నిరాశకు నిష్క్రమణ పలికే కథల సంపుటి ‘ఆసరా’

గీతలన్నా, గీతాలన్నా తనకిష్టమని చెప్పే శ్రీమతి వారణాసి నాగలక్ష్మి మంచి కథా రచయిత్రిగా కూడా పాఠకలోకానికి పరిచితురాలు. వానచినుకుల్లో తడుస్తున్న వాళ్ళకు గొడుగు ఎవరైనా ఇస్తే ఎంత ఆసరానో కన్నీటి జడిలో తడిసే వారికి కొండంత ధైర్యాన్నిచ్చే ‘ఆసరా‘ సంపుటిలోని కథల వంటి కథలు అంత ఆలంబన. ‘బంగారపు పళ్లేనికైనా గోడ చేర్పు ఉండాలి’ అన్నట్లు, ఎంతటి వాళ్ళకైనా ఏదో ఒక సమయంలో ఆసరా అవసరపడుతుంది. ‘పాడి ఉన్నా పంటలు ఉన్నా పంచుకునే మనిషుండాలి’ అని తోడు-నీడ సినిమా పాటలో అన్నట్లు కష్టాలను కన్నీళ్ళనే కాదు, మన ఆనందాన్నీ పంచుకునే వాళ్ళున్నదే జీవితం.
ఈ సంపుటిలో వరసగా నాలుగు కథలు చదివాక నాకు ఏం చెప్పాలని పదే పదే అనిపించిందో సరిగ్గా అవే మాటలు ‘మేఘన’ కథలో కనిపించాయి. “సృజనాత్మక రచనలో చెప్పదలచిన విషయాన్ని మొహాన కొట్టినట్లుగానో, లేదా అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లుగానో చెప్పకూడదు. పాఠకుడిలో ఆలోచన రేకెత్తించేలా, చిరునవ్వు మొలిపించేలా, నిద్రపోతున్న వ్యక్తిని వెచ్చని సూర్యకిరణం మేల్కొలిపినట్లుగా, మనసు ఆర్ద్రమై కళ్ళు చెమర్చేలా, సూచనప్రాయంగా, దృశ్యాదృశ్యంగా రచన సాగాలి” మేఘన కథలో సృజనాత్మక రచన వర్క్ షాప్ నిర్వహించే సాహితీ వైద్యుడు సుధీర్ సంజయ్ చెప్పిన మాటలు నిజానికి రచయిత్రివే. శ్రీమతి నాగలక్ష్మి కథల్లో కనిపించే నేటి మానవ సంబంధాలు, సమస్యలు, అంతస్సంఘర్షణలు, వాగ్వివాదాలు, చిలిపి తగవులు – అన్నింటిలోనూ సౌకుమార్యం కనిపిస్తుంది. తిట్టినా అందులో పదునుతోపాటు నాగరికత కనిపిస్తుంది. నవ సమాజాన్ని నిశితంగా పరిశీలించి నిర్లిప్తంగా ఉండే మనుషుల్ని ఈ సమస్య గురించి ఆలోచించమంటుంది. ఈ సంపుటి పేరు ‘ఆసరా’ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తల్లిపేగు (బొడ్డుతాడు) ఆసరా. చివరి వార్ధక్య దశలో చెట్టంత బిడ్డలో, చేతికర్రో ఆసరా. ఈ మధ్య సాగే జీవనయానంలో ఆసరా ఎన్నోసార్లు అవసరమవుతుంది. మొదటి కథ పేరే ‘ఆసరా’ సైబర్ కేఫ్‌లలో చిరుచీకటి నిండిన కేబిన్లలో యువతీ యువకులు యౌవనమైకంలో చేసే శృంగార చేష్టల్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చెయ్యటం గురించి మనకు తెలుసు. అటువంటి సమస్య వచ్చినప్పుడు ఎగతాళి చేసి స్నేహితులు, తిట్టి తల్లిదండ్రులు వాళ్ళని మరింత నీరుగారిపోయేలా చేస్తారు. అందుకు ఫలితమే ఎన్నో ఆత్మహత్యలు. ఆ కాసేపు వివేకంతో, ఓర్పుతో ధైర్యం చెప్పేవాళ్ళుంటే, సమస్యకు పరిష్కారాన్ని సూచించే వాళ్ళుంటే ఆ ‘ఆసరా’ జీవితాన్నే నిలబెడుతుందని ఈ కథ చెబుతుంది. తప్పు దిద్దుకోవటానికి తల్లి చేయూతనిస్తే ఒక పడుచుపిల్ల జీవితం మళ్లీ పచ్చగా మారుతుందని చెప్పే ఈ కథ ఇటు యువతకు, అటు తల్లిదండ్రులకు కనువిప్పు. సమాజంలో ‘పీడించటం’ అనేది వర్ణాలకు, వర్గాలకు పరిమితం చేస్తుంటారు. ‘అమృతాన్ని సాధించు’ కథ చదివినప్పుడు బలవంతులు, బలహీనుల్ని పీడిస్తారనీ, అందుకు వర్ణ, వర్గాలు అతీతమని అనిపిస్తుంది. పదిమంది మెప్పు కోసం ఆదర్శ వివాహాలు చేసుకొని వివక్ష విషాన్ని కడుపులోనే దాచుకొని పండంటి కాపురాన్ని పాడుచేసుకుంటున్న ఒక జంట కథ ఇది. తన ప్రేమకోసం తన వాళ్ళందరినీ వదిలి వచ్చిన భార్యను ‘అగ్రవర్ణపు అహంకారి’గా మాత్రమే చూసే అవినాశ్ ఆత్మన్యూనతా భావంతో, పేరుకుపోయిన పగతో భార్య నీరదను నిజంగానే ‘కురిసే మేఘం’గా మార్చాడు. అవినాశ్ పురుషుడిగా తన ఆధిక్యత భార్య మీద చూపిస్తే నీరదను ఆసరాగా నిలిచే సునంద ఇంట్లో పనిపిల్లమీద ఆధిపత్యం సాగిస్తుంది. ‘తప్పులు దిద్దువారు తమ తప్పులెరుగరు’మరి!
ఒళ్లు కొవ్వెక్కిన వెధవ ఒంటరిగా వచ్చే ఆడపిల్లను మానభంగం చేస్తే తప్పు చేసిన వాడు హాయిగా తిరుగుతుంటాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అమెరికా మొగుడు మోసం చేస్తే ఆమెకూ ఆత్మహత్యే గతి. మనకు కనబడుతున్న కన్నీటి కథలివి. కాని ‘సంధ్యారాగం’ కథలో ‘సావేరి’కి సుమేధ ఆసరాతో బ్రతికి సాధించాలనే పట్టుదల వచ్చింది. బొద్దింకను చూస్తే భయపడే సావేరి పసిఫిక్ మహా సముద్రం మీద ‘హాట్ ఎయిర్ బెలూనింగ్’ చేసేంత ధైర్యవంతురాలైంది. “’వే’ని వెతికి పట్టుకోవాలి. అది తీసేస్తే ‘సారి’ మిగిల్తుంది. నువ్వు ‘సావేరి’ని. అందమైన రాగానివి.“ అన్న స్నేహితురాలి మాటల ఆసరా విలువ అమూల్యం.
జీవితాన్ని మధురంగా, రాగసుధా భరితంగా ఊహించుకుని కలలుకనే అమ్మాయిలు తనను పట్టించుకోని భర్త దొరికితే మానసిక వేదనకు గురౌతారు. ఆ కోపంలో ‘మొమెంట్ ఆఫ్ ప్లెజర్’ ఫలితంగా వచ్చిన గర్భాన్ని తీయించేసుకోవాలనుకుంటారు. అది భర్తకు బుద్ధి చెప్పటమనుకుంటారు. కడుపున పడిన బిడ్డను కాదనుకునే హక్కు తల్లికి లేదని, జన్మనివ్వటం అద్భుతమైన ఘట్టమనీ చెప్పే కథ ‘చిన్నబోదా చిన్నప్రాణం’. ఆడపిల్లల్ని వద్దనుకున్న పాపం తరతరాలను కట్టికుదుపుతుందని ‘రేపటి ప్రశ్న’ కథ హెచ్చరిస్తుంది. అత్తగారొస్తుంటే దెయ్యం వస్తున్నట్లు భయపడిన కోడలు ఆమె ప్రేమతోరాసిన ‘ఒక ప్రేమలేఖ’ మానవ సంబంధాల తియ్యదనానికి నిదర్శనం. అర్థం చేసుకోవటం కష్టం. అపార్థంతో నిందలు వెయ్యటం సులభమనే సందేశం ‘ప్రేమతో మీ పెద్దత్త’ కథలో చూడవచ్చు. అమ్మ అనురాగానికి అద్దంపట్టిన కథ ‘గోడమీదబొమ్మ’. బాపు- రమణల ‘రాధాగోపాళం’ను చూసి ముచ్చటపడి రచయిత్రి మురిపెంగా రాసుకున్న కథ ‘శ్యామాగోపాళం’. (ఆఁయ్! అమ్మా! మమ్మల్నే ఇమిటేట్ చేస్తావా? మా పాత్రల్ని (గిన్నెలు కాదు రాధా గోపాళం) జాతీయం చేస్తావా? అని పెద్దాళ్ళిద్దరూ ఖోప్పడ్డారేమో?) కథా వస్తువులు, కథ నమూ నచ్చే కథల ‘మిక్చర్’ ‘ఆసరా’ కథా ప్రియులను మెప్పిస్తుంది. నేటి నిజాలను హితంగా, మితంగా చెప్పిన శ్రీమతి నాగలక్ష్మి అభినందనీయురాలు.

డా. బి.ఉమాదేవి, నది మాసపత్రిక, సెప్టెంబరు 2013

* * *

“ఆసరా” కథా సంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
ఆసరా On Kinige

Related Posts:

“కథాపయనంలో కొత్త పుంతలు…” ‘ఆసరా’ కథాసంపుటి గురించి…

వారణాసి నాగలక్ష్మి గారి కథా సంపుటి “ఆసరా”కి ముందుమాటగా కౌముది వెబ్‌జైన్ సంపాదకులు కిరణ్ ప్రభ గారు ఇలా రాసారు.

* * *

సమస్యలని సమస్యలుగా కాక నిత్యజీవితంలో ఎదురయ్యే సంఘటనలుగా మలచి పాఠకులకి చూపిస్తే వాటిల్లో తమని తాము చూసుకోగలుగుతారు. ఇంక తర్వాత రచయిత ఏమి చెప్పినా పాఠకుడికి ఆత్మీయంగానే అనిపిస్తుంది. అలాంటి పాఠకుడు చివరంటా కథారచయితతో కలిసి ప్రయాణిస్తాడు. ఆ ప్రయాణపు చివరి మజిలీ (కథ ముగింపు) కూడా ఊరేగింపులూ, ఉద్యమాలూ, నినాదాలూ కాకుండా సున్నితంగా హృదయాన్ని తట్టి వదిలే దృశ్యమైతే రచయిత పాఠకుడికి చిరకాల మిత్రుడిగా మిగిలిపోతాడు. ఈ టెక్నిక్ ని అద్భుతంగా ఒడిసిపట్టుకుని తీవ్రమైన సమస్యలని సైతం సున్నితమైన కథా వస్తువులుగా మలచగల రచయిత్రి శ్రీమతి వారణాసి నాగలక్ష్మి గారు.

నాగలక్ష్మిగారు లలిత గీత రచయిత్రిగా ఏడెనిమిదేళ్ళ కిందట ఫోన్ ద్వారా పరిచయమయ్యారు. ఆమెకి ప్రతి పోటీలోను బహుమతులు గెలుచుకోవడం అలవాటని మాకప్పుడు తెలీదు!(ఈ సంపుటిలోని కథలలో బహుమతుల వివరాలని చూశాక మీరూ అంగీకరిస్తారీ యథార్థాన్ని!) నిజానికి మా పరిచయం కూడా ఆమెకి బహుమతి తెచ్చిపెట్టిన సందర్భమే. లలిత గీత రచనా పోటీల్లో బహుమతి వచ్చిందని తెలియచేయడానికి ఫోన్ చేసి మాట్లాడాం… ఆ తరువాత మేము నిర్వహించిన కథారచనా పోటీల్లో కూడా వరుసగా బహుమతులు అందుకున్నారు. మా పోటీలకి న్యాయనిర్ణేతలు మారినా విజేతల జాబితాలో మాత్రం నాగలక్ష్మిగారి పేరు ఉండాల్సిందే….! అది వారి రచనలకున్న విలువ, నాణ్యత, గుర్తింపు. తద్వారా నాగలక్ష్మి గారి మిగతా రచనలూ, ప్రచురితమైన పుస్తకాలూ చదివే అవకాశం లభించింది.

ఆమె లలిత గీతాల్లో, చిత్రలేఖనాల్లో కనిపించే లాలిత్యమే కథా రచనల్లో కూడా కనిపిస్తుంది. ఏ కథా కూడా ఊసుబోక వ్రాసినట్లు, కేవలం ఊహాలోకంలోంచి ఊడిపడినట్లు అనిపించదు. ఏదో సందేశం ఇచ్చితీరాలి అన్న దృక్పథం కంటే జీవితాన్ని జీవితంగా చూపిస్తూ మధ్యలో ఎదురయ్యే ఇబ్బందులకీ, సమస్యలకీ పరిష్కారం ఇదేనేమో ఆలోచించండి అని మనసు పొరల్ని స్పృశించి వదిలేస్తారు. రెండు మూడు దశాబ్దాల కిందటి కుటుంబ సంబంధ బాంధవ్యాలని గుర్తుచేసే కథలు కొన్నీ (ఒక ప్రేమలేఖ, ప్రేమతో పెద్దత్త, వినిపించని రాగాలు… మొదలైనవి), మారని కాలం, వేగవంతమైన జీవన విధానాలు, నాలుగు వీధుల కూడలిలో నిలబడ్డ సందేహాస్పద యౌవనాలు… వీటిని ప్రతిబింబించే కథలు ఇంకొన్నీ (ఆసరా, సంధ్యారాగం… మొదలైనవి), వర్తమాన సమాజిక కోణాలకి నిలువుటద్దంలాంటి కథలు మరికొన్నీ (ప్రగతి ఫలాలు, ఇది కల కాదు, రేపటి ప్రశ్న… మొదలైనవి).

కొన్ని కథల ముగింపు చదివిన ప్రతిసారీ కళ్ళు చెమరుస్తాయి. పెద్ద, పెద్ద ఉపన్యాసాలు ఉండవు. సంక్లిష్టమైన కథా శిల్ప భేషజాలు కనిపించవు. ఒక్క వాక్యం చాలదూ అనిపిస్తారు. ‘మేఘన’ కథ ముగింపులో నాన్నమ్మ గారింటి వద్ద ఆంక్షల మధ్య గడిపిన చిన్నారి “ఏమైందంటే… నాన్నమ్మ నన్ను తిట్టలేదు… కొట్టలేదు… ఎత్తుకోలేదు కూడా…” అంటుంది. “ఎత్తుకోలేదు కూడా…” అన్న రెండు పదాల్లో పసిపాప మనస్తత్వాన్ని పూర్తిగా దర్శింపచేశారు. ‘వినిపించని రాగాలు’ కథ చివరలో “రాత్రంతా వీచిన పెరటి గాలి నా మనసు నిండా ప్రాణ వాయువు నింపింది. ఉతికి ఆరేసిన వస్త్రంలా నా హృదయం ప్రక్షాళితమైంది. కారు ముందుకి కదులుతుంటే నా మనసు వాళ్ళ మధ్యే ఆగిపోయింది” అంటారు. ఇందులో కూడా చివరి వాక్యంతో పాఠకుల హృదయాల మీద ఎంతో బలమైన ముద్ర వేస్తారు. అలాగే ‘ఒక ప్రేమలేఖ’ ముగింపు కూడా. ఈ ‘ఒక ప్రేమలేఖ’ కథ చదివి ఎంతో ఇష్టపడి ‘స్వప్న’ పత్రిక నుంచి అనుమతి పొంది వెంటనే ‘కౌముది’ లో కూడా ప్రచురించడం జరిగింది. అలాగే ఏ కథలోనైనా పాత్రలతో, తన భాషలో కాక, ఆయా వ్యక్తిత్వాలకి తగినట్లు మాట్లాడించడంలో కూడా నాగలక్ష్మిగారు కథా రచయిత్రిగా మంచి నేర్పు ప్రదర్శించారు. ఈసంపుటంలో మిగతా కథలకంటే భిన్నంగా నిలిచేవి శ్యామా గోపాళం(హాస్యకథ), మానవ ప్రయాణం (కవితాత్మక అధివాస్తవిక చిత్రణ). ఇవి కూడా నాగలక్ష్మిగారి కలానికున్న విభిన్నతకి దర్పణాలు.

ముందుకి నడవండి.. కథా వీధిలోకి అడుగుపెట్టండి… కథలే మిమ్మల్ని నడిపిస్తాయి.

నాగలక్ష్మిగారి కలం నుంచీ ఇలాగే సజీవమైన కథలు నిరంతరం వెలువడాలని మనసారా ఆశిస్తూ…

కిరణ్ ప్రభ

* * *

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మీ కాపీని నేడే సొంతం చేసుకోండి.

ఆసరా On Kinige

Related Posts:

“ఆప్తవాక్యం” – ‘ఆసరా’ కథాసంపుటి గురించి….

వారణాసి నాగలక్ష్మి గారి కథా సంపుటి “ఆసరా”కి ముందుమాటగా ప్రముఖ అనువాదకురాలు శాంతసుందరి గారు ఇలా రాసారు.

* * *

వారణాసి నాగలక్ష్మితో నాకు పరిచయమై నాలుగేళ్ళయింది. అప్పట్లో కథా రచయిత్రిగా పరిచయమైన నాగలక్ష్మి మొదటి పుస్తకం ‘ఆలంబన’ నన్ను బాగా ఆకట్టుకుంది.’భూమిక’ సంస్థ చేపట్టిన హిందీ అనువాదాల కోసం ఆ పుస్తకం మొత్తం చదివాను.

ఆ తరువాత ఆమె కవితలూ, పాటలూ,గేయాలూ రాస్తుందనీ, ఇంకా చిత్రాలు కూడా వేస్తుందనీ తెలిసింది. ఇంత చిన్నవయసులో అంత బహుముఖమైన ప్రజ్ఞని సాధించటం చూసి చాలా సంతోషం వేసింది. ఇవన్నీ ఆమెలోని కళాకారిణిని నాకు పరిచయం చేశాయి. అటు చదువులో కూడా అద్భుతమైన విజయాలు సాధించిందని తెలిసి అబ్బురపడ్డాను. ఎవరైనా తల్చుకోవాలేగాని, దేన్నైనా సాధించేందుకు ఎంతటి ప్రయత్నమైనా చెయ్యగలరు అనటానికి నాగలక్ష్మి ఒక ఉదాహరణ. ఇంత ప్రతిభ ఉండి కూడా నాగలక్ష్మిలోని గాంభీర్యం, అదే సమయంలో సరళంగా అందరితో కలిసిపోయే స్వభావం మా ఇద్దరి మధ్యా ఆత్మీయమైన స్నేహానికి దారి తీసింది.

నాగలక్ష్మి కథలన్నీ పత్రికల్లోనూ, వెబ్ పత్రికల్లోనూ ఎంతోమంది చదివే ఉంటారు. ఇతర ప్రక్రియల్లో కలం సారించినప్పటికీ, ఆమెకి బాగా గుర్తింపు తెచ్చినవి కథలేనని నా అభిప్రాయం. కథల్లో నేపథ్యం తెలుగువారి జీవితాలే, కానీ ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్న రచయిత్రి కావటం వల్ల, ఆమె కథల కాన్వాసు పెద్దదిగా కనిపిస్తుంది. సైన్స్ విద్యార్థిని కాబట్టి దానికి సంబంధించిన ప్రస్తావన కూడా, కథావస్తువునుబట్టి కనిపిస్తుంది- ఈ కోవకి చెందిన కథలే.

కవయిత్రీ, పాటల రచయిత్రీ నాగలక్ష్మి వచనంలో కూడా ఆ లక్షణాలు సందర్భానుగుణంగా కనిపిస్తూ ఉంటాయి. నాగలక్ష్మి రచనా శైలిలోని విశిష్టత చెప్పాలంటే, కథ చెప్పే విధానం స్పష్టంగా, సామాన్య పాఠకుడికి కూడా సులభంగా అర్థమయ్యేలా చెప్పగలదు. పాఠకుడు కథ చదవటం మొదలు పెట్టాడంటే మధ్యలో ఆపే ప్రసక్తే లేదు. అందువల్లనేమో నాగలక్ష్మి కథలకి ఎక్కువగా పోటీల్లో బహుమతులు లభిస్తూ ఉంటాయి. కథావస్తువులో వైవిధ్యం, కథ చెప్పటంలో నైపుణ్యం, మంచి భాషా శైలీ నాగలక్ష్మి కథల్లోని ప్రత్యేకత.

నాగలక్ష్మి నన్ను తన కథల పుస్తకానికి ముందుమాట రాయమన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నేను కథా రచయిత్రినీ, విమర్శకురాలినీ కాను, కేవలం అనువాదకురాలిని. కానీ ఎంతో ఆప్యాయంగా, మా స్నేహాన్ని కారణంగా అనుకుని ఈ నాలుగు మాటలూ, నాకు తోచినవి రాశాను. స్నేహితుల కోరికని ఎవరైనా తోసిపుచ్చగలరా మరి?

ఆర్. శాంత సుందరి

* * *

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మీ కాపీని నేడే సొంతం చేసుకోండి.

ఆసరా On Kinige

Related Posts:

ఉత్సవ కానుక–ఆదూరి వెంకట సీతారామమూర్తి–కథా సంకలనం.


ఉత్సవ కానుక

 

 

 

ఆదూరి వెంకట సీతారామమూర్తి

 

 

హరివంశీ పచ్రురణలు

సీతమ్మధార, విశాఖపట్నం.


 

 

 

 

 

 

UTSAVA KAANUKA

(Anthology of Short Stories)

by

©Aduri Venkata Seetarama Murty

First Published : April 2007.

Title Designed by

Sri BAPU

Author’s Photo : Hema Shankar

For Copies :

Smt. A. Satyavathi Devi

50–52–2, Seetammadhara

Visakhapatnam – 530 013.

Ph : 0891 – 2536741

Visalandhra Book House, Hyderabad

and its branches in A.P.

Printed at :

Satyam Offset Imprints

Visakhapatnam – 16.

Price : Rs.50/–


 

ఇదీ వరుస

ఉత్సవ కానుక… 5

అమ్మాయిపెళ్ళి…… 22

తెరువు….. 37

పాత బంగారులోకం……. 57

ఊరట….. 67

చిలకాకుపచ్చ రంగు జరీచీర…. 81

బతుకుదారి…. 91

సర్వం జగన్నాథం…….. 103

వృత్తి ధర్మం……… 119

అంతరాలు……. 127

సంసారంలో హింసానాదం…….. 141

బంధం…….. 171

బెస్ట్‌ కపులూ – గిఫ్ట్‌ కూపనూ……… 178

గోరింట పండింది…. 188

ఆనందపురం వెళ్లాలి…. 202

‘ఆత్మధృతి’ కథాసంపుటిపై…. 210

కొన్ని సమీక్షలూ..లేఖలూ.. అభిప్రాయాలూ… 210

Seetarama Murty – A Gentle Persuader. 220


 

ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక. అక్టోబరు 24, 2003

 

 

ఉత్సవ కానుక

                ఆనాటి ఉత్సవ ప్రారంభ వేడుక ఎంత ఘనంగా జరగాలో అంత ఘనంగానూ మొదలైంది. తన జీవితమంతా శాస్త్రీయ సంగీత సాధనలోనూ, బోధనలోనూ గడుపుతూన్న సంగీత కులపతి మార్కండేయశాస్త్రి గారి ఆధ్వర్యంలో యీ ఆరాధనోత్సవాలు తక్కువస్ధాయిలో జరుగుతాయని ఎవరూ వూహించరు. సరస్వతీ గాన సభ హాలు అత్యంత సుందరంగా అలంకరింపబడింది. వేదిక అంతా పరిమళాలు విరజిమ్మే రంగురంగుల పూలగుత్తులతో నిండి వుంది వేదికకు ఒక ప్రక్క త్యాగరాజస్వామి వారి తైలవర్ణచిత్రం గులాబీలూ మల్లెల దండలతో అలంకరింపబడి వుంది.

                ఉదయం పూజానంతరం తిరువీధి ఊరేగింపు కార్యక్రమం. తరువాత పంచరత్న సేవ. వేదికమీద అటు పాతిక మంది, యిటు పాతిక మంది నిష్ణాతులూ, ఔత్సాహికులూ అయిన గాయనీ గాయకులూ, వేదిక మధ్యలో మైకు ముందు శాస్త్రిగారు. ఆయన తమ గళాన్ని సరిచేసుకున్నారు హాలంతా సంగీతప్రియులతో నిండి వుంది.

                జగదానంద కారక… జయ జానకీ ప్రాణ నాయక…

                త్యాగరాజ స్వామి వారి కీర్తనల్లో ఆణిముత్యాలనదగ్గ పంచరత్న కీర్తనల్లో మొదటి కీర్తనను ఆలపించారు శాస్త్రిగారు వేదిక మీద కళాకారుల కంఠాలన్నీ ఏక కంఠంగా సేవ మొదలయ్యింది. నాట రాగంలో సాగిన ఆ కీర్తనకు హాల్లో ప్రేక్షక సీట్లలో కూర్చున్న ఔత్సాహిక కళాకారులు తాళం వేయడం ప్రారంభించారు చూడ్డానికీ వినడానికీ కూడా మనోహరంగా వుందా దృశ్యం.

                ఎల్ల లోకాలకూ ఆనందదాయకమైన వాడా… జానకీరమణా సుగుణాకరా. .. పాపరహితుడా… అందమైన ముఖము, అమృతమయమైన వాక్కు గలవాడా… ఇంద్రనీల మణుల కాంతివంటి కాంతిగల శరీరము గలవాడా… చంద్ర సూర్యనేత్రుడా… సృష్టి స్థితి లయాలకు కారకుడా… శరణాగతుల్ని పాలించేవాడా… సత్కవుల హృదయాలలో వేంచేసి వుండేవాడా… దేవముని స్నేహితుడా.. త్యాగరాజాది వరభక్తులు నిన్ను నుతిస్తున్నారు…అనే భావన శ్రావ్యమైన నాటరాగంలో ఒదిగి కళాకారుల కంఠాలగుండా జాలువారి హాలు హాలంతా పరుచుకుంది.

                అటు సంగీత వాహినిలో ఓలలాడుతూనే ఒక కార్యకర్తగా మొదటి ద్వారానికెదురుగా నిలబడి పర్యవేక్షిస్తూ వున్నాను నేను ప్రముఖులు కూర్చున్న ముందు వరుసలో ఒక్క సీటు మాత్రం ఖాళీగా వుంది రెండు మూడు వరుసల్లో కొన్ని సీట్లు ఎవరికోసమో నిర్దేశింపబడినట్లు ఖాళీగా వున్నాయి.

                ఇంతలో ముందు ద్వారం గుండా ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించేడు. ఆరడుగల ఆజానుబాహువు, నెరిసిన తల తెల్లని పట్టు లాల్చీ, పైజామా వేసుకున్నాడు. అతని వెనుక అతని భార్య కాబోలు ఆకుపచ్చరంగు పట్టుచీరలో వుంది. ఆమెతో పాటు ఓ పదేళ్ల కుర్రాడు. వాళ్లు ముగ్గురూ సరాసరి ముందువరుసలోని ముఖ్యుల్ని దాటుకొంటూ వచ్చి హాలంతటినీ ఓ మారు పరికించి రెండో వరుసలో ఖాళీగా వున్న సీట్లలో కూర్చున్నారు. ఆయనెవరో నాకు ఎప్పుడూ ఎక్కడా చూసినట్టు గుర్తులేదు. ఆహ్వానితులలో ముఖ్యుడో, లేదా అటువంటి ముఖ్యుల బంధువో తెలియలేదు

                దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా…

                గౌళ రాగంలో త్యాగరాజస్వామి రెండవ పంచరత్న కీర్తన మొదలయింది. తెలిసిన స్ధానిక కళాకారులు కొందరొస్తే వారికి సీట్లు చూపించి కూర్చోబెడుతున్నాను. ఇంతలో పట్టులాల్చీ ఆసామి లేచి స్టేజీకి దగ్గరగా వెళ్లి చేతిలోని ఫ్లాష్‌ కెమెరాతో నాలుగైదు ఫోటోలు తీసి వచ్చి భార్య పక్కన కూర్చున్నాడు.

                ఉదయం సభ కావటాన, అందులోనూ సెలవుదినం కాకపోవటాన రద్దీ ఆట్టే లేకపోయినా హాలు సుమారుగా నిండుగానే వుంది.

                కర్ణాటక సంగీత రత్నత్రయంలో అగ్రగణ్యులైన త్యాగరాజస్వామి వారికి ప్రతియేటా తిరువైయూరులో ఆరాధనోత్సవాలు విశేషరీతిలో జరుగుతూండడం, సంగీతమే తన జీవిత ధ్యేయమూ, గమనమూ, అనుకుని ఉచితంగా సంగీతాన్ని నేర్పి ఎన్నో వందల మంది సంగీత కళాకారుల్ని తయారుచేసిన మార్కండేయ శాస్త్రిగారు ఆ ఉత్సవాలకు శిష్యులతో సహా వెళ్లి రావడం కొన్ని ఏళ్లుగా జరుగుతూనే వుంది. అయితే యింతమంది సంగీత కళాకారులూ, అభిమానులూ వున్న యీ పట్నంలో కూడా అటువంటి ఉత్సవాలు శక్తికొద్దీ జరిపి త్యాగరాజస్వామి వారినెందుకు ఆరాధించకూడదూ అనే పట్టుదలతో ఉద్యమించి అభిరుచిగల వారిని సంప్రదించి రెండేళ్ల క్రిందటే మొదటి ఉత్సవం జరిపారు. ఆయన కృషికి తగిన ప్రోత్సాహమే లభించింది. ఉత్సవ కమిటీలో నగరానికి చెందిన కొందరు ప్రముఖులు వుండటం వల్ల ఆర్ధికపరమైన యిబ్బందులు ఆట్టే లేవు. ఇప్పుడు సంగీతాభిమానులకీ లోటులేదు

                ..ఎందరో మహానుభావులు…మేఘశ్యాముని అందాలు హృదయారవిందములో చూసుకొని బ్రహ్మానందాన్ని పొందేవారెందరో!… సామగానం చేసే ధన్యులెందరో… మనస్సనే కోతి సంచారాన్ని నిలుపుచేసి దివ్యమూర్తిని పొడగాంచే వాళ్లెందరో… పారమార్థిక మార్గంలో పరాత్పరుణ్ణి స్వరం, లయ, రాగం తెలిసి పాడే వాళ్లెందరో… భాగవతరామాయణాలు, వేదం, శాస్త్రపురాణాలు, ఆరు మతాల రహస్యాలూ, ముప్ఫయ్‌ మూడు కోట్ల దేవతల అంతరంగ భావాలూ తెలిసి, భావ రాగ తాళాల సౌఖ్యం గమనించి చిరాయువూ నిరవధి సుఖమూ అనుభవిస్తూ త్యాగరాజ బంధువులైన వాళ్లెందరో … రాముడికి యదార్థ దాసులైన వాళ్లెందరో… ఆ మహానుభావులందరికీ వందనాలు అనే భావనతో స్వరాన్వితమైన ఎందరో మహానుభావులందరికీ వందనములుఅనే ఐదవ ఘనరాగ పంచరత్న కీర్తన సంగీతాభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.

                అలా ఉదయం పది గంటలకు త్యాగరాజ పంచరత్న సేవ ముగిసింది. కొంత విరామానంతరం సంగీత సభలు మొదలవుతాయి ఔత్సాహిక, బాల కళాకారులకు పదేసి నిముషాలూ, లబ్ధ ప్రతిష్టులకు పదిహేను, ముప్ఫయ్‌ నిముషాలూ కేటాయిస్తూ అలా మూడురోజులూ రాత్రి తొమ్మిది గంటల వరకూ జరుగుతాయి.

                విరామ కాలంలో ప్రసాద వితరణ కార్యక్రమం మొదలైంది పట్నంలో ప్రఖ్యాతి గాంచిన ఓ పెద్ద హోటల్‌ వారు ప్రసాదాలు పంపడానికి ముందుకొచ్చారు. పులిహార, చక్కెర పొంగలి రెండు వేర్వేరు ఆకు దొన్నెల్లో వేసి అందిస్తున్నారు కార్యకర్తలు వచ్చేవారిని ఒక వరుస క్రమంలో నిలిపే ప్రయత్నంలో నేనున్నాను.

                సరిగ్గా అప్పుడు మళ్లీ చూశానా పట్టు లాల్చీ ఆసామీని. ఈమారు కాస్త పరీక్షగానే చూశాను. స్థానిక రాజకీయ నాయకుడితో కల్పించుకుని మాట్లాడుతున్నాడు. పెద్దగా విరగబడి నవ్వుతున్నాడు. తననందరూ పరికిస్తున్నారో లేదోనని చుట్టూ చూస్తున్నాడు కాస్సేపాగి ప్రసాదాలిచ్చే స్థలం వద్దకు వచ్చి అబ్బో చాలా క్యూ వుందే. ఇచ్చేయ్యలేరా అంటూ చెయ్యి చాపేడు ఒకరిద్దరికి యిచ్చాక అక్కడి కార్యకర్త యితగాడికీ ప్రసాదం యిచ్చేడు

                క్యూలో రావొచ్చు గదా! అంటున్నారెవరో అతగాడు పట్టించుకుంటేనా?

                ప్రసాదాలకోసం క్యూ ముందుకు జరుగుతోంది. ప్రసాదం తెచ్చిన రెండు అండాలూ ఖాళీ అవుతున్నాయి వెంటవెంటనే నిండుతున్నాయి కూడా. జరగబోయే సంగీత సభల గురించీ, ఏర్పాట్ల గురించీ అంతా మెచ్చుకుంటున్నారు. శాస్త్రిగారి కృషిని అందరూ పొగుడుతున్నారు

                ఊరికొక్కరు చాలు శాస్త్రిగారి వంటివారు మన సంస్కృతీ సాంప్రదాయాలు రక్షింపబడ్డానికీ, సంగీత సాహిత్య కళారూపాలు వెలుగులోకి వచ్చి అందరికీ అందుబాటులోకి రావడానికీ.

                క్యూలో వెనుకనున్న ఎవరో అనడం నా చెవినా బడింది.

                మరి కొద్దిసేపట్లో ప్రసాద వితరణ కార్యక్రమం పూర్తయిపోతుందనగా ఆకుడొప్పలు అయిపోయాయి. ఉన్నవారు కొద్దిమందే. అయినా శర్మను పిలిచి వాటిని తెచ్చే పనిని వురమాయించేను. అంతలోకే అక్కడ మిగిలిన కొద్దిమందిలో ఒక ఆసామీ ముందుకొచ్చి.

                అయ్యాదొప్పల అవసరం లేదు దైవ ప్రసాదం కాసింతైనా చాలు. చేతుల్లో వేసేయ్యండి అన్నాడు

                పొందూరు ఖద్దరు లాల్చీ, పంచ, పై మీద కండువాతో వున్నాడతను దాదాపు యాభై ఏళ్లుండొచ్చు నాతనికి.

                ఔనండీ. దొప్పలు అవసరం లేదు.అన్నారు మరొకరు.

                నిజానికి ఆ కొద్దిమంది కోసం ఆకుదొప్పల్ని తెప్పించనక్కరలేదు. కానీ అందరికీ అన్నీ సమానంగా అందాలి. ఎవరూ నిరాశపడకూడదన్నది శాస్త్రిగారి అభిమతం. అందుకే

                ఫర్వాలేదు. వచ్చేస్తున్నాయి. ప్రసాదం కావల్సినంత తీసుకోండిఅన్నాను.

                కాస్సేపట్లోనే ప్రసాద వితరణ ముగిసింది. హాల్లో కచ్చేరీ ప్రారంభమైంది. అందరూ లోపలికి దారి తీస్తున్నారు నా వంతు ప్రసాదాన్ని నేనూ తీసుకుని లోపలకు వెళ్లే ప్రయత్నంలో వున్నాను.

                ఇంతలో అయ్యా. ఒక్కమాట!అని ఎవరో పిల్చినట్టయి వెనుదిరిగి చూశాను. ఆయనే! క్యూలో చివరన ఉండిపోయినాయన. ఖద్దరు లాల్చీ వేసుకున్న యాభైయేళ్ల వ్యక్తి! చేతిలో చిన్న సంచీతో త్వరత్వరగా నావైపు వస్తున్నాడు.

                ఆగి, ఏమిటీఅన్నట్లు చూశాను అతని వంక.

                అయ్యా, తమరు కార్యకర్తల్లా వున్నారు నాకో చిన్న సహాయం కావల్సి వుంది. శాస్త్రిగార్ని కలవాలో, మీరే అందుకు తగిన వారో నాకు తెలియదు అన్నాడు.

                చెప్పండి.అన్నాను.

                మాది సీతారాంపురం. ఈ వూరికి కొత్తవాడిని. కేవలం తమరు జరిపే యీ ఆరాధనోత్సవాల కోసమే వచ్చాను. ఇక్కడ నాకు బంధువులు గాని మిత్రులు గాని ఎవరూ లేరు భోజనమంటే బయట ఎక్కడన్నా చేయగలను. ఈ రెండు రాత్రులూ ఉండటానికి కాస్త వసతి సదుపాయం వుంటుందేమోనని…

                అతని వివరణలో అభ్యర్ధన వుంది. ఆశ వుంది. అయితే పై వూళ్లనించి వచ్చే సంగీత కళాకారులకైతే భోజన వసతి సదుపాయాలను ఉత్సవ కమిటీ కలుగజేస్తోంది. మరి …. ఇటువంటి వారి విషయంలో…

                నా ఆలోచన గ్రహించిన వాడిలా పోనీ నా అభ్యర్ధనను శాస్త్రిగారికో, కమిటీ వారికో తెలియజేసినా సరే లేదా … నేనే స్వయంగా వారిని… అంటూ ఆగేడు. నేనిక ఆలోచించలేదు

End of preview – Rest of the book is available @ http://kinige.com/kbook.php?id=215 

Related Posts:

పొగడపూలు (వేలుపిళ్ళై కథలకు ముళ్ళపూడి ముందు మాట)

వేలుపిళ్లై On Kinige

గొప్ప కథలు రాసిన టాప్‌టెన్ రచయితలలో మీకు చప్పున గుర్తొచ్చే ఒక్కపేరు చెప్పమని అడగ్గానే చాసోగారు ఠక్కున చెప్పిన పేరు సి. రామచంద్రరావు.

రాసికన్న వాసికే విలువనిచ్చే అమితమిత రచయితలలో చాసో తరువాత సి. రామచంద్రరావు గారినే చెప్పుకోవాలి.

యాభై అరవై యేళ్లలో సి. రామచంద్రరావుగారు రాసినవి తొమ్మిది కథలే!

నల్లతోలు, వేలుపిళ్లై, ఏనుగులరాయి, టెన్నిస్ టూర్నమెంటు, గాళిదేవరు, కంపెనీలీజ్… మైగాడ్! వేటికవే! ఇన్నేళ్ళయినా వాడిపోని పొగడపూలు, అపురూపాలు, ఆరనిదీపాలు.

ఇవి నిజాయితీ గల కథలు అన్నారు చాసోగారు.

రోజూ ఎన్నో కథలు చదువుతున్నా, కథలలో మునిగితేలుతున్నా మళ్ళీ ఈయన కథ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేటంతటి అపురూప శిల్పాలు అన్నారు నండూరి రామమోహనరావు గారు.

ఆంధ్ర సచిత్ర వారపత్రికలో – ఆ గోల్డెన్ పీరియడ్‌లో నండూరివారి సరసన సహాయకుడిగా పనిచేసిన నేనూ, రావుగారి కథలకు బొమ్మలు వేసిన బాపూ ఈ కథలు చదివి త్రిల్లయిపోయేవాళ్ళం. చెప్పుకుని తల్చుకుని మురిసిపోయే వాళ్ళం…

కావ్యాల్లాంటి కథలు అన్నారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు.

అంతర్జాతీయ స్థాయిగల కథలు అన్నారు ఆదివిష్ణుగారు.

ఎన్నోయేళ్ళు – ఉహూ, ‘హూ – టీ’ ఎస్టేట్స్‌లో ఉన్నతాధికారిగా ఉన్న ఈ లాయర్ – మానేజర్- తెల్లదొరల – నల్లదొరల మధ్య హాయిగా విహరించారు. వెలుగునీడలు చూశారు. మనకు చూపించారు. టెన్నిస్ ఛాంపియన్‌గా ఎన్నో ట్రోఫీలు గెలిచారు. రావుగారి సోదరులందరూ టెన్నిస్ ఆటగాళ్ళే. ఒక సోదరుడి కొడుగు – వింబుల్డన్ ప్లేయర్ మహేష్ భూపతి.

రామచంద్రరావు గారు మనతో మాట్లాడేది తెలుగే అయినా టెలుగులా వినపడుతుంది. స్టయిలు హొయలు అంతా ఇంగ్లీషే. మాటా ఇంగ్లీషే. కాని మనసంతా తెలుగు. రామచక్కని తెలుగు. స్పష్టమైన ఖచ్చితమైన తెలుగు.

ఈ తెలుగు కథలకు పుట్టినిల్లు రావు గారి కలం అయినా చాలా కథలకు మెట్టినిల్లు తమిళనాడు! తమిళతంబీలు చాలమంది కనిపిస్తారు. అయినా వాళ్ళంతా మనవాళ్ళయిపోయి మనలో ఒకళ్ళయిపోతారు. అదీ రావుగారి శిల్పం – ప్రజ్ఞ!

ఇంగ్లీషు, తెలుగు, తమిళ పాత్రల చుట్టూ అల్లిన ఈ కథలు – ఏ దేశంలోనయినా రాణించే కథలు…. మాటల వెనక మనసులను ఎక్స్‌రే తీసి చూపించగల కథలు. అన్‌హెర్డ్ మెలోడీస్ ఆర్ స్వీటర్ స్టిల్ అన్నట్టు – ఆకుచాటుపిందెలా, మబ్బుచాటు వెన్నెలలా, నీడచాటు నీడలా – ఆయన కథలలో మాటచాటు మాటల అంతరంగ తరంగాలు – అపురూప శిల్పాలు.

గంగిగోవుపాలు గంటెడైనను చాలు అని వేమన్న అన్నా – ఈ గోవు మరిన్ని పాలు చేపాలని రావుగారిని కోరుకొందాం.

అంతవరకూ ఆయన రాసిన ఆ కాసినీ మేసిమేసి నెమరేసి ఆనందించుదాం…

-ముళ్ళపూడి వెంకటరమణ.

వేలుపిళ్లై On Kinige

The eBook is now available on Kinige @ http://kinige.com/kbook.php?id=142

Related Posts: