జీవన కెరటాలు అనే ఈ పుస్తకం కొద్దిపాటి చదువుతో, పల్లెటూరి స్థాయి నుంచి ఎదిగి అంతర్జాతీయ స్థాయి వ్యక్తులతో కలిసి పనిచేసి జీవితాశయాలు నెరవేర్చుకున్న ఓ సామాన్యుడి అసాధారణ గాథ. ఒడిదుడుకుల జీవన గమనంలో ఎంచుకున్న రంగంలో కర్మయోగిగా పనిచేసి అనుకున్నది సాధించిన ఓ వ్యక్తి కథ ఇది. కేకలతూరి క్రిష్ణయ్య స్వీయచరిత్ర ఇది.
విద్యుద్దీకరణ అనే పెద్ద పెద్ద పదాలతో చెప్పినా, కరెంట్ స్తంభాలు పాతించడమే కదా అని తేలికగా తీసేసినా, ఆయన స్వీయ కథా స్రవంతిని చదవడం ఆసక్తికరంగా ఉంటుంది.
వృత్తిపరమైన అంశాలతో రచన ప్రారంభించి సందర్భానుసారంగా తన కుటుంబ నేపధ్యం గురించి వివరించారు రచయిత. ఈ పుస్తకం చదువుతున్నప్పుడూ ఓ జీవిత చరిత్రలా కాకుండా వ్యక్తిత్వ వికాస గ్రంథంలా అనిపించడానికి ఇదే కారణం.
క్రిష్ణయ్యగారు చిన్న పల్లెలో అత్యంత బీద కుటుంబంలో జన్మించి హైస్కూల్ స్థాయి వరకు మాత్రమే చదివి బ్రతుకుతెరువు కోసం గుమాస్తాగా, పోలీసుగా, వ్యవసాయదారుడిగా, వైద్యుడిగా, సూపర్వైజర్గా పనిచేసి, ఇంజనీర్‌గా ఎదిగి మన దేశంలోనూ, ఇతరదేశాలలోనూ అంతర్జాతీయ సలహాదారులతో పని చేసి ఇంజనీరుగా, కాంట్రాక్టర్‌గా, వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. తను స్వయంగా నేర్చుకున్న ఎన్నో అంశాలను ఎందరో కుర్రవాళ్ళకు నేర్పి వారూ జీవితంలో స్థిరపడడానికి దోహదం చేసారు. ఆయన జీవితానుభవాలు నేటి యువతకు మార్గదర్శకంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ పుస్తకం ఎవరికి వారు చదువుకుని ప్రేరణ పొందవలసిందే. అయితే ఇందులోని కొన్ని అద్భుతమైన వాక్యాలను ఇక్కడ ఉటంకిస్తాను.
“ఆనందం డబ్బుతో రాదు, కావాలంటే రాదు. ఎదుటివారి ప్రేమ, ఆప్యాయత అర్థం చేసుకొని, మనం కూడా వాటిని ఇతరులకు ధారాళంగా పంచగలిగితేనే ఆనందం అందుతుంది.”
“తన గురించి, తన పరిస్థితి గురించి, బాధ్యత గురించి ఆలోచించకుండా ఇతరులను గొప్పల కోసం కొన్ని విధాలుగా సంతోషపెట్టాలనుకోవటం జీవితాన్నే దెబ్బతీస్తుంది.”
“ఎదుటి మనిషికి మేలు జరిగేపని, అప్పటికి మన గురించి చెడ్డగా అనుకున్నా పరవాలేదు, చొరవ తీసుకుని తెలియజెప్పడం మానవ ధర్మం.”
“పై మెట్టు మీద ఉన్నవాడు క్రింద మెట్లున్నాయని గుర్తుంచుకుంటే క్రిందపడడు.”
“దేవుడు మనతో కొన్ని పనులు ఎందుకు చేయిస్తాడో మనకు అర్థం కాదు. కష్టమైనా, ఇష్టం లేకపోయినా అంతా మన మంచికే అనుకుని చేసుకుపోవడమే మంచిది. కానీ అత్యాశతోనో, స్వలాభేపేక్షతోనో చేస్తే మేలు జరగకపోవచ్చు.”
“విద్య నేర్చుకున్న వ్యక్తి అయినా సమయానుకూలంగా, అప్పటి అవసరాన్ని గుర్తించి (కామన్ సెన్స్) ఆలోచించికపోతే, విజయం సాధించలేడు.”
“ఆయా అవసరమునకు తగినట్లు మన చర్య లేకపొతే మన కృషి నిరర్ధకమవుతుంది. మన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశంగా భావించాలి.”
“ఏ పని చిన్నది కాదు. చిన్న పని కదా అని అశ్రద్ధ చేయకుండా చేయడం వలన మేలు జరుగుతుంది.”
“మంచి ఉక్కు కొలిమిలో తయారు చేసి ఎంత కావాలో అంత పదును పెట్టుకోవచ్చు. ఇనుముకు ఎంత పదును పెట్టినా మండిపోతుంది. అదేవిధంగా సామర్థ్యం ఉన్న వ్యక్తి మీద వత్తిడి తెచ్చేకొద్దీ మెరుగుపడి పదును తేలుతాడు. సామర్థ్యం లేని వ్యక్తి మీద వత్తిడి తెస్తే తిరగబడతాడు.”
“మనకు ప్రాప్తం లేనప్పుడు దేవుడు కూడా ఇవ్వలేడు. ప్రాప్తం ఉన్నది ఎవరు తప్పించలేరు.”
“పని చేసేడప్పుడు ఇంకొకరి ఆలోచనలు వినకూడదనే అహంకారం ఉండకూడదు.”
“జీవితంలో సద్వినియోగం చేసుకున్న ప్రతి క్షణమూ నిన్ను కాపాడుతుంది. ”
“ప్రపంచంలో ఏ విషయమైనా, ఏ పనైనా పూర్తిగా నాకు తెలుసు అని చెప్పడానికి వీలు లేదు. ఎంత నేర్చుకున్నా, ఇంకా నేర్చుకోవలసింది ఎంతో ఉంటుంది. ”
“అత్యాశతో గాని, ఆవేశంతో గాని, స్వలాభంతోగాని తీసుకునే నిర్ణయాలు సక్రమంగా ఉండవు. మానవత్వంతో తీసుకున్న నిర్ణయం సక్రమంగా ఉంది మేలు చేస్తాయి.”
“ఒక వ్యక్తి బాధ్యత లేకుండా తిరిగేటప్పుడు ఒక లక్ష్యం, ఓర్పు, పట్టుదల ఉండవు. ఒక పధ్ధతి ఉండదు. ఏదో ఒక పని భయంతోనో, భక్తితోనో ఆరంభించి, కొన్ని పద్ధతులకు లోబడి, పని పూర్తి చేయవలననే ధ్యేయంతో, వ్యతిరేక పరిస్థితులకు తట్టుకొని నిలబడినప్పుడు ఓర్పు, సామర్థ్యం పెరుగుతుంది”
ఇలాంటి స్ఫూర్తినిచ్చే వాక్యాలు, ఉదాహరణలు ఈ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. 512 పేజీల ఈ పుస్తకం చదువరులకు ఎంతో ప్రేరణ కలిగిస్తుంది. రచయిత తన స్వీయ అనుభావాలు సొంత మాటలలో రాయడం వలన పుస్తకంలో అత్యంత నిజాయితీ కనపడుతుంది. ఆయన నిబద్ధత అర్థమవుతుంది.
జీవన కెరటాలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
కొల్లూరి సోమ శంకర్