‘జలపాతగీతం‘ చదివాను. అనుభూతి, ఆలోచన కమనీయంగా సంగమించిన కవితాసంపుటి అది. “రాగాన్ని వేదికే భావం”, “మాటకి ప్రాణం పోయాల్సిన వేళ”, “వసంతం ఒక పంచవన్నెల పాట”, “పద్యమయ్యేవేళ” – ప్రత్యేకించి పేర్కొనదగిన మంచి కవితల్లో కొన్ని. కృత్రిమ జీవితానికి ‘కొబ్బరాకు మబ్బులకింద నవ్వు మొలకల సీమ సింగారం‘ అందమైన అభివ్యక్తులు. ‘రాగాన్ని వెదికే భావం‘ కవిత ముగింపు చాల బాగుంది.
–జ్ఞానపీఠ పురస్కారగ్రహీత, పద్మభూషణ్, డా|| సి. నారాయణరెడ్డి (లేఖ, తే. 16.3.97)
‘జలపాతగీతం‘ అందింది. అన్నీ ఇంచుమించుగా మంచి కవితలే. ‘రోజూ చూసే దృశ్యమే‘ అన్న కవిత ఎంతో బాగుంది.
‘దృష్టపూర్వా అపిహ్యర్థాః| కావ్యేరస పరిగ్రహాత్ / సర్వేనవా ఇవా –భాంతి| మధుమాస ఇవద్రుమాః‘ అని ప్రాచీనులననే అన్నారు. దీనికి మీ కవిత గొప్ప పునసృష్టి.
–ముదిగొండ వీరభద్రయ్య (లేఖ, తే. 11.3.97)
‘జలపాతగీతం‘ చదివాను. ఆపాతమధురంగా ప్రవహించిన మీ కవిత్వ గానాన్ని ఆకర్ణించాను. ఈ దశాబ్దంలో మీది విలక్షణమైన గొంతు. కొన్ని కవితల్లో భావాన్ని; యింకా కొన్ని కవితల్లో శిల్పాన్ని, మరికొన్ని కవితల్లో ధ్వనిలో గుప్పెళ్లతో వెదజల్లారు….
–డా|| నాగభైరవ కోటేశ్వరరావు (లేఖ, తే.10–4–97)
ఆదూరి సత్యవతీ దేవి గారి జలపాతగీతం మనోజ్ఞంగా సాగిపోయింది. అక్షరాలను పూలుగా పరచినట్లు, భావాలను అత్తర్లు పన్నీర్లుగా చల్లినట్లు, అర్థాలు ఆర్ద్రాతి ఆర్ద్రమై పరిమళించినట్లు, తమ కవితలను శిల్పీకరిచిన రసజ్ఞ కవయిత్రి యీమె. లలితమైన భావాలు వీరి స్వంతం. తనకు యీ లోకానికంతటికీ ఇష్టమైన ఏవస్తువు పైనైనా మమకారం చూపడానికి ఆ వస్తువులకు హానికలిగించే శక్తులను సుతిమెత్తగా మందలించడానికి ఆ లలిత భావాలనే ప్రయోగిస్తారు. ఏ సంఘటనను స్పృశించినా అద్భుతమైన భావనాపరంపర జలపాతంలా ఎగిసిపడుతుంది. వస్తువైవిధ్యాన్ని పాటిస్తూనే రూపవైశారద్యాన్ని సాధించారు కవయిత్రి.
–ఆచార్య నాయని కృష్ణకుమారి (తే. 23.4.97)
‘జలపాతగీతం‘ అందింది. మొదటి పుస్తకంలో కవిత్వం ఆరంభమై రెండో పుస్తకంలో మలుపు తిరిగి, మూడో పుస్తకంలో ముచ్చటైన మీ సొంత మార్గం ఏర్పడింది. మీ కవితా ప్రయాణంలో కొంత భాగానికి నేను ప్రత్యక్ష సాక్షిని కావటం నాకు సంతృప్తికరంగా సంతోషంగా వుంది.
–చే.రా. (లేఖ, తే. 11.3.97)
నులివెచ్చని సంవేదన– మనోనేత్రం ముద్రించిన ఆర్ద్రమైన ఛాయాచిత్రాలు:
పొద్దుటి పూట గడ్డిపరకపై వాలిన మంచు బిందువును ముద్దుపెట్టుకున్నట్లనిపిస్తుంది ఈ సంకలనంలోని కొన్ని కవితలను చదివితే. మేఘాలై తిరిగివచ్చి గుండెలో వెచ్చని కన్నీటి జలపాతాలను వొంపినట్లు ఒక ఆనంద విషాదం. ఎందుకో ఏమిటో తెలిసీ, చాలాసార్లు తెలియక, కలిగే వేదనలోంచి పుట్టే అక్షరాలకు ఎంత మహత్తు! ఈ కంటితో అందాన్నే చూడగలగడం ఒక వరం. ఈ మనసుతో బాధనే పాడగలగడం అంతకన్నా గొప్ప వరం. ప్రేమించే తాహతును బట్టే బాధపడే అర్హత లభిస్తుందేమో!
ఏకాంత జలపాతాల్ని నిబ్బరంగా వొంపుకుని గీతమై ధ్వనించిన ఆదూరి సత్యవతీ దేవికి ప్రకృతే తాత్త్విక భూమికను కట్టబెట్టింది. ప్రకృతిని అపారంగా ప్రేమిస్తూ, ప్రాకృతిక నియమాలతో మనిషి సహజాతి సహజంగా లయించాలని ఆమె అత్యాశపడుతున్నారు. యంత్రయుగ బీభత్సంలో అనాది సౌందర్యాల కేన్వాసు ఛిన్నాభిన్నమైపోవడం ఆమెను అమితంగా వేధిస్తోంది. మనిషి మరగా మారడం ఆమెకు దిగులుగా ఉంది. అందుకే పరాయీకరణలో అస్తిత్వాన్ని కోల్పోతున్న మనిషికి ఆమె పచ్చని వసంతాల రుచి చూపిస్తున్నారు. “ఎంత నిరుపేదతనం / మనిషికీ మనిషికీ మధ్యన” అని వాపోతూ. “మిత్రమా మిత్రమా / రెండు స్వప్నాల మధ్య / రెండు ప్రపంచాల మధ్య / ఒక గందర్వగానం / నిరంతరం సాగనీ” అని ప్రేమగా అర్థిస్తున్నారు. సత్యవతీ దేవి కవిత్వానికి లాలనగా ఆందోళన రేకెత్తించే అరుదైన సుగుణం ఉంది. మనిషి ఎన్నటికైనా ప్రేమవైపే నడవక తప్పదు కదా అన్న ఆశావాదమూ ఉంది. అంతేకాదు, చూపుల జీవన కాంక్షల్ని రెప్పల పొత్తిళ్ళలో కరిగిస్తూ, ప్రకృతి ఔన్నత్యాన్ని విడమరచి చెబుతూ మనిషితనం అంటే ఏమిటో ఈ కవిత్వం గుర్తుచేస్తుంది.
జీవరాసుల మనుగడకై / ఆరు ఋతువుల్నీ తరగతి గదులుగా మలచుకొని / తానే ఒక పాఠశాలై చరిస్తూ / ఇచ్చిపుచ్చుకునే సందర్బాలన్నింటినీ సమతూకాలుగా చేసి / అర్పించుకొనే సంస్కారాన్ని మనిషిని / వనాల నుంచీ, గనుల నుంచీ, జీవనదుల నుంచీ / నీలాంబర జలధారల నుంచీ గ్రహించమని ప్రకృతి తన తొలిపాటగా వినిపించిందని అంటారు. కంటికి కనిపించే దృశ్యాలను చిత్రికపడుతూ, ఆ క్రమంలో తానే దృశ్యంలో లీనమై కవిత్వాన్ని వినిపిస్తారు సత్యవతీదేవి.
మౌనంలో జీవశక్తిని, దుఃఖంలో సౌందర్యాన్ని దర్శించగలుగుతున్నారు. కనుకే, “నన్ను నేను చూసుకునేదీ / తెలుసుకునేదీ / ఒక యథార్థ దుఃఖలిపిలోనే” అంటారు. ఆ లిపిలోనే సౌందర్య సీమలు సాక్షాత్కరిస్తాయి. ఎవరో అన్నట్లు, తీయని పాటలన్నీ విషాద ఘడియల్లోంచి పుట్టినవే కదా!
–పసునూరు శ్రీశీధరబాబు, ఇండియాటుడే 30 ఆగష్టు 1997
కవిత్వ ‘జలపాతగీతం‘
అనేకానేక వాదాల వివాదాల్లో కవిత్వం గతి తప్పిపోతున్న కాలమిది. అప్పుడప్పుడు మళ్ళీ కృష్ణశాస్త్రి, తిలక్ లాంటి కవులు ఎక్కడో తచ్చాడుతూ మండుటెండలో ‘జలపాతగీతాల‘ వుతున్నారు. ‘రెక్క ముడవని రాగం‘ నుంచి ‘జలపాత గీతం‘ వరకూ ఆదూరి సత్యవతీదేవి గారి కవితాగానం, ఆమెను చదివిన సాహితీప్రియుల్ని అలా వెంటాడుతూనే ఉంటుంది. ప్రకృతి స్వరాలను అక్షరాలుగా పేర్చి పచ్చటి పాటలుగా మలిచే గొప్ప శిల్పి సత్యవతీదేవి.
“జీవదానం చేసి పునర్జన్మనివ్వటం / బతుకులోని ఒక భాగాన్ని / ఎప్పటికీ కొత్తగా మెరిపించటం / ఈ అక్షరాలకి తెలుసు”– ఆమె మాటల్లోనే కాదు, మనక్కూడా ఈ కాసిన్ని అక్షరాలే చాలు తమకాన్ని తీర్చేందుకు. సత్యవతీదేవి గారు పాట నుంచి కవిత్వం వైపు మళ్ళేరు కాబట్టి సహజంగానే అస్పష్టత ఆమె జోలికి పోలేదు. ప్రకృతి పచ్చదనమంత సున్నితంగా కవిత్వమల్లగల నేర్పు ఈమె రచనల్లో కన్పిస్తుంది. ఈమెతో కవిత్వం నిజంగానే ప్రేమలో పడింది. ఎంత కవిత్వమైనా ‘ఏ చేతులు పూచిన ఋతువులో‘! నంటూ పాట తాలూకు ‘లయ‘ వినిపిస్తుంది.
కవిత్వమంటే భావుకత్వమనీ, ప్రేయసీ ప్రియుల మధ్య పావురాయిపట్టుకొచ్చే ప్రేమ సందేశమనీ అర్థాలుండేవి. దాన్ని చెరిపేస్తూ కవిత్వమంటే విప్లవమనీ, సమాజాన్ని మార్చే సాధనమనీ జనం గుండె గొంతుకలో కొట్టుకునే ప్రాణధారనీ శ్రీశీశ్రీశీ లాంటి ఆధునికలు నిరూపించారు. దీన్ని కూడా కాదని… కవిత్వమంటే సామాన్యులకు అర్థం కాని అస్పష్టతనీ, గందరగోళ పదాల కూర్పనీ, అర్థాలను బద్దలుకొట్టి నిఘంటువులక్కూడా అందని కొత్తర్థాలు రాయటమని ఓ తరం పోటీపడింది. దాన్ని భూజానేస్కుని శిష్యరికం చేయటానికే మరోతరం కవిత్వం రాసింది. ఇదీ కాదని… కవిత్వమంటే దళిత, మైనారిటీ, స్త్రసీ వాదాలనీ కవిత్వం జుట్టు పట్టుకుని కులమతాల కుళ్ళు రాజకీయాల్లో ముంచి తేల్చుతున్నారు కవులు. ఈ సదర్భంలో ఎవరు రాసిన కవిత్వం వాళ్ళే చదువుకుని తృప్తి పడాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకంటే ఇన్ని గందరగోళాల మధ్య నిజమైన పాఠకుడు ఎక్కడో తప్పిపోతున్నాడు. అయినా అక్కడక్కడా కొంతమంది ప్రకృతి కవులు పాఠకులని సేదతీరుస్తూనే ఉన్నారు. అలాంటిదే సత్యవదీదేవిగారి కవిత్వం. “యుగాలనాటి సంగీతం / యవ్వనాల మోహవేగం / జలజల పారు గీతం / జలపాతగీతం.” కృత్రిమత్వం, నటనలూ మనుషుల్లో పేరుకుపోవటం, నిజంగా మన నవ్వుల్ని మనమే నటించాల్సి రావటం పంత దారుణమో కదా! మనిషి తనను తానే వెలిగించుకుని ఒక వెన్నెల ముక్కయి బయటకు రావాలని కవి అభిలాష. కవిత్వానికి వస్తు పరిమితులు లేకపోయానా ఈ తరహా ప్రకృతి కవిత్వంలో స్పష్టమైన అనుభవాల్ని అనుభూతించటం సత్యవతీదేవిగారికి మొదట్నుంచీ అలవాటు. కొన్ని అనుభవాలు జీవితంలో చాలా చిన్న సంతోషాలని మాత్రమే కలిగించి జారిపోతుంటాయి, మళ్ళీ మనం వాటిని గుర్తుంచుకోం. కాని సత్యవతీదేవి గారు ఆ క్షణాల్ని అందంగా పట్టుకుంటారు. వాటికి అక్షరరూపమిచ్చి ఆ అనుభవాలను పునర్జీవింపజేసి ఒకే ఆనందాన్ని పదేపదే అనుభూతిస్తారు. మనకూ పంచిపెడ్తారు.
–జావేద్, వార్త దినపత్రిక 11 ఆగష్టు 1997
వేదనాభరితం జలపాత గీతం
అనాది సౌందర్యాల ప్రకృతి కాన్యాసు ఛిన్నాభిన్నమై మనిషిలోని మనిషితనం డిగ్రేడ్ అయిపోతున్న పరిస్థితుల పట్ల ఆవేదన,. ఆదూరి సత్యవతీదేవి గారి ‘జలపాత గీతం‘లో నిదానంగా ప్రవహిస్తుంది.
దుఃఖలిపిని తెల్సి కొత్తగా సుఖ దుఃఖాలు రెండూ సమమేనన్న తాత్విక బోధను కావిస్తారు.
“నన్ను నేను చూసుకునేదీ తెలుసుకొనేదీ ఒక యదార్థ దుఃఖ లిపిలోనే / ఒక్కొక్క దెబ్బా తగిలి జీవితం పెచ్చులూడిన గోడలా అందవిహీనమై పోతున్నదే అని / భాధ మెలిపెట్టినప్పుడల్లా దెబ్బ వెనుక సన్నివేశం నన్ను మరో ప్రక్కకు మళ్లించి /కొమ్మలు తెగినా చిగురించటం మానని చెట్టును చూపెట్టేది / ఉరిత్రాళ్ళకు వ్రేలాడిన త్యాగాల్ని చూపెట్టేది అప్పట్నించి గాయం నాకు ఆత్మీయమై పోయింది / ఓటమి నన్ను మెరిపించి గెలుపువైపు నడిపించే గురువై సాకింది. / నిజంగా ఆ కన్నీటి చెమ్మే తెలియకపోతే / జీవితం ఎంత రసాస్వాద భోజ్యాన్ని కోల్పోయేదో కదా!” అంటారు కవయిత్రి!
దుఃఖమే ఒక గురువై సుఖ పడడం నేర్పుతుంది. నరికిన చెట్టు మళ్ళీ హరితత్వాన్ని పొందిన విధంగా ఆశా జీవియై మళ్ళీ జీవించడం మొదలెడతాడు. దుఃఖాన్ని ఆస్వాదించ నేర్చుకోలేనివాడు సుఖాన్ని కూడా సరిగా ఆస్వాదించలేడనేది కవయిత్రిగా లోకానికామె ఇచ్చే సందేశం.
21వ శతాబ్దంలో మనమెన్ని విధాల శాస్త్ర విజ్ఞానంలో అభివృద్ధిని సాధించి ముందుకు సాగుతున్నామనుకున్నా ఓమూల మనమీనాడు పర్యావరణ కాలుష్య రాక్షసి పెనుకోరల్లో చిక్కుకొని ఉన్నామన్న నిజం మనల్ని భయకంపితుల్ని చేయక మానదు. సర్వప్రకృతి సంపదే ఛిద్రమై ఓజోన్ పొరకు చిల్లులు పడడం మూలాన సర్వమానవాళి మనగడ ఒక తేలిక ప్రశ్నగా మిగిలిపోయింది. చెట్లు నరికివేస్తున్నాం. ప్రాణవాయువు లుప్తమై రోగాలబారిన పడుతున్నాం. ప్రకృతిలో దినదినం విడుదలయ్యే మృత్యు పొగల్లోచంద్రుడు సహితం కానరాకుండా పారిపోతున్నాడు. ఈ ప్రకృతి విధ్వంసనలో ఈ విషపు గాలుల్లో చిరునవ్వుల చిన్నారులకేదీ రక్ష? ఈ విషాద – భయానక పరిస్థితుల నేపథ్యంలోనే కవయిత్రి –
‘విజ్ఞానం పెరిగి పెరిగి / ఈనాటి యుగవేగం కూడా / మనిషి గెల్చుకున్న విజయమే / కానీ– / నీడలా వెన్నంటి పోరాడుతున్న కాలుష్య గాలులూ / నిరంతరంగా ఆకాశాన్ని చిల్లులు పొడుస్తున్న / క్లోరో ఫ్లోర్ కార్బన్లూ మిథైల్ బ్రోమైడ్లూ / ఓజోన్ పొరని చేదిస్తూ ఒక వికృత వేషంలో / దేశదేశాల పసిపిల్లల్నీ నమిలి మింగేయటానికి / బయలుదేరిన కంసుని దూతలల్లే భయం కొల్పుతున్నాయి.‘ అంటారు.
ఆధునిక విజ్ఞానం పేరుతో ఎన్నో మనం సాధించవచ్చు. ఆ శాస్త్రసీయ విజయాలన్నీ ఈ ఘోర విషకాలుష్య వాతావరణం ముందుదిగదుడిపే అవుతాయి. నేడు లెక్కల్లో తేలింది 65% శకటాలవల్ల వచ్చే కలుషితమయిన గాలి నగరాల్లో వ్యాపిస్తోందిట. దీనిని అరికట్టే నాధులేరీ? మానవులంతా కలిసికట్టుగా ఎదిరిస్తేనే ఈ విశాల వసుంధర క్షేమంగా ఉంటుంది. ఈనాటి మానవాళికిదొక సవాల్‌గా పరిణమించింది. మేధావులూ, కవులూ కదలిరండి – పర్యావరణాన్ని రక్షించుకొనే మార్గాలను అన్వేషించండి. అదే కవి తపన. అదే ఆదూరి సత్యవతీదేవిగారి ఆవేదన.
ఆదూరి సత్యవతీదేవి దుఃఖం తత్వ చింతనా కలిపి కలబోసిన కవిత్వమే – ‘జలపాత గీతం‘ ఒక ¬రు మనచెవుల్లో నినదిస్తుంది. కొన్ని కవితలయితే చక్కటి ప్రకృతి శోభను మన కళ్ళకు కట్టే పెయింటింగులు. ఆమె కలం అప్పుడప్పుడు కుంచెగా మారిపోతుంది. మరిన్ని నూతనవిలువల్ని ఆధునిక సాహిత్యంలోకి తీసుకురాడానికి ఈమె ప్రయత్నిస్తున్నారు.
–ఎస్.ఏ. పద్మనాభ శాస్త్రి, ఆంధ్రభూమి 2 జూన్ 1997.
సౌందర్యం అనుభూతుల సమ్మేళన ప్రవాహం – ‘జలపాతగీతం‘
జలపాతం స్వచ్ఛతకూ, వేగానికీ, మార్పుకూ, సౌందర్యానికీ ప్రతీక!
ఆదూరి సత్యవతీదేవి రాసిన ఈ కవితలు మానవ జీవన జలపాతంలో ఒక్కో గీతాన్ని ఆలపిస్తున్నాయి. ఒక్కోరాగాన్ని నినదిస్తున్నయి. కవితలన్నింటి నిండా పరచుకున్న అండర్ కరంట్ మానవతే ! సృష్టినీ, మనిషినీ సౌందర్యమయంగా చూస్తూ మాయమవుతున్న మనిషితనం కోసం విలపిస్తున్న హృదయసుధ ఈ ‘జలపాతగీతం‘
చినిగిపోయిన పచ్చల కేన్వాసు; రాగాన్ని వెదికేభావం, జలపున్నమి; మాటకి ప్రాణం పోయాల్సిన వేళ; పలుచనయిపోతున్న పచ్చదనం; వసంతం ఒకపంచ వన్నెలపాట; పరిమళలహరి; ఒక హరితవసంతానికై; వెలుగు విహంగం; పద్యమయ్యే వేళ; జలపాతగీతం;– యివన్నీ కవితల పేర్లు. ఇవి ఎంతమనోహరంగా వున్నాయో, కవితల్లోని కంటెంటు కూడా అంతే ఆలోచనా స్పోరకంగా వుంది. సౌందర్య దృష్టితో చూడడం ఒక ఎత్తైతే, ఆ సౌందర్య అనుభూతిని అక్షరబద్ధం చేసి మనోహరంగా అక్షరచిత్తరువులను మనముందు నిలపడం యింకా గొప్ప !
మనిషితనాన్ని మరచి, త్యజించి మతం, కులం, భాష, ఆలోచన, వాదం, నమ్మకం, దేశం, యిలా చాలా రకాలుగా మనల్ని మనమే ఖండఖండాలుగా చేసుకోవడం, కోసుకోవడం స్పందించే ఎవరినైనా కలచివేస్తుంది. సత్యవతీదేవిగారు దాన్ని గొప్పగా చిత్రించి రంజింప చేశారు.
ఏదో వివక్షతతో, విభిన్న సిద్ధాంతాలతో, సెన్సేషన్ ఉబలాటంతో చాలా రకాలుగా కవిత్వం చలామణి అవుతున్నవేళ ఒక్క మానవజాతేకాదు, సృష్టితో మమేకమై మానవతని సౌందర్యంతో, ఆలోచనతో రంగరించి అందరికోసం, ఆర్తితో కవిత్వం రాయడం సత్యవతీదేవిగారి ప్రత్యేకత. దాన్ని ఆదరించి, ఆస్వాదించి, అటువంటి కవిత్వం మరింత రావాలని ఆశించడం మనందరి వంతు!
జీవదానం చేసి పుర్జన్మ నివ్వటం; బతుకులో ఒక భాగాన్ని ఎప్పటికీ కొత్తగా మెరిపించడం; ఈ అక్షరాలకి తెలుసు; (ఈ కాసిన్ని అక్షరాలే…) నేను ముందుకీ అవి వెనక్కీ పరుగుల ఆటే ఆటగా; నన్ను పసితనంలోపడవేసేవి; ప్రతి ఉదయం నాకొక మిఠాయి పొట్లాం దొరికేది; రేపటికై ఒక తీపికల మిగిలేది… (చినిగిపోయిన పచ్చల కేన్వాసు); విచ్చీ విచ్చని మొగ్గలాలిత్యాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయి; వెన్నునంటి పలికేపాట గురితప్పిపోతుంది; (జలపున్నమి); తరతరాల మానవుడు; బుద్దిని అరగదీసి; చిక్కని మైత్రీ సుగంధాన్ని మనముందుంచి–
“వెండి గిన్నెలోని పాల బువ్వలా / శుచి పక్వంచేసి అందించిన సారాన్ని / రుచిరార్థాలెరుగని కాకుల్లా నేల పాలుచేసి / వెన్నెలకు రక్తపు మరకలంటిస్తున్నవేళ / ఆనందం నిషేధమే” అంటారు. (మాటకి ప్రాణం పోయాల్సిన వేళ)
ఇందులో ఏ కవితా ఖండికను ఆఘ్రాణించినా యింతవరకు మనం చెప్పుకున్న అంశాలు బోధపడతాయి. అందుకే ఆదూరి సత్యవతీదేవిగారి కవితలను చదవడం అంటే – పశ్చిమాకాశంలోని సాంధ్యతారను ఆనందించినట్టు, నీలిమేఘాల కడ్డంగా ఎగిరే తెల్లకొంగను ఆనందించినట్టు, రసానుభూతి పొందుతానని సంజీవ్‌దేవ్ చెప్పుకున్నారు. అదెంతో నిజం. అందుకే ఈ కవితా దర్పణంలో మసకపోయిన మన మానవతకు నగిషీలు దిద్దుకుందాం !
చివరగా నాకు బాగా నచ్చిన కవితాఖండిక (“శాపాలా? బహూమానాలా?” నుంచి)
“. . . నీడలా వెన్నంటి పోరాడుతున్న కాలుష్య గాలులూ / నిరంతరంగా ఆకాశాన్ని చిల్లులుపొడుస్తున్న క్లోరోఫ్లోరో కార్భన్లూ మిథైల్ బ్రోమైడ్లూ / ఓజోన్‌పొరను ఛేదిస్తూ / ఒక వికృతవేషంలో / దేశదేశాల పసిపిల్లల్ని నమిలి మింగేయటానికి బయలుదేరిన కంసుని దూతలల్లే భయం గొల్పుతున్నాయి. / చెంగల్వపూదండల్ని కబళించనున్నాయి. / భూమిమీద వనరుల్నీ వనాల్నీ ఎండగట్టి /గ్రహాంతరాళాల్నిండా పొగధూళుల్ని నింపి / మానవజీవిత భద్రతను జీరోడిగ్రీకి దింపి / గడగడలాడిస్తున్న యీ శాస్త్రసవిస్తృతి / ఎవరి సుఖస్వప్నాలకోసం? ఏ ఉజ్వల బాల్యాలకోసం?
–నాగసూరి వేణుగోపాల్, ఆహ్వానం మాసపత్రిక, ఏప్రిల్ 1998
Authors Thrid book Veyi Rangula Velugu ragam can be read @ http://kinige.com/kbook.php?id=214