‘తెలీని రహస్యాలు’ తెలిస్తే అంతా మేలే – మనకే తెలీని మన రహస్యాలు పుస్తకంపై సమీక్ష

అన్ని ప్రశ్నల్లోకి అతి పెద్ద ప్రశ్న ‘నేనెవరు?’ అనేది. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే, ఇంక అడగవలసిన ప్రశ్నలు గాని, తెలుసుకోవలసిన సమాధానాలు గాని వుండవు. ఉపదేశంకోసం తన దగ్గరకు వచ్చిన వాళ్ళతో రమణమహర్షి చెప్పేవారట, ‘ఈ ప్రశ్ననే ఎవరికివారు వేసుకొని సమాధానం వెతుక్కోండి’ అని. ఒక ఉపనిషత్తులో శిష్యుడు అడుగుతాడు. ‘ఏ ఒక్కటి తెలుసుకొంటే బయట కనిపించే ఈ చరాచర ప్రపంచం అంతా తెలుస్తుంది?’ అని. బహుముఖాలుగా, చిత్ర విచిత్రాలుగా భాసిస్తున్న ఈ రంగుల ప్రపంచం తెలుసుకోవటం ఏ ఒక్కరికైనా ఎలా సాధ్యం అంటే తననుతాను తెలుసుకొన్నప్పుడు, ఆత్మజ్ఞానం అలవడినప్పుడు సాధ్యమవుతుంది అనవచ్చు.
మన వేదాంతం అంతా ఇందుకొరకే, అంటే, తానెవరో తాను తెలుసుకొనేందుకే ఉద్దేశించబడింది. ఆ వేదాలు, వేదాంతాలైన ఉపనిషత్తులు వేల ఏండ్ల నాటివి కావటంవల్ల, అప్పటి సాంఘిక పరిస్థితులు ఈనాటి స్థితిగతులకంటే వేరుకావటంవల్ల, జన సామాన్యానికి అవి అందుబాటులోకి రాక, అవి అన్నీ గూఢార్థాలుగా, వేదాంత రహస్యాలుగా వుండిపోయినవి. భావం చెడకుండా వాటిని మళ్ళీ మన భాషలోకి మన పరిస్థితుల కనుగుణంగా మలుచుకోవలసిన అవసరం నేటి కాలానికి ఎంతైనా వుంది.
అలాంటి ప్రయత్నంలో భాగంగానే డాక్టర్ వాసిలి వసంతకుమార్ రాసిన అనేకానేక గ్రంథాలు. వాటిల్లో ‘‘మనసు గెలవాలి’’ గ్రంథంలో మనసు మర్మం విప్పిచెప్పినా, ‘‘77 సాధనా రహస్యాలు’’, ‘‘56 ఆత్మదర్శనాలు’’ గ్రంథాలలో సంఖ్యాపరంగా తాత్వికతను గురించి విశదీకరించినా వారికివారే సాటి అనిపించుకున్నారు.
ప్రస్తుత గ్రంథం ‘మనకే తెలీని మన రహస్యాలు’లో రచయిత ఆ రహస్యాలేమిటో చెప్పి, మనలోమనకే తెలీని ఇన్ని రహస్యాలున్నాయా? అని ఆశ్చర్యపడేట్టు చేశారు. ఒక విధంగా మనం వాస్తవికంగా ఏమిటో తెలిసేట్టు చే శారు. ఏ రహస్యమైనా అది తెలియనంతవరకే రహస్యం. తెలిసిన తరువాత బట్టబయలు. ఆ రహస్యాలు ఏమిటో తెలుసుకోని మనిషి కష్టాల పాలవుతున్నాడు అనీ, తెలుసుకొని, వాటిని అధిగమించి సుఖ జీవితం గడపాలనీ రచయిత కాంక్షిస్తున్నారు.
నిత్యజీవితంలో ఎదురుపడే సంఘటనలను ఆధారంచేసుకొని వెలువరించిన సార్వకాలిక సత్యాలు రచయిత నిశిత పరిశీలనా దృష్టికి మచ్చుతునకలుగా నిలుస్తవి. ఉదాహరణకు:
1. జీవితాన్ని దొర్లించేస్తుంటే ఉప్పగానే వుంటుంది. జీవితాన్ని కదిలించగలిగితే కర్పూరమే అవుతుంది. – పేజీ 19.
2. పడుకోబోయేముందు లెక్కల పద్దులు రాయగలమేకానీ ఏం సాధించామన్నది డైరీకి ఎక్కించాలంటే కలంలో సిరా ఉన్నా
జీవితంలో సారం కనిపించదు. – పేజీ 38.
3. ఇంతకాలం మనం ఇతరులతో పోటీపడుతూ వచ్చాం… ఇప్పటినుండయినా మనతో మనం పోటీ పడగలమా అన్నది ప్రశ్న.
– పేజి 39.
4. ఇతరుల మెప్పుకోసం మన బ్రతుకును దుర్భరం చేసుకోకూడదు. – పేజి 94
5. మనకు మనమే కేంద్రం కావాలన్న ప్రయత్నమే ధ్యానం. – పేజి 132
6. గడప దాటితేనే గదా ప్రపంచం కనిపించేది అన్నట్టుగా మనం కూడా ఎన్నోవిధాల మన గడప దాటాల్సిందే! మన ప్రమేయం లేకుండా మనపై బడ్డ ముసుగులను తొలగించుకుంటూ పోవలసిందే! అప్పుడే మనం సరికొత్తగా కాంతులీనుతాం. – పేజి 138
డాక్టర్ వాసిలి వసంతకుమార్ రచనలన్నీ ఆధునిక ఉపనిషత్తులు అయితే, వాటిల్లో ప్రస్తుత గ్రంథం ‘మనకే తెలీని మన రహస్యాలు’ ఒకటి

-దీవి సుబ్బారావు, అక్షర, ఆంధ్రభూమి, 21/06/2014

మనకే తెలీని మన రహస్యాలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

మనకే తెలీని మన రహస్యాలు on kinige

Related Posts:

స్ఫూర్తిదాయకం.. ‘యోగి’ వ్యక్తిత్వం- “సమ్మాన్యుడు” పుస్తకంపై సమీక్ష

డా.సి.వి.యోగి అనే సంక్షిప్త నామంతో ప్రాచుర్యం సంపాదించిన ప్రతిభావంతుడు డా.చేంబోలు వెంకట యోగిగారి జీవిత చరిత్ర ఈ పుస్తకం.
ఆయన జీవిత విశేషాలను తెలియజేస్తూ ఆయన సమకాలికులు, కుటుంబ సభ్యులు రాసిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ఇవిగాక ఆయనవద్ద చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి.
సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ఆశీస్సులతో వెలువడిన ఈ పుస్తకంలో శ్రీ శివానందమూర్తిగారి ఆధ్యాత్మిక సూక్తులు అసంఖ్యాకంగా ఆంగ్లంలో ప్రచురించారు.
విశ్రాంత ఉపన్యాసకులు యర్రంశెట్టి సత్యారావు పుస్తకానికి రాసిన ప్రస్తావనలో ‘‘డాక్టర్ యోగి జీవనశైలి ఎందరినో కదిలించింది, కరిగించింది. విద్యాదానమే ఆయన అందరికీ అందించిన నిజమైన యోగం. ‘యోగి’ అనే పరమపవిత్ర పదానికి ప్రతీకగా నిలిచారు’’ అన్నారు (పేజి 15).
అనేక మందికి విద్యాదానం చేసిన డా.యోగిగారికి మెట్రిక్యులేషన్ తర్వాత కాలేజిలో చేరి చదువుకొనే అవకాశం లేకుండా పోయింది. ప్రైవేటుగా చదివి హిందీలో ‘సాహిత్యరత్న’ డిగ్రీ సంపాదించారు. కాశీ వెళ్లి హోమియో వైద్యం నేర్చుకొని వచ్చి స్వస్థలం అనకాపల్లిలో హోమియో ప్రాక్టీసు మొదలెట్టారు. రాబడి తక్కువ కావటంతో ట్యూషన్స్ చెప్తుండేవారు.
స్వయంకృషితో పధ్నాలుగు భాషలు నేర్చుకొని పాండిత్యం సంపాదించుకొనగలిగారు. ఇదిగాక బిఎస్సీ, బి.కాం. తదితర డిగ్రీ పుస్తకాలు తెచ్చుకొని అధ్యయనంచేసి ఆ విద్యార్థులకూ ట్యూషన్స్ చెప్పేవారట. చూడటానికి ఇదంతా నమ్మశక్యంగా కనిపించదు. అయితే ఇవన్నీ అక్షర సత్యాలని ఈ పుస్తకంలోని వ్యాసాలు తెలియజేస్తాయి. కారుణ్య భావం, సేవాతత్పరత మొదలైన సద్గుణాలన్నీ ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగమైపోయాయనే సంగతిని వెల్లడించే సంఘటనలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
కాకినాడలో జిల్లా కలెక్టరుతో జరిపిన సంభాషణ (పేజి 66) డాక్టర్ యోగిగారిలో ఉన్న అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సంభాషణకు సంబంధించి పేజి 119లో ఉన్న వివరాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
ఆయనలో అపారమైన విజ్ఞానం ఉండేది. దానికితోడు అద్భుతమైన వ్యక్తిత్వం. అందుకే కాకినాడలో హిందీ లెక్చరర్‌గా పనిచేస్తున్న కాలంలో అనేకమందిని ప్రభావితం చేయగలిగారు.
వారి పెద్ద కుమారుడు సినీ గేయ రచయితగా స్థిరపడ్డ ‘సిరివెనె్నల’ సీతారామశాస్ర్తీ. ఆయన రాసిన పెద్ద వ్యాసం ఒకటి ఈ పుస్తకంలో ఉంది. ఒక తండ్రిగా డా.యోగి ఏ విధంగా ఉండేవారో ఇందులో వివరించారు.
డా.యోగి జీవితకాలం కేవలం నలభై సంవత్సరాలు. అయినా ఆ స్వల్ప వ్యవధిలోనే ఆదర్శవంతమైన జీవితం గడిపి అనేకమందికి మార్గదర్శకులు కాగలిగారు.
సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలు చదివారు. ఉపన్యాసాలివ్వగల స్థాయికి ఎదిగారు. చదివిన వాటిని ఆచరణలోనూ చేసిచూపేవారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నరోజుల్లోనూ ఇతరులకు సహాయం చేయటానికి వెనుకాడేవారు కాదు.
హోమియో వైద్యంలోనూ ఆయన విశేషమైన ప్రతిభ కలిగి ఉన్నారనే సంగతి, ఈ పుస్తకంలో ఇవ్వబడిన కొన్ని కేసురిపోర్టులు చూసినప్పుడు తెలుస్తుంది. మొదట్లో ఫీజు తీసుకున్నారు గానీ, తర్వాత కాలంలో మానేశారట. కారణమేమిటని ఒకరు అడిగినప్పుడు ‘్ఫజు కోసం పేషెంట్సును బాధపెట్టటం ఇష్టం లేదు’ అని జవాబిచ్చారట.
పిల్లలను సహజంగా ఎదగనివ్వాలన్నది వారి ఆలోచన. చదువు పేరుతో పిల్లలను ఒత్తిడికి గురిచెయ్యకూడదని ఆయన తరచూ అంటుండేవారట. కానె్వంటు చదువులు రాజ్యమేలుతున్న ఈ రోజులలో ఇది ఆలోచించవలసిన విషయం.
ఏ సబ్జక్టుకు సంబంధించిన పుస్తకమైనా ఒక్కసారి చదివితే ఆయనకు గుర్తుండిపోయేది. అసాధారణమైన ఆదరణాశక్తికి కారణం ఏమై ఉంటుందని అన్నప్పుడు ‘దైవానుగ్రహం’ అన్నది వారి జవాబు.
ఎవరైనా సనాతన ధర్మానికి సంబంధించిన తప్పుడు విమర్శ చేసినప్పుడు ఆయన సహించేవారు కాదు. తార్కికంగా వాదించి తగిన సమాధానం చెపుతుండేవారట.
ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. విశ్రాంతి నెరుగని జీవితం. సమస్యలు ఎదురైనప్పుడు వెనుకంజవేయటంకన్నా ఎదుర్కొని విజయం సాధించటం మిన్న అని ఆయన జీవిత చరిత్ర తెలుపుతుంది.
నిజాయితీగా జీవించి ‘పరోపకారార్థమిదం శరీరమ్’ అన్న సూక్తిని సార్థకం చేసిన గొప్ప వ్యక్తి డా.యోగి.
పుస్తకంలో చివరి అధ్యాయానికి ‘మహాభినిష్క్రమణం’ అని శీర్షిక ఇవ్వటం సముచితంగా ఉంది.
పుస్తకం ముగింపులో ‘యోగిగారి జీవితం యొక్క ప్రభావం మాతోనే అంతమవకూడదు. ఇంకా ముందు తరాల వారికి కూడ స్ఫూర్తిని ఇవ్వాలనే కాంక్షతో ఆయన కొండంత వ్యక్తిత్వాన్ని చిన్నదర్పణంలో చూపించటానికి ప్రయత్నించాను. నా ప్రయత్నం ఎంతవరకూ సఫలీకృతం అయిందో కాలమే నిర్ణయించాలి’ అన్నారు రచయిత.
వారి ఆకాంక్ష నెరవేరుతుందని ఆశించవచ్చు.

-ఎం.వెంకటేశ్వరశాస్ర్తీ, అక్షర, ఆంధ్రభూమి, 29/03/2014

***

ఈ సమీక్షను ఈనాడు పుస్తక సమీక్ష పేజీలో చదవడానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి

http://www.andhrabhoomi.net/content/yogi

 

 

 

 

 

 

 

 

సమ్మాన్యుడు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

సమ్మాన్యుడు” on kinige

Related Posts:

వస్తు వైవిధ్యంతో అలరించే కథలు – చింతలవలస కథలు

ఈ సంకలనంలోని కథలలో పదహారు ఇంతకు ముందు వేర్వేరు పత్రికలలో ప్రచురించబడినవి. కథలలో వస్తు వైవిధ్యం బాగా ఉంది. కథకు ఒక ప్రయోజనమనేది ఉండాలని రచయిత ఆకాంక్షిస్తున్న వైనం ఈ కథలు సూచిస్తున్నాయి.
సృష్టిలో ప్రతి ప్రాణీ మరొక ప్రాణికి ఆహారంగా మారటంవల్ల ప్రకృతిలో సమతుల్యం ఏర్పడుతుంటుంది. ఈ అంశాన్ని సమాజంలో వర్థిల్లుతున్న అవినీతికి ముడిపెడుతూ చేసిన వ్యంగ్య రచన ‘ఫడ్ చైన్’ ఆసక్తికరంగా ఉంది. అట్టడుగు స్థాయి నుంచి పై స్థాయి వరకు విస్తరించిన అవినీతి సర్వవ్యాపకత్వాన్ని ఈ రచన ఎత్తి చూపుతుంది.
రాజకీయ నాయకుడికి ఎవరి మీదనైనా కోపం వస్తే ఏర్పడే దుష్పరిణామాలు ‘పొడుం డబ్బాలో దోమ’ కథలో కనిపిస్తాయి. ఇదొక మంచి హాస్య రచన.
తెలుగు సినిమాలలో హాస్యం పేరుతో చూపించే వెకిలి చేష్టలనూ, చౌకబారు సంభాషణలనూ విమర్శించటం ‘రంగుల నీడల్లో’ కథలో కనిపిస్తుంది.
కష్టపడకుండా అడ్డదారుల్లో డాక్టరేట్లు సంపాదించుకునే మార్గాల గురించి అప్పుడప్పుడూ పత్రికలలో వార్తలు కనిపిస్తుంటాయి. అయితే అందుకు భిన్నంగా అడవుల్లో త్రాచుపాముల మధ్య తిరుగుతూ పరిశోధన చేస్తున్న రిసెర్చి స్కాలర్ ‘బలిపశువు’ కథలో కనిపిస్తాడు. గిరిజనుల జీవితాలను గురించి కథలో కొన్ని సంగతులున్నాయి.
గిరిజనుల జీవన శైలిని గురించి తెలిపే మరో కథ ‘ఒడిశాల’. మారుమూల గిరిజన ప్రాంతంలో ప్రభుత్వం వారు పెట్టిన ఏకోపాధ్యాయ పాఠశాల ముచ్చట్లు ఈ కథలో కనిపిస్తాయి.
దేని గురించైనా భయపడుతున్న వాళ్లకు, ఆ భయానికి కారణమైన దాని గురించి విశే్లషించి చెప్పినప్పుడు, ఆ భయం పోతుందనే సంగతిని ‘సానుభూతి పాలు’ కథ తెలియజేస్తుంది.
పాడి పరిశ్రమ, పాలసేకరణ కేంద్రాలు మొదలైన అంశాలతో మరికొన్ని కథలున్నాయి. రైల్వే ఉద్యోగుల గురించి ‘రైల్ వేపాకు’ కథలో కొన్ని విశేషాలున్నాయి. బాధ్యతా రాహిత్యంతో పని చేయటంవల్ల కష్టాలను కొని తెచ్చుకోవటమే అవుతుందనే సందేశం ఈ కథలో ఉంది. మూఢ విశ్వాలాను కూడ ఏదైనా మంచి పనికి ఉపయోగించుకొనవచ్చని ‘చెంచు మంత్రం’ కథ తెలుపుతుంది. మొత్తం మీద చూసినప్పుడు ఈ పుస్తకంలోని కథలలో కొన్ని అనవసరంగా సాగదీసి నట్లున్నాయి. అలాగే అర్థం చేసుకోవటానికి కష్టపడవలసిన సందర్భాలు కూడా అక్కడక్కడా కనిపిస్తాయి.

-ఎం.వెంకటేశ్వర శాస్త్రి, అక్షర, ఆంధ్రభూమి, 15/03/2014

ఈ ఆర్టికల్ ని ఆంధ్రభూమి పేపర్‌లో చదవడం కొరకు ఈ క్రింద లింక్ క్లిక్ చేయండి.
http://www.andhrabhoomi.net/content/chintalavalasa

 

 

 

 

 

 

 

చింతలవలస కథలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.

***

చింతలవలస కథలు on Kinige

 

Related Posts:

బిగి సడలని ‘సస్పెన్స్’

పట్టు సడలని ‘బిగి’తో, ఆద్యంతం ఉత్కంఠ కలిగించే ‘క్రైమ్’ కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఒకప్పుడు ‘డిటెక్టివ్ సాహిత్యం’ తెలుగు పాఠకులను ఉర్రూతలూగించింది. ఇటీవలి కాలంలో క్రైమ్ కథాంశాలతో ‘డిటెక్టివ్ సాహిత్యం’లో కృషి చేస్తున్న రచయితల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ క్రైమ్ కథలకు ఆదరణ పూర్తిగా అంతరించిపోలేదు. కొన్ని పత్రికలు ఇప్పటికీ కొన్ని పేజీలను క్రైమ్ కథలకు ప్ర త్యేకించడం చూస్తున్నాం. పలు టీవీ చానళ్లు కూడా యథార్థ సంఘటనలతో రూపొందించే క్రైమ్ కథలను ప్రసారం చేస్తున్నాయి. ఇ లాంటి కథనాలకు సంబంధించి పేర్లు, పాత్రలు, స్థలాలు మొదలైనవన్నీ కల్పితమని, ఎవరినీ ఉద్దేశించి రాసినవి కావని ‘క్రైమ్’ కథా రచయితలు చెప్పడం ఆనవాయితీ అయనా, వీటిలో చాలావరకూ మన చుట్టూ ఉన్న సమాజం నుంచి వచ్చినవే. ఈ కథలు చదవడానికి ఉత్కంఠ భరితంగా ఉండడమే కాదు, నేరాలకు నేపథ్యం ఏ మిటి? ఏ కారణంగా కొందరు నేరస్థులవుతున్నారు? అనే విషయాలపై కూడా పాఠకులకు అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఇక, క్రైమ్ కథలు రాసే రచయితలపై ఆంగ్ల సాహిత్య ప్రభావం సహజంగా ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా ఉంది. తెలుగు భాషలో అద్భుత శైలితో స్వతంత్రంగా నేరగాథలను ఆవిష్కరించే రచయితల సంఖ్య తక్కువే. ఈ లోటును రేణిగుంట ఉత్తమ్ కొంతవరకూ తీర్చారనే చెప్పాలి. ‘థ్రిల్లర్స్’ పేరిట ఆయన రాసిన పది కథలూ పాఠకుల్లో ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తిస్తాయి. కథ నిడివి చిన్నదైనా, పెద్దదైనా ‘సస్పెన్స్’ ఒక్కటే రచయిత ప్రతిభకు గీటురాయి వంటిది. కథనాన్ని అనేక మలుపులు తిప్పుతూ, పాఠకుడి చేత ఏకబిగిన చదివించే లక్షణం ఉత్తమ్ రచనల్లో కనిపిస్తుంది. ‘థ్రిల్లర్స్’లో ‘ద్రోహం’, ‘విషకన్య’, ‘అతడు’, ‘ముసురు’, ‘ద ప్లాన్’ తదితర కథలు దేనికదే వైవిధ్యంతో కనిపిస్తాయి. కొన్ని కథల్లో ముగింపును మనం అంత సులువుగా ఊహించలేం. ప్రేమ, డబ్బు, విలన్లు, తుపాకులు, పోలీసులు.. వీటితో పాటు ‘ఆత్మ’లకూ క్రైమ్ కథల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ‘67 నిముషాల తర్వాత’ కథలో- రాత్రి వేళ రైలు దిగిన ఓ ఒంటరి అమ్మాయిని క్షేమంగా ఇంటికి చేర్చిన వ్యక్తి ఆమె బావ కాదని, అది ‘ఆత్మ’ అని ముగింపులో చెప్పడం ఊహించని మలుపు. ఇలాంటి అనుకోని మలుపులే క్రైమ్ కథల్ని గుర్తుండేలా చేస్తాయి. ఇక, విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలును అంతం చేసేందుకు ప్రత్యర్థులు సాగించిన వ్యూహాలు, వాటిని తిప్పికొట్టేందుకు మహామంత్రి తిమ్మరుసు చేసిన ప్రతి వ్యూహాలకు సంబంధించిన కథ ‘కుట్ర’. చారిత్రక ప్రసిద్ధి చెందిన రాయలు జీవితానికి సంబంధించిన కథాంశాన్ని ‘క్రైమ్’ కథాసంపుటిలో చేర్చడం విశేషం.

ఎస్‌ఆర్, ఆంధ్రభూమి అక్షర పేజి, 07/09/2013

* * *

“థ్రిల్లర్స్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.
థ్రిల్లర్స్ On Kinige

Related Posts:

అమెరికాలో జీవనం.. అనుభూతుల సారం

ఆ నేల, ఆ నీరు, ఆ గాలి అన్ని నవోదయ షాపుల్లోనూ లభిస్తుంది వెల: రూ.80, కినిగే.కామ్‌లో కూడా దొరుకును. అరవై, డెబ్భై దశాబ్దాలలో అమెరికాకు ప్రవాసం వెళ్ళిన అతి కొద్దిమంది భారతీయుల్లో వేలూరి వెంకటేశ్వరరావు ఒకరు. అక్కడికి వెళ్ళినా మన జన్మభూమిని, అమ్మ భాషనీ మరిచిపోక, తెలుగులో కథలు రాస్తున్న వారు కొద్దిమందిలో ఒకరు. ఇలా ఎందుకన్నానంటే ఈ రోజుల్లో అమెరికా వెళ్ళినవారు తెలుగునే మరిచిపోతున్నారు, ఇక కథలు రాయడం కూడానా? అందుకే వెంకటేశ్వరరావుగారి కృషిని ముందుగా అభినందించాలి. అమెరికాలోనే కాదు, భారతదేశంలో ఉండి కూడా తెలుగును మరచిపోతున్న వారెందరో! మరొక మాట ఏమంటే- ప్రతి ఒక్కరి నోటా వినే ఒకే ఒక మాట ‘టైం లేదండీ’ అని. నిజమే అందరికీ ఉరుకుల పరుగుల జీవితమే కానీ అందులోంచి కొద్ది సమయాన్ని సాహిత్యం కోసం కేటాయించాలంటే ముందస్తుగా భాషపైనా సాహిత్యం పైనా ప్రేమ, అభిమానం ఉండాలి. ఇవి కలిగినవారు కనుకనే వెంకటేశ్వరరావుగారు ఈరోజు ఈ-మాట అనే వెబ్ పత్రికకి డెబ్భై ఏళ్ళ వయసులో కూడా తరగని హుషారుతో సంపాదకత్వం వహిస్తూ ఉండటం ఆయనకి తెలుగు భాష పట్ల మమకారాన్ని చాటుతోంది. గత ఏభై ఏళ్ళలో తను రాసిన కథలన్నిటినీ పుస్తకంగా తీసుకురావడం చాలా ముదావహం. అమెరికా జీవితాన్ని దాదాపు నాలుగు దశాబ్దాలపైనే అనుభవిస్తూ, అక్కడే స్థిరపడినవారు వెంకటేశ్వరరావు దంపతులు. ముందుమాటలో రచయిత అమెరికా స్టైల్‌లోనే ఒక మాట అన్నారు. కథ చదవగానే ‘వావ్’ అనిపించాలని. నిజమే- కొన్ని కథలు చదివాక నాకలాగే అనిపించింది. పాఠకులకు కూడా అనిపిస్తుంది అనడంలో అతిశయోక్తిలేదు. కానీ అన్ని కథలు చదివించేలా లేవు. కొన్ని సింప్ల్ నేరేషన్‌లా అనిపిస్తాయి. అయినా అమెరికా జీవితానికి, అప్పటి రోజుల్లో ఉన్న స్థితిని కొంత ఆవిష్కరించడం కొన్ని కథల్లో బాగుంది. ఉదాహరణకి ‘గోమేజ్ ఎప్పుడొస్తాడో?’’, ‘మేటామార్పాసిస్’ లాంటి కథలు. అక్కడి జీవన విధానాన్ని మాత్రమేకాక గోమేజ్ అనే వ్యక్తిలోని నిజాయితీని ప్రతిబింబించే ఆ కథ తప్పక ఆకట్టుకుంటుంది. మేటామార్పాసిస్ ఫ్రాంజ్ కాఫ్కా శీర్షిక తీసుకున్నా ఈ కథను మలచిన కథనం బాగుంది. రంగనాథం అమెరికా వెళ్ళిన కొద్దిరోజులకు ఎలా ఎంతగా మారాడో చెప్తూపోతే ఇదేమీ గొప్ప కథకాదు కానీ ఆఖరిలో ఎంత మారినా అవసరం కొద్దీ తన ఆహారపు అలవాట్లుమారవు- మన భారతీయుడికి ముఖ్యంగా తెలుగువాడికి అని చెప్పడం ఈ కథలో పంచ్. ప్రముఖ కథకుడు వాసిరెడ్డి నవీన్ తన మాటలో వ్యంగ్యం వెంకటేశ్వరరావుగారి కథకు చిరునామా అన్నారు. అది నిజమే. ప్రతి కథలోనూ ఒక వ్యంగ్యం. ఆంగ్లంలో ఐతే ‘‘టాంగ్ ఇన్ చీక్’’ కామెంట్ అంటాము. అలా కథనంలోనే ఇమిడిపోయే వ్యంగ్యం పాఠకులని చదివిస్తుంది. ‘‘స్వర్గంలో స్టిప్ టీజ్’’ కథ చాలా హాస్యస్ఫోరకంగా ఉంది. ముఖ్యంగా పుస్తకం టైటిల్ కథ- ‘‘ఆ నేల, ఆ నీరు, ఆ గాలి’’ పురాణ పాత్రలైన సీతారామ లక్ష్మణులు వనవాసంలో గోదావరి కృష్ణ దాటుతున్న సమయంలో సీత, లక్ష్మణుడు రాముడిని ఎదిరించడం, పెన్నా దాటగానే మళ్ళీ అతడి కాళ్లకు మొక్కి మన్నించమని కోరడం- మనల్ని నవ్వించినా, రాముడు వ్యాఖ్యలో- ‘ఆ నేల, గాలి, నీరు మహిమతో అక్కడివారు గొడవ పడకుండా ఉండరు’ అనడం కొంచెం ఆగ్రహం తెప్పించవచ్చు ఆయా ప్రాంతాల వారికి. నవ్వేసుకుంటే ఈ కథ బాగానే ఉంటుంది. ఇక కథనంలో రచయత చేసిన ప్రయోగాలు కథాచిత్రాలుగా ఆయన రాసిన ప్రక్రియ నేటి చదువరులకి ఇష్టంగా ఉండవచ్చు. కొన్ని నాస్టాల్జియా కథలు ప్రవాసుల్లో తప్పవు మరి. వారి తెలుగు మాస్టారి గురించి ఆయన వెలిబుచ్చిన గౌరవం చాలా ప్రశంసనీయం. రచయత తన జీవిత భాగస్వామి శాంతిగారికి అంకితమిచ్చారు ఈ పుస్తకాన్ని. సీరియస్ పాఠకుడికి ఇందులో ఏమీలేదు గానీ, లైట్ రీడ్‌గా పనికొచ్చే పుస్తకం అని చెప్పవచ్చు.

జగద్ధాత్రి, 30/03/2013 నాటి ‘అక్షర పేజి’

* * *

కినిగె వెబ్ సైట్ ద్వారా ప్రింట్ బుక్‌ని తగ్గింపు ధరకి తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

ఆ నేల, ఆ నీరు, ఆ గాలి On Kinige

Related Posts: