతిని గట్టిగా పట్టుకొన్నది.

సరిగ్గా అదే సమయంలో, బాధాసూచకమైన శబ్దాలు చేస్తూ వంతెన మధ్యలో వెల్లకిలా పడిపోయాడు సూట్‌కేసును పట్టుకుని వున్న వ్యక్తి.

“కొట్టండి….తల పగిలిపోయేటట్లు కొట్టండి….. కొట్టండి….”బిగ్గరగా అరిచాడు అతన్ని చుట్టుముట్టి వున్న ఆగంతకుల్లో ఒకతను.

అంతకుముందు అటూఇటూ చిందులు తొక్కటంలో క్రింద పడిపోయిన లావుపాటి లాటీవంటి చేతికర్ర నొకదాన్ని క్రిందినించి తీశాడు మరోవ్యక్తి.

ఆపైన క్షణం కూడా ఆలస్యం చేయలేదు శ్యామ్‌సుందర్‌. వాసంతి చేతిని వదిలించుకొని వింటినుంచి వెలువడిన బాణంలా వంతెనమీదికి పరుగు తీశాడు.

గుండెలనిండా గాలిని పీల్చుకోవటానికి కాబోలు రెండు క్షణాలు ఆగాడు చేతికర్రను పట్టుకున్న వ్యక్తి. రాకెట్‌ మాదిరి వేగంగా దూసుకువస్తున్న ఆకారాన్ని గమనించి, అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేశాడు.

తను వంతెనమీదికి చేరుకునేలోపల, అతను క్రిందపడిపోయిన వ్యక్తిని ఎటాక్‌ చేయదలచుకుంటే ఎలా అడ్డుకోవాలో తెలియక, చెవులు చిల్లులుపడి పోయేలా బిగ్గరగా అరిచాడు శ్యామ్‌సుందర్‌.

“రండి రండి….అందరూ వంతెనమీదికి వచ్చేయండి….ఒక్క దొంగ రాస్కెల్‌ని కూడా అవతలికి పోనీయకూడదు….రండి రండి….” అని ఆ చుట్టుపట్ల సంచరిస్తున్న తన ఫ్రండ్స్‌ని పిలుస్తున్నట్లుగా కేకలు పెట్టాడు.

మరింత అయోమయానికి గురైపోయాడు చేతికర్రను పట్టుకున్న వ్యక్తి. ఛెంగున ప్రక్కకు దూకి, వంతెన క్రింది భాగంలోకి తొంగి చూశాడు.

తిరిగి అతను తల పైకి ఎత్తే సమయానికి, అతని సమీపంలోకి చేరుకోనే చేరుకున్నాడు శ్యామ్‌సుందర్‌.

“రండి రండి ….అందరూ రండి” అని తన అరుపుల్ని కంటిన్యూ చేస్తూనే అమాంతంగా గాలిలోకి ఎగిరి అతని గుండెమీద తన్నాడు.

అతనంత వేగంగా కదలగలడని వూహించకపోవడం వల్ల, వెనక్కి దూకి ఆ దెబ్బనుంచి తనను తాను కాపాడుకోవటానికి ప్రయత్నం చేయలేదా వ్యక్తి.

బరువైన కాంక్రీట్‌ దిమ్మలు రెండు ఒకేసారి వచ్చి తన గుండెలకు తగిలినట్లు కీచుగా అరుస్తూ, వెనక్కి తూలాడతను.

అతని గుండెలకు కనెక్ట్‌ అయిన పాదాలు, నేలమీదికి దిగిన మరుక్షణం, రెండు అడుగులు ముందుకు వేశాడు శ్యామ్‌సుందర్‌. అతని చేతి లోని లాటీవంటి కర్రను తన స్వాధీనం చేసుకుని, రెట్టించిన వేగంతో మిగిలిన వారిమీద కలబడ్డాడు.

వెర్రి ముఖాలు వేసుకొని చూస్తున్నారు వారందరూ….మోటారు వెహికిల్స్‌లో తప్ప కాలినడకన ఆ సమయంలో అటుగా వచ్చేవారెవరూ వుండరనే విశ్వాసంతో తమ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటున్నారు వారు- అనుకోని విధంగా వచ్చిపడిన ఆ పర్సనాలిటీని ఎలా ఎదుర్కోవాలో వారికి అర్ధం కాకముందే, పూనకం వచ్చిన మనిషిలా వారిని చెల్లా చెదురు చేసేశాడు శ్యామ్‌సుందర్‌. చేతికర్రను గిర్రుగిర్రున త్రిప్పుతూ దొరికిన వారిని దొరికినట్లు విరగబాది వెనక్కి నెట్టేశాడు.

వంతెనకు అటు ఇటు నిర్మించబడివున్న కాంక్రీట్‌ రెయిలింగ్స్‌ని పట్టుకుని అర్జంటుగా క్రిందికి జారిపోయారు వారిలో ఇద్దరు. వంతెన అవతల దట్టంగా ఎదిగివున్న పొదల్లోకి పోయి అదృశ్యం అయ్యారు మరో ఇద్దరు.

దుస్తుల్లో దాచుకొని వున్న పొడవాటి పేష్కప్‌ని బయటికి తీసి, పెద్దపులిలా తన మీదికి దుముకబోయిన అఖరి వ్యక్తి భుజాలు విరిగిపోయే టట్లు చేతికర్రను విసిరాడు శ్యామ్‌సుందర్‌.

బాధను భరించటం అసాధ్యం అయింది కాబోలు, వెర్రిగా అరిచి, పేష్కప్‌ని వదిలేశాడు ఆ వ్యక్తి. అంతకుముందు రెండు క్షణాలక్రితం తన సహచరులు ఇద్దరు వంతెన క్రిందికి జారిపోయినట్లు, కాంక్రీట్‌ రెయిలింగ్స్‌ని పట్టుకుని జారలేదతను. ఒలింపిక్స్‌ డైవింగ్‌ పోటోల్లో పాల్గొంటున్నట్లు అమాంతంగా ఎగిరి, వంతెనక్రింద ప్రవహిస్తున్న ఒక వాగులోకి దూకేశాడు.

అతను వదిలేసిన పేష్కప్‌ని వెతికి చేతిలోకి తీసుకున్నాడు శ్యామ్‌సుందర్‌. సన్నపాటి వెంట్రుకను కూడా రెండుగా చీల్చగలిగేటట్లున్న దాని పదునును ఎడమచేతి చూపుడు వేలితో పరిశీలిస్తూ, క్రిందపడిపోయిన వ్యక్తికి కుడిచేతిని అందించబోయాడు.

కృతజ్ఞత ఉట్టిపడే చూపులతో ఆ చేతిని అందుకొని పైకి లేవాలి ఆ వ్యక్తి అతని అంచనా ప్రకారం. తను క్రిందపడిన తర్వాత కూడా వదిలి పెట్టకుండా గట్టిగా పట్టుకొని వున్న తన సూట్‌కేసును వదిలి అతనికి నమస్కారం చేయాలి. తన ప్రాణాల్ని కాపాడటానికి ఆకాశంలో నుంచి వూడిపడిన దేవదూతవని వల్లిస్తూ థేంక్స్‌ చెప్పుకోవాలి.

అటువంటి వాటిల్లో ఒక్కటి కూడా చేయకపోగా, దెబ్బతిన్న అడవి జంతువు మాదిరి వికృతంగా ముఖం పెట్టి, చాలా వయొలెంట్‌గా బిహేవ్‌ చేశాడా వ్యక్తి. శ్యామ్‌సుందర్‌ చేతిని అవతలుక విసిరికొట్టాడు. నేలకు తాటించిన రబ్బరు బంతి మాదిరి వేగంగా పైకి లేచి, ఒక్కసారిగా పిక్కబలం చూపించాడు.

రెండు క్షణాలు పట్టింది శ్యామ్‌సుందర్‌కి తన ఆశ్చర్యం నుంచి తేరుకోవటానికి, తేరుకున్న వెంటనే, గురిచూసి విసిరాడతను లాటీ వంటి చేతికర్రని.

గింగిరాలు తిరుగుతూపోయి, ఆఘమేఘాలమీద వెళ్ళిపోతున్న సూట్‌కేసు పర్సనాలిటీ పాదాలమధ్య దూరింది అది.

బాలెన్స్‌ తప్పి ముందుకు పడిపోయాడా వ్యక్తి. పడిన వెంటనే పైకి లేవటానికి ప్రయత్నించేలోపల, మెరుపువేగంతో అతన్ని సమీపించి, చేతికర్రతో భుజాలమీద బలంగా మోదాడు శ్యామ్‌సుందర్‌.

గావురుమని అరిచి మరోసారి రోడ్డును కౌగలించుకున్నాడా వ్యక్తి. స్పృహ తప్పటం వల్ల కాబోలు, సూట్‌కేసును వదిలేశాడు.

అవసరం అయితే మరో దెబ్బ వేయటానికి రెడీ అవుతున్న శ్యామ్‌సుందర్‌ దగ్గిరికి పరిగెత్తుకువచ్చి, అతి బలవంతంగా తన స్వాధీనం చేసుకున్నది యమదండం మాదిరి మారిపోయిన చేతికర్రని.

“మతిపోయినట్లు ప్రవర్తించటం ఈమధ్య నీకు బాగా అలవాటు అయిపోయింది. ఇతన్ని కాపాడటం కోసం హీరో మాదిరి పరిగెత్తుకువచ్చి, ఇప్పుడు నువ్వు చేస్తోంది ఏమిటి?” పట్టరాని కోపంతో, అతను తన బాస్‌ అనే మాటను మరిచిపోయి, యకాయకిని ఏకవచనంతో సంబోధిస్తూ అడిగేసింది.

అరగంటకు కనీసం ఆరు వెహికల్స్‌ అయినా అటూ ఇటూ తిరుగుతూ వుండే ఆ రోడ్డుమీద అప్పటికి ఒక గంటనుంచీ ఒక్క వాహనం కూడా కనిపించనం దుకు ఆశ్చర్యపోతూ, పాంటు జేబులో భద్రంగా దాచుకొని వున్న సిగరెట్‌ పాకెట్‌ని బయటికి తీశాడు శ్యామ్‌సుందర్‌. సిగరెట్‌ని వెలిగించుకొని పొగను గుండెలనిండా పీల్చుకొంటూ చిరునవ్వు నవ్వాడు.

కోపం వస్తే రాక్షసుడి మాదిరి చిందులు తొక్కే శ్యామ్‌సుందర్‌నే చూసి వున్నది వాసంతి. ఒక మనిషి భుజాలు విరిగిపోయేటట్లు కొట్టి అలా చిద్విలాపంగా చిరునవ్వుల్ని చిందించే శ్యామ్‌సుందర్‌ని అంతకుముందు ఎన్నడూ చూసి వుండలేదు.

“ఆర్‌ యూ ఆల్‌రైట్‌ ? వంతెనమీద దెబ్బ ఏదీ తగలలేదుకదా!” ఆందోళనను అణచుకోవటానికి ప్రయత్నిస్తూ అడిగింది.

తన హీరోయిజానికి బెదిరి దూరంగా పారిపోయిన వ్యక్తులెవరయినా తన చర్యల్ని గమనించేందుకు ఆ చుట్టుపట్ల తచ్చట్లాడుతున్నారో లేదో ఒకసారి గట్టిగా చూసుకుని ఆమెకు సైగ చేశాడు శ్యామ్‌సుందర్‌.

“మనం చేసిన సహాయాన్ని తలుచుకొని పరవశించిపోతూ మన పాదాలకు నమస్కారం చేయవలసిన ఈ పెద్దమనిషి పిచ్చిపట్టిన శునకం మాదిరి మనమీదికి ఎగబడటానికి ఏదో కారణం వుండే వుంటుంది….అదేమిటో తెలుసుకోనిదే ఇక్కడ్నించి అవతలకు పోవటం నాకు చేతకాదు. సాయంపట్టు వాసంతీ…..ఇతన్ని అవతలకు తీసుకుపోవటానికి హెల్ప్‌చేయి.” అంటూ అచేతనంగా పడివున్న ఆ వ్యక్తిని అమాంతంగా భుజం మీదికి ఎత్తుకున్నాడు.

అతని ఆలోచన ఏమిటో అర్ధం చేసుకోవటానికి విపరీతమయిన ప్రయత్నం చేస్తూ, ఆ వ్యక్తి వదిలేసిన సూట్‌కేసును తను తీసుకున్నది వాసంతి.

పాంటు జేబులో నుంచి ఒక పెన్సిల్‌ టార్చిని బయటికి తీసి, దాని వెలుగులో దారి చూసుకుంటూ రోడ్డుకు ఎడమచేతి వైపున వున్న పొదల్లోకి దారితీశాడు శ్యామ్‌సుందర్‌. పాతికగజాల దూరం వెళ్ళిన తరువాత అగుపించిన ఒక చిన్న మెరక ప్రదేశంలో భుజంమీది వ్యక్తిని పడుకోబెట్టి, అతని బుగ్గల్ని తట్టాడు.

అర నిముషం తరువాత కనులు తెరిచాడా వ్యక్తి……

అంతకుముందు మాదిరిగానే వికృతంగా చూస్తూ, ప్రక్కకు దొర్లే ప్రయత్నం చేశాడు.

“ఇతని ప్రవర్తన నాలో రకరకాల అనుమానాల్ని రేకేత్తిస్తోంది. తాపీగా కూర్చొని ఒకసారి ఆ సూట్‌కేసు ఓపెన్‌చేయి వాసంతీ….

అందులో ఎటువంటి నిధి దాచిపెట్టబడి వున్నదో జాగ్రత్తగా చూడు….” అని షర్టును పట్టుకొని వెనక్కి లాగుతూ వాసంతిని హెచ్చరించాడు శ్యామ్‌సుందర్‌.

ఆ మాటల్ని ఆలకించి మరింత పట్టుదలగా ప్రయత్నించాడా వ్యక్తి అతని చేతుల్ని వదిలించుకొని అవతలకు పారిపోవటానికి.

నిర్ధాక్షిణ్యంగా మరో దెబ్బవేసి అతనికి మరోసారి స్పృహ తప్పించాడు శ్యామ్‌సుందర్‌. వాసంతి వెంటబెట్టుకు వచ్చిన చేతికర్రను గిర్రుగిర్రున తిప్పి, సూట్‌కేసు మీద బలంగా మోదాడు.

ఫట్‌మని శబ్దం చేస్తూ పగిలిపోయింది దాన్ని పట్టివుంచిన తాళం.

దానంతట అదే తెరుచుకుంది సూట్‌కేసు…..

శ్యామ్‌సుందర్‌ ఫోకస్‌ చేసిన పెన్సిల్‌ టార్చి వెలుగులో అందులోని నిధి నిక్షేపాల్ని చూసి ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయింది వాసంతి.

కనులు తిరిగి క్రింద పడిపోతున్న అనుభూతి కలిగేసరికి చేతుల్ని క్రింది ఆనించి పడిపోకుండా తమాయించుకున్నది.

End of Preview.

Rest of the book can be read @ http://kinige.com/kbook.php?id=197

Related Posts: