వందేళ్ల తెలుగు కథల్లో నుంచి, ఆ రచయితల నుంచి స్వీకరించవలసినవీ పరిహరించవలసినవీ విజ్ఞతతో గ్రహించిన యువ రచయితలు ఇప్పుడు వస్తున్నారు. తమదైన తాత్విక దృక్పథంతో జీవితాన్ని పరిశీలించి దానికి తగిన శైలిలో రచనలు చేస్తూ వర్తమాన కథను వెలుగుదారిలో నడిపిస్తున్న వీళ్ల సంకలనాలు తెలుగు కథకు ఉజ్వల భవిష్యత్తును వాగ్దానం చేస్తున్నాయి. అరుణ పప్పు కథా సంపుటి ‘చందనపు బొమ్మ‘ ఈ కోవకు చెందినదే. ఇందులోని పది కథల్లో తొమ్మిది శిల్పపరంగా ఉత్తమ పురుషలో చెప్పినవి. వీటిలో కనిపించే ‘నేను’ ఒక విద్యావంతురాలూ ఉద్యోగినీ అయిన యువతి. వృత్తిరీత్యా సమాజంలో రకరకాల మనుషులను కలుసుకునే అవకాశమూ అవసరమూ ఉన్న జర్నలిస్టు. ముందుతరపు స్త్రీల పోరాటాలు సాధించిన హక్కులు, అవకాశాలను అందిపుచ్చుకుని ఆత్మగౌరవంతో తమ పనులకు తాము బాధ్యత వహించే యువతులు ‘నేను’ అంటూ ఈ కథల్లో మనకు కనిపిస్తారు. జర్నలిస్టులు కాకపోయినా దీప, పూర్ణ, మృణ్మయి, లాలిత్య వంటివాళ్లు వివేకవంతులు, ఆలోచనాపరులు, జీవన ప్రేమికులు. లోపల ఉండవలసిన సున్నితత్వాన్నీ సంవేదనలనూ కాపాడుకుంటూనే అవసరమైన చోట నిర్భయంగా నిలబడతారు. ఈ కథలన్నిటిలో వ్యక్తుల మధ్య సంబంధాల్లోని రకరకాల ఛాయలు, మానసిక సంఘర్షణలు ప్రధానంగా కనిపిస్తాయి. మంచి కథకు క్లుప్తత, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, నిర్మాణ సౌష్టవం అనే నాలుగు లక్షణాలూ ఉండాలని అంటారు విమర్శకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య. ‘చందనపుబొమ్మ’లోని కథలన్నిటిలోనూ అవి ఉన్నాయి. కథలకు నేపథ్యంలో రచయిత్రి అద్దిన రంగులు వాటిని పరిపుష్ఠం చేశాయి. ‘ఏకాంతంతో చివరిదాకా’లో కొండప్రాంతపు వర్ణన, ‘ఒక బంధం కావాలి’లో సముద్రతీరాన సూర్యోదయం, ‘భ్రమణకాంక్ష’లో కథానాయకుడి అనుభూతులు – ఇవన్నీ అలాంటి కొన్ని అందమైన రంగులు. తెలుగు భాషను చక్కగా ఉపయోగించే సామర్థ్యమున్న రచయిత్రి ఇంగ్లీష్ పదాలను, వాక్యాలను అత్యవసరమైతే తప్ప వాడకుండా ఉంటే బాగుంటుంది. ‘చందనపుబొమ్మ’తో తమ ప్రచురణలను ప్రారంభించిన రాష్ట్ర కథానిలయం నందలూరువారు ప్రతి ఏడూ ఇలాంటి ఒక యువ కథాగుచ్ఛాన్ని అందిస్తారని ఆశిద్దాం.
– పి. సత్యవతి
ఆదివారం ఆంధ్రజ్యోతి, 7 ఏప్రిల్ 2013
* * *
“చందనపు బొమ్మ” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్ సైట్ ద్వారా ప్రింట్ బుక్‌ని తగ్గింపు ధరకి తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.