మనమెరగని ఘంటసాల జీవితం

ఇంతవరకూ మనకు తెలిసింది ‘ఘంటసాల పాట’ మాత్రమే. ఆ ‘పాట’ వెనక ఉన్న జీవితం మనకు అంతగా పరిచయం లేదు. ఆ జీవితాన్ని, ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఘంటసాల కుమార్తె శ్యామల తీసుకువచ్చిన పుస్తకం ఇది. ‘నేనెరిగిన నాన్నగారు‘ అనే పేరు చూడగానే కేవలం తండ్రితో తనకున్న అనుబంధాన్ని మాత్రమే చెబుతున్నారేమో అనుకుంటాం. కానీ, ఘంటసాల పూర్వీకుల పుట్టుపూర్వోత్తరాలతో పాటు ఘంటసాల బాల్యం, యవ్వనం, అంచెలంచెలుగా ఆయన ఎదిగిన క్రమాన్ని పాఠకుడి కళ్లు చెమర్చేలా ఎంతో ఆ్రర్దతతో, ఆర్తితో అవలోకించే ప్రయత్నం చేశారామె. కృష్ణాజిల్లాలో పుట్టి, విజయనగరం సంగీత కళాశాలలో చదివి, సినిమాల్లో పాటలు పాడ్డానికి వెళ్లడమే మనందరికీ తెలిసిన ఘంటసాల చరిత్ర. కానీ .. పౌరోహిత్యం జరుపుకునే కుటుంబంలో పుట్టి ఘంటసాల అనుభవించిన కటిక పేదరికం, తోటి పండితుడి చేత అవమానం పాలై సంగీతం అభ్యసించాలన్న పట్టుదలతో ఎవరీకీ చెప్పకుండా మహారాజా సంగీత కళాశాలను వెతుక్కుంటూ విజయనగరం వెళ్లడం, అక్కడ పట్రాయని సీతారామ శాస్త్రి చూపిన ఆదరణ, ద్వారం వెంకటస్వామినాయుడుగారి మెప్పుతో సంగీత కళాశాలలో సీటు సంపాదించడం, పిల్లజమిందారైన సహపాఠి ముద్దు పాపారావు అపూర్వ చెలిమి, ఆకలికి తాళలేక జోలె పట్టి అన్నం అడుక్కున్న తీరు, ఆనాటి దేవదాసి కళావరురింగు సరిదెల లక్ష్మీనరసమ్మ ఇచ్చిన ఆతిథ్యం, నూనూగు యవ్వనంలో స్వాతంత్య్రోదమంలో పాల్గొని జైలు పాలవడం, మేనమామ కూతురు సావిత్రిని పెళ్లాడడం, సముద్రాల రాఘవాచార్య సహకారంతో మద్రాసుకు మకాం మార్చడం … హెచ్.ఎం.వి.రికార్డులకు పాడుతూ కాణీ, అణా సంపాదించడం, తోటి గాయని వక్కలంక సరళ (కాదు సుమా కల కాదు సుమా – కీలుగుర్రం ఫేం)తో పెళ్లికుదరబోయి, అనుకోని పరిస్థితుల్లో మరో రంగూన్ ‘సరళ’తో ద్వితీయ వివాహం జరగడం, తమిళ గాయకుడు సౌందరరాజన్ ‘అన్నా నీవు తమిళంలో పాడితే మాకు బతుకు తెరువు లేదన్నా’ అని మొరపెట్టుకోగానే తమిళంలో పాటలు పాడటం మానేయడం, లేమిలో తనకు సహాయం చేసిన విజయనగరం మిత్రులకు కలిమిలో సహాయం చేసి రుణం తీర్చుకోవడం, తప్పనిసరి పరిస్థితుల్లో నాగయ్యకు (లవకుశ) గాత్రదానం చేయడం వెనకున్న కథా కమామిషూ, ఉత్తరాది సంగీత ప్రముఖులు బడేగులాం అలీఖాన్, మహమ్మద్ రఫీలతో అనుబంధం … ఇలా ఎన్నెన్నో సంఘటనలను సేకరించి గుది గుచ్చి అందించారు శ్యామల. ఘంటసాల చనిపోయినప్పుడు పద్నాలుగేళ్ల ప్రాయంలో ఉన్న శ్యామలకు తెలిసింది కొంతే అయినా, తండ్రిపైనున్న అవ్యాజ్యమైన ప్రేమతో ఎందరెందర్నో కలిసి, తనకు తెలియని తండ్రి వ్యక్తిత్వాన్ని ఆరాతీసి అక్షర రూపం ఇచ్చారామె. పుస్తకం సాంతం చేతిరాతతో ఉన్నా చదవడానికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా కదిలించే శైలితో కథనం నడిపిన శ్యామల అభినందనీయురాలు. ఘంటసాల అభిమానులకు ఇదొక అపురూప కానుక.

గొరుసు
ఆదివారం ఆంధ్రజ్యోతి, 7 ఏప్రిల్ 2013

* * *

“నేనెరిగిన నాన్నగారు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్ సైట్ ద్వారా ప్రింట్ బుక్‌ని తగ్గింపు ధరకి తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.
నేనెరిగిన నాన్నగారు On Kinige

Related Posts: