మాస్టర్ స్టోరీ టెల్లర్ – దేవరకొండ బాలగంగాధర తిలక్

దేవరకొండ బాలగంగాధర తిలక్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక గ్రామంలో 1921 ఆగష్టు 1 న జన్మించారు.
తిలక్ అనగానే గుర్తొచ్చేది… అమృతం కురిసిన రాత్రి. తిలక్ పేరు తలచుకోగానే ‘నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్న వాక్యం స్ఫురించకతప్పదు. తిలక్ కవిగానే కాదు, కథకుడిగా కూడా తనదైన ముద్ర వేసారు.
తిలక్ మద్రాస్ లయోలా కాలేజిలోనూ, విశాఖ ఎ.వి.ఎన్. కాలేజిలోనూ ఇంటర్ చదువుతూ, అనారోగ్య కారణాల వల్ల ఆపేసారు. తణుకులో విజ్ఞాన పరిషత్ స్థాపించారు. తర్వాతి కాలంలో దానినే ‘సాహితీ సరోవరం’గా మార్చారు. తిలక్ కవితలు, కథలే కాదు, నాటకాలు కూడా రాసారు. బృందావన కళా సమితి అనే సంస్థని స్థాపించి నాటకాలు వేయించారు.
మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి ఆయన కవితను, కథలను, నాటికా ప్రక్రియను ఉపయోగించుకున్నారు. రోజూవారీ జీవితంలో మనకు తారసపడే అభాగ్యులను, మోసగాళ్లను ఆయన పాత్రలుగా తీసుకుని అసలు రూపాలతో మన ముందు నిలబెట్టారు.
తిలక్ తన మొదటి కథని 11 వ ఏట రాసారు. ‘మాధురి’ పత్రికలో ప్రచురితమైన ఆ కథ ఇప్పటికీ అలభ్యం. ఆయన 16 ఏళ్ళకే రాసిన పద్యాలు, గేయాలు ‘ప్రభాతము – సంధ్య’ పేరుతో 1938లో తొలి సంపుటిగా వచ్చింది.
గోరువంకలు, కఠినోపనిషత్తు, అమృతం కురిసిన రాత్రి ఇతర కవితా సంకలనాలు. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ‘ అమృతం కురిసిన రాత్రి ‘ ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.
తిలక్ కథలు, సుందరీ-సుబ్బారావు, ఊరి చివరి యిల్లు తిలక్ కథా సంకలనాలు. సుశీల పెళ్లి, సుప్త శిల, సాలె పురుగు తిలక్ రాసిన నాటకాలు. 1956-66 మధ్య కాలం తిలక్ రచయిత శిఖరారోహణ చేసిన కాలం. అద్భుతమైన సాహిత్యాన్ని పాఠకులకు అందిస్తూ 1966 జూలై 1 న చిన్న వయసులోనే తిలక్ కీర్తి శేషులయ్యారు.

* * *

ఆనాటి సమాజాన్ని తన కథల్లో ఎలా వ్యక్తీకరించారో చెప్పడానికి ఆయన కథల్లోని ఈ క్రింది వాక్యాలు చాలు.

ఆశాకిరణం కథ నుంచి:

నలభై ఏళ్ళు పైబడిన తాను, తన సభ్యతకీ, స్వభావానికీ విరుద్ధమైన పనులన్నీ బతకడంకోసం చేశాడు. కాని దాని ఫలితంగా మరింత అవమానాన్ని, దుఃఖాన్ని కొనితెచ్చుకున్నాడు. ఇంకా తనిలాగ ఎన్నేళ్ళు ఆకలితో బతకగలడు? తన కుటుంబానికి ఏం దారి చూపించగలడు? భయంకరమైన నిస్సహాయత అతన్ని చుట్టుకుంది. అతనికి చీకట్లోకి జారిపోతున్నట్లు చీకటి నీళ్ళలో పీకలోతు మునిగిపోతూన్నట్టు ఉంది. నీరసంవల్ల అతని కాళ్ళూ చేతులూ లాగుతున్నాయి. అతనికలాగ గోడ నానుకుని ఆలోచించే వోపిక కూడా లేకపోయింది.
అలా మగతగా నిస్త్రాణగా వున్న అతనికి ‘నాన్నా’ అన్న పిలుపుతో మెలకువ వచ్చింది. కళ్ళుతెరచి చూశాడు. అతని పెద్దకొడుకు పదేళ్ళవాడు ‘అమ్మరమ్మంటోంది’ అన్నాడు.
“ఏం?”
“తింటానికి.”

* * *

పలితకేశం కథ నుంచి:

అతనికి చిరాకు కలిగింది. ఆశ్చర్యం కలిగింది. భయంవేసింది. ఇంతవరకూ ఉన్న మనస్స్వాస్థ్యం చెడిపోయినట్టయింది. ఎక్కడిదీ తెల్లవెంట్రుక? ఎప్పుడు ఎలా వచ్చింది? అభేద్యమనుకొన్న యీ కోటగోడకి పగులు ఎలా ఏర్పడింది. ప్రసాదరావు మొహంలో రంగులు మారాయి. అతనికి చీకట్లో వొంటరిగా నడుస్తూంటే ఎవరో శత్రువులు చుట్టుముట్టి నట్లనిపించింది. అతను సరదాగా మంచుమీద స్కేటింగ్ చేస్తుంటే చటుక్కున అంచు విరిగి అగాధమైన లోయలోకి జారిపోతున్నట్టు అనిపించింది తన నిస్సహాయత తనకి తెలియవచ్చింది. ఈ తెల్ల వెంట్రుక యిక నల్లబడదు. ఈ ఒక్క తెల్లవెంట్రుక ఆసరాతో తక్కిన వెంట్రుకలు కూడా తెల్లబడిపోతాయి. అతను ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నాడు. పరిష్కరించాడు. కాని యిది తన చేతిలోలేదు. ఏదో బలవత్తరమైన శక్తి అతన్ని ఆక్రమిస్తోంది. ఓడిస్తోంది. శ్రీమంతుడైన ప్రసాదరావు. హేతువాది అయిన ప్రసాదరావు, ఆప్టిమిస్టు అయిన ప్రసాదరావు. గౌరవమూ ప్రతిష్టాగల ప్రసాదరావు. సిసలైన వ్యక్తిత్వం కల ప్రసాదరావు తెల్లబోయి కంగారుపడి అద్దంముందు వెర్రిగా నిలుచునిపోయాడు.

* * *

సముద్రపు అంచులు కథ నుంచి:

వీరయ్య మౌనంగా అంచనా వేస్తున్నాడు. ఆకలీ – రేపటిని గూర్చిన భయమూ లేకుండా గౌరవంగా బతకాలని కోరని వారుండరు. కాని ఆ పేదరికం పొలిమేర దాటడం కష్టం అని వీరయ్యకి తెలియదు. ఆ పొలిమేర దగ్గర నీచత్వమూ నిరాశా రోగమూ లాంటి పెద్ద పెద్ద అగడ్తలుంటాయి. పై అంతస్తులోనికి ఎగరడానికి చేసే ప్రయత్నం అతి కష్టమైనదీ అపాయకరమైనదీకూడా. కాని వీరయ్య ధనం దేనికైనా మూలం అని గుర్తించాడు. కేవలం తన కష్టంవల్లనే తప్ప మరోమార్గం సంపాదనకి లేదనీ తెలుసుకున్నాడు. ఆ వచ్చిన ధనం తన్ని అంటిపెట్టుకుని ఉండాలి. కాని యీ చంచల పదార్థం ఉన్న చోటికే వెళ్లే దుర్గుణం కలిగి ఉందనీ అతనికి తెలియదు. ఏమైనా దారిపొడుగునా జయించుకుపోవాలనే పట్టుదల అతనిలో వుంది. అందుకోసమే తక్కిన తన వాళ్ళల్లో ఉన్న అలసటనీ అవినీతినీ తనలోంచి తుడిచిపెట్టి నియమబద్దంగా బతకాలనుకున్నాడు. అందుకోసమే నరసమ్మ నెత్తురులేని వలపుకి దూరంగా తొలగాడు.
పడవ సముద్రంలో వూగింది. రెండుకుండలలో గంజీ కూడూపెట్టి పడవలో ఉంచారు. తెరచాప గాలికి వయ్యారంగా ఆడింది. ఎండముదిరిన వేడికిరణాలు చల్లని సముద్రాన్ని తాకుతున్నాయి. “నాను కూడువొండి ఎదురు చూపులు చూత్తూంటాను.” అంది చంద్రి.

* * *

నవ్వు కథ నుంచి:

“అతను పక్కనుంటేనే మూర్తికి వొళ్ళంతా తేలికపడినట్టు, ఉదయపు నీరెండవంటి ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తుంది. మూర్తికి సమస్యలు చాలా వున్నాయి. కాని సమస్యలన్నీ రామచంద్రరావు ఎదురుగా వున్నంతసేపూ మంచు విడిపోయినట్లు మాయమైపోతాయి.
కాని, మూర్తికి ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతూంటుంది. ఎందుకు ఇతని వదనాన ఒక విషాదరేఖగానీ, విసుగుగానీ కనిపించవు? ఏ జీవిత రహస్యం ఇతనికి తెలుసును? సుఖంలోని ఆనందంలోని ఏ కీలకాన్ని యితను వశపరచుకున్నాడు?”

* * *

పై వాక్యాలు చదువుతుంటే మాస్టర్ స్టోరీ టెల్లర్స్‌లో తిలక్ ఒకరనేందుకు ఏ మాత్రం సంశయించనక్కర్లేదని మనకి అర్థమవుతుంది. కినిగెలో తిలక్ రచనల కోసం ఈ లింక్‌ని అనుసరించండి.

Related Posts:

  • No Related Posts