అక్షరమే ‘ప్రపంచం’గా మారిన వేళ…’మన ప్రపంచం’ పుస్తకంపై సమీక్ష

అంశం ఏదైనా అది అక్షరాల వెలుగులో వ్యాస రూపం ధరిస్తే దాని ప్రభావ తీవ్ర తాకిడే వేరు. మనసుల్ని భావోద్వేగంతో కుదిపేస్తుంది. మనుషుల్ని అమితంగా ఆలోచింపజేసి కలచివేస్తుంది. ఈ వేదనకు మూలం వర్తమాన ప్రపంచాన్ని అనుభవంతో కాచి వడబోయడం. సామాజిక వ్యవస్థలోని సంఘర్షణల్ని ఉక్కపోత రూపంలో ఆరబెట్టడం. అలా చెలరేగిన కఠోర వాస్తవ దృశ్యరూపాల మంటలే జీవన సత్యాలుగా ఊపిరిపోసుకుంటాయి. ఇలాంటి సందర్భకోణాల్లోంచి చిత్రికపట్టిన శీర్షికా వ్యాసాల కలబోత నేపథ్యమే ఈ పుస్తక పరిచయ ముఖ చిత్రమైంది. దీని రచయిత దుప్పల రవికుమార్. వ్యాస రచనలో చెయ్యి తిరిగి అనుభవశాలి. ‘సత్యం’ సాయంకాల దినపత్రికలో రెండేళ్ళపాటు ‘వీక్లీకాలమ్’గా ధారావాహికంగా ప్రచురింపబడిన వ్యాస సంకలనమే ఈ ‘‘మన ప్రపంచం’’అనే వ్యాఖ్యాన పుస్తకం. కళింగాంధ్ర గుండె చప్పుడుగా అభివర్ణించే ఈ అక్షర లక్షల సముదాయాన్ని సిక్కోలు బుక్‌ట్రస్ట్ తొలి ప్రచురణగా జనం మధ్యకు దీనిని తీసుకొచ్చి పరిచయం చేసింది. ఈ ప్రయత్నంలో భాగంగా రవికుమార్‌గారు చేసిన అక్షర కృషి అంతాఇంతా కాదు. నైతిక విలువలు సమూలంగా అంతరించిపోతున్న సామాజిక వ్యవస్థలో ఒక లక్ష్యానికి కట్టుబడి నిలబడటం అంత తేలిక్కాదు. వృత్తి- ప్రవృత్తిరీత్యా నిబద్ధతను పాటిస్తూ తట్టుకొని ఏటికి ఎదురీదడం సాధారణ విషయం కాదు. చేసే పనిలో విషయముంటేనే అది సాధ్యపడుతుంది. అది రవికుమార్ లాంటి అరుదైన వ్యక్తులకు మాత్రమే రచయితగా చెల్లుతుంది.
మొత్తం 59 వ్యాసాలున్న ఈ సంకలనంలో రవికుమార్‌గారు స్పృశించని అంశంలేదు. సంఘర్షించని సందర్భక్షణం లేదు. చూసి స్పందించని దృశ్యం లేదు. అంతా ఒక ప్రణాళికాబద్ధంగా, వడపోతతో విశే్లణాత్మకంగా సమస్తాన్ని కళ్ళకి కట్టించే ప్రయత్నం చేశారు. అవసరమైనచోట చురుకైన వాతలు పెట్టారు. నిరంతర మెలకువతో చైతన్యపరిచి అంతర్లీనంగా ఉత్తేజితుల్ని చేశారు. ‘వాళ్లంతే’ శీర్షికా వ్యాసంలో ‘‘కేవలం రూపాయి నలిపి వాసన చూపిస్తే మనశ్శరీరాలు అప్పగించే నేటి తరపు జర్నలిస్టుల దౌర్బల్యాన్ని భరించి తీరాలని’’ పత్రికాముఖంగా రచయిత బాహాటంగా ప్రకటించినపుడు రవికుమార్‌లోని అంతర్విముఖత అతనిలోని ‘గట్స్’ని తేటతెల్లపరుస్తుంది.
ఆధ్యాత్మిక గురువులు సచ్చిదానంద, చినజియర్ స్వామి, రవిశంకర్ లాంటి వాళ్ళను ఉదాహరిస్తారు. పాలక-సంపన్న వర్గాలకు వ్యతిరేకంగా గొంతెత్తి, ఆదివాసుల పక్షాన హక్కులకోసం పోరాటం సలిపి, గుజరాత్ మారణకాండ బాధితుల తరఫున కొమ్ముకాసి నిలబడ్డ బాబాలెంతమంది ఉన్నారని నిలదీస్తారు. ఈ నిబద్ధత వెనుక నిక్కచ్చితనం ప్రతిబింబిస్తుంది. కాకరాపల్లి, సోంపేట వద్ద జరిపిన ప్రజాపోరాటాల స్ఫూర్తిని చైతన్యవాహికగా ప్రవహింపజెయ్యడంలో అందెవేసినతనం కనిపిస్తుంది. అభివృద్ధిపేరుతో ప్రభుత్వం ఆడుతున్న జూదం థర్మల్ విద్యుత్ కేంద్రాలతో ధర్మాన మూటగట్టుకున్న అపఖ్యాతిని బట్టబయలు చేస్తారు. ఉన్నదున్నట్టుగా కుండబద్దలుకొట్టి నిజాల్ని నిర్భయంగా వెల్లడిచేయడం ఇతని సహజ నైజాన్ని అద్దంపట్టిస్తుంది. పేదాగొప్పల మధ్య తారతమ్యాన్ని ఆర్థిక అసమానత్వం ద్వారా చాటిచెప్పే ప్రయత్నంచేస్తారు రచయిత.
రాజ్యాలను కూల్చడంలో అమెరికా పాశవిక చర్యలను వ్యాసంలో ఎండగడతారు. ఉగ్రవాదం, కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చెయ్యడం, నిరుద్యోగం, పేదరికం లాంటి అంశాలకు జవాబుదారీతనం వహించాల్సి రావడాన్ని గుర్తుచేస్తారు. భాజపా, కాంగ్రెస్, టిడిపి, తెరాస, లోక్‌సత్తాల వైఖరిని ప్రస్ఫుటంగా ప్రతిఫలింపజేస్తారు. మద్యం సిండికేట్, కాంట్రాక్టింగ్, కోస్టల్ కారిడార్, బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు, గ్రానైట్ అక్రమ తరలింపు చర్యలు, మత్స్యసంపదల గురించి పూసగుచ్చినట్టు కళ్ళకు కట్టిస్తారు. దేశవ్యాప్త కుంభకోణాలకు అక్షర రూపమిస్తారు. వ్యాపార-మావోయిస్టు వర్గాల కార్యకలాపాలతో ప్రభుత్వ పాలనపై కొరడా ఝుళిపిస్తారు. ప్రపంచీకరణ మనిషిజంపై ఎలాంటి మార్పులను తీసుకొచ్చిందో- నైజీరియన్ రచయిత చినువా అచ్‌బె మాటల్లో వివరిస్తారు. పరారుూకరణ తీరును వ్యక్తీకరిస్తారు. వస్తు సంస్కృతి మోజులో వర్తమాన ప్రపంచ పోకడల తీరును హృద్యంగా ఆవిష్కరిస్తారు. మాతృభాష సంరక్షణోద్యమం ఆవశ్యకతను అంతర్లీనంగా నొక్కిచెబుతారు. శ్రీకాకుళ విప్లవ పోరాటస్ఫూర్తినీ, కథానిలయం ప్రాముఖ్యతనీ ప్రస్తావిస్తారు.
ఇంకా ప్రముఖుల పుస్తక రచనల గురించి వివరణ సాల్మన్ రష్డీ, తస్లీమా నస్రీన్, రెజాఅస్లాన్, వెండీ డోనిగర్, జితేందర్ భార్గవ, హమీష్ మెక్ డోనాల్డ్‌లతో పూర్తిచేస్తారు వ్యాసకర్త రవికుమార్. ఆంధ్రా- తెలంగాణాలు విడిపోయిన సందర్భాన్ని చారిత్రాత్మక ఘట్టంగాకాక, ఆలోచనాత్మకంగా విశ్లేషించుకోవాల్సిన తీరుతో మన మేథస్సుకు పదును పెడతారు.
అర్థశాస్త్రంలోని కౌటిల్యుడి మాటగా మనకు ఉద్బోధిస్తారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇందులో ఇంకా ఊహకి అందని ప్రశ్నలు, ప్రస్తావించని సందర్భాలు కోకొల్లలుగా మిగిలిపోయాయి. వీటి మూలాల లోతుల్లోకి వెళ్లగలిగితే కంటికి కనిపించని అట్టడుగు చీకటి కోణాలు ఎన్నో బయల్పడే అవకాశముంది. ఈ రచయిత లోచూపుకీ, దిశానిర్దేశత్వానికీ భవిష్యత్తు ఆశావహ దృక్పథంగా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి కనిపించదు. భిన్న కోణాల్లో వ్యాసాలు రాయడంలో ఆరితేరిన దుప్పల రవికుమార్‌గారి సునిశిత పరిశీలనా దృష్టికి, విశ్లేషణా సామర్థ్యానికి ఎలాంటివారైనా దాసోహం పలకాల్సిందే. ఈ పుస్తకాన్ని చదివిన వారందరికి ఆ రకమైన అనుభవం అనుభూతిగా మిగిలిపోతుంది. సులభశైలిలో సరళ భాషలో రాయడంవలన అటు పాఠకుల మెప్పునూ, ఇటు విమర్శకుల ప్రశంసలనూ సమపాళ్ళలో అందుకోగలిగారు రచయిత.

–  రాజా, ఆంధ్రభూమి-అక్షర, 14/03/2015.

మన ప్రపంచం” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి..

మన ప్రపంచం on kinige

ManaPrapamcham600

 

Related Posts:

అతివ అంతరంగ మథనం – “అన్వేషణ” నవలపై సమీక్ష

మనిషి జీవిస్తున్నాడా? లేక జీవిస్తున్నానని భ్రమలో ఉన్నాడా? అనే ఒక సందిగ్ధం ఈరోజుది కాదు. పురాణాల నుండి వస్తున్నదే! ఐతే- ఆ మాట నిర్భయంగా నేడు అంటున్నారు. అనుకుంటూనే ఆలోచిస్తున్నారు. గంటి భానుమతి రచించిన ‘‘అన్వేషణ’’ నవలలో నిజంగా మానవ జీవితంలోని అనేక కోణాలను అన్వేషించారు. అందరికీ తెలిసిన సమాధానాలపై ఎదురు తిరిగారు. తెలియని ప్రశ్నలను సంధించారు. ఈ 21వ శతాబ్దంలో కూడా ఇంకా అత్తింట్లో ఆవేదనలు, భర్త మూలంగా అవమానాలు, అనుమానాలు ఎదుర్కొంటున్న నేటి సమాజపు దుస్థితిని అభివర్ణించిన తీరు ఎంతో ఆకట్టుకుంది. అసలు స్త్రీ సంఘానికి భయపడాలా? లేక తన మనస్సాక్షికి భయపడాలా? అంటే నా ధోరణిలో మనస్సాక్షికే ఎక్కువ మార్కులు వేస్తాను. సంఘం అనేది గాలివాటుకు ఎగిరిపడుతున్న ఎండుటాకు లాంటిది. అదిగో అని చూపితే కనిపించకున్నా, అవును నాకూ కనిపించింది అంటూ ఎదుటిమనిషిని మరింత నిర్వీర్యం చేస్తుంది. కానీ మన మనస్సాక్షికి తెలుస్తుంది మనమేంటి? మనం జీవిస్తున్న విధానం ఏమిటి? అని. ఒక స్ర్తి అయినా, పురుషుడైనా మనస్సాక్షి ముందు తలెత్తుకుంటే చాలు గెలిచినట్లే..
అసలు  స్త్రీ అంటేనే ఒక కుటుంబం. స్త్రీ లేనిదే కుటుంబాలు ఎంతగా వెలవెలపోతుంటాయో మనం గమనిస్తూనే ఉంటాం. ఈ నవలలో విజయ అనే పాత్ర ఎన్నో సందిగ్ధాల మధ్య సతమతమవుతూ తన జీవితం అలా ఎందుకు ఒంటరి అయిపోయిందనే విషయంపై అన్వేషణ కొనసాగిస్తుంది. అలాంటి సమయంలో తనను ప్రేమించిన వ్యక్తి కూడా తల్లిదండ్రులు ఎవరో తెలియకుంటే పెళ్ళిచేసుకోవడం కష్టమని అనడం విజయను మరింత బాధిస్తుంది. పెళ్ళికి యువతి కావాలా? యువతికి యువకుడు ఉంటే చాలదా? అంటే చాలదు. ప్రేమకు ఇద్దరు చాలు పెళ్లికి మాత్రం రెండు కుటుంబాలు కావాలి అనే మాట విన్నాం. అయితే కుటుంబం ఎందుకు? అంటే మాత్రం రాబోయే తరాలకు ఒక చరిత్ర కావాలి. నాన్న అమ్మ ఎలాగో, అమ్మమ్మ, తాత, పెదనాన్న, చిన్నాన్న పిన్ని అత్త లాంటి వరసలన్నీ ఎంతో కావాలి. వారందరూ మనకంటూ ఏమీ చేయకపోవచ్చు. కానీ ఉన్నారనే ఆశ ముందుకు నడిపిస్తుంది. తల్లిదండ్రులు పునాదులైతే నా అన్నవాళ్ళు మూలస్తంభాలు. ఆ విషయమే ఈ నవలలో కనిపిస్తుంది.
గంటి భానుమతి ఎంతో సున్నిత హృదయులు. వీరిలోని నొప్పించేతత్వం లేని తనమే ఈ నవలకు పునాది అయింది. కారణం ఈ నవలలో మరీ బాధించే పాత్రలు చూపలేదు. కాలానుగుణంగా మనిషి తత్వం మారుతుందే తప్ప ఎవరూ చెడ్డవారు కారనే తత్వాన్ని తెలియజేసిన తీరు కడు రమణీయం. కాకుంటే మనుషుల్లో ఏదో ఒకటి కావాలని బాధ, ఉంటే ఎవరికి చెందుతుందో అనే బాధ, ఆస్తుల పంపకాలు, అక్కచెల్లెళ్ళ పోరాటాలు, రక్తసంబంధీకుల సమస్యలు చదువుతుంటే ఒకటుంటేఒకటిలేదనే తత్వంతో మనుషులు ఎదగలేకపోతున్నారా అనిపించక మానదు. అదే విషయం విజయ జీవితంలో కనిపిస్తుంది. తండ్రి వచ్చినా, అమ్మమ్మ, తాతయ్యలు ఉన్నా ఆస్తుల పంపకాలలో అనేక చేదుకోణాలను చూస్తుంది. పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకున్న విజయ తల్లిని అన్వేషించడం మాత్రం ఆపలేదు. చివరకు తన తల్లి అత్యాచారానికి గురై చేయూతనిచ్చేవారు ఉన్నా అందుకోలేక, సమాజానికి ముఖం చూపించలేక మరింతగా కుంగిపోయి తన జీవితాన్ని పోగొట్టుకుందనే నిజాన్ని తెలుసుకుని కుమిలిపోతుంది. మరో వివాహం చేసుకుని వారి ద్వారా కూడా బిడ్డలున్నా వారి నుండి ఆదరణ లభించకపోవడంతో మొదటి భార్య కన్నబిడ్డ విజయ తండ్రిని తానే కొడుకై ఆదరిస్తుంది. తల్లిదండ్రులు ఎలాంటివారైనా అనుబంధం ముందు ఓడిపోక తప్పదని నిరూపిస్తుంది.
మనిషి జీవితంలోని మార్పుచేర్పులకు సమాజమే కారణం అయితే, వ్యక్తిగా తనను తాను గమనించుకునే స్థితికి మనిషి ఎపుడు చేరుకుంటాడు? అదే స్త్రీ అయితే తన పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలను సంధించి సరికొత్త సమాధానాన్ని అందించిన తీరులో సాగిన వైనం మనల్ని ఆద్యంతం అలరిస్తుంది. వ్యక్తిత్వం అనేది ఒక స్ర్తికి సంబంధించింది అనడం కంటే వ్యక్తిత్వం ప్రతి వ్యక్తికి సంబంధించింది అని ముగించి ఉంటే మరింత బావుండేదనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రశ్నగా స్త్రీ నిలబడినంతకాలం సమాజం తనకిష్టమైన సమాధానాలు చెబుతూనే ఉంటుంది. తానే ఒక సమాధానమైన రోజు ప్రశ్నలన్నీ ఏమవుతాయి? ఆలోచించాలి…!

-ఎస్.ఎం. అక్షర, ఆంధ్రభూమి, 21/06/2014

***

అన్వేషణ”నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

అన్వేషణ on kinige

Related Posts:

నా యెఱుక – శ్రీ ఆదిభట్ల నారాయణదాసు స్వీయ చరిత్ర పై సమీక్ష

‘కథ’ యెఱుక గలిగినవాడి కథ – అనే శీర్షికతో ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితమైన సమీక్ష ఇది.
హరికథ అనగానే మనకందరికీ జ్ఞప్తికి వచ్చేది ఆదిభట్ల నారాయణదాసుగారి పేరే. పూర్తి పేరు అజ్జాడ ఆదిభట్ట(ట్ల) నారాయణదాసు (1864-1945). దాసుగారు నవరస భరితమైన నవ హరికథా ప్రక్రియకు ఆద్యులు. దాసుగారి కన్నా ముందు ఎందరో హరికథలు చెప్పారు. కానీ, అపర శారదాదేవిగా పేరొందిన దాసుగారితో హరికథకే గొప్ప గుర్తింపు వచ్చిందనడంలో సందేహం లేదు. నా యెఱుక అనేది దాసుగారి స్వీయ చరిత్ర. ఇది లోగడ పుస్తక రూపం దాల్చి ప్రచురించబడినా, నేడు అందుబాటులో లేని కారణంగా గుంటూరు మిత్రమండలి వారు ఎంతో సాహసం చేసి మళ్లీ వెలుగులోకి తెచ్చారు. దాసుగారు రచించిన వారి యెఱుక 7 అధ్యాయాలు కాగా, పానుగంటివారు, చెళ్లపిళ్లవారు, దువ్వూరి శాస్ర్తీగారు, శంకర రామారావుగారు, పాతూరిగారు దాసుగారిపై వ్రాసిన వ్యాసాలూ పాఠకులకు ఎంతో విలువైన సమాచారాన్నిస్తాయి.
‘సుందర రూపము దృష్టికి, సంగీతమూ చెవికి, సువాసన ఘ్రాణమునకు, సుస్పర్శము శరీరమునకూ, మంచి చవి జిహ్వకు నభీష్టములు కదా!’ అన్నారు దాసుగారు. ఇవన్నీ వేర్వేరుగా అనుభవించే సుఖాలు. ఐతే, దాసుగారి సమక్షంలో అన్నీ ఒకేసారి అనుభవంలోకి వచ్చేవట. వారి జీవితంలో లోక సామాన్యమైన తీరూ, అలౌకికమైన అద్భుత శక్తీ మిళితమై ఉండేది కాబట్టే, గాంధర్వ గానామృతపేయంగా హరికథలు చెప్పగలిగారు. దాసుగారిలో అసాధారణ శక్తులుండేవి. అవన్నీ స్వభావసిద్ధంగా వచ్చినవే. దానికోసం ఆయన గురుశిక్షణ ఏదీ పొందలేదు. ఆట, పాట, ఆశుధార, అసాధారణ పాండిత్యం- వీటన్నిటినీ మించిన ధైర్యం దాసుగారి ఖ్యాతికి కారణాలు. సంగీత సాహిత్యాలూ, వేదమూ వారి కుల విద్యలు. మిగిలినవన్నీ ఆయన అశ్రమంగా నేర్చుకున్నవే. దేశీ సంగీతంతోబాటు ఆయనకు మార్గ సంగీతమూ కొట్టిన పిండే. హిందూస్థానీ సంగీతాన్ని సైతం అలవోకగా పాడేవారాయన. ఈ స్వీయ చరిత్రను గ్రాంథికంలోనే వ్రాసినా ఇప్పటికీ చదవడానికి ఇబ్బందిగా లేకపోవడం గమనార్హం.
అసలు హరికథలు ఎందుకు చెప్పాలని దాసుగారికి అనిపించిందో తెలియాలంటే 27, 93 పేజీల్లో దాసుగారే చెప్పడాన్ని మనం చదివి తెలుసుకోవచ్చు. అంబరీషోపాఖ్యానం ఏకబిగిన రచించి, గానం చేసిన రీతి దాసుగారి ప్రతిభకొక ఉదాహరణ మాత్రమే (పేజీ 101). దాసుగారు ఒకసారి విక్రమోర్వశీయం నాటకంలో రాజు పాత్ర వేసి అందరినీ ఆకట్టుకున్నారట (పేజీ 122). దాసుగారి కవితాశక్తి పరీక్ష, విజయం పొందిన రీతి గురించి చదివితే పాఠకులకు ఆశ్చర్యం కలగక మానదు (పేజీ 123). అలాగే, దాసుగారి క్లాస్‌మేట్స్ గురించి, విద్యాభ్యాసం గురించి వ్రాసిన అంశాలు పాఠకులను అలరిస్తాయి.
దాసుగారికి వ్యవహారిక భాష అన్నా, వితంతు వివాహాలన్నా గిట్టేది కాదు. తెలుగులో ఏమి వ్రాసినా గ్రాంథికంలోనే ఉండాలన్నది దాసుగారి అభిప్రాయం. బహుశా దీనివల్లనే దాసుగారికి వీరేశలింగం పంతులుకి వైషమ్యమేర్పడిందిలా ఉంది. దాసుగారు నా యెఱుక పేరుతో స్వీయ చరిత్ర వ్రాస్తున్నారని తెలుసుకొన్న వీరేశలింగం, ఆయనకన్నా ముందుండాలని తన స్వీయచరిత్ర వ్రాసి ప్రచురించారట. ఈ స్వీయ చరిత్రలో వీరేశలింగంతో జరిగిన మరో సంఘటనను దాసుగారు వ్రాసుకున్నారు. దానికి వీరేశలింగం పేరును ప్రస్తావించకుండా విచిత్ర వివాహకర్త విచిత్ర రచన అని చెప్పారు. ఈసప్ ఫేబిల్స్ (ఈసప్ కథలు) లో కొన్నిటిని తెలుగు చేయమని దాసుగారిని భీముడు అనే ఆయన బావగారు కోరగా, దాసుగారు 100 కథలను తెనిగించి, చివరన 4 పాదాలలో కథనీ, నీతిని ఇమిడ్చి గీతాలను నూఱుంగంటి అనే పేరుతో వ్రాశారు దాసుగారు. దానిని భీముడు వీరేశలింగం ప్రెస్‌లో ముద్రణకు ఇవ్వగా ఆయన ఆ పుస్తకాన్ని వెలుగులోకి రానీకుండా అదే తీరులో తాను వ్రాసి ఈసప్ కథలను ప్రచురించుకొన్నాడట (పేజీ 144- గొప్పవాళ్లుగా చెలామణి కావాలంటే ఆ మాత్రం చేయాలేమో?). మరో సందర్భంలో ఆయన హరికథలను చిన్నబుచ్చి మాట్లాడగా, దాసుగారు సరైన రీతిలో సమాధానాన్నివ్వడం కూడా మనం చదవొచ్చు (పేజీ 161).
మహారాజుల సమక్షంలో ఎన్నో హరికథలు చెప్పినా ఎవరికీ చేతులు జోడించడం గానీ, వారిని ‘యువర్ హైనెస్స్’అని గానీ ఎరుగని ధైర్యశాలి ఆయన. ఆ ఆత్మవిశ్వాసమే ఆయన్ని నడిపించింది. దేశ విదేశాల్లో విస్తృతంగా పర్యటించి హరికథలు చెప్పి మెప్పించిన దాసుగారు అవసరమైనపుడు ఇంగ్లీషు వివరణలనీ ఇచ్చేవారు. అంతేకాదు. టికెట్టు పెట్టి అష్టావధానం జరిపిన ఘనత దాసుగారిది (పేజీ 134). అన్నట్టు, దాసుగారి ఇంగ్లీష్, తెలుగు సంతకాలనూ ఈ పుస్తకంలో చూడొచ్చు (పేజీ 170). ఇక అనుబంధంలో హరికథ గురించి దాసుగారు స్వయంగా వ్రాసిన వ్యాసం అందరూ చదవాల్సిందే. వారు 70 ఏళ్ల వయస్సులో సంక్షిప్తంగా నామాట అనే శీర్షికన వ్రాసిన స్వీయచరిత్ర ద్విపద కూడా ఈ పుస్తకంలో చోటుచేసుకుంది (పేజీ 207). దాసుగారి పాండితీ వైభవాన్ని తెలిసిన రాజుగారు దాసుగారు పాడగా గ్రామఫోను రికార్డుచేశారు (పేజీ 188), కానీ అది మనకు దక్కకపోవడం నిజంగా విషాదకరం.
ఇంతకీ దాసుగారి నా యెఱుక ఎందుకు చదవాలి అని అడిగేవారికి జవాబు ఒక్కటే. ఆ కాలంలో చేతిలో పావలా లేకపోతే పెద్ద చదువులు చదవలేక ఎలాటి బాధపడాల్సి వచ్చేదో తెల్సుకోవాలన్నా వారి బాల్య యవ్వన దశల సంధికాలంలో అధ్యయన రీతుల్లోనూ, సంప్రదాయ నిరతిలోనూ వచ్చిన పెను మార్పులేమిటో తెల్సుకోవాలన్నా నా యెఱుక చదవాలి. అంతేకాదు. లోకంలో అనుకూల శత్రువులు, కృత్రిమ స్వభావులు మోసాలకెలా పాల్పడతారో తెల్సుకోవాలన్నా నా యెఱుక చదవాలి. అలనాటి అచ్చతెనుగు పద ప్రయోగాలను ఆస్వాదించాలన్నా కూడా నా యెఱుకను తప్పక చదవాలి. ఒకటి కాదు, రెండు కాదు. ముప్ఫైఏళ్ళ దక్షిణాపథ చారిత్రక, సాంస్కృతిక విషయాలనన్నిటినో నా యెఱుక చెబుతుంది. అంతేకాదు. దాసుగారి జీవనశైలిని తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఇతోధికంగా ఉపకరిస్తుంది.
చక్కని ముద్రణ, సందర్భోచితంగా దొరికిన మేరకు ఛాయాచిత్రాలు, ఈ తరం వారికి ఇబ్బందిలేకుండా వివరణనిస్తూ ఫుట్‌నోట్స్- అన్నీ ఈ పుస్తకానికి సంపాదకులైన రవికృష్ణగారెంత శ్రమించారో చెప్పకనే చెబుతాయి. అలాగే గిరిధర్‌గౌడ్‌గారు వేసిన దాసుగారి ముఖచిత్రం పుస్తకానికి నిండుదనాన్నిచ్చింది. అట్టవెనక, కరుణశ్రీ పద్యం దాసుగారి గొప్పదనాన్ని గురించి చెప్పకనే చెబుతుంది. డిటిపి కాలంలో కూడా తప్పొప్పుల పట్టిక ఇవ్వడం విచిత్రంగా తోచినా, అది సంపాదకుల చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.
నా యెఱుక- తొలి ముద్రణ ఎపుడు వచ్చింది, ఆ పుస్తకం తాలూకు ముందుమాట, కవర్ పేజీ వంటి వాటికి కూడా ఈ పుస్తకంలో కాస్త చోటు ఇచ్చివుంటే బాగుండేది. అలాగే, దాసుగారి పూర్తి బయోడేటాను తొలి పుటల్లో ఇచ్చి ఉండాల్సింది. వారి కుటుంబం గురించిన ప్రస్తావన ఎక్కడా రాలేదు. అటు దాసుగారూ ప్రస్తావించలేదు. సంపాదకులవారూ ఏమీ చెప్పలేదు. దాసుగారు దాదాపు డజను హరికథలను రచించి, గానం చేశారు. అవి ప్రస్తుతం అందుబాటులో లేవనే చెప్పాలి. ఈ పుస్తకం మనవి మాటల్లో చెప్పినట్లు, దాసుగారి హరికథలను కొద్దిపాటి వ్యాఖ్యానంతోనైనా సరే తిరిగి అన్నిటినీ ఒక సంకలనంగా వెలుగులోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వీక్యూబ్ రమణ
అక్షర, ఆదివారం ఆంధ్రభూమి, 23 సెప్టెంబర్ 2012

* * *

“నా యెఱుక” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా తక్కువ ధరకి ప్రింట్ పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
నా యెఱుక On Kinige

Related Posts:

జీవన వైవిధ్యం

కేకలతూరి క్రిష్ణయ్య రచించిన “జీవన వైవిధ్యం” అనే పుస్తకం పై ” ‘సందేశాత్మక’ వాస్తవిక రచన” అనే శీర్షికతో 29/01/2012 నాటి ఆంధ్రభూమి దినపత్రిక అక్షర పేజీలో ద్వా.నా.శాస్ర్తి సమీక్ష ప్రచురితమైంది.

రచనా ప్రపంచం విలక్షణమైనదని, వైవిధ్యమే రచనకి వన్నె తెస్తుందని సమీక్షకులు వ్యాఖ్యానించారు. మానవ జీవిత విధానాలపై, వ్యక్తిత్వ వికాసంపై అనేక పుస్తకాలు వచ్చాయని, ఎవరి ధోరణి వారిదేన్ని, అన్ని ధోరణులూ మంచి జీవితం కోసమే, మంచి సమాజం కోసమేనని అంటారు సమీక్షకులు. ప్రాచీన కాలంనుంచి ఋషులు, తత్వవేత్తలు, కవులు తపనపడింది దీనికోసమేనని, కేకలతూరి క్రిష్ణయ్య తపన కూడా ఇదేనని ద్వా.నా.శాస్ర్తి పేర్కొన్నారు. మానవ జీవితాలు ఎలా వుంటున్నాయో, ఎలా వుండకూడదో, ఎలా వుండాలో వివరించే పుస్తకం ‘జీవన వైవిధ్యం’ అని ఆయన అన్నారు.

క్రిష్ణయ్య చిన్న స్థాయినుంచి ఇంజనీర్ స్థాయికి ఎదిగారని. దేశ విదేశాలలో ఎన్నో ప్రాజెక్టులు పూర్తిచేశారని, ఏడు పదుల పైబడిన వీరు తమ జీవితానుభవాలను- విన్నవి, కన్నవి- ఆకళింపుచేసుకొని రసగుళికలుగా ‘‘జీవన వైవిధ్యం’’అనే పుస్తకం అందించారని సమీక్షకులు తెలిపారు. ఈ పుస్తకంలో 75 అంశాలపై వ్యాసాలున్నాయి.

ఈ పుస్తకం విశిష్టత గురించి చెబుతూ – ఈ పుస్తకం వాస్తవ జీవితాల కథనం అని, జరిగిన సంఘటనలే ఈ పుస్తకానికి ఆధారాలని పేర్కొన్నారు.

పూర్తి సమీక్షని చదవడానికి ఈ లింక్‍ని అనుసరించండి.

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభ్యమవుతుంది. పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి.

జీవన వైవిధ్యం On Kinige

Related Posts:

‘బ్లాగ్’ వనంలో విరబూసిన జాజి పరిమళాలు

మల్లీశ్వరిగారి ‘‘జాజిమల్లి’’ బ్లాగ్ కథలు పుస్తకం పై ది. 29 జనవరి 2012నాటి ఆంధ్రభూమి దినపత్రిక -అక్షర పేజీలో ” ‘బ్లాగ్’ వనంలో విరబూసిన జాజి పరిమళాలు” అనే శీర్షికతో ఓ సమీక్ష ప్రచురితమైంది.

అందమైన గతానికీ, ప్రస్తుత అయోమయానికీ మధ్య ఒక వారధి కట్టిన కథలేవైనా పాఠకులని సులువుగా ఆకట్టుకుంటాయని సమీక్షకులు సాయి పద్మ మూర్తి అభిప్రాయపడ్డారు. మల్లీశ్వరిగారి ‘‘జాజిమల్లి’’ బ్లాగ్ కథలు అలాంటివేనని అంటూ, ‘‘పెరస్పెక్టివ్’’ ప్రచురణల ద్వారా ప్రచురితమైన ఈ బ్లాగ్ కథలు మనల్ని హడావిడి పెట్టవని, నిశ్శబ్దంగా మన హృదయాల్ని కొల్లగొడతాయని అన్నారు సమీక్షకులు .

ఈ బ్లాగ్ కథలను చదువుతుంటే చెఖోవ్ కథలు గుర్తొస్తాయని, ఒక ఫ్లాష్ లాంటి కొసమెరుపు, చమక్కు ఉండటం వీటి ప్రత్యేకత అని అన్నారు సమీక్షకులు .

మనందరి ఉరుకుల పరుగుల జీవితాల్లో, పెద్ద పెద్ద కథలు చదవటం కష్టం అయిపోతోంది.. బరువైన పుస్తకాల వైపు ఆశగా చూస్తూ.. పుస్తకం సైజు చూసి చదవలేకపోతున్నాం అనే వాళ్ళకి.. గడిచిపోతున్న జీవితాన్ని, మోడువారిపోతున్న ఆశల తోటలకీ, తామే తోటమాలులు ఎలా కావాలో సూటిగా, సరళంగా చెప్తుందీ పుస్తకం అని సమీక్షకులు పేర్కొన్నారు.

పూర్తి సమీక్షని ఈ లింక్‌లో చదవగలరు.

జాజిమల్లి బ్లాగ్ కథలు పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‍‍ని అనుసరించండి.
జాజిమల్లి బ్లాగ్ కథలు On Kinige

Related Posts:

చరిత్ర పరిశోధనల్లో ఘనాపాటి

ప్రముఖ రచయిత, చారిత్రక పరిశోధకుడు అయిన సయ్యద్ నశీర్ అహమ్మద్ గురించి 20 నవంబర్, 2011 నాటి ఆంధ్రభూమి దినపత్రిక లోని “కవులూ.. రచయితలూ” శీర్షికలో సుప్రసిద్ధ విశ్లేషకులు విహారి పరిచయం చేసారు.

పరిశోధన ఒక అసిధారావ్రతమని, అందునా చారిత్రక పరిశోధన మరీ వ్యయప్రయాసలకోర్చినదని విహారి పేర్కొన్నారు. సయ్యద్ నశీర్ అహమ్మద్ రాసిన పుస్తకాలను, చేసిన పరిశోధనల గురించి ఈ వ్యాసంలో విశ్లేషించారు రచయిత.

ఈ వ్యాసం పూర్తి పాఠాన్ని ఈ దిగువ చిత్రంలో చదవగలరు.


సయ్యద్ నశీర్ అహమ్మద్ రాసిన పుస్తకాలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తున్నాయి.

ఈ పుస్తకాలపై తగ్గింపు కూడా ఉంది. వివరాలకు ఈ లింక్ చూడండి.

సయ్యద్ నశీర్ అహమ్మద్ ఈ పుస్తకాలు 25 శాతం తగ్గింపు ధరకు On Kinige

Related Posts: