మైలు రాళ్లు

ప్రతి ఒక్కరి జీవితంలో అరవయ్యేళ్ళు ఓ మైలురాయి. సాహిత్యకారులకైతే అదొక చారిత్రక సందర్భం. దశాబ్దాలుగా సాహిత్య కృషి చేస్తున్న దాసరి అమరేంద్ర… అరవయ్యేళ్ళు నిండిన సందర్భంగా తాను వివిధ ప్రక్రియల్లో సృజించిన సాహిత్య సర్వస్వాన్ని రెండు సంపుటాలుగా వెలువరించారు. మిగిలిన ప్రక్రియల్లో కూడా రచనలు చేసినప్పటికీ… చాలామంది ఏదో ఒక సాహిత్య ప్రక్రియలో విశేషంగా కృషి చేస్తారు. కాని అమరేంద్ర అన్ని ప్రక్రియలనూ ప్రేమించారు.

అన్నిట్లోనూ ఒక స్థాయికి తగ్గని రచనలను వెలువరించారు. ‘ఆత్మీయమ్‘లో కథలు, కవితలు, అనువాదాలు, యాత్రా రచనలతో పాటు సన్నిహితుల అభినందనలు కూడా జత చేశారు. ‘లోకంలోని అన్ని అందాలూ ఆనందాలూ/తమ కోసమే సృజించబడ్డాయనిపిస్తేనూ… విశ్వరహస్యాలూ… వేదాంతపాఠాలూ తమ అనుబంధంలోనే నిక్షిప్తమై ఉన్నామనిపిస్తేనూ… సందేహమెందుకూ… రాగోదయమయినదన్నమాట’ అనడంలోనే అమరేంద్ర హృదయ సౌకుమార్యమేంటో అర్థమవుతుంది.

ఉద్యోగరీత్యా తెలుగు నేలకు దూరంగా ఉండడం వల్ల, దేశ రాజధాని ఢిల్లీలో ఉంటున్నందువల్ల వివిధ భాషా ప్రక్రియలతో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. అందుకే ఎక్కువగా ఎవరూ స్పృశించని రూపకాన్ని కూడా చక్కగా రక్తికట్టించి, గంధర్వ, భూలోకాల్లో విహరింపజేశారు. ఊహాలోకాలలోనే కాదు… హిమాలయాలు, పూల లోయలు, పిండారీ గ్లేషియర్, అమర్‌నాథ్‌ల వంటి ఇహలోకాలనూ పాఠకులకు తన కళ్ళతో చూపుతారు.

ఆయనే చెప్పుకున్నట్టు అమరేంద్ర కాళ్ళలో చక్రాలున్నాయన్నమాట నిజమేనని ఆయన యాత్రా రచనలు చదివే వారికి అర్థమవుతుంది. రెండో సంపుటి ‘సాహితీ యాత్ర‘లో వ్యాసాలు, ఇంటర్వ్యూలు పొందుపరిచారు. వీటిల్లో ఆయా రచయితల పుస్తకాలపై రాసినవే ఎక్కువ. బలివాడ కాంతారావు, అల్లం శేషగిరిరావు మొదలుకుని… నాగావళి కథల వరకు వివిధ సంకలనాలపై తన విశ్లేషణను అందించారు. కాళీపట్నం రామారావు మాస్టారి ఇంటర్వ్యూ మామూలుగానే సాగినప్పటికీ… ఖుష్వంత్ సింగ్, సచ్చిదానందన్ వంటివారి ఇంటర్వ్యూలు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాయి. భిన్న ప్రక్రియల్లో సాగిన దాసరి అమరేంద్ర కృషి భవిష్యత్‌లో మరింత విస్తృతిని సంతరించుకుంటుందని ఆశిద్దాం.

దేరా, ఆదివారం అనుబంధం, ఆంధ్రజ్యోతి దినపత్రిక, 22 జూన్ 2013

* * *

“ఆత్మీయమ్”, “సాహితీ యాత్ర” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌లని అనుసరించండి.

ఆత్మీయమ్ On Kinige

సాహితీయాత్ర On Kinige

Related Posts: