‘తెలీని రహస్యాలు’ తెలిస్తే అంతా మేలే – మనకే తెలీని మన రహస్యాలు పుస్తకంపై సమీక్ష

అన్ని ప్రశ్నల్లోకి అతి పెద్ద ప్రశ్న ‘నేనెవరు?’ అనేది. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే, ఇంక అడగవలసిన ప్రశ్నలు గాని, తెలుసుకోవలసిన సమాధానాలు గాని వుండవు. ఉపదేశంకోసం తన దగ్గరకు వచ్చిన వాళ్ళతో రమణమహర్షి చెప్పేవారట, ‘ఈ ప్రశ్ననే ఎవరికివారు వేసుకొని సమాధానం వెతుక్కోండి’ అని. ఒక ఉపనిషత్తులో శిష్యుడు అడుగుతాడు. ‘ఏ ఒక్కటి తెలుసుకొంటే బయట కనిపించే ఈ చరాచర ప్రపంచం అంతా తెలుస్తుంది?’ అని. బహుముఖాలుగా, చిత్ర విచిత్రాలుగా భాసిస్తున్న ఈ రంగుల ప్రపంచం తెలుసుకోవటం ఏ ఒక్కరికైనా ఎలా సాధ్యం అంటే తననుతాను తెలుసుకొన్నప్పుడు, ఆత్మజ్ఞానం అలవడినప్పుడు సాధ్యమవుతుంది అనవచ్చు.
మన వేదాంతం అంతా ఇందుకొరకే, అంటే, తానెవరో తాను తెలుసుకొనేందుకే ఉద్దేశించబడింది. ఆ వేదాలు, వేదాంతాలైన ఉపనిషత్తులు వేల ఏండ్ల నాటివి కావటంవల్ల, అప్పటి సాంఘిక పరిస్థితులు ఈనాటి స్థితిగతులకంటే వేరుకావటంవల్ల, జన సామాన్యానికి అవి అందుబాటులోకి రాక, అవి అన్నీ గూఢార్థాలుగా, వేదాంత రహస్యాలుగా వుండిపోయినవి. భావం చెడకుండా వాటిని మళ్ళీ మన భాషలోకి మన పరిస్థితుల కనుగుణంగా మలుచుకోవలసిన అవసరం నేటి కాలానికి ఎంతైనా వుంది.
అలాంటి ప్రయత్నంలో భాగంగానే డాక్టర్ వాసిలి వసంతకుమార్ రాసిన అనేకానేక గ్రంథాలు. వాటిల్లో ‘‘మనసు గెలవాలి’’ గ్రంథంలో మనసు మర్మం విప్పిచెప్పినా, ‘‘77 సాధనా రహస్యాలు’’, ‘‘56 ఆత్మదర్శనాలు’’ గ్రంథాలలో సంఖ్యాపరంగా తాత్వికతను గురించి విశదీకరించినా వారికివారే సాటి అనిపించుకున్నారు.
ప్రస్తుత గ్రంథం ‘మనకే తెలీని మన రహస్యాలు’లో రచయిత ఆ రహస్యాలేమిటో చెప్పి, మనలోమనకే తెలీని ఇన్ని రహస్యాలున్నాయా? అని ఆశ్చర్యపడేట్టు చేశారు. ఒక విధంగా మనం వాస్తవికంగా ఏమిటో తెలిసేట్టు చే శారు. ఏ రహస్యమైనా అది తెలియనంతవరకే రహస్యం. తెలిసిన తరువాత బట్టబయలు. ఆ రహస్యాలు ఏమిటో తెలుసుకోని మనిషి కష్టాల పాలవుతున్నాడు అనీ, తెలుసుకొని, వాటిని అధిగమించి సుఖ జీవితం గడపాలనీ రచయిత కాంక్షిస్తున్నారు.
నిత్యజీవితంలో ఎదురుపడే సంఘటనలను ఆధారంచేసుకొని వెలువరించిన సార్వకాలిక సత్యాలు రచయిత నిశిత పరిశీలనా దృష్టికి మచ్చుతునకలుగా నిలుస్తవి. ఉదాహరణకు:
1. జీవితాన్ని దొర్లించేస్తుంటే ఉప్పగానే వుంటుంది. జీవితాన్ని కదిలించగలిగితే కర్పూరమే అవుతుంది. – పేజీ 19.
2. పడుకోబోయేముందు లెక్కల పద్దులు రాయగలమేకానీ ఏం సాధించామన్నది డైరీకి ఎక్కించాలంటే కలంలో సిరా ఉన్నా
జీవితంలో సారం కనిపించదు. – పేజీ 38.
3. ఇంతకాలం మనం ఇతరులతో పోటీపడుతూ వచ్చాం… ఇప్పటినుండయినా మనతో మనం పోటీ పడగలమా అన్నది ప్రశ్న.
– పేజి 39.
4. ఇతరుల మెప్పుకోసం మన బ్రతుకును దుర్భరం చేసుకోకూడదు. – పేజి 94
5. మనకు మనమే కేంద్రం కావాలన్న ప్రయత్నమే ధ్యానం. – పేజి 132
6. గడప దాటితేనే గదా ప్రపంచం కనిపించేది అన్నట్టుగా మనం కూడా ఎన్నోవిధాల మన గడప దాటాల్సిందే! మన ప్రమేయం లేకుండా మనపై బడ్డ ముసుగులను తొలగించుకుంటూ పోవలసిందే! అప్పుడే మనం సరికొత్తగా కాంతులీనుతాం. – పేజి 138
డాక్టర్ వాసిలి వసంతకుమార్ రచనలన్నీ ఆధునిక ఉపనిషత్తులు అయితే, వాటిల్లో ప్రస్తుత గ్రంథం ‘మనకే తెలీని మన రహస్యాలు’ ఒకటి

-దీవి సుబ్బారావు, అక్షర, ఆంధ్రభూమి, 21/06/2014

మనకే తెలీని మన రహస్యాలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

మనకే తెలీని మన రహస్యాలు on kinige

Related Posts:

స్ఫూర్తిదాయకం.. ‘యోగి’ వ్యక్తిత్వం- “సమ్మాన్యుడు” పుస్తకంపై సమీక్ష

డా.సి.వి.యోగి అనే సంక్షిప్త నామంతో ప్రాచుర్యం సంపాదించిన ప్రతిభావంతుడు డా.చేంబోలు వెంకట యోగిగారి జీవిత చరిత్ర ఈ పుస్తకం.
ఆయన జీవిత విశేషాలను తెలియజేస్తూ ఆయన సమకాలికులు, కుటుంబ సభ్యులు రాసిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ఇవిగాక ఆయనవద్ద చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి.
సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ఆశీస్సులతో వెలువడిన ఈ పుస్తకంలో శ్రీ శివానందమూర్తిగారి ఆధ్యాత్మిక సూక్తులు అసంఖ్యాకంగా ఆంగ్లంలో ప్రచురించారు.
విశ్రాంత ఉపన్యాసకులు యర్రంశెట్టి సత్యారావు పుస్తకానికి రాసిన ప్రస్తావనలో ‘‘డాక్టర్ యోగి జీవనశైలి ఎందరినో కదిలించింది, కరిగించింది. విద్యాదానమే ఆయన అందరికీ అందించిన నిజమైన యోగం. ‘యోగి’ అనే పరమపవిత్ర పదానికి ప్రతీకగా నిలిచారు’’ అన్నారు (పేజి 15).
అనేక మందికి విద్యాదానం చేసిన డా.యోగిగారికి మెట్రిక్యులేషన్ తర్వాత కాలేజిలో చేరి చదువుకొనే అవకాశం లేకుండా పోయింది. ప్రైవేటుగా చదివి హిందీలో ‘సాహిత్యరత్న’ డిగ్రీ సంపాదించారు. కాశీ వెళ్లి హోమియో వైద్యం నేర్చుకొని వచ్చి స్వస్థలం అనకాపల్లిలో హోమియో ప్రాక్టీసు మొదలెట్టారు. రాబడి తక్కువ కావటంతో ట్యూషన్స్ చెప్తుండేవారు.
స్వయంకృషితో పధ్నాలుగు భాషలు నేర్చుకొని పాండిత్యం సంపాదించుకొనగలిగారు. ఇదిగాక బిఎస్సీ, బి.కాం. తదితర డిగ్రీ పుస్తకాలు తెచ్చుకొని అధ్యయనంచేసి ఆ విద్యార్థులకూ ట్యూషన్స్ చెప్పేవారట. చూడటానికి ఇదంతా నమ్మశక్యంగా కనిపించదు. అయితే ఇవన్నీ అక్షర సత్యాలని ఈ పుస్తకంలోని వ్యాసాలు తెలియజేస్తాయి. కారుణ్య భావం, సేవాతత్పరత మొదలైన సద్గుణాలన్నీ ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగమైపోయాయనే సంగతిని వెల్లడించే సంఘటనలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
కాకినాడలో జిల్లా కలెక్టరుతో జరిపిన సంభాషణ (పేజి 66) డాక్టర్ యోగిగారిలో ఉన్న అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సంభాషణకు సంబంధించి పేజి 119లో ఉన్న వివరాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
ఆయనలో అపారమైన విజ్ఞానం ఉండేది. దానికితోడు అద్భుతమైన వ్యక్తిత్వం. అందుకే కాకినాడలో హిందీ లెక్చరర్‌గా పనిచేస్తున్న కాలంలో అనేకమందిని ప్రభావితం చేయగలిగారు.
వారి పెద్ద కుమారుడు సినీ గేయ రచయితగా స్థిరపడ్డ ‘సిరివెనె్నల’ సీతారామశాస్ర్తీ. ఆయన రాసిన పెద్ద వ్యాసం ఒకటి ఈ పుస్తకంలో ఉంది. ఒక తండ్రిగా డా.యోగి ఏ విధంగా ఉండేవారో ఇందులో వివరించారు.
డా.యోగి జీవితకాలం కేవలం నలభై సంవత్సరాలు. అయినా ఆ స్వల్ప వ్యవధిలోనే ఆదర్శవంతమైన జీవితం గడిపి అనేకమందికి మార్గదర్శకులు కాగలిగారు.
సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలు చదివారు. ఉపన్యాసాలివ్వగల స్థాయికి ఎదిగారు. చదివిన వాటిని ఆచరణలోనూ చేసిచూపేవారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నరోజుల్లోనూ ఇతరులకు సహాయం చేయటానికి వెనుకాడేవారు కాదు.
హోమియో వైద్యంలోనూ ఆయన విశేషమైన ప్రతిభ కలిగి ఉన్నారనే సంగతి, ఈ పుస్తకంలో ఇవ్వబడిన కొన్ని కేసురిపోర్టులు చూసినప్పుడు తెలుస్తుంది. మొదట్లో ఫీజు తీసుకున్నారు గానీ, తర్వాత కాలంలో మానేశారట. కారణమేమిటని ఒకరు అడిగినప్పుడు ‘్ఫజు కోసం పేషెంట్సును బాధపెట్టటం ఇష్టం లేదు’ అని జవాబిచ్చారట.
పిల్లలను సహజంగా ఎదగనివ్వాలన్నది వారి ఆలోచన. చదువు పేరుతో పిల్లలను ఒత్తిడికి గురిచెయ్యకూడదని ఆయన తరచూ అంటుండేవారట. కానె్వంటు చదువులు రాజ్యమేలుతున్న ఈ రోజులలో ఇది ఆలోచించవలసిన విషయం.
ఏ సబ్జక్టుకు సంబంధించిన పుస్తకమైనా ఒక్కసారి చదివితే ఆయనకు గుర్తుండిపోయేది. అసాధారణమైన ఆదరణాశక్తికి కారణం ఏమై ఉంటుందని అన్నప్పుడు ‘దైవానుగ్రహం’ అన్నది వారి జవాబు.
ఎవరైనా సనాతన ధర్మానికి సంబంధించిన తప్పుడు విమర్శ చేసినప్పుడు ఆయన సహించేవారు కాదు. తార్కికంగా వాదించి తగిన సమాధానం చెపుతుండేవారట.
ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. విశ్రాంతి నెరుగని జీవితం. సమస్యలు ఎదురైనప్పుడు వెనుకంజవేయటంకన్నా ఎదుర్కొని విజయం సాధించటం మిన్న అని ఆయన జీవిత చరిత్ర తెలుపుతుంది.
నిజాయితీగా జీవించి ‘పరోపకారార్థమిదం శరీరమ్’ అన్న సూక్తిని సార్థకం చేసిన గొప్ప వ్యక్తి డా.యోగి.
పుస్తకంలో చివరి అధ్యాయానికి ‘మహాభినిష్క్రమణం’ అని శీర్షిక ఇవ్వటం సముచితంగా ఉంది.
పుస్తకం ముగింపులో ‘యోగిగారి జీవితం యొక్క ప్రభావం మాతోనే అంతమవకూడదు. ఇంకా ముందు తరాల వారికి కూడ స్ఫూర్తిని ఇవ్వాలనే కాంక్షతో ఆయన కొండంత వ్యక్తిత్వాన్ని చిన్నదర్పణంలో చూపించటానికి ప్రయత్నించాను. నా ప్రయత్నం ఎంతవరకూ సఫలీకృతం అయిందో కాలమే నిర్ణయించాలి’ అన్నారు రచయిత.
వారి ఆకాంక్ష నెరవేరుతుందని ఆశించవచ్చు.

-ఎం.వెంకటేశ్వరశాస్ర్తీ, అక్షర, ఆంధ్రభూమి, 29/03/2014

***

ఈ సమీక్షను ఈనాడు పుస్తక సమీక్ష పేజీలో చదవడానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి

http://www.andhrabhoomi.net/content/yogi

 

 

 

 

 

 

 

 

సమ్మాన్యుడు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

సమ్మాన్యుడు” on kinige

Related Posts:

ఆశావాదమే జీవనవేదం

వివిధ పత్రికలలో ప్రచురించబడిన ఇరవై కథానికలు ఈ పుస్తకంలో ఉన్నాయి. జీవితాన్ని వేర్వేరు కోణాలలో పరిశీలించి విశ్లేషించటం ఇందులో చూడవచ్చు. పుస్తకానికి ముందుమాట రాస్తూ డా.వేదగిరి రాంబాబు ‘మానవ సంబంధాలమీద రచయిత్రికి గట్టి నమ్మకం ఉందని, నిర్మలమైన ప్రేమతో అవి నిలబడతాయని రచయిత్రి గాఢంగా నమ్ముతున్నారని’ అన్నారు. పరిచయాలు వేరు, స్నేహాలు వేరు, ప్రేమలు వేరు, అవసరానికి సహాయ పడటం వేరు- దేని స్థానం దానిదే. అది తెలుసుకోకుండా ఒక దానిని మరొకటిగా భావించినప్పుడు సమస్యలొస్తాయి. ఈ సత్యాన్ని తెలియజేసేదే ఈ పుస్తకంలోని ‘పగటి కల’ కథ. దుర్మార్గంగా వ్యవహరించటం అనేది పరిస్థితులనుబట్టి ఉంటుందని, దానికి ఆడా, మగా అన్న తేడా ఉండదనీ ‘జాతర’ కథ సూచిస్తుంది. ఈ కథ ముగింపులో ‘పురుషులవల్ల స్ర్తిలు బాధలు పడుతున్నారన్నది ఎంత నిజమో, అదే విధంగా ఒక కోణంలోంచి గమనిస్తే పురుషులు కూడా స్ర్తిల మూలంగా ఎంతో నరకం అనుభవిస్తున్నది కూడ నిజం’ అని రచయిత్రి చెప్పటం ఆలోచించతగ్గది. జీవితాన్ని విశ్లేషిస్తూ ఆశావాద దృక్పథం అవసరమని తెలుపుతుంది ‘పిచ్చుక గూళ్లు’ కథ. ‘అడ్డా’ కథ కార్మికుల జీవన పోరాటాన్ని సమస్యలతో సర్దుకపోవటాన్ని తెలుపుతుంది. ‘చచ్చి సాధించేది ఏదీ లేదు. సమస్యలను ఎదుర్కోవాలి. బతుకు పోరాటం కొనసాగించాలి’ అనే ఆశావాద వైఖరిని ‘జీవితానికి ఆవలి గట్టున’ కథ ఉద్బోధిస్తుంది.

ఎం.వి.శాస్ర్తి , ఆంధ్రభూమి అక్షర పేజి, 13/07/2013

* * *

“అడ్డా” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
అడ్డా On Kinige

Related Posts: