‘మనసు పలికె’ సందేశాత్మక వినోదం

రాసిన ప్రతి కథలో సందేశాత్మకత జోడించి హాస్యస్ఫోరకంగా కథను అల్లే నేర్పు ఈ రచయితకు ఉగ్గుతో అబ్బిన విద్య. కథనంలోని చతురత పాఠకుడిలో ఆసక్తి రేకెత్తించి వదలకుండా చదివిస్తుంది. క్లుప్తత ఇంకో ప్లస్ పాయింట్. దీనివలనే కేవలం నాలుగేళ్లలో 40 పై చిలుకు కథలు రాయగలిగారేమో! వినోదపు సిరా నింపుకుంటే గాని కదలని కలం ఆయనిది. గతంలో వచ్చిన ‘కుడి ఎడమైతే’ హాస్య కథలకీ, ఈ సంపుటిలోని కథలకూ పెద్ద వ్యత్యాసం లేదు. రెంటిలోనూ మానవ ప్రవృత్తుల్లోని వైరుధ్యాలు, మనుషుల విభిన్న, వింత పోకడలే కనిపిస్తాయి.

‘పడమటిగాలి’లో పాశ్చాత్య సంస్కృతి మత్తులో ఊగిపోతూ వెర్రి పోకడలు పోయే ‘గణపతిశాస్త్రి’ కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుని, అతి సున్నితంగా, వ్యంగ్యంగా తనదైన బాణీలో వెక్కిరించారు. భార్యాభర్తల మధ్య పొడచూపిన పలచని పొరలాంటి ఘర్షణని కథాంశంగా తీసుకుని రాసిన కథ ‘మన (సే) శత్రువు’. ఈ కథనంలో స్వగతమే డామినేట్ చేసింది. ముఖ్యంగా ఇతివృత్తాల్లో ‘ప్రేమ’ స్వైరవిహారం చేయడం గమనార్హం. కాలేజీ ప్రేమల నేపథ్యాన్ని మనసు గిలిగింతలు పెట్టేలా చిత్రిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ప్రేమికులు విధిగా పాటించాల్సిన కొన్ని పద్ధతులు, మనసుని అదుపులో పెట్టుకోవడంలోని మెళకువలు ‘లవ్ మి లావణ్యా!’ లాంటి కథల్లో సూచిస్తూనే మరోవైపు దంపతుల మధ్య ఉండాల్సిన అవగాహన ప్రాముఖ్యతని ‘సంగమం’ లాంటి కథల్లో చెప్పారు.

ఇందులోని పదహారు కథలూ భిన్న పరిమళాలు వెదజల్లే రంగురంగుల పువ్వులు. ఒక పువ్వుని ఆఘ్రాణిస్తే చాలు కమ్మిన మత్తుతో మనకు తెలియకుండానే మరో పువ్వుకోసం పేజీని తిరగేస్తాం.

గొరుసు
(ఆదివారం ఆంధ్రజ్యోతి, 22 జూలై 2012)

* * *

మనసు పలికె ” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె ద్వారా ప్రింట్ పుస్తకం ఆర్డర్ చేసి తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

మనసు పలికె On Kinige

Related Posts: