కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్యగారి జీవితం ఒక ఉద్యమం. ఉద్యమమే వారి జీవితం. కామ్రేడ్ ఎంబీగా చిరపరిచితమైన బసవపున్నయ్యగారి జీవితాన్ని, భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమాన్ని వేరువేరుగా చూడడం చాలా కష్టం. అసాధ్యం కూడా. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంతో అంతగా మమేకమైన జీవితం బసవపున్నయ్యగారిది. వారి జీవిత ప్రస్థానం ఎలా మొదలైంది. బాల్యం ఎలా గడిచింది, విద్యార్థి జీవితాన్ని ఎలా గడిపారు. విద్యార్థి లోకానికి ఎలా నాయకత్వం వహించారు అనే దానితో ప్రారంభమై.. రాటుదేలిన కమ్యూనిస్టు నాయకుడిగా ఎలా ఎదిగారు, ఎలాంటి పోరాటాల్లో పాల్గొన్నారు అనేవరకు అనేక విషయాలు ఈ పుస్తకంలో వున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం కమ్యూనిస్టుపార్టీ నిర్వహించిన పోరాటాలు, రూపొందించుకున్న కార్యాచరణలు, ఎత్తుగడలు ఎలాంటివో ఈ పుస్తకం చదివి తెలుసుకోవచ్చు. తెలంగాణ సాయుధ పోరాటంలో పార్టీ అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలు, వాటికి కారణాలు తెలుసుకోవచ్చు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్‌ల పట్ల పార్టీవైఖరి, అలాగే ఎన్.జి.రంగా లాంటి నాయకుల పట్ల వైఖరి ఏమిటి? ఆ వైఖరికి కారణాలు ఏమిటి? లాంటి రాజకీయ అంశాలనే కాదు.. కామ్రేడ్ ఎంబీ జీవిత కాలంలోని సామాజిక పరిణామాలను కూడా ఈ పుస్తకం ద్వారా అర్థంచేసుకోవచ్చు. కామ్రేడ్ సీతారాం ఏచూరి మాటల్లో చెప్పాలంటే.. స్వాతంత్య్ర ఉద్యమంలోను, ఆ తరువాత కాలంలోనూ కమ్యూనిస్టు ఉద్యమప్రాభవం, దాని బలహీనతలను వివరించే పుస్తకం ఇది. ఇది ఏకబిగిన రచించిన పుస్తకం కాదు. కామ్రేడ్ బసవపున్నయ్యగారు వివిధ సందర్భాలలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో వెలిబుచ్చిన అభిప్రాయాలను ఒక క్రమపద్ధతిలో కూర్చి రూపొందించిన పుస్తకం. ఇది కామ్రేడ్ బసవపున్నయ్యగారి జీవిత చరిత్రకాదు. ఆయన జీవితకాలంలోని రాజకీయ చరిత్ర. ఆయన జీవిత కాలంలోని సామాజిక చరిత్ర. ఆయన జీవితకాలంలోని కమ్యూనిస్టు చరిత్ర.
– వాసిరెడ్డి , ఆంధ్రభూమి – అక్షర , 25-4-2015.
“నా జ్ఞాపకాలు” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి..
నా జ్ఞాపకాలు on kinige