కుండీలో మర్రిచెట్టు (విన్నకోట రవిశంకర్) పరిచయం–ఇస్మాయిల్

విన్నకోట రవిశంకర్ రచించిన కవితా సంకలనం కుండీలో మర్రి చెట్టు పుస్తకానికి ఇస్మాయిల్ వ్రాసిన పరిచయం ఈ దిగువ చదవండి.

 

కుండీలో మర్రిచెట్టు On Kinige

పరిచయం

రవిశంకర్ ని నేను పదేళ్ళబట్టి ఎరుగుదును. అప్పట్లో అతను మా కాలేజీ విద్యార్థి. అప్పుడే ప్రారంభమైంది అతని అన్వేషణ. మనిషైన ప్రతి వాడిలోనూ కొద్దో గొప్పో ఈ తపన ఉంటుందనుకుంటాను. తనెవరు? తన అస్తిత్వం ఏమిటి? తన తాదాత్మ్యంఏమిటి? ఒకడు ఎవరూ సాధించలేనిది అనగా పర్వతాలెక్కడమో, సముద్రాన్ని ఈదడమో, కొత్త భూఖండాన్ని కనుక్కోవడమో, ఏదో చేసి తన్నుతాను కనుక్కుని మురిసిపోతాడు. మరొకడు పేకాటలోనో, తాగుడు లోనో మునకవేసి ఆ మసక లోతుల్లో తన కోసం తడుముకుంటాడు. ఇంకొకడు రాజ్యాన్నో, ధనాన్నో, అధికారాన్నో వశం చేసుకుని తన్నుతాను జయించాననుకుంటాడు. కవులూ కళా కారులైతే తమ అంతరంగాల్లోకి సొరంగాలు తవ్వుకుంటూ పోతారు. లోనికి తవ్వగా తవ్వగా తను తనకి తగలకపోతాడా?

ఈ పదేళ్ళనించీ రవిశంకర్ నీ, అతని ఆత్మావిష్కరణోద్యమాన్నీ గమనిస్తూనే వున్నాను. తన పద్యాల కోసం ఎంత లోతుగా తవ్వాడో? ఎందుకంటే, పద్యమంటే తనే. కవీ, కవిత్వం వేరుకాదు. కవితలో తప్పించి కవికి వేరే అస్తిత్వం లేదు. పద్యం రచించి దాన్ని అద్దంలా మెరుగుపెట్టాకే అందులో తన మొహం చూసుకుని గుర్తిస్తాడు కవి.

ప్రకృతిలో కూడా ఆత్మావిష్కారాన్ని దర్శిస్తాడు రవిశంకర్.

`ఏడాది పొడుగునా వేచి వేచి ఒక చెట్టు

ఒళ్ళంతా పువ్వులతో

తనను తాను తిరిగి పొందేవేళ’

(హోళీ)

సామాన్య మానవుడు కూడా అరుదైన ఆనందపు వేళల్లో ఆత్మసాక్షాత్కారం పొందుతాడని ఇతని నమ్మకం.

`పువ్వులా,

పక్షిలా,

రంగు ల్నాశ్రయించి,

రంగుల మంటల్లో ఆనందభస్మమై రూపుదాల్చి,

బహుశ మనిషి కూడా ఈ రోజు కాస్సేపు

తనను తాను తిరిగి చేరుకుంటాడు.

(హూళీ)

ఆనందభస్మాలే పూనుకోనక్కర్లేదు. ఫ్లూ జ్వరం కూడా, ఇతని సాక్ష్యం ప్రకారం, కవిత్వం లాగే మనల్ని ఏకాతంలో బంధించి, మనల్ని మనకు రుచి చూపిస్తుంది!

`మా నుంచి మేమే తప్పించుకు తిరిగే మాకు

ఈ రెండు రోజుల ఏకాంతంలో –

ఊహల్లో, ఆలోచనల్లో,

మా రూపాన్ని మళ్ళీ గుర్తుకుతెచ్చి,

మమ్మల్ని మాకు రుచి చూపిస్తుంది’

(ఫ్లూ)

జీవిత పుటల్ని చివరిదాకా తిరగవేసే ఆసక్తీ , నిజాయితీ, ధైర్యమూ రవిశంకర్ కున్నాయి. ఒకటి రెండు పుటలతో చాలించి, అదే విషయాన్ని అదే పదజాలంతో పునః పునః పునః పునర్నినదించే నినాదకవి కా డితను. ఎంత అనుభవ వైవిధ్య ముందో అంత ప్రగాఢతా ఉంది ఇతని కవిత్వానికి.

`స్త్రీ పాత్ర’ అనే కవిత ఒక వింత సత్యాన్ని అభివ్యక్తం చేస్తుంది. ఇది మనందరికీ అనుభవ వేద్యమైనా, ఎవరూ గుర్తించని గూఢ యథార్థం.

`అక్కడున్న అందరి మనసుల్లోని

దుఃఖాన్నీ

ఆవిష్కరించే బాధ్యతని

ఒక స్త్రీ నయనం వహిస్తుంది’.

స్త్రీ సమక్షంలేని పరిసరాలే వేరుగా వుంటాయి. శుష్కంగా, జీబుగా, చీకాకుగా. ఆడది తనున్నచోట తన చుట్టూ ఆర్ద్రత ప్రవేశపెడుతుంది. మగవాళ్ళ మనస్సుకి ఏంటినా వంటిది స్త్రీ. ఆమె లేని చోట పురుషప్రవర్తనే వేరుగా వుంటుంది. అందుకే, కొన్ని కఠిన, శుష్క జీవితాల గురించి తను రాసిన కథలకి హెమింగ్వే `MEN WITHOUT WOMEN’ అని పేరు పెట్టాడు. ఆ పరిస్థితి తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది.

ఇటువంటి అనుభవ అగాధాల్ని మామూలు కవులు ముట్ట లేరు. `సాగర్ శిల్పం’ అనే కవిత చూడండి. శిల్ప సుందరితో అంటాడు:

‘వేదన ప్రక్క నువ్వు; వైరాగ్యం ప్రక్క నువ్వు;

వెలిగే జ్ఞాపకం ప్రక్క నువ్వు

…………………………………………

జీవితంలో వైరుధ్యాలన్నిటికీ

నువ్వే సరైన భాష్యంలా అనిపిస్తావు.

నువ్వు మా జీవితపు విలువల పునాదుల్ని

తుదకంటా కదిలించే ప్రశ్నవి.’

కళకి ఇంత పర్యాప్తమైన నిర్వచనం ఎక్కడా నాకు తారసపడ లేదు. జీవితపు విలువలతోనే కదా కళకి ప్రమేయం. ఈ సత్యాన్ని ప్రవించడం కాదు ఈ కవిత చేసిన పని, ఇది మనకు అనుభూతమయేటట్లు చేసింది. అనగా, ఒక యథార్థాన్ని ఆలోచనా రూపంలో కాక అనుభవ రూపంలో మనకు ప్రసాదిం చింది. ఇదే కవిత్వసారం.

మానవత్వపు సారాంశాలైన జీవితానుభవాలతో స్పందించే కవితలు ఈ పుస్తకం నిండా వున్నాయి. పై నుదహరించినవి కాక ‘ కుండీలో మర్రిచెట్టు’, ‘రామప్ప సరస్సు’, ‘జ్ఞాపకం’, ‘నిద్రానుభవం’, ‘చలనచిత్రం’, ‘పాపమనసు’ వంటి విషా దంతో, ఆనందంతో, ఉత్సాహంతో, అనురాగంతో, పురాజ్ఞాపకాలతో మెరిసే, మండే, మిరుమిట్లు గొలిపే జీవితశకలాలెన్నో ఈ కవి మనకు సమర్పించాడు.

కవిత్వగడియారపు లోలకం ఆ చివరినించి ఈ చివరికి ఊగినట్లుందీ మధ్య. భావకవులు వాస్తవానుభవాల్ని విస్మరించి, ఆంతరంగికమైన అనుభూతుల్నీ, భావాల్నీ వ్యక్తీకరించటమే పనిగా పెట్టుకున్నారు. ఒకలాంటి పొగమంచు ఆవరించి నట్లుంటుంది వారి కవిత్వం. యథార్థదృశ్యాలు కనిపించవు. ఇప్పుడు లోలకం ఇటు మళ్ళాక, కవిత్వంలో అనుభూతి లోపించి, కవిత్వమంటే పదాలూ, ఆలోచనలూ తప్ప మరేంకాదు అనే అపోహ వ్యాపించినట్లుంది. లోలకాన్ని మళ్ళించినవాడు శ్రీశ్రీ. ఐతే, దాన్ని ఈ కొసకి తీసుకువచ్చినవాళ్ళు బైరాగి, ఆరుద్ర, అజంతా,మోహనప్రసాద్, శివారెడ్లు. కవిత్వమంటే మాటలు తప్ప మరేం కాదన్న అభిప్రాయం ఈ నాటి యువకవుల్లో పాతుకున్నట్లుంది. అనుభవమూ, అనుభూతీ, రెండూ సంయోజిస్తేనే కాని కవిత్వపు విద్యుత్ స్పులింగం పుట్టదనే గ్రహింపు చాలామంది కవులకు ఉన్నట్లు తోచదు. భావకవిత్వం పూర్తిగా ఆత్మాశ్రయమైతే, ప్రస్తుత కవిత్వం పూర్తిగా వస్త్వాశ్రయమైనదనవచ్చు. ఐతే, ఈ వస్తువుకూడా వాస్తవమైన జీవితానుభవం కాదు. దానికి నకిలీ ప్రతిగా నిలబడే వట్టి మాటలూ, ఆలోచనలూ, సిద్దాంతాలూ, నినాదాలూనూ.

రవిశంకర్ కవిత్వ నావ మాటల ప్రవాహంలో కొట్టుకుపోదు. దానికి గమ్యముంది.

జీవితానుభవమూ, హృదయానుభూతీ – ఈ రెండు ధృవాల్నీ కలిపి కవిత్వ విద్యుచ్చక్తిని సృష్టించాడు కవీ, విద్యుత్ ఇంజనీరూ ఐన రవిశంకర్. ఇటువంటి కవులు అరుదుగా వుంటారు. ఇదింకా ఇతని మొదటి పుస్తకం.

22-11-1992

ఇస్మాయిల్

 

———————————-

ఈ పుస్తకం ఇప్పుడు కినిగెపై లభిస్తుంది.

 

కుండీలో మర్రిచెట్టు On Kinige

Related Posts: