స్వయం ప్రకాశం

ప్రముఖ రచయిత్రి టి. శ్రీవల్లీరాధిక రచించిన కథల సంపుటం “స్వయం ప్రకాశం“. ఇందులో పన్నెండు కథలు ఉన్నాయి. ఈ పుస్తకంలోని కొన్ని కథలను పరిచయం చేసుకుందాం.

మనుష్యులకి ఈర్ష్య ఉండడం సహజమే. ఎవరైనా నాకు ఈర్ష్య లేదు అని చెబితే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నమ్ముతారా? సమాజం నమ్ముతుందా? తోటివాళ్ళు సాధారణంగా ఏ విషయాలకి సంతోషిస్తారో… గర్వపడతారో, వాటి పట్ల ఉత్సాహం చూపని, ఉద్వేగం ప్రదర్శించని ఓ మహిళని ఈర్ష్శ్యాళువుగా ముద్ర వేస్తారు. అవతలివారికి తనని తాను అర్థమయ్యేలా చెప్పడంలో కథకురాలు విఫలమై, వారంతా ఆమెని చూసి ఈర్ష్య పడే స్థితి తెచ్చుకుంటుంది. ఫలితంగా ఆమె మళ్ళీ మౌనాన్ని ఆశ్రయిస్తుంది. ఏం మాట్లాడాలన్నా భయపడుతుంది. చివరికి తన సొంత విజయాల పట్ల కూడా ఉత్సాహం చూపదు. అలాంటి స్థితిలో ఆమెకి తన సమస్యకి పరిష్కారం తన పిల్లల సంభాషణలో దొరుకుతుంది. ఆలోజింపచేసే కథ “ఈర్ష్య”.

కథకురాలు తన భర్తతో కలసి మైసూరు పరిసర ప్రాంతాలలో ఉండే పుణ్యక్షేత్రాల సందర్శనకి వెడుతుంది. అన్నీ చూసాకా, తిరుగు ప్రయాణం రోజున ఇంకా కాస్త సమయం దొరికే సరికి, మైసూర్‌కి దగ్గర్లోని సోమనాధపురం వెడతారు. అక్కడ గుడిలో ఓ ప్రవాస భారతీయుడు పరిచయం అవుతాడు. కథకురాలి భర్త చేసే పనులన్నీ అతనికి తప్పుల్లానే కనిపిస్తాయి. అతను తన సామర్ధ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం లేదని, డబ్బు విలువ తెలుసుకోడం లేదని అంటూ, తన గురించి తాను చెప్పుకుంటూ తన తెలివితేటలని ప్రదర్శిస్తాడు. అయితే అతని లోని లోపమేంటే వివరిస్తుంది కథకురాలు. అక్కడి వారు మిగుల్చుకోడానికి చూస్తే, ఇక్కడి వారు పంచుకోడానికి చూస్తారని, ‘పుణ్యం – పురుషార్థం’ అవేనని చెబుతుంది.

మగవాళ్ళ దృష్టిలో స్త్రీ వ్యక్తిత్వం అంటే ఏమిటో చెబుతుంది కథకురాలు. పురుషుల దృష్టిలో మాహిళల వ్యక్తిత్వం అంటే… డబ్బు సంపాదించగల సామర్థ్యం, భర్త సంపాదించి తెచ్చినా…. తేకపోయినా బాధ్యతలు నెత్తికెత్తుకోగల ప్రయోజకత్వం, భర్త నుంచీ ఏమీ ఆశించని, అతని మీధ ఆధారపడని ధీరత్వం…వాటితో పాటు అతనికి అణిగిమణిగి ఉండే సహనశీలత…. అతడు కొట్టినా, తిట్టినా చిరునవ్వుతో చూడగల స్థితప్రజ్ఞత. ఇది వ్యక్తిత్వమా? ‘భార్యాత్వం’ కదూ?

మగవాళ్ళు చాలా సులభంగా వాడే మాటలని ఆడవాళ్ళు ఎందుకని అంత సులభంగా తీసుకోలేరు? ఎందుకంత గుంజాటన పడతారు?బాధ ఎందుకు పడతారు? ఆ మగవాడు భర్తయి, ఆ స్త్రీ భార్య అయితే ఆమె మనః స్థితి ఎలా ఉంటుంది? అందునా ఆ బంధం విఫలమైనప్పుడు స్త్రీ తను వేసిన అడుగుని వెనక్కి తీసుకోలేని తన అశక్తత పట్ల బాధ పడుతుంది. అలాంటి బాధనే మగవాడికీ కలిగిస్తే గాని తనకి ఉపశమనం లభించదనుకుంటుంది. వాడుకుని వదిలేస్తే కలిగే బాధని భర్తలో కూడా కలిగించిన ఓ భార్య కథ – ‘అలక్ష్యం’.

తనతో బామ్మ ఎందుకు అబద్ధం చెప్పిందో.. తను పెద్దయి; తన మనవరాలి పెళ్ళినాటికి కూడా వేణుగోపాల్‌కి అర్థం కాదు. ఎందుకో ఏదో కోల్పోయిన భావన. ఇంట్లో పెళ్ళి సంబరం ఏదీ ఉన్నట్లు అతని అనిపించదు. పెళ్ళంటే ఇలా ఉంటుందని చిన్నప్పుడు బామ్మ చెప్పిన మాటలు అబద్ధాలేమోనన్న సంశయం అతనిలో తీరదు. చివరికి అతని సంశయాలని, సందేహాలని అతని అక్క తీరుస్తుంది. బామ్మ లాంటి మంచి గురువుని తాను సరిగా ఉపయోగించుకోలేకపోయాననిపిస్తుందతనికి. ‘మాటలు కాదు’ చక్కని కథ.

తాను అమిత ధైర్యశాలిని అనుకునే మనవరాలికి, నిజమైన ధైర్యం అంటే ఏమిటో ఆమె బామ్మ చెబుతుంది. ప్రమాదంలో నుంచి త్వరగా బయటపడడం… దాని గురించి బాధ పడకపోవడం… ధైర్యం. అలా ఉండగలిగినవారే నిజమైన ‘సాహసి’ అని మనవరాలు గ్రహిస్తుంది.

పెద్దలకి, పిల్లలకి మధ్య ఉండే తేడాని అద్భుతంగా చెప్పిన కథ ‘ధారణ’. ఓ ఫాన్సీ డ్రెస్ పోటీ నేపధ్యంలో పిల్లల తల్లిదండ్రులు రకరకాల దుస్తులు అమ్మే కొట్టు చుట్తూ తిరగడం, పిల్లలు ఆయా దుస్తులలో ప్రదర్శనివ్వడం గురించి చెబుతుందీ కథ. బాల్యానికి దగ్గరగా ఉండే కిటుకేమిటో ఈ కథ చెబుతుంది.

ఈ కథల సంపుటికి శీర్షిక అయిన కథ ‘స్వయం ప్రకాశం’. ఈ సంకలనానికి తలమానికమైన కథ. కష్టం రావడానికీ, కష్టపడడానికి మద్య ఉండే తేడాని విశదీకరిస్తుందీ కథ. మన కష్టాలని చూసి మనమే బాధపడడం అనవసరమైతే… ఎదుటివాళ్ళు బాధపడాలని కోరుకోడం అసహ్యమని చెబుతుందీ కథ.

కోరికలు, ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నంత కాలం అనుభవమూ, పాండిత్యమూ పనిచేయవు. ఆశ ఉన్న చోట అవి నిర్వీర్యమైపోతాయని చెబుతుంది ‘ఆశ’ కథ. ఒక విషయానికి స్పందిస్తున్నంత కాలం, దాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేమని, స్థితప్రజ్ఞత అలవడ్డాకే నిజమైన జ్ఞానం లభిస్తుందని చెబుతుంది ఈ కథ.

సమర్థతని, నిగ్రహంతో కూడిన ప్రవర్తనకి ముడిపెట్టిన ఓ మేనేజరు ఆ రెండిటికి అసలు సంబంధమే లేదని తెలుసుకుంటుంది. సమర్థత కేవలం ఆసక్తికి సంబంధించిన విషయమని, ఆసక్తి ఉన్న రంగాలలో వ్యక్తుల సామర్థ్యం స్పష్టం అవుతుంది. ఈ విషయాలు తను నిర్దేశించినవీ, తనకి అనుకూలమైనవి అయితే ఆ వ్యక్తులు సమర్థులు, మర్యాదస్తులని అంటుంది సమాజం. దీనికి వ్యతిరేకమైతే, సామర్థ్యం కూడా అసమర్థతగానే పరిగణించబడుతుంది. మనలాగా ప్రవర్తించే వాళ్ళని మాత్రం సమర్థులుగానూ, మనకి అనాసక్తమైన పనులు చేసేవారిని అసమర్థులుగాను భావించకూడదని చెబుతుంది ‘యోగ్యత’ కథ.

ఈ సంపుటిలో కథలకి మనుషులకు సహజంగా ఉండే లక్షణాలను, వేటిని అలవర్చుకుంటే తాము ఆనందంటూ ఉంటూ ఇతరులని సైతం సంతోషంగా ఉంచగలుగుతారో ఆ లక్షణాలను శీర్షికలుగా ఉంచడం బావుంది. దాదాపుగా అన్ని కథలలోనూ మనుషుల ప్రవర్తనను, కుటుంబ సభ్యుల సంబంధ బాంధవ్యాలను చక్కగా ప్రస్తావించారు రచయిత్రి. పాత్రల మనస్తత్వాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణించడం వలన అన్ని కథలకు నిండుదనం వచ్చింది. పాత్రోచితమైన సంభాషణలు కథకి ఎంచుకున్న ఇతివృత్తానికి బలాన్ని చేకూర్చాయి. వెరసి పాఠకులని నిరాశపరచని పుస్తకం ” స్వయం ప్రకాశం”.

ఈ కథాసంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

స్వయం ప్రకాశం On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

“మహార్ణవం” కథాసంపుటికి పురస్కారం

కొల్‌కతాలోని భారతీయ భాషా పరిషద్ 1974లో స్థాపించబడింది.

భారతీయ సాహిత్యం కోసం ఎనలేని సేవ చేస్తున్న సంస్థ ఇది. ఒక భాషలో వెలువడిన పుస్తకాన్నిఇతర భాషలలోకి అనువదింపజేసి, ఆ పుస్తకాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం ఈ సంస్థ లక్ష్యాలలో ఒకటి.

అన్ని భారతీయ భాషలలోని సాహిత్యకారులను ఒక వేదిక మీదకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా, ఈ సంస్థ 1980 నుంచి వార్షిక పురస్కారాలను అందిస్తోంది.

2011 వ సంవత్సరానికి భారతీయ భాషా పరిషద్, కలకత్తా వారి పురస్కారం – తెలుగులో- సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి టి.శ్రీవల్లీరాధిక రచించిన “మహార్ణవం” కథాసంపుటికి – ప్రకటించబడింది.

ది 18 – 19 ఫిభ్రవరి 2012 తేదీలలో జరిగిన కార్యక్రమంలో రచయిత్రి ఈ అవార్డుని స్వీకరించారు. రచయిత్రికి అభినందనలు.

మహర్ణవం కథా సంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

మహార్ణవం On Kinige

Related Posts:

కైవల్యం” కవితాసంపుటిపై సమీక్ష

సుప్రసిద్ధ రచయిత్రి శ్రీవల్లీ రాధిక గారి కవితా సంకలనం “కైవల్యం“పై కౌముది అంతర్జాల మాసపత్రిక, ఫిబ్రవరి 2012లో సమీక్ష ప్రచురితమైంది.

అర్ధవంతమైన కవితలు, అర్ధమయ్యే కవితలు, ఆలోచించి వ్రాసిన కవితలు, ఆలోచింపజేసే కవితలు…వ్రాసే అతికొద్ది మంది ఆధునిక కవయిత్రులలో రాధికగారు ఒకరని సమీక్షకులు అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ సంకలనంలోని కవితల్లో చాలా భాగం వాస్తవ చిత్రణతో మొదలై ఆధ్యాత్మిక భావనలను అల్లుకుని ఒక చక్కని ముగింపుతో పూర్తవుతుందని; ఏ కవితా అలవోకగా చదివి మరిచిపోయేది కాదని సమీక్షకులు పేర్కొన్నారు. పుస్తకానికి ముందుమాట వ్రాసిన అద్దేపల్లి రామ్మోహనరావుగారి మాటలు, చివరి అట్టపై ఆశీస్సులందించిన సామవేదం షణ్ముఖశర్మగారి మాటలు అక్షరసత్యాలని సమీక్షలులు పేర్కొన్నారు.

పూర్తి సమీక్షకై ఈ లింక్‍ నొక్కండి

కైవల్యం కవితాసంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి.

కైవల్యం On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: