మిసిమి డిసెంబర్ 2011 సంచిక – సంపాదకీయం
స్వయంకృషితో విద్యనేర్చి, విద్యార్థుల సంక్షేమానికి పునాదులు వేసి, హైద్రాబాదుకే కాకుండా ఇంకా విస్తృతంగా తెలుగునాట సాహిత్య సాంస్కృతిక పునర్వికాసానికి, అవిరళ కృషి సల్పిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. గోల్కొండ పత్రిక ద్వారా అనేకానేక తెలుగువారి సమస్యలను, స్త్రీ సంక్షేమాన్ని వెలుగులోకి తెచ్చి తన జాతిని మేలుకొల్పిన ధన్యజీవి. రాజకీయాలను ప్రభావితం చేసి ప్రజాసేవకు అంకితమైన త్యాగమూర్తి. సురవరం వారి జీవన ప్రస్థానం రేఖామాత్రంగా ఇస్తున్నాము.
ఒకప్పటి రాష్ట్ర విభజన మూలంగా ప్రక్కరాష్ట్రాలతో కలపబడిన తెలుగు ప్రాంతం వారి ఇక్కట్లు, అక్కడ తెలుగు భాషకి పట్టిన దుర్గతిని ఉద్వేగపూరితంగా ఏకరువు పెట్టారు గుత్తి చంద్రశేఖర రెడ్డి.
నిఘంటువులు, పదకోశాలు తయారు చేయవలసింది విశ్వవిద్యాలయాలు, అకాడెమీలు, కానీ తెలుగు వారికి మొదటి నుంచి ఒకరిద్దరు వ్యక్తులే శ్రమకోర్చి ఈ కార్యం నెరవేరుస్తున్నారు. అనువాదకులకు, భాషాశాస్త్రం అధ్యయనం చేసే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తమైన తెలుగు – ఇంగ్లీషు నిఘంటువును తయారు చేసింది ఇద్దరు వ్యక్తులే! వారు జె.పి. ఎల్. గ్విన్, వెంకటేశ్వర శాస్త్రి.
పుస్తకాల ప్రభావం ఎంతగా ఒక వ్యక్తిని తీర్చిదిద్దుతుందో కవి శివారెడ్డి తన వ్యాసంలో విపులీకరించారు. ఈ దిశలో రచయితల నుంచి మరిన్ని వ్యాసాలు ఆహ్వానిస్తున్నాం.
తెలుగు వచనపు పరిమళాన్ని – తెలుగు వాక్యపు నడకలోని సోయగాన్ని శ్రీపాదవారి రచనలలోనే చూడాలి. శ్రీపాద, ప్రబంధపద్య పండితుల అహానికి కించపడి తెలుగు వచన రచనకు ఉపక్రమించారు.
తెలుగు లెంకగా ప్రసిద్ధి చెందిన తుమ్మల సీతారామమూర్తి 111వ జయంతి. వారు తెలుగు భాషకు, తెలుగుజాతికి తెచ్చిన పేరు ప్రతిష్ఠలను ఎంతో చక్కని శైలిలో తెలియజేసారు గెల్లి రామమోహనరావు.
స్త్రీ స్వేచ్ఛకు ప్రతీక టంగుటూరి సూర్యకుమారి. తన బహుముఖ ప్రతిభతో ప్రపంచాన్ని గెలవడమే కాదు – తెలుగు బావుటా దశదిశలా ఎగురవేసిన సుకుమారిని 86వ జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాము.
చిత్రకళ మానవ చరిత్రతో ముడిపడి ఉంది. దాదాపు 50 వేల సంవత్సరాలనాడే గీతలు మొదలయి, కాలక్రమేణా సప్తవర్ణాల సమ్మేళనంతో సుసంపన్నమయిన చిత్రకళా చరిత్రను మిసిమి, పాఠకులకు అందిస్తున్నది.
నేతాజీ ఉత్తరాలు చదివి, దేశ స్వాతంత్ర్యం కోసం ఆనాటి నాయకులు చేసిన త్యాగలు, బలిదానాల వెలుగులో ఈనాటి దేశ పరిస్థితులను మనం చూస్తే ఆందోళనకు గురి కావడమే కాదు, సిగ్గుతో తలదించుకోవలసిన దుస్థితి ఇది.
– సంపాదకులు
మిసిమి డిసెంబర్ 2011 సంచిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.
మిసిమి డిసెంబరు 2011 On Kinige
మిసిమి వార్షిక చందాపై తగ్గింపు!! వివరాలకు ఈక్రింది లింక్ చూడండి.
Misimi 2011 Subscription On Kinige