మానవతా స్పర్శ – ‘నిర్ణీతి’ , ‘ఆరునెలలు ఆగాలి’ పుస్తకాలపై సమీక్ష

మానవీయ విలువలూ, ఆత్మీయతా స్పర్శా, అపారమైన ఆర్ద్రతా కలిగిన కథలే కలకాలం నిలబడతాయి. పి.ఎస్.నారాయణనిర్ణీతి’ సంపుటిలోని కథలు ఆ కోవకే చెందుతాయి. ‘పెళ్ళివారిల్లు పెద్దముత్తయిదువులా ఉంది’ లాంటి పోలికలు కథలకి కొత్త అందాన్నిస్తాయి. ‘పంచాగ్ని’ కథలో భారతి ఇంట్లో అద్దెకు దిగిన ఇద్దరు కుర్రాళ్లలో ఒకడైన సుధాకర్‌కి తెలిసిన ఓ నిజం, అతను ప్రవర్తించిన తీరూ పాఠకుల మదిలో చెరగని ముద్రవేస్తుంది. ‘నిర్ణీతి’ కథలో స్నేహానికి కల్యాణి ఇచ్చిన విలువా, దానివల్ల ఆమెకు ఎదురైన అనుభవం, ఫలితంగా ఆమె తీసుకున్న నిర్ణయం ఆసక్తిని రేపుతాయి. అత్యాచారానికి గురైన యువతి ధైర్యంగా నిలదొక్కుకుని, ఆత్మవిశ్వాసంతో పోరాడి ప్రతీకారం తీర్చుకోవడం ‘ఆరునెలలు ఆగాలి‘ నవల ఇతివృత్తం. అందుకు ఆమె పన్నిన వ్యూహాలూ, ఎదుర్కొన్న పరిస్థితులూ పాఠకులను ఉద్వేగానికి గురిచేస్తాయి.

- అయ్యగారి శ్రీనివాసరావు, ఆదివారం అనుబంధం, 3rd Aug 2014

 

 

 

 

 

 

 

 

ఆరు నెలలు ఆగాలి” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

ఆరు నెలలు ఆగాలి on kinige

 

Related Posts:

హృదయాన్ని కదిలించిన కథలు

మొత్తం 30 కథల్ని కూర్చి ‘శాలువా‘ పేరుతో అచ్చు వేయించారు. భాష, శైలి, భావం ఈ కథల్లో పొదిగారు. కథల్ని ఉపోద్ఘాతంతో మొదలెట్టటం ఆయనకు అలవాటు. అది ఆయన ఎత్తుగడ. వస్తుపరమైన గుణవిశేషంతో పాటు శిల్పం కూడ ప్రాధాన్యం సంతరించుకుంది.
కథ రాయగానే సరికాదు. సందేశం ఉండాలి. అప్పుడే దానికి విలువ పెరుగుతుంది.
కవి, రచయిత సమాజంలోని కుళ్ళు కుతంత్రం, మూఢనమ్మకాలు, అవినీతి వంటి అంశాల మీద దృష్టి సారించి వాటి నిర్మూలనకు తమ వంతు కృషి చేయాలి. అదే చేసారు పిడుగు పాపిరెడ్డి గారు. ఒక్క మాటలో చెప్పాలంటే పిడుగుల్లాంటి కథలు పాఠకులకు అందించారు కవి. పల్లె తనాన్ని పల్లె భాషలోనే చెప్తేనే రక్తికడుతుందనడానికి ఈ కథలే తార్కాణం.

తూములూరి రాజేంద్రప్రసాద్
చిత్ర సకుటుంబ సచిత్ర మాసపత్రిక జూలై 2013

* * *

“శాలువా” కథాసంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.
శాలువా On Kinige

Related Posts:

మాస్టర్ స్టోరీటెల్లర్ -వల్లంపాటి వెంకటసుబ్బయ్య

ప్రముఖ రచయిత, విమర్శకుడు, అనువాదకుడు అయిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథలపై సాక్షి దినపత్రికలో “ఒక కథావిమర్శకుడి తొలి అడుగుజాడలు” అనే శీర్షికతో వెలువడిన సమీక్ష ఇది.

* * *

కథలు ఎలా రాయాలో కథాశిల్పం అంటే ఏమిటో అని పుస్తకాలు రాసిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథలు ఎలా ఉంటాయి అనే కుతూహలం పాఠకులకు రావడం సహజం. వాటిని చదవాలని ఆశపడటమూ సహజం. అయితే మంచి తేయాకు ఏదో ఆ తేయాకు నుంచి మంచి డికాక్షన్ వస్తుందో రాదో పరీక్షించి చెప్పే నిపుణుడికి తేయాకు పండించడం తెలియకపోవచ్చు. బహుశా వల్లంపాటి ఈ ఎరుకతోనే కథలు రాయడం మానేశారా? లేదా సృజనలో నిమగ్నమైతే తానొక్కడే లబ్ధి పొందుతాడు… సృజన కోసం ప్రయత్నించేవాళ్లకు సహాయకారి కాగలిగితే అనేకమందికి ఉపయోగపడతాడు అనే సూత్రం కనిపెట్టడం వల్ల కథాసృజనను వదిలిపెట్టి కథావిమర్శను స్వీకరించారా?

ఏమైనాగాని ఆయన చనిపోయిన రెండుమూడేళ్లకు ఆయన కథలన్నీ ‘వల్లంపాటి కథలు’గా రూపుదాల్చడం చాలామంది పాఠకులకు సంతోషం కలిగించే విషయం. అసలు వల్లంపాటి ఇన్ని కథలు రాశారా అని ఆశ్చర్యపోయే నేటి తరం రచయితలు కూడా ఉన్నారు. 1958లో కథలు రాయడం ఆరంభించిన వల్లంపాటి 1970ల వరకూ కథలు రాసినట్టున్నారు. ఆ తర్వాత రాయలేదు. ఈ కథలన్నింటిని పరిశీలిస్తే వీటిలో కూడా ఆ రోజుల్లోని కథల ధోరణి, పేదరికం, మధ్యతరగతి విలువలు, రచయిత తననుతానే రచయితగా ప్రధానపాత్రగా ప్రవేశపెట్టి రాయడం వంటివి కనిపిస్తాయి. రాసిన ప్రతి కథా ఏదో ఒక సమస్యను చూపడానికి ఏదో ఒక విలువను ప్రతిపాదించడానికి ఏదో ఒక పతనాన్ని సూచించడానికి ప్రయత్నించడం అర్థమవుతుంది. అదే సమయంలో దృక్పథం అంటూ ఏమీ లేకుండా కలం నుంచి జారిన కథలు కూడా లేకపోలేదు. అందుకే వీటిని వల్లంపాటి ప్రామాణికమైన రచనలుగా ఎంచకుండా తొలి అడుగుజాడలుగానే చూడాలి. అందుకనే ఏమో తాను జీవించి ఉండగా, వీటి అవసరం ఉందా లేదా అనే సంశయంతో వల్లంపాటి వీటిని పుస్తకంగా తెచ్చి ఉండరు.

కాని- కథాపాఠకులు, మరీ ముఖ్యంగా కథారచయితలు ఈ కథలను తప్పక చదవాలి. ఒకకాలపు జీవితం గురించి తెలుసుకోవడానికి కథాపాఠకులు, ఒక రచయిత/విమర్శకుడు కథారచనను సాధన చేసిన పద్ధతిని ఆ పద్ధతిలో అతడి జయాపజయాలను అర్థం చేసుకోవడానికి కథా రచయితలు ఈ పుస్తకాన్ని చదవాలి.

వల్లంపాటి ఈ సంకలనంలో కచ్చితంగా కొన్ని కథలతో గాఢమైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. ‘రానున్న శిశిరం’ వంటి కథల్లో తన చేయి తిరిగిన రచనాశైలితో ఆశ్చర్యం గొలుపుతారు. కథకు అవసరంలేని వృధావర్ణనలు, వృధా సంఘటనలు కథలో ఉండరాదు అని నమ్మిన వల్లంపాటి తన కథలన్నింటిలోనూ ఆ సూత్రాన్నే పాటించారనిపిస్తుంది. స్ట్రయిట్‌గా పాయింట్‌లోకి దిగడం చూడవచ్చు.

అయితే ఇవి ఇప్పుడు ఔట్ డేటెడా?
మధ్యతరగతి ఉన్నంతకాలం మధ్యతరగతి గురించి రాసిన ఏ కథా ఔట్‌డేటెడ్ కాదు. కాకపోతే కాసింత మేకప్ మార్చుకొని మళ్లీ మళ్లీ కనిపిస్తుంటుందంతే. ఆ సంగతి అటునుంచితే- ప్రతి రచయితా చేసిన కృషి రికార్డు కావాల్సిందే. ఆ మేరకు వల్లంపాటి కథలకు సంబంధించి ఈ సంపుటి ఒక నాణ్యమైన రికార్డు. రాయలసీమ భాషకు, జీవితానికి దర్పణం లాంటి నవలను రాయాలన్న కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వల్లంపాటి తన కోరికను తీర్చుకోలేకపోవడం ఒక లోటైతే అలాంటి ఎన్నో కలలు కనే సాహిత్యకారులకు స్ఫూర్తిగా వారిని ప్రోత్సహించే శక్తిగా ఉండి వారి కలలు సాకారం కావడానికి ప్రయత్నించిన ఆయన ప్రెజెన్స్ లేకపోవడం చాలా పెద్ద లోటు. పుస్తకం ప్రింటింగ్, క్వాలిటీ చాలా బాగున్నాయి.

కె.సువర్చల

“వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథలు” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.
వల్లంపాటి కథలు On Kinige

Related Posts:

శీలమా? అదియేమి?

అనామకుడు అనే కలంపేరుతో డా. ఎ. ఎస్. రామశాస్త్రి రాసిన కథా సంకలనం – “శీలమా? అదియేమి?“.

సిద్ధాంతాల మూసకట్టులోంచి కాకుండా విశాల జీవితానుభవం నుంచి వచ్చిన కథలివి. ఇందులోవి చాలా వరకు బహుమతి పొందిన కథలే. ఇందులో మొత్తం 21 కథలున్నాయి. కొన్ని కథల గురించి ప్రస్తావిస్తాను.

అనంతం: ఈ కథలోని ప్రధానపాత్ర రామ్మూర్తికి హఠాత్తుగా తను చచ్చిపోతాననే భయం పట్టుకుంటుంది. కొడుకు కోడలితోనూ, మనవడితోనూ, మిత్రబృందంతోనూ ఉల్లాసంగా ఉండలేక పోతాడు. ఎప్పుడూ అదే దిగులు….. మానసికంగా కృంగిపోతుంటాడు. భయాన్ని దూరం చేసుకోడానికి వీలైనంత సేపు సముద్రపుటొడ్డున కూర్చుంటుంటాడు. చివరికి, చావుకి భయపడేకన్నా, చచ్చిపోవడమే నయమని భావించి సముద్రంలోకి నడవబోతాడు. అప్పుడో పదహారేళ్ళ అమ్మాయి ఎదురై అతన్ని ఆపుతుంది….. జీవితం వైపు నడుపుతుంది. ఆసాంతం ఆసక్తిగా సాగిపోయిన ఈ కథలో సముద్రం గురించి, కెరటాల గురించి రాసిన వాక్యాలు చదువుతూంటే మనమూ సముద్రం ముందు బీచ్‍లో కూర్చున్నట్లుంది.

అసంపూర్ణం: ఇది ఇద్దరు బావామరదళ్ళ కథ. బావ (కథకుడు) బాగా చదువుకుని గొప్ప శాస్త్రవేత్త అవుతాడు. అతనికెంత సేపు విజ్ఞానం మీదే దృష్టి! ప్రకృతిని ఆస్వాదించేంత సమయమూ, ఆసక్తి, భావుకత లేవు. ఇందుకు భిన్నంగా, మరదలు శైలజ భావుకురాలు. ప్రకృతిని ఆస్వాదించలేని బావ స్వభావాన్ని అర్థం చేసుకున్న ఆమె అతనికి తనకి జోడీ సరిపోదని గ్రహించి అతనితో పెళ్ళికి నిరాకరిస్తుంది. ఇద్దరూ వేర్వేరు పెళ్ళిళ్ళు చేసుకుని తమ జీవితాలను గడుపుతూంటారు. కథకుడు తను ఎంచుకున్న రంగంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు సాధిస్తాడు. అయినా అతనిలో ఏదో అసంతృప్తి. కొన్నేళ్ళ తర్వాత ఓ ఫంక్షన్‍లో బావామరదళ్ళు కలుస్తారు. మరదలితో తన బాధని వ్యక్తం చేస్తాడు. బదులుగా, మరదలు నవ్వుతుంది. ఆ నవ్వులో అతనికి ఎన్నో అర్థాలు గోచరిస్తాయి. మనుషులను అర్థం చేసుకోకబోతే, ఏం జరుగుతుందో ఈ కథ చెబుతుంది.

ఆరంభం: ఓ పౌరాణిక గాధ ఆధారంగా అల్లిన కథ ఇది. వసుదేవుడు కృష్ణుడిని రహస్యంగా రేపల్లెకి తీసుకురావడం గురించిన కథ. ఓ గడ్డపాయన బుట్టలో బాబుని పెట్టుకుని యమునానదిని దాటి రేపల్లె వస్తాడు. దార్లో ఎదురైన ఓ అవిటి బాలుడిని ఊరిపెద్ద ఇల్లెక్కడ అని అడుగుతాడు. కుంటి బాలుడు నందుడి ఇంటికి దారి చూపించడంతో పాటు, వర్షంలో బాబు తడవకుండా గొడుగు వేసి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. తెల్లారి నిద్రలేచేసరికి అతని శారీరక వైకల్యం పోయి, కాలు బాగయిపోతుంది. దైవం లీలలని ఉద్దేశించి రాసిన కథ ఇది.

ఏ గాలెటు వీస్తుందో: ఓ ఆర్థికవేత్త కథ ఇది. దేశంలో వడ్డీరేట్లు తగ్గాలని, అప్పుడే మన దేశం ఆర్ధికంగా పురోగతి సాధిస్తుందని నమ్మే అతను, పెన్షన్ డబ్బులపై వచ్చే వడ్డీ సరిపోక ఇబ్బందులు పడుతున్న మావయ్య కుటుంబాన్ని చూడాడానికి వస్తాడు. తను చెప్పే సిద్ధాంతం వారి జీవితాన్ని క్రుంగదీస్తుందోని గ్రహిస్తాడు. మరి తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడా, లేదా? చిన్నప్పుడు తనకి సాయం తన వృద్ధికి దోహదం చేసిన మావయ్యకి ఇప్పుడతను ఏమైనా చేయగలిగాడా? ఆర్ధికవేత్త దృక్పథానికి, సామాన్య మధ్యతరగతి మహిళ దృక్కోణానికి మధ్య ఉండే వైరుధ్యాన్ని ఈ కథ చక్కగా వ్యక్తీకరించింది.

ఓ అజ్ఞానం లోంచి: ఇది ఓ పాత్రికేయుడి కథ. ఒక రచయిత గురించిన కథ. రెండు సుప్రసిద్ధ నవలలు రాసి, ఆ తరువాత విరమించి ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా గడుపుతున్న ఆ రచయితని ఇంటర్వ్యూ చేసి ఓ వ్యాసం రాయలనేది విలేఖరి ఉద్దేశం. ఆ రచయిత ఎవరు? ఆ విలేఖరి సంకల్పం నెరవేరిందా?

ఓ వందనోటు కథ: డబ్బు నల్లధనంగా ఎలా మారుతుందో సోదాహరణంగా తెలియజేసిన కథ ఇది. “నల్ల ధనం నిరోధించడం ప్రభుత్వం, బ్యాంకులు చేసేపని కాదు. నల్లధనం ఉండకుండా ఉండాలంటే కరెన్సీ నోట్లను కాదు తెలుపు చేయాల్సింది….. మన మనస్సులను..” అంటుందీ కథ.

క్రైం 2000: ఇంటర్‍నెట్ ఆధారంగా చేసే సైబర్ నేరాలను ప్రస్తావిస్తూ, బ్యాంకు దొంగతనం సులువుగా ఎలా చేయచ్చో ఓ కుర్రాడు నిరూపిస్తాడు. అయితే మరో కుర్రాడు అంతే తెలివిగా ఈ నేరాన్ని నిరూపించి పోలీసులకు సాయం చేస్తాడు. సైబర్ నేరాలు పెరిగిపోతున్న ఈ కాలంలో ప్రతీ ఒక్కరు ఎంత అప్రమత్తత ఉండాలో ఈ కథ చెబుతుంది.

గూళ్ళు: విపరీతంగా పెరిగిపోతున్న అపార్టుమెంట్ సంస్కృతిలో, ఓ ఫ్లాట్‍లో ఉంటున్న ఓ యువజంట కథ ఇది. వారు ఎదుర్కుంటున్న సమస్యలు, వారి జీవితం ఎలా సాగుతోందీ, మార్పు కోసం ఏం చేయాలనుకున్నారు… ఇలా ఈ కథ ఆసక్తిగా సాగుతుంది. ఈ కథలోని చాలా సంఘటనలు మన అందరి జీవితాలలోనూ తారసపడేవే.

తెరవెనుక: ఇదో చక్కని కథ. మనిషికి తప్పు చేయాలనే ఆలోచన ఎందుకు కలుగుతుంది? తప్పు అనే భావన ఆలోచనలో ఉంటుందా? ఆచరణలో ఉంటుందా? వ్యక్తిగతంగా మనుషులకి ఉండే పిరికితనమే సమాజానికి లాభదాయకమా? ఇలా ఎన్నో ప్రశ్నలతో ఆలోజింపజేస్తుందీ కథ.

మీ: స్వర్గస్తుడైన తండ్రికి ఉత్తరం రూపంలో నివాళి అర్పించిన కొడుకు కథ ఇది. మనసు ఆర్ద్రమైపోతుంది ఈ కథ చదివాక.

మెరీనా…మెరీనా: ” ఏదో వస్తుంది… ఇంకేదో పోతుంది. ఓ దశ నుంచి ఇంకో దశకి ఎదగడం…. ఇదే జీవితం” అని ఈ కథ చెబుతుంది. స్వేచ్ఛలోనే ఆనందం ఉందనుకునే వ్యక్తి, బాధ్యతలోనూ ఆనందం ఉందని తెలుసుకుంటాడీ కథలో.

విముక్తి: మరణానికి దగ్గరగా ఉండి, ఇంకా మృత్యుఘడియలు సమీపించని వయోవృద్ధులుండే కుటుంబాలు ఎదుర్కునే సమస్యల గురించిన కథ ఇది. మనుషుల అవసరాలు, మనస్తత్వాలు బంధాలను ఎలా నిర్దేశిస్తాయో ఈ కథ చెబుతుంది. నిడివి ఎక్కువైనా చివరిదాకా ఆసక్తిగా చదివిస్తుంది.

శీలమా? అదియేమి?: శీర్షికలోనే కథ ఏమిటో చెప్పేసే కథ ఇది. శీలమంటే ఏమిటో విశ్లేషించారు రచయిత ఈ కథలో. ప్రగతి అంటే బాహ్యాలంకరణ కాదని, ఆలోచనల్లోనూ, ఆచరణలోనూ పురోగతి కావాలని రచయిత అంటారు. ఈ కథలో రచయిత విశ్వనాధ సత్యనారాయణగారి వాడుక భాష వంటి గ్రాంథిక భాషను ఉపయోగించే శైలిని వాడడానికి రచయిత ప్రయత్నించారు.

రచన శైలి ఆహ్లాదంగా ఉంటూ, ఆసాంతం హాయిగా చదివించే గుణం కలిగిన ఈ కథలు చదువరులలో ఆలోచనలు రేకెత్తిస్తాయి. మంచి కథలని చదివిన తృప్తి పాఠకులకు కలుగుతుంది. ఈ పుస్తకం ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ నొక్కండి.

శీలమా ? అది యేమి? On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

కృష్ణారెడ్డి గారి ఏనుగు

అభిజాత్య కన్నడ-తెలుగు భాషా (అనువాద) సంశోధన కేంద్రం (రిజిష్టర్డ్‌)

ఇం.నెం. 5-10, రోడ్‌ నెం. 21, దీప్తిశ్రీనగర్‌, మియాపూర్‌ పోస్ట్‌

హైదరాబాద్‌ – 500 049. ఫోన్‌ : 040-65520386

మొబైల్‌: 9052563666కృష్ణారెడ్డి గారి ఏనుగు

మూలం : దివంగత పూర్ణచంద్ర తేజస్వి

అనువాదం : శాఖమూరు రామగోపాల్‌

ఇం.నెం. 5-10, రోడ్‌ నెం. 21,

దీప్తిశ్రీనగర్‌, మియాపూర్‌ పోస్ట్‌

హైదరాబాద్‌ – 500 049.

ఫోన్‌ : 040-65520286

ధర : రూ. 100/-

ప్రథమ ముద్రణ

జనవరి, 2011

ప్రతులు : 1,000

డి.టి.పి.

చేగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి

సెల్‌: 9989253506

ప్రింటర్స్‌

శ్రీ ఉదయ్‌ ప్రింటర్స్‌

నారాయణగూడ, విఠల్‌వాడి

హైదరాబాద్‌

ఫోన్‌ : 64511385, 23260110

ప్రతులకు:

శాఖమూరు రామగోపాల్‌

ఇం.నెం. 5-10, రోడ్‌ నెం. 21, దీప్తిశ్రీనగర్‌,

మియాపూర్‌ పోస్ట్‌, హైదరాబాద్‌ – 49.

ఫోన్‌: 04065520286, మొబైల్‌:9052563666

ప్రచురణ/పంపిణీదారులు :

అభిజాత్య కన్నడ – తెలుగు భాషా (అనువాద) సంశోధన కేంద్రం (రిజిష్టర్డ్‌)

ఇం.నెం. 5-10, రోడ్‌ నెం. 21, దీప్తిశ్రీనగర్‌, మియాపూర్‌ పోస్ట్‌

హైదరాబాద్‌ – 500 049. సెల్‌ : 9052563666


కథాక్రమం

తేట తెలుగులో కన్నడ కస్తూరి.. 6

అభిశంస.. 7

ఏరిన ముత్యాలు…. 9

నా మాట.. 12

కృష్ణారెడ్డి గారి ఏనుగు… 15

ఒక రూపాయి….. 76

మాయదారి మనస్సులోని మర్మం….. 93

వ్యభిచారం…. 111

వరాహ పురాణం….. 136

కాంచన రధం…. 162

ఫలితం…. 179

పేగుబంధం…. 195

పగుళ్ళు….. 213

యాతన (హింస). 225

వదులుకోటం (తెంచుకోటం). 239

తాతగారి వారసత్వ పరుపు మీద మనమడికి ఎంత నిద్రో!. 248

ఆముదం త్రాగిన తాసీల్దారు… 259

పాపం పిచ్చయ్య స్థితి.. 271

వైరాగ్యంలోని మహిమ… 281


దివంగత పూర్ణచంద్ర తేజస్విగారు కన్నడంలో సహజసుందరంగా అందించిన కథలను సేకరించి వాటిని తెలుగువారికి అందించాలని అనువాదం చేసిన శ్రీ శాఖమూరు రామగోపాల్‌గారు అభినందనీయులు. అందులో పెద్ద కథ విలక్షణమైన కథగా కృష్ణారెడ్డిగారి ఏనుగుఉన్నందువలన ఆ కథ విలక్షణం వల్ల ఈ కథా సంపుటికి ఆ కథ పేరే పెట్టడం జరిగింది.

Continue reading

Related Posts:

ఉత్సవ కానుక–ఆదూరి వెంకట సీతారామమూర్తి–కథా సంకలనం.


ఉత్సవ కానుక

 

 

 

ఆదూరి వెంకట సీతారామమూర్తి

 

 

హరివంశీ పచ్రురణలు

సీతమ్మధార, విశాఖపట్నం.


 

 

 

 

 

 

UTSAVA KAANUKA

(Anthology of Short Stories)

by

©Aduri Venkata Seetarama Murty

First Published : April 2007.

Title Designed by

Sri BAPU

Author’s Photo : Hema Shankar

For Copies :

Smt. A. Satyavathi Devi

50–52–2, Seetammadhara

Visakhapatnam – 530 013.

Ph : 0891 – 2536741

Visalandhra Book House, Hyderabad

and its branches in A.P.

Printed at :

Satyam Offset Imprints

Visakhapatnam – 16.

Price : Rs.50/–


 

ఇదీ వరుస

ఉత్సవ కానుక… 5

అమ్మాయిపెళ్ళి…… 22

తెరువు….. 37

పాత బంగారులోకం……. 57

ఊరట….. 67

చిలకాకుపచ్చ రంగు జరీచీర…. 81

బతుకుదారి…. 91

సర్వం జగన్నాథం…….. 103

వృత్తి ధర్మం……… 119

అంతరాలు……. 127

సంసారంలో హింసానాదం…….. 141

బంధం…….. 171

బెస్ట్‌ కపులూ – గిఫ్ట్‌ కూపనూ……… 178

గోరింట పండింది…. 188

ఆనందపురం వెళ్లాలి…. 202

‘ఆత్మధృతి’ కథాసంపుటిపై…. 210

కొన్ని సమీక్షలూ..లేఖలూ.. అభిప్రాయాలూ… 210

Seetarama Murty – A Gentle Persuader. 220


 

ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక. అక్టోబరు 24, 2003

 

 

ఉత్సవ కానుక

                ఆనాటి ఉత్సవ ప్రారంభ వేడుక ఎంత ఘనంగా జరగాలో అంత ఘనంగానూ మొదలైంది. తన జీవితమంతా శాస్త్రీయ సంగీత సాధనలోనూ, బోధనలోనూ గడుపుతూన్న సంగీత కులపతి మార్కండేయశాస్త్రి గారి ఆధ్వర్యంలో యీ ఆరాధనోత్సవాలు తక్కువస్ధాయిలో జరుగుతాయని ఎవరూ వూహించరు. సరస్వతీ గాన సభ హాలు అత్యంత సుందరంగా అలంకరింపబడింది. వేదిక అంతా పరిమళాలు విరజిమ్మే రంగురంగుల పూలగుత్తులతో నిండి వుంది వేదికకు ఒక ప్రక్క త్యాగరాజస్వామి వారి తైలవర్ణచిత్రం గులాబీలూ మల్లెల దండలతో అలంకరింపబడి వుంది.

                ఉదయం పూజానంతరం తిరువీధి ఊరేగింపు కార్యక్రమం. తరువాత పంచరత్న సేవ. వేదికమీద అటు పాతిక మంది, యిటు పాతిక మంది నిష్ణాతులూ, ఔత్సాహికులూ అయిన గాయనీ గాయకులూ, వేదిక మధ్యలో మైకు ముందు శాస్త్రిగారు. ఆయన తమ గళాన్ని సరిచేసుకున్నారు హాలంతా సంగీతప్రియులతో నిండి వుంది.

                జగదానంద కారక… జయ జానకీ ప్రాణ నాయక…

                త్యాగరాజ స్వామి వారి కీర్తనల్లో ఆణిముత్యాలనదగ్గ పంచరత్న కీర్తనల్లో మొదటి కీర్తనను ఆలపించారు శాస్త్రిగారు వేదిక మీద కళాకారుల కంఠాలన్నీ ఏక కంఠంగా సేవ మొదలయ్యింది. నాట రాగంలో సాగిన ఆ కీర్తనకు హాల్లో ప్రేక్షక సీట్లలో కూర్చున్న ఔత్సాహిక కళాకారులు తాళం వేయడం ప్రారంభించారు చూడ్డానికీ వినడానికీ కూడా మనోహరంగా వుందా దృశ్యం.

                ఎల్ల లోకాలకూ ఆనందదాయకమైన వాడా… జానకీరమణా సుగుణాకరా. .. పాపరహితుడా… అందమైన ముఖము, అమృతమయమైన వాక్కు గలవాడా… ఇంద్రనీల మణుల కాంతివంటి కాంతిగల శరీరము గలవాడా… చంద్ర సూర్యనేత్రుడా… సృష్టి స్థితి లయాలకు కారకుడా… శరణాగతుల్ని పాలించేవాడా… సత్కవుల హృదయాలలో వేంచేసి వుండేవాడా… దేవముని స్నేహితుడా.. త్యాగరాజాది వరభక్తులు నిన్ను నుతిస్తున్నారు…అనే భావన శ్రావ్యమైన నాటరాగంలో ఒదిగి కళాకారుల కంఠాలగుండా జాలువారి హాలు హాలంతా పరుచుకుంది.

                అటు సంగీత వాహినిలో ఓలలాడుతూనే ఒక కార్యకర్తగా మొదటి ద్వారానికెదురుగా నిలబడి పర్యవేక్షిస్తూ వున్నాను నేను ప్రముఖులు కూర్చున్న ముందు వరుసలో ఒక్క సీటు మాత్రం ఖాళీగా వుంది రెండు మూడు వరుసల్లో కొన్ని సీట్లు ఎవరికోసమో నిర్దేశింపబడినట్లు ఖాళీగా వున్నాయి.

                ఇంతలో ముందు ద్వారం గుండా ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించేడు. ఆరడుగల ఆజానుబాహువు, నెరిసిన తల తెల్లని పట్టు లాల్చీ, పైజామా వేసుకున్నాడు. అతని వెనుక అతని భార్య కాబోలు ఆకుపచ్చరంగు పట్టుచీరలో వుంది. ఆమెతో పాటు ఓ పదేళ్ల కుర్రాడు. వాళ్లు ముగ్గురూ సరాసరి ముందువరుసలోని ముఖ్యుల్ని దాటుకొంటూ వచ్చి హాలంతటినీ ఓ మారు పరికించి రెండో వరుసలో ఖాళీగా వున్న సీట్లలో కూర్చున్నారు. ఆయనెవరో నాకు ఎప్పుడూ ఎక్కడా చూసినట్టు గుర్తులేదు. ఆహ్వానితులలో ముఖ్యుడో, లేదా అటువంటి ముఖ్యుల బంధువో తెలియలేదు

                దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా…

                గౌళ రాగంలో త్యాగరాజస్వామి రెండవ పంచరత్న కీర్తన మొదలయింది. తెలిసిన స్ధానిక కళాకారులు కొందరొస్తే వారికి సీట్లు చూపించి కూర్చోబెడుతున్నాను. ఇంతలో పట్టులాల్చీ ఆసామి లేచి స్టేజీకి దగ్గరగా వెళ్లి చేతిలోని ఫ్లాష్‌ కెమెరాతో నాలుగైదు ఫోటోలు తీసి వచ్చి భార్య పక్కన కూర్చున్నాడు.

                ఉదయం సభ కావటాన, అందులోనూ సెలవుదినం కాకపోవటాన రద్దీ ఆట్టే లేకపోయినా హాలు సుమారుగా నిండుగానే వుంది.

                కర్ణాటక సంగీత రత్నత్రయంలో అగ్రగణ్యులైన త్యాగరాజస్వామి వారికి ప్రతియేటా తిరువైయూరులో ఆరాధనోత్సవాలు విశేషరీతిలో జరుగుతూండడం, సంగీతమే తన జీవిత ధ్యేయమూ, గమనమూ, అనుకుని ఉచితంగా సంగీతాన్ని నేర్పి ఎన్నో వందల మంది సంగీత కళాకారుల్ని తయారుచేసిన మార్కండేయ శాస్త్రిగారు ఆ ఉత్సవాలకు శిష్యులతో సహా వెళ్లి రావడం కొన్ని ఏళ్లుగా జరుగుతూనే వుంది. అయితే యింతమంది సంగీత కళాకారులూ, అభిమానులూ వున్న యీ పట్నంలో కూడా అటువంటి ఉత్సవాలు శక్తికొద్దీ జరిపి త్యాగరాజస్వామి వారినెందుకు ఆరాధించకూడదూ అనే పట్టుదలతో ఉద్యమించి అభిరుచిగల వారిని సంప్రదించి రెండేళ్ల క్రిందటే మొదటి ఉత్సవం జరిపారు. ఆయన కృషికి తగిన ప్రోత్సాహమే లభించింది. ఉత్సవ కమిటీలో నగరానికి చెందిన కొందరు ప్రముఖులు వుండటం వల్ల ఆర్ధికపరమైన యిబ్బందులు ఆట్టే లేవు. ఇప్పుడు సంగీతాభిమానులకీ లోటులేదు

                ..ఎందరో మహానుభావులు…మేఘశ్యాముని అందాలు హృదయారవిందములో చూసుకొని బ్రహ్మానందాన్ని పొందేవారెందరో!… సామగానం చేసే ధన్యులెందరో… మనస్సనే కోతి సంచారాన్ని నిలుపుచేసి దివ్యమూర్తిని పొడగాంచే వాళ్లెందరో… పారమార్థిక మార్గంలో పరాత్పరుణ్ణి స్వరం, లయ, రాగం తెలిసి పాడే వాళ్లెందరో… భాగవతరామాయణాలు, వేదం, శాస్త్రపురాణాలు, ఆరు మతాల రహస్యాలూ, ముప్ఫయ్‌ మూడు కోట్ల దేవతల అంతరంగ భావాలూ తెలిసి, భావ రాగ తాళాల సౌఖ్యం గమనించి చిరాయువూ నిరవధి సుఖమూ అనుభవిస్తూ త్యాగరాజ బంధువులైన వాళ్లెందరో … రాముడికి యదార్థ దాసులైన వాళ్లెందరో… ఆ మహానుభావులందరికీ వందనాలు అనే భావనతో స్వరాన్వితమైన ఎందరో మహానుభావులందరికీ వందనములుఅనే ఐదవ ఘనరాగ పంచరత్న కీర్తన సంగీతాభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.

                అలా ఉదయం పది గంటలకు త్యాగరాజ పంచరత్న సేవ ముగిసింది. కొంత విరామానంతరం సంగీత సభలు మొదలవుతాయి ఔత్సాహిక, బాల కళాకారులకు పదేసి నిముషాలూ, లబ్ధ ప్రతిష్టులకు పదిహేను, ముప్ఫయ్‌ నిముషాలూ కేటాయిస్తూ అలా మూడురోజులూ రాత్రి తొమ్మిది గంటల వరకూ జరుగుతాయి.

                విరామ కాలంలో ప్రసాద వితరణ కార్యక్రమం మొదలైంది పట్నంలో ప్రఖ్యాతి గాంచిన ఓ పెద్ద హోటల్‌ వారు ప్రసాదాలు పంపడానికి ముందుకొచ్చారు. పులిహార, చక్కెర పొంగలి రెండు వేర్వేరు ఆకు దొన్నెల్లో వేసి అందిస్తున్నారు కార్యకర్తలు వచ్చేవారిని ఒక వరుస క్రమంలో నిలిపే ప్రయత్నంలో నేనున్నాను.

                సరిగ్గా అప్పుడు మళ్లీ చూశానా పట్టు లాల్చీ ఆసామీని. ఈమారు కాస్త పరీక్షగానే చూశాను. స్థానిక రాజకీయ నాయకుడితో కల్పించుకుని మాట్లాడుతున్నాడు. పెద్దగా విరగబడి నవ్వుతున్నాడు. తననందరూ పరికిస్తున్నారో లేదోనని చుట్టూ చూస్తున్నాడు కాస్సేపాగి ప్రసాదాలిచ్చే స్థలం వద్దకు వచ్చి అబ్బో చాలా క్యూ వుందే. ఇచ్చేయ్యలేరా అంటూ చెయ్యి చాపేడు ఒకరిద్దరికి యిచ్చాక అక్కడి కార్యకర్త యితగాడికీ ప్రసాదం యిచ్చేడు

                క్యూలో రావొచ్చు గదా! అంటున్నారెవరో అతగాడు పట్టించుకుంటేనా?

                ప్రసాదాలకోసం క్యూ ముందుకు జరుగుతోంది. ప్రసాదం తెచ్చిన రెండు అండాలూ ఖాళీ అవుతున్నాయి వెంటవెంటనే నిండుతున్నాయి కూడా. జరగబోయే సంగీత సభల గురించీ, ఏర్పాట్ల గురించీ అంతా మెచ్చుకుంటున్నారు. శాస్త్రిగారి కృషిని అందరూ పొగుడుతున్నారు

                ఊరికొక్కరు చాలు శాస్త్రిగారి వంటివారు మన సంస్కృతీ సాంప్రదాయాలు రక్షింపబడ్డానికీ, సంగీత సాహిత్య కళారూపాలు వెలుగులోకి వచ్చి అందరికీ అందుబాటులోకి రావడానికీ.

                క్యూలో వెనుకనున్న ఎవరో అనడం నా చెవినా బడింది.

                మరి కొద్దిసేపట్లో ప్రసాద వితరణ కార్యక్రమం పూర్తయిపోతుందనగా ఆకుడొప్పలు అయిపోయాయి. ఉన్నవారు కొద్దిమందే. అయినా శర్మను పిలిచి వాటిని తెచ్చే పనిని వురమాయించేను. అంతలోకే అక్కడ మిగిలిన కొద్దిమందిలో ఒక ఆసామీ ముందుకొచ్చి.

                అయ్యాదొప్పల అవసరం లేదు దైవ ప్రసాదం కాసింతైనా చాలు. చేతుల్లో వేసేయ్యండి అన్నాడు

                పొందూరు ఖద్దరు లాల్చీ, పంచ, పై మీద కండువాతో వున్నాడతను దాదాపు యాభై ఏళ్లుండొచ్చు నాతనికి.

                ఔనండీ. దొప్పలు అవసరం లేదు.అన్నారు మరొకరు.

                నిజానికి ఆ కొద్దిమంది కోసం ఆకుదొప్పల్ని తెప్పించనక్కరలేదు. కానీ అందరికీ అన్నీ సమానంగా అందాలి. ఎవరూ నిరాశపడకూడదన్నది శాస్త్రిగారి అభిమతం. అందుకే

                ఫర్వాలేదు. వచ్చేస్తున్నాయి. ప్రసాదం కావల్సినంత తీసుకోండిఅన్నాను.

                కాస్సేపట్లోనే ప్రసాద వితరణ ముగిసింది. హాల్లో కచ్చేరీ ప్రారంభమైంది. అందరూ లోపలికి దారి తీస్తున్నారు నా వంతు ప్రసాదాన్ని నేనూ తీసుకుని లోపలకు వెళ్లే ప్రయత్నంలో వున్నాను.

                ఇంతలో అయ్యా. ఒక్కమాట!అని ఎవరో పిల్చినట్టయి వెనుదిరిగి చూశాను. ఆయనే! క్యూలో చివరన ఉండిపోయినాయన. ఖద్దరు లాల్చీ వేసుకున్న యాభైయేళ్ల వ్యక్తి! చేతిలో చిన్న సంచీతో త్వరత్వరగా నావైపు వస్తున్నాడు.

                ఆగి, ఏమిటీఅన్నట్లు చూశాను అతని వంక.

                అయ్యా, తమరు కార్యకర్తల్లా వున్నారు నాకో చిన్న సహాయం కావల్సి వుంది. శాస్త్రిగార్ని కలవాలో, మీరే అందుకు తగిన వారో నాకు తెలియదు అన్నాడు.

                చెప్పండి.అన్నాను.

                మాది సీతారాంపురం. ఈ వూరికి కొత్తవాడిని. కేవలం తమరు జరిపే యీ ఆరాధనోత్సవాల కోసమే వచ్చాను. ఇక్కడ నాకు బంధువులు గాని మిత్రులు గాని ఎవరూ లేరు భోజనమంటే బయట ఎక్కడన్నా చేయగలను. ఈ రెండు రాత్రులూ ఉండటానికి కాస్త వసతి సదుపాయం వుంటుందేమోనని…

                అతని వివరణలో అభ్యర్ధన వుంది. ఆశ వుంది. అయితే పై వూళ్లనించి వచ్చే సంగీత కళాకారులకైతే భోజన వసతి సదుపాయాలను ఉత్సవ కమిటీ కలుగజేస్తోంది. మరి …. ఇటువంటి వారి విషయంలో…

                నా ఆలోచన గ్రహించిన వాడిలా పోనీ నా అభ్యర్ధనను శాస్త్రిగారికో, కమిటీ వారికో తెలియజేసినా సరే లేదా … నేనే స్వయంగా వారిని… అంటూ ఆగేడు. నేనిక ఆలోచించలేదు

End of preview – Rest of the book is available @ http://kinige.com/kbook.php?id=215 

Related Posts:

అస్తిత్వ వేదన ధ్వనీ – ప్రతిధ్వనీ : పెద్దిభొట్ల – (మునిపల్లెరాజు)

(from foreward to Peddibhotla Subbaramayya kathalu part one)

His voice is gruff and deep

He keeps his mustache clean and trim

(His registered trade mark is no joke!)

He travels light in the twilight zones

On uncaring streets, a mission on his shoulders

With a tattered Note Book and a broken pencil

To record the marginalized, lonely

Defenseless and the naked urchins!

In this ancient promise he never fails

A conscious keeper of his home town’s soul!!

* * *

సభా వేదిక నుండి ఏవో అసహన కదలికలు, వాకాటి పాండురంగారావుగారు -ఎంతో గంభీరంగా ఉన్నట్లున్నా ఆందోళనగా నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. సాహిత్య సభ నిండుగా వున్నది. ఇంకా వస్తున్నారు- సాహితీ ప్రియులు. దాదాపు గంట ఆలస్యం. పురస్కార గ్రహీత అంతులేడు. కబురులేదు.

సందర్భం- రావిశాస్త్రి స్మారక సాహితీ నిధి పురస్కారం. వేదిక -సుందరయ్య విజ్ఞాన కేంద్రం-హైదరాబాదులో బాగ్‌లింగంపల్లి ప్రాంతం.

నిజం చెప్పద్దూ- నాకూ టెన్షన్‌గానే వుంది. మెట్లకింద గ్రంథాలయం గదిలోకి వెళ్ళి, నా నోట్‌బుక్‌లో పైపద్యం గిలుకుతూ కొట్టివేతలతో తంటాలు పడుతున్నాను. అది-యీ తరుణంలో దైవదత్తంగా జ్ఞాపకం వచ్చింది.

“అడుగో…. అడుగో- పెద్దిభొట్ల…” అని పైనించి వినబడ్డ ఆశ్చర్యార్థకాలతో సభామందిరంలోకి జొరబడ్డాను.

ఆనాటి స్టార్ ఎట్రాక్షన్- శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య! పురస్కార గ్రహీత- ఏ ఆందోళనా లేని నిబ్బరం. ఏ అంతర్యుద్ద పదజాలం వినని వినోద ప్రదర్శన. శ్రీకాకుళం నుంటి ఇప్పుడే దిగానని చెబుతున్నాడో, దారిలో మాగురువుగారి మనుషులెవరో తటస్థిస్తే మాట్లాడుతున్నానని సర్దుబాటు చేస్తున్నాడో! దూరప్రయాణపు దుమ్ములేదు. దేశద్రిమ్మరి ప్రవక్త- శరశ్చంద్ర ఛటర్జీవలె కన్పించాడు. మీసాల చాటున చిరునవ్వును మాత్రం నేను గమనించాను.

ఇటువంటి సాదా భేటీలు (Brief encounters) మరికొన్ని. ఒక్కోక్క (encounter)లో ఒక్కోక్క రూపం! ఒక్కొక్కటీ చెప్పమంటారా?

దుఃఖార్తుల, శ్రమార్తుల, శోకార్తుల, అనాధుల అభాగ్యుల సామూహిక విషాద గానానికి బాణీలు కడుతున్న సంగీత దర్శకుడా?

లోకంలో చరిత్ర హీనుల పదయాత్రకు ప్లేకార్డ్స్ – రాసి పెడ్తూన్న పేవ్‌మెంట్ చిత్రకారుడా?

మాక్టింగోర్కీ అద్భుత నాటకం Lower depths లో వృద్ద యాత్రికుడు ‘లూకా’ లాగా తన వేదాంత ప్రవచనాలతో యీ బీభత్స లోకానికి శాంతిని ప్రసాదిస్తున్న రష్యన్ పౌరుడి రెండవ శరీర ధారియా?

సాంప్రదాయ సాహిత్యంలో అలంకారాలను ఆధునిక సాహిత్యపు ఐడియాలజీలను, ఆధునికాంతర సాహిత్యపు పునాదియైన అనుభవాలను, నినాదాలను నిర్దేశాలనూ, నిర్ణయాలనూ- తృణీకరించి- తన అంతఃకరణే తన ధనస్సుగా, దాని విన్యాసమే తన అభివ్యక్తీకరణగా- కథలల్లిన మహా కథకుడిగా- ఎవరేమని రాసినా- పెద్దిభొట్లవారు నాకొక పొగమంచు వెనక “మిస్టిక్” గానే గోచరిస్తాడు.

దళిత బ్రాహ్మణుల చరిత్రకారుడిగా వేగుంట మోహన్ ప్రసాదుకూ, బాల్యం పారేసుకున్న భవభూతి భ్రాతగా కప్పగంతుల మల్లికార్జునరావులకు తోచినా, నాకు మాత్రం-దోస్తా విస్కీపాత్ర, మాస్కోలో పేద విద్యార్థి రోడియన్ రాస్కోల్నికావ్‌గా- చీకటి చలిరాత్రిలో అతడు వేచివున్న వీధిలో శిల్పవిగ్రహంలా, దీనురాలు సోన్యాకోసం నిరీక్షిస్తున్న బుద్దుడిలా గోచరిస్తాడు.

(Rodiam Raskolnikov is involved in a tragic struggle for the good of man facing the dark night of his soul) ఒకసారి ఆయన నాకు టైగర్ స్వామిగా దూరంనుంచి కన్పించాడు (ఈ టైగర్ స్వామి నిజంగా ఎంతో సాత్వికుడైనా, తన తపస్సుకు భంగం కలిగించేవారికి పులిగా కన్పించి దూరానికి తరిమివేసేవాడని దక్షిణామూర్తిగారి రచనల్లో వుంది).

అంతర్జాతీయం స్థాయిలో కథా యజ్ఞాశ్వాల మీద స్వారీ చేసిన “నీళ్ళు, పూర్ణాహుతి” గురించి పునఃమూల్యాంకనానికి ఆవశ్యకతలేదు. ఇది చిరకాలంగా నా నిశ్చితాభిప్రాయం. ఈ కథానికల్లో లౌకిక సాఫల్యతా, ఆధ్యాత్మిక సాఫల్యతాల ముచ్చట ఎవరైనా చేసి వున్నారా? ఒక కథాస్రష్ట విశ్వరూపంలో, ఒక ఉన్మత్త పథికుడి కాలిగుర్తుల్లో ఒక ఉద్విగ్న భావుకుడి సనాతన చింతనలో, కథానికే ఒక చిరు కావ్యంగా పరివర్తన చెంది, వస్తుశిల్ప శైలీ నిర్మాణాల్లో రాగ మాలికల రూపం దాల్చి- నీరు నిదురరాని యామినీ యాతనలో వినిపించే ముఖారి రాగ విషాదగీతాలు-కొన్ని పెద్దిభొట్ల వారి కథలు. కొన్ని గాదు, ఎన్నో.

నాకు ఎన్ని పర్యాయాలో ఆశ్చర్యం కలిగించిన విషయం- యింతటి భావుకుడు, తన గురువు గారు కవిసామ్రాట్ విశ్వనాథ వార ముద్దువడ్డనలను ముసిముసినవ్వులతో స్వీకరించిన శిష్యుడు-కవిత్వారాధనకు ఏల పూనుకోలేదో.

పెద్దిభొట్లవారిలో ఒక విద్రోహ కవి- కాజీ నజ్రుల్ ఇస్లాం, మరొక జిడ్డు కృష్ణమూర్తి, వేరొక విశ్వప్రేమి, ఒంగోలు నుంచి గుంటూరు పట్టణం దాటి విజయవాడలో విగ్రహారాధన చేయని పూజారిగా, తనను ప్రవాసిగా భావించకుండా, విజయవాడ భూధూళినే మహిమాన్వితంచేయ బూనుకున్న కనకదుర్గామాత కాపాలికుడు- కలిసి వున్నారు.

విజయవాడ కర్మక్షేత్రంలో రాజమార్గాలను కాలిమార్గాల్నీ-సర్వే చేసినవాడు- కనకనే “చీకటి” కథలో పాసెంజర్లకోసం వేచివున్న సావిత్రినీ, జలగలాంటి అప్పారావును, కథలో వచ్చే సోషలిస్టు స్వప్నాన్నీ కాపాలికుడిగానే సృష్టించగలిగాడు.

తనకాలపు నిరంతర అంతర్యుద్ధ చరిత్రను అర్థనిమీలిత నేత్రాలతో రక్తిగా చెప్పగల-కన్యాశుల్కంలో పాత్రను అవలీలగా పోషించగలడు.

మరెందరు రచయితలో నాముందు నిలిచి సుబ్బరామయ్యగారితో పరిచయం చేయమంటున్నారు.

ఎడ్గార్ వాలెన్ కాబోలు అతని పేరు. నా చిన్నతనంలో అతని డిటెక్టివ్ నవలలు చాలా చదివి వుంటాను. అప్పుల బాధలు మీద పడ్డప్పుడల్లా, హోటల్ గదిలో బైఠాయించి, ఏకదాటిగా పందొమ్మిది స్టెనోగ్రాఫర్లకు పందొమ్మిది నవలలను డిక్టేటు చేయగలిగిన అపూర్వ మేధావి. లండన్ నగరపు అండర్ వరల్డ్ మోసగాళ్ళు, చిల్లర దొంగలు, పెద్దబందిపోట్లు- అందరినీ ముద్దు పేర్లతో పిలువగలిగినవాడు.

తన చుట్టూ సమాజంలోని దీన జీవుందరిసమస్యలను మననం చేసుకునే చిన్న కథలచక్రవర్తి ఆంటన్ చేహోవ్, ఏడుసార్లు నోబెల్ పురస్కారానికి ప్రతిపాదించినా తిరస్కృతుడైన అద్భుత కథకుడు, మానవకారుణ్యం గురించి వ్రాయని సోమర్ సెట్ మామ్, కథా ప్రపంచంలో నా వారసుణ్ణి గుర్తించానని స్వర్గ దామం నుంచి వక్కాణిస్తున్న తిలక్- పెద్దిభొట్లవారి మిత్రవర్గం బహుదొడ్డది.

మహా కథక మాంత్రికులు- తమ జన్మ పట్నాలనుండే ఆవిష్కృతులైనారు. గైడీ మొపాసా పారిస్ నగరం, ఓహెన్రీ న్యూయార్క్, మార్క్‌ట్వైన్ మిసిసిపీ, శ్రీ పాదసుబ్రహ్మణ్యశాస్త్రిగారి రాజమహేంద్రవరం, మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి మచిలీపట్నం, కొడవటిగంటి కుటుంబరావుగారి తెనాలి, రావిశాస్త్రిగారి విశాఖపట్నం, చాసో “యిజీనగరం” దాశరథి వారి ఖమ్మంమెట్టు, కాళీపట్నంవారి “చిక్కోలు” వట్టికోట ఆళ్వారుస్వామి సికిందరాబాదు- జన్మభూమి వాసన లేనిదే ఏ కథకూ- దీర్ఘకాలిక విలువ వుండగలదా?

విజయవాడ ఇంద్రకీలాద్రి శిలలపైన చెక్కవలసిన మానవ వేదనా గాథల- పౌరాణికుడు యీ పెద్దిభొట్లవారు.

ఎట్లాగో- ఒక ఆంగ్ల కవితతో పదం పలికింది. ఇక ఒక ఆంద్ర కవితతో యీ ప్రసంగాన్ని ముగిద్దాం. అసుకవి సహబాధితుడు- అజంతా- అభిశప్త జీవుల Muffled drum beater! ఆంద్రప్రభ దినపత్రికలో తేదీ లేకుండా వ్రాసిన శిలాఫలకం మీద చెరిగిపోని శాసనం.

“వాళ్ళను ముట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయని ముందే హెచ్చరిస్తున్నాను” – ప్రారంభ పంక్తి.

“బహుశ ఇది చరిత్ర శాపం కావచ్చునేమో! లేక ప్రతీకారం అనాలా? ముమ్మాటికి యిది వాస్తవం వాస్తవం. చరిత్ర సుడిగాలిలో ఎవరైనా కొట్టుకుని పోక తప్పదు, కాలానికి దయాదాక్షిణ్యాలు లేవు.

సామాన్య గృహస్థుడు బతకటం ఇప్పుడు ఎంత కష్టం? బ్రతుకు ఎంత దుర్బరం, ఎంత బాధాకరం?” చివరి పంక్తులు.

***

ఈ శాపగ్రాస్తులకు చరిత్రలో చిరస్థానం కల్పించిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య అయ్యవార్లను కథా వినువీధిలో ధ్రువతార అనండి (కప్పగంతుల) కొండంతవెలుగు అనండి (విహారి) అన్ని Under statements కిందే లెక్క.

సికిందరాబాద్,

3-5-2010.

పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు – 1 On Kinige

Visit now http://kinige.com/kbook.php?id=190 to rent/buy this short story collection from Peddibhotla Subbaramaiah.

Related Posts:

పరిచయం (నండూరి రామమోహనరావు గారు 1964లో వేలుపిళ్ళై కథలకు)

వేలుపిళ్లై On Kinige

సి. రామచంద్రరావుగారి కథలంటే నాకు చాలా ఇష్టం. అవి ఇంకా చాలామందికి ఇష్టం కావడానికి కనీసం ఒక శతాంశమైనా నేను కారణం కావడం నా కిప్పటికీ సంతోషం కలిగిస్తుంది.

రామచంద్రరావుగారిని చూస్తే కథలు రాసేవాడిలా, అందులోనూ తెలుగులో రాసేవాడిలా కనిపించరు. తెలుగు కథలు రాసేవారి కొక ప్రత్యేకమైన తరహా వుంటుందని నా ఉద్దేశం కాదు. అయినా, రామచంద్రరావుగారిలో కథా రచయితను చటుక్కున పోల్చుకోవడం కష్టం. తెలుగును, ఇంగ్లీషును కూడా ఇగ్లీషు యాసతో మాట్లాడే ఆయనను టెన్నిస్ ప్లేయరనో, ఏ టీ, కాఫీ ఎస్టేట్ల మేనేజరనో పరిచయం చేస్తే తేలిగ్గా నమ్మవచ్చు. నిజానికి ఆయన ఈ రెండూ కావడమే కాక, కథా రచయిత కూడా కావడం ఒక విశేషం.

ఈ కథలలో స్థలం తెలుగుదేశం కాదు; పాత్రలు, వాతావరణం తెలుగువికావు. అందుచేత వీటిలో తెలుగుదనం లోపించిందంటే నేనేమీ చెప్పలేను – తెలుగు వాతావరణం వుండటమే తెలుగు కథలకు గొప్పదనం కాదని తప్ప. ఈ కథావస్తువులన్నీ రచయిత తనకు తెలిసిన, పరిచితమైన జీవితంలో నుంచి ఏరుకుని, పరిశీలించి, భావనచేసి రాసినవే. అందుచేత, వీటిలో ఒక నిజాయితీ, ఒక వాస్తవికత వున్నాయి. కనుకనే, అవి సజీవంగా కదులుతున్నట్టు వుంటాయి; మనల్ని కదలిస్తాయి. ఈ గుణ విశేషం, వల్ల అవి నిస్సందేహంగా గొప్ప కథలే. అవి రాసినవాడు తెలుగువాడు కావడం మరొక విశేషం.

ఈ సంపుటిలో అన్నిటిలోకి నాకు నచ్చిన కథ ఏదంటే త్వరగా చెప్పలేను. అన్నీ అన్ని రకాలు; దేని వైచిత్రి దానిదే. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా మానవ స్వభావేన్మీలనం చేయడంవల్ల ఈ కథల వైవిధ్యం పఠితలను ఎంతైనా ఆకర్షిస్తుంది. అయినా నిగ్గతీసి అడిగితే, ఈ సంపుటిలోని రెండవ కథను, దానికంటే ముందుగా మొదటి కథను పేర్కొంటాను. మొదటికథ నాకు బాగా నచ్చడానికి కారణం వారపత్రిక పోటీలో మొదటి బహుమతి పొందినదని మాత్రమే కాదు. చదవండి, మీకే తెలుస్తుంది.

రామచంద్రరావుగారు తరుచుగా వ్రాయరు. ఒక కథకు, మరొక దానికి మధ్య చాలా వ్యవధి వుంటుంది. ఇవి మొదట్లో ఆంధ్ర వార పత్రికలో ప్రచురిత మవుతున్నప్పుడు మళ్ళీ ఆయన కథ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పాఠకులు పెక్కుమంది వుండేవారు. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు తోచినప్పుడు ఆయన కథ రాస్తారు. ఉద్యోగ విధులు అడ్డురావడం దీనికి ప్రధాన కారణం కాకపోవచ్చు. ఒకసారి అడిగితే ఆయన చెప్పినట్లు జ్ఞాపకం – మంచి కథావస్తువు దొరికేవరకు, దాని ఎత్తుగడనుంచి ముగింపు వరకు సంవిధానమంతా మనస్సులో స్పష్టంగా రూపు కట్టేవరకు తాను కథ రాయలేనని. ఇది నిజం కావచ్చు. కనుకనే, ఈ కథలలో ఇంత మంచి శిల్పం, వైవిధ్యం సాధించారేమో ననిపిస్తుంది. ఏమైనా, ఈ సంపుటిలోని కథలన్నీ నాలుగైదేళ్ళ క్రిందట రాసినవే. ఆ తరువాత ఆయన కథ రాసినట్టు నాకు జ్ఞాపకం లేదు.

ఎందుకు రాయడం లేదు సి.రా.రావు గారూ?

-నండూరి రామమోహనరావు

విజయవాడ,

14-12-64

వేలుపిళ్లై On Kinige

 

This eBook is now available on Kinige @ http://kinige.com/kbook.php?id=142

Related Posts:

మారుతున్న విలువల్ని తెలుగు కథ ప్రతిబింబిస్తోందా ? (వాసిరెడ్డి నవీన్)

కథ 2006 నుండి:

కథ 2006 On Kinige

సామాజిక అంశాలను అర్థం చేసుకోవడానికి సామాజిక, ఆర్థిక విషయాలపై చర్చ ఎంత అవసరమో, సాహిత్యాన్ని సరైనదారిలో నడపడానికి, దిశానిర్దేశానికి అర్థవంతమైన సాహితీ విమర్శ అంతే అవసరం. గత నాలుగైదు సంవత్సరాలుగా తెలుగులో వెలువడుతున్న కథాసాహిత్యాన్ని పరిశీలిస్తే సరైన విమర్శలేని లోపం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కథా రచనలో, నిర్మాణంలో అలసత్వం కనబడుతోంది. ఓ విమర్శకుడన్నట్లు చాలా కథలు సగం చెక్కిన శిల్పాలుగా, గొప్ప కథలు కావాల్సిన ఎన్నో కథలు కేవలం మంచి కథలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. ఈ విషయంపై సరైన చర్చ లేకపోవటం, ఒకవేళ అలాంటి చర్చ ఏదో ఒక రూపంలో మొదలైనా అది ప్రక్కదారి పట్టడం కథా సాహిత్యానికి, దాని ఎదుగుదలకూ ఆటంకంగా తయారైంది.

మన సమాజంలో ఇవాళ ఎన్నో విషయాలు చర్చకు వస్తున్నాయి. సామాజిక చిత్రం మారిపోతుంది. ప్రతి అంశాన్నీ ఆర్థిక విషయాలు శాసిస్తున్నాయి నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమై గ్లొబలైజేషన్ దిశగా సమాజం పరుగులు పెట్టడంతో వస్తున్న విపరీత పరిణామాలను మనం ప్రత్యక్ష్యంగా చూస్తూనే ఉన్నాం. గత పదేళ్ళ క్రితం ఉన్న అస్పష్టత, అయోమయం, అర్థంగానితనం ఇప్పుడేమీ లేదు. ఇప్పుడంతా నలుపు తెలుపుల్లో స్పష్టంగా ఒక వికృత సమాజం మన కళ్ళ ముందు నిలబడి ఉంది.

ఈ పెను మార్పులన్నీ మానవ జీవితాల్లోకి ఇంకిపోయి – మానవ విలువల స్వరూప స్వభావాలను సమూలంగా మార్చివేస్తున్నాయి. వ్యవస్థీకృత విలువల పునాదులు కదిలి పోతున్నాయి. ఈ మార్పులు మనల్ని ఎటువైపు నడిపిస్తాయో అర్థం కాకుండా ఉంది. ఈ దశలో అనేక కొత్త అంశాలు, కొత్త విషయాలు, సంబంధాలు కథా వస్తువులుగా తెరమీద కొచ్చాయి. వాటిని అందిపుచ్చుకోవడంలో, వాటిని కథలుగా మలచటంలో మన కథా రచయితలు నైపుణ్యాన్ని, పరిణితిని చూపలేకపోతున్నారు.

గ్లోబలైజేషన్‌కి వ్యతిరేకంగా భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగనంత చర్చ, ఉద్యమాలు మన రాష్ట్రంలో జరిగాయి. గ్లోబలైజేషన్ ప్రక్రియ ఆగలేదు గాని దాని ఫలితాల పట్ల ఒక అవగాహనని ఈ ఉద్యమాలు ఇవ్వగలిగాయనే అనుకొంటున్నాను. తీరా దాని పరిణామాలు తీవ్రరూపం దాల్చాక, అవి మానవ సంబంధాలను, విలువలను తీవ్రంగా ప్రభావితం చేసే స్థాయికి వెళ్ళాక ఈ విషయంపై మన కథకులెందుకో లోతుల్లోకి వెళ్ళలేకపోతున్నారు.

ఉదాహరణకి భూమినే తీసుకొందాం. దానికి రెక్కలొచ్చాయి. ఎక్కడెక్కడికో ఎగిరి పోతోంది. త్వరితగతిన అనేక చేతులు మారి చివరికి మల్టీనేషనల్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఈ ప్రక్రియ రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాదు, చిన్నపాటి పట్టణ ప్రాంతాల్లోనూ వేగవంతం అయింది. ఈ క్రమంలో భూమి విలువలలో వచ్చిన అనూహ్యమైన పెరుగుదలను మన సమాజపు మానవ సంబంధాలు తట్టుకోగలవా? భూమి ఇంక ఎంతమాత్రమూ పంటలు పండించే క్షేత్రం కాదు. కోట్లు కుమ్మరించగలిగే సాధనం కూడా. పోనీ ఈ ఫలితాలు అందరికీ అందుతున్నాయా అంటే అదీ లేదు. అతి తక్కువ ధరకు చేతులు మారిపోయి కోట్ల విలువను సంతరించుకొనే ఈ మాయ అంత తేలిగ్గా అర్థం కాదు. ఒకవేళ ఈ అనూహ్య సంపద సామాన్యుల చేతి కొచ్చినా దాని వెన్నంటి వచ్చే కృతకమైన విలువలు, విశృంఖల భావనలు, అనుమానాలు, ఆరాటాలు, హత్యలు, ఆత్మహత్యలు… ఇలా బహు ముఖాలుగా విస్తరించిన సమాజపు వికృత స్వరూపం ఇంకా మన కథల్లోకి రావటమే లేదు.

గతంలో ఉన్న అస్పస్టత ఇప్పుడు లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా కథా వస్తువుని ఎంచుకొని తదనుగుణమైన శైలిలో కథారచన కొనసాగాలి. కథారచన, ఆ మాట కొస్తే సాహితీసృజన ఎప్పుడూ ఆషామాషీ వ్యవహారం కాదు. మనల్ని శోధించుకొని అంతరంగం నండి తన్నుకు రావాలి.

***

ఈ సంకలనంలోని 13 కథలను ఈ నేపథ్యంలో పరిశీలించినప్పుడు అనేక విషయాలు ఇంకా స్పష్టంగా అర్థమవుతాయి.

మారుతున్న విలువల్ని సందర్భాలను కొత్తకోణం నుంచి పరిశీలించిన గేటెడ్ కమ్యూనిటీ, మా నాన్న నేను మా అబ్బాయి, యూ… టర్న్ కథల వంటివి ఇంకా విస్తృతస్థాయిలో రావలిసిన అవసరం ఉంది. అత్యంత సున్నితమైన విషయాలను నేర్పుగా చెప్పిన కథలివి. విలువల మధ్య అంతరాలు, తరాల మధ్య అంతరాలుగా పైకి కనబడినా వాటి నేపథ్యం మాత్రం మారిన సామాజిక స్థితిగతులే. పోగుపడుతున్న సంపద తెచ్చే అశాంతికి, వితరణశీలతకి ఉన్న సంబంధం కొంచెం ఆశ్చర్యం అనిపించవచ్చు… కానీ వాస్తవం కదా!

మారిన సమీకరణాలు, పల్లెల్ని సైతం విడవకుండా ఆవరించినా ఇంకా సజీవ సంబంధాలు కొనసాగడానికి కారణం. ఈ దేశ సంస్కృతి, ఇక్కడ పోరాట సంప్రదాయం కారణం. అందుకే ఊడల్లేన్ని మర్రి కథలో చెల్లవ్వకు ఓ ఆసరా దొరికింది. కుటుంబాల పట్ల ఎంత శతృత్వమున్నా మూగజీవాలను సైతం ఆప్యాయంగానే చూడగలిగారు (మాయిముంత). యవనిక కథలో నేపథ్యం మారిందే తప్ప విషయం అదే. మారిన విలువలు మనుషులను దూరంగా ఉంచినా ఇంకా తడి ఇంకిపోని మానవ హృదయం ఒకటి ఆవిష్కృతమయిందీ కథలో.

అయితే ఈ సంప్రదాయాన్ని ఇలా నిలుపుకోవడానికి ఎన్ని పోరాటాలు చేయాలో మరెంత వేదనను భరించాలో? ఇది భవిష్యత్తు తేల్చాల్సిన సమస్య.

గ్లోబలైజేషన్ దేశానికి, రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులను, ఎన్ని మల్టీనేషనల్ కంపెనీలను తెచ్చింది, ఎంత వ్యాపారాభివృద్ధి జరిగిందీ గణాంకాలతో సహా లెక్కలు వేసి చెప్పగలం కానీ అత్మహత్యల సంస్కృతిని ఈ స్థాయిలో తెచ్చింది అన్న విషయం మాత్రం అలవోకగా మర్చిపోతాం. వందలాది అత్మహత్యలు మన కంటికి సామాన్యంగా కనబడతాయి. ఎన్ని కుటుంబాలు రోడ్ల పాలైనాయో. ఎంతమంది ఉసుళ్ళలాగా ఎరవేసి వేటాడబడ్డారో (వేట)! ఎలా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళంతా ఒకచోటా మాట్లాడుకోగలిగితే (ఆత్మలు వాలిన చెట్టు) ఎన్నెన్ని సామాజిక కోణాలు ఆవిష్కృతమౌతాయో కదా !

ఎన్ని ప్రభుత్వాలు మారినా, గ్లోబల్ పెట్టుబడులు దేశంలోకి వరదగా వచ్చినా కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్న ఫ్లొరైడ్ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయాయి? మరే దేశంలోనయినా ఈ వికృతమైన అశ్రద్ధ సాధ్యమేనా? (జీవచ్ఛవాలు).

ఈ సంకలనంలో వస్తురీత్యా, శిల్పరీత్యా విలక్షణమైన రెండేసి కథలు ఉన్నాయి.

పురాణ చారిత్రిక గాథల్ని కొత్త కోణం నుండి దర్శించడం కథగా మలచటం తెలుగు సాహిత్యానికి కొత్తకాదు కానీ, ఈ సంకలనంలోని మృణ్మయనాదం కథలో సీత,అహల్యల సంభాషణ అనేక కొత్త విషయాలను చర్చకు తెస్తుంది. తెలుగులో బౌద్ద జాతక కథలను తిరిగి చెప్పడం దాదాపుగా లేదనే చెప్పాలి. ఆనాటి వాతావరణాన్ని ఆసరా చేసుకొని నేడు హింస, అహింస గురించి చర్చించడమే ఈ కథ (జాతక కథ) లోని ప్రత్యేకత.

అతడు… నేను.., లోయ చివరి రహస్యం కథ మళ్ళీ త్రిపురను గుర్తు చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఇటువంటి అబ్సర్డ్ కథలు ఎవరూ పెద్దగా రాసినట్లు లేదు. రచయిత కొత్తవాడైనా ఒడుపుగా కథ చెప్పటంలో, మానవ మస్తిష్కంలో సుడులు తిరిగే ఆలోచనలను సమన్వయం చేయడంలో విజయం సాధించినట్లే. అతను, అతనిలాంటి మరొకడు కథ 20 ఏళ్ళు మనల్ని వెనక్కి తెసుకెళ్ళి,ఆ రాజకీయ వాతావరణాన్ని కళ్ళముందు నిలబెట్టడంతో పాటు ఇప్పటి అవకాశవాద విద్యార్ధి రాయకీయాలను, వాటిని నడిపే శక్తుల మోసపూరిత తత్వాన్ని విలక్షణశైలిలో చిత్రించింది.

***

చివరిగా ఒక ప్రశ్న,మారిన సామాజిక విలువల్ని , మానవ సంబంధాల్ని సమగ్రంగానూ, కళాత్మకంగానూ తెలుగు కథ చిత్రించగలుగుతోందా?

9 ఏప్రిల్ 2006 ,హైదరాబాద్

Read Complete Katha 2006 eBook on Kinige @ http://kinige.com/kbook.php?id=119

కథ 2006 On Kinige

Related Posts: