మిసిమి ఏప్రిల్ 2012 సంచిక సంపాదకీయం

గత దశాబ్ద కాలంలో తెలుగు సాహిత్య ధోరణుల మూల్యాంకనం చేసిన వ్యాసాలు పరిశీలిస్తే పరిస్థితి చాలా నిరాశాజనకంగా వుంది. ఇలా ఎందుకుంటుందో అనేది ఇప్పటి ప్రశ్న. అస్తిత్వ వేదనల నుంచి, మాండలికపు మలుపులలో నుంచి తెలుగు వాఙ్మయాన్ని బైటకు తెచ్చి కొత్తపుంత తొక్కించ వలసిన అవసరం ఎంతైనా వుందనేది నిర్వివాదం. ఇందుకు పూర్తి బాధ్యత పురస్కారాల కోసం పరుగులెత్తే రచయితలు – విశ్వ విద్యాలయాలలోని ఆచార్యులు తలకెత్తు కోవలసి వుంది.

ఇటీవల కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన సామల సదాశివతో ఇష్టాగోష్టి జరిపి వీడియో తీశాము. అప్పటికింకా పురస్కార ప్రకటన జరగలేదు. ఆయన మాటలలో మాండలిక ధోరణులుగాని, ప్రాంతీయ దురభిమానంగాని మాకెక్కడా వినిపించలేదు-బడిపంతులుగా జీవితాన్ని గడిపిన నిరాడంబర జీవి. హిందూస్థానీ సంగీత ధోరణులేగాక ఎన్నో విషయాలపై మిసిమికి వ్యాసాలు గత రెండు దశాబ్దాలుగా రాస్తూనే ఉన్నారు. వారి సహకారానికి కృతజ్ఞతలు – వారి పురస్కారానికి అభినందనలు!

ఊట్ల కొండయ్య -స్వయం శిక్షణతో జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేసి ఎన్నో మజిలీలు చేరిన కొండయ్య ఏ కొండా ఎక్కక పోయినా తెలుగుకు కొండంత సేవ చేశారు.

మనం ఎవరిని దేశం వదిలి పొమ్మని ఆందోళనలు – ఉద్యమాలు నడిపామో, ఆ తెల్లవారిలో కొందరు తెలుగులో ఎన్నో అపురూపమైన తాళపత్ర గ్రంథాలను పరిష్కరింపజేసి ప్రచురించారు. వాటి వివరాలు కొన్ని ఇస్తున్నాం.

ఎనిమిది జ్ఞానపీఠ పురస్కారాలు పొందిన కన్నడ సాహిత్యకారులలో ముఖ్యులు భైరప్ప. వారి ‘దాటు’ సమీక్షలో కులాలకూడలిలో నిలబడి నేటి సాంఘిక పరిస్థితిని పరిశీలించుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

‘గూడవల్లి రామబ్రహ్మం’ జీవితం – ఆదర్శం – ఆయన మర్త్యప్రపంచాన్ని వదిలి దశాబ్దాలైనా – ఇప్పటికీ చూడగలిగిన వారికి వెలుగు చూపుతూనేవుందని పాఠకులు రాసిన ఉత్తరాలే మాకు ప్రమాణాలు – అలాగే ‘బెంగుళూరు నాగరత్నమ్మ,’ ‘రావిచెట్టు రంగారావు’. ‘బద్దిరాజు సోదరులు’ వ్యాసాలు కూడ ఎంతో స్పందనను తెచ్చాయి.

-సంపాదకులు

* * *

మిసిమి ఏప్రిల్ 2012 సంచిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ అనుసరించండి.

మిసిమి ఏప్రిల్ 2012 On Kinige

Related Posts: