చిన్న కథల పొది – “అస్త్రం”

పదమూడు కథలతో కూడిన “అస్త్రంకె.ఎల్.వి. ప్రసాద్ గారి రెండవ కథా సంపుటి. చూసిన, అనుభవించిన, ఎదురైన, సంఘటనలను కథలుగా మలచి పాఠకులకు అందించారు. చిన్న కథగా కథను మలచడంలో జాగ్రత్త, నైపుణ్యం, అవసరం. అనవసర విషయాలు ఉంటే కథ కుదరదు. ఈ విషయాలు తెలిసిన రచయిత వీరు మర్యాదస్తుడుగా మసలే మనిషి తీరును “అతడు – ఆమెలో” ప్రదర్శనకు పెడతారు. అమ్మాయిలకు పేర్లు పెట్టే రాజశేఖర్‌కు తన పెద్ద చెల్లెలి విషయంలో జరిగిన సంఘటనలో కళ్ళు తెరచినట్లయింది. ఈ సంగతిని కొసమెరుపు రూపంలో కథకుడు అందిస్తాడు. ఈ సంపుటిలో చదువుకు సంబంధించిన కథలు రెండు ఉన్నాయి. “అబ్బాయి చదువు”లో తల్లిదండ్రుల ఆకాంక్షకు వ్యతిరేకంగా తనేం చదవాలో అబ్బాయి నిర్ణయం తీసుకుంటే, “నేరం నాదికాదు” కథలో తన ఆసక్తికి వ్యతిరేకంగా తల్లి ఒత్తిడివల్ల చదివిన అమ్మాయి ఇంటర్ ఫెయిల్ అవడం కనిపిస్తుంది. ఈ రెండు కథలవల్ల తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల పట్ల ఎటువంటి దృష్టి కలిగి వుండాలో తెలుస్తుంది. పిల్లల ఆసక్తులను పరిగణలోకి తీసుకోవాలని కథలు చెబుతాయి.

అన్ని సమకూర్చుకొని, వేళకు వివాహం జరుపుకుందామనుకున్న ఆదర్శ జంటకు, మంత్రిగారి జోక్యం వల్ల, ముహూర్తం దాటాక పెళ్ళి జరగడం “ముడి”లో కనపడుతుంది. పేరుకోసం పత్రికలో చోటుకోసం వచ్చిన మంత్రి, వాస్తవంగా పెళ్లి చేసుకున్న జంటకు చేసిన మేలేమి లేదు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లు, సమాజంలో జరిగే మంచి పనులకు చేయూత నివ్వడంకంటే, వాటి నుండి లబ్ధి పొందడమే పరమావధిగా రాజకీయ నాయకులు నడవడం తెలిసిన విషయమే. ఇలాంటి కథే “అంకితం” ఇందులోని రచయిత వ్యవహరించిన తీరు రాజకీయ నాయకుడి తీరుకు భిన్నంగా లేదు. లీడర్ పేరుకోసం తాపత్రయపడితే, రచయిత డబ్బుకోసం ఆశపడటం కనిపిస్తుంది. ఈ రెండు కూడా విపరీత పోకడలే. వీటిని ఆసక్తికరంగా మలచిన తీరు ఆకట్టుకుంటుంది.

“తోటకూర నాడే మందలించాలి” అనే సూక్తిని గుర్తుకు తెచ్చేకథ “తప్పటడుగులు”. చిన్నప్పుడు కొడుకు చేసిన తప్పుపని, తండ్రికి సంతోషం కలిగిస్తే, అలాంటిపనే పెద్దయ్యాక చేయడంవల్ల తండ్రి ఉనికికే మోసం రావడం కథలో కనిపిస్తుంది. ఇది ఈనాడు సమాజంలో జరిగే తండ్రి, కొడుకుల తగాదాలకు అద్దంపట్టింది.

అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే లాంటివాళ్ళు గొంతెత్తితే రచయిత కథనెత్తాడు.”ఆటోవాలా” అనే కథలో లంచావతారం ఒకడైతే, శ్రమజీవి మరొకరు. అవినీతి తిండితో అరగక ఒకడు బాధపడుతుంటే, అవసరానికి ఆటో నడిపించే ఉద్యోగి మరొకరు. కథ కాస్త సినిమాటిక్‌గా ఉంది. లంచావతారాన్ని అతని భార్యే చీదరించుకోవడం బాగుంది.

అమ్మాయిలను మభ్యపెట్టి, మోసగించి జ్యోతిషం చెపుతున్న వ్యక్తి “బ్రతుకు దెరువు”లో కనిపిస్తే, యవ్వనంలో ఉండే, బస్సులో నిలబడచేతగాక కుంటివానిగా నడించిన వ్యక్తి “కుంటి మనస్సు”లో కనిపిస్తాడు. ఇద్దరూ చేసింది మోసమే. కాని హస్తిమశకాంతరం. నిజాయితీని వదిలిన యువకుని ఒక కథ చూపిస్తే, అమ్మాయిలను చూసి భ్రమసే వృద్ధుణ్ణి మరో కథ చిత్రిక పట్టింది. ఈ రెండు ధోరణుల నేటి వ్యాపార సమాజపు ప్రతిఫలనాలే.

శ్రద్ధగా చదువుకొని, తనను తాను సంస్కరించుకొన్న రాధ “ఆమె గెలిచింది”లో కనపడితే, కోరుకున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి నాటకమాడిన శ్రీనివాస్ “అస్త్రం” లో కనపడతాడు. నిజాయితీలో ఒకరు హృదయాన్ని జయిస్తే, మరొకరు గడుసుగా కాపురం నిలుపుకోవటం వల్ల పాఠకులకు రెండు కథలు ఆహ్లాదాన్ని పంచాయి.

“మనిషి” కథలో చెప్పులు కుట్టేవాని సంస్కారం, డబ్బున్న ఉద్యోగి కనులు తెరిపిస్తుంది. కార్మిక హృదయం ఒక మనిషిని చేరదీస్తే, మధ్య తరగతి ఆలోచన బేరం ఆడడం కనిపిస్తుందీ కథలో. అందుకే అతడు మనీషి అయితే, ఇతడు మనిషిగా మిగిలాడు.

వృత్తిరీత్యా డాక్టరుగా, ప్రవృత్తిరీత్యా సాహిత్యజీవిగా, అవసరం రీత్యా ప్రయాణికుడిగా, రచనారీత్యా కథకుడిగా, అవగాహనారీత్యా మానవతావాదిగా, అంతిమంగా తానే ఒక అస్త్రంగా కె.ఎల్.వి.ప్రసాద్ ఇందులో తారసిల్లుతాడు.

బి.వి.ఎన్.స్వామి.
(ప్రజాసాహితి మే,2012 సంచిక నుంచి)

* * *

ప్రజాసాహితి” మాసపత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. ఈ క్రింది లింక్‌లని అనుసరించండి.

Related Posts: