నడుస్తున్న చరిత్ర మే 2012 సంపాదకీయం

తెలుగు’పెరియార్‌’ అయ్యుండాల్సిన సత్యమూర్తి

* * *

ఆర్ధిక విముక్తితో హెచ్చుతగ్గులులేని సోషలిస్టు సమాజం ఏర్పడుతుందనీ అందుకు మార్క్సిజమే సరియైున దారి అనీ నమ్మినవారు మనదేశంలో కమ్యూనిస్టు రాజకీయ పంథాలో నడిచారు. ఎత్తుగల్లో, ఉద్యమరీతుల్లో వచ్చిన అభిప్రాయభేదాలవల్ల వారు వేర్వేరు బాటల్లో నడిచినా అందరి లక్ష్యమూ సోషలిస్టు సమాజ స్థాపనే. అయితే, భారతదేశంలో వ్రేళ్లూనికొని ఉన్న కులవ్యవస్థ కమ్యూనిస్టు పార్టీలనూ, ఉద్యమాలనూ ప్రభావితం చేసింది.

బడుగుల సమస్యలన్నిటికీ అంతిమ పరిష్కారం కూడ మార్క్సిస్టు లక్ష్యసాధనలోనే ఉందని, సోషలిస్టు సమాజ స్థాపనతో తమ ఆర్ధిక సమస్యలతోపాటు సామాజిక వెనుకబాటుతనం కూడ మటుమాయం అవుతుందని, కమ్యూనిస్టు నాయకులైన సత్యమూర్తి లాంటి వారు భావించారు. అయితే కొన్ని సందర్భాలలో కలిగిన చేదు అనుభవాలతో లోలోపల సంఘర్షణకు గురై, కళ్లముందు కన్పించే వాస్తవాలకు తలొగ్గి విప్లవాగ్ని జ్వాలల్లోంచి ఎగసిన ఒక జ్వాలగా, ఒక సామూహిక అస్తిత్వానికి ప్రతినిధిగా ఆయన తలెత్తాడు. స్వాభిమానం నుండి ఎగసిన కవితా ఖడ్గంగా శివసాగరుడిగా గొంతు విప్పాడు.

తెలుగు నుడిపై ఆయనకున్నంత పట్టు చాలా తక్కువ మందిలో చూస్తాం. ఆరేళ్ల క్రిందట మూడుసార్లుగా ఆయనతో వివరంగా మాట్లాడిన సందర్భాల్లో తన అనుభవాలను, అభిప్రాయాలను ఆయన నాతో చెప్పారు. దళిత సమాజపు వర్తమాన సంఘర్షణను ఆయన విశ్లేషించిన తీరు, దానికి పరిష్కారాలుగా ఆయన సూచించిన మార్గాలు అచ్చెరువు గొల్పుతాయి.

మార్క్సిస్టు సిద్ధాంతం పట్ల ఆయనకున్న నమ్మకం అప్పటికి ఏమీ సడల్లేదు. కాని, దళిత జనులకేగాక, మొత్తం బడుగు వర్గాలందరికీ సామాజిక గౌరవమూ, సాంస్కృతిక మర్యాదా లభించే పరిస్థితులుంటేనే రాజకీయంగా అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతామని ఆయన గట్టి నిర్ణయానికే వచ్చాడు. అప్పటికప్పుడు గానీ, సమీప కాలంలోగాని మార్క్సిస్టు విప్లవ మార్గంలో బడుగులు పయనించం సాధ్యం కాదనీ, కులాధిపత్య వర్గాల పికిలి నుండి ఉద్యమ సంస్థలను విడిపించం అయ్యేపని కాదనీ ఆయన అభిప్రాయ పడ్డారు.

అంబేద్కర్‌ మార్గం సరైనదేగాని, ఆ బాటలో నడిపించగల నేతలు లేకపోవడమే బాధ కలిగిస్తున్నదని సత్యమూర్తి అన్నారు. ఇప్పుడు శారీరకంగా శక్తి నశించినందున తాను కొత్తగా ఉద్యమ నిర్మాణం చెయ్యగలననుకోవడం లేదని, కొత్తతరం ముందుకు వస్తుందని మాత్రం నమ్మకముందని ఆయన అన్నారు.

భాష విషయంలో తన అభిప్రాయాల్ని చెప్తూ బడుగువర్గాలు తమ భాషనూ, సంస్కృతినీ దూరం చేసుకోకుండనే ఆంగ్లాన్ని కూడ బాగా నేర్చుకోవాలన్నారు. ఆంగ్లాన్ని నేర్చుకోబట్టే ఉన్నతవర్గాల నుంచి నాయకులు తయారయ్యారనీ, అంబేద్కర్‌ ఆంగ్లం నేర్చుకొని, ఉన్నత చదువులు చదివివుండకపోతే, జాతీయస్థాయి నాయకుడుగా ఎదగగలిగేవాడు కాదనీ అన్నారు. అయితే, వేల ఏండ్లుగా తమ వారసత్వమైన భాషాసంస్కృతుల పునాదుల మీద నిలబడే, వాటి అండతోనే ఈ దేశపు బడుగువర్గాలు తేలిగ్గా ఆధునిక విద్యా సంపదను అందుకోగలుగుతాయన్నారు. బడుగుల భాషలో ప్రాచీన విజ్ఞానాన్నీ, ఆధునిక విజ్ఞానాన్నీ అందకుండ చేయడం కోసమే అసలైన తెలుగు నుడిని త్రొక్కివేశారన్నారు. ఒకనాడు సంస్కృతం, ఇప్పుడు ఆంగ్లం ఆధిపత్యంతో తమదైన విజ్ఞానాన్ని కోల్పోవడంతోపాటు, ఆధునిక విజ్ఞాన ప్రగతినీ అందుకోలేకపోతున్నారని అన్నారు. అందువల్ల – ప్రజల తెలుగులోనే అత్యంత ఆధునిక విజ్ఞానమంతా వారికి అందుబాటులోకి రావాలన్నారు. చైనాలో జరుగుతున్నదిదే అనీ, చైనాలో ఉత్పత్తులు అన్నిరంగాల్లో పెరగనికి ప్రజల భాషలో అత్యాధునిక విజ్ఞానాన్నంతా వారికందించమే కారణం అని సత్యమూర్తిగారన్నారు. (ఇదే మాటను ఈ ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాషోద్యమ సమాఖ్య నిరసన దీక్షాశిబిరంలో మాట్లాుతూ మార్క్సిస్టు పార్టీనేత బి.వి. రాఘవులు కూడ అన్నారు).

తెలుగు భాషోద్యమం పట్ల సత్యమూర్తి గారి విశ్లేషణ, ఉద్యమం ఎలా ముందుకు సాగాలో ఆయన చెప్పిన తీరు మరపురానిది. ఇలాంటి అవగాహన ఇప్పుడు దళితనాయకులుగా పోరాటాలు చేస్తున్నవారిలో ఎంతవరకు ఉన్నదో ఎవరికివారు ఆలోచించుకోవలసిందే.

తెలుగు భాషోద్యమం బడుగులకు వ్యతిరేకమైనదనే ఆరోపణను ఆయన త్రోసిపుచ్చారు. తెలుగు బడుగుల భాష. వారి భాష వారికెలా వ్యతిరేకమవుతుంది? వారి సొత్తు అది.. అని అన్నారాయన. ‘సంస్కృతాన్ని విపరీతంగా తెచ్చి తెలుగును తొక్కివేశారు. అసలు చదువునే మాకు అందకుండ చేశారు. మా భాషలో ఏదీ నేర్చుకోలేని స్థితిని తెచ్చిపెట్టి, ఇప్పుడు ఇంగ్లీషును కూడ అందకుండ చేస్తున్నారు అన్నదే మావాళ్ల బాధ’ -అని సత్యమూర్తిగారు స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ బడులలో తప్ప ప్రయివేటు బడులలో చేరగల స్తోమత బడుగులకెక్కడిది? అందువల్లే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం కావాలని వారంటున్నారు. దీన్ని ఎలా తప్పుపట్టగలం? అని ఆయన ప్రశ్నించారు.’మా భాషలో మాకు ఆధునిక విజ్ఞానాన్నంతా అందివ్వండి, ఉద్యోగాలివ్వండి, బ్రతుకుదెరువుకు మార్గాలు చూపండి. ఇదే సరైనదారి. అలా ఇవ్వలేనప్పుడు ఉన్నతవర్గాలతోపాటు మేమూ ఇంగ్లీషు బడులలో చదువుకునే మార్గాలు కల్పించండి. వారు చదివే చదువే మాకూ కావాలి. అందుకు మా వాళ్లకు రిజర్వేషన్లు కావాలి.’ ఇదీ సత్యమూర్తి గారి వాదం.

”ఇంగ్లీషు మీడియంలో చదువులు మాకూ కావాలని కోరుతున్నామంటే అర్థం మా తల్లిభాష తెలుగును వద్దంటున్నామని కాదు. మమ్మల్ని అణగదొక్కేందుకు ఆయుధంగా మరో భాషను ఉపయోగించుకోవద్దని అంటున్నాము. మాదగ్గర ఉన్న బలమైన ఆయుధం మా తల్లిభాష తెలుగు. దాని శక్తి మాకు తెలుసు. మా భాషలోనే మాకు సైన్సూ, లెక్కలూ, అన్నీ కావాలి. అది సాధ్యంకాక పోవడనికి కారణం ప్రభుత్వం అగ్రకులాధిపత్యంలో ఉండమే. అందువల్ల మా భాషను అణగద్రొక్కుతున్నారు. ఐనా, అది మా సాంస్కృతిక చైతన్యవాహినిగా మాలో ఎప్పుడూ బలంగానే ఉంటుంది. మా ప్రభుత్వం వచ్చినపుడు అది అన్నిరంగాల్లోనూ విజృంభిస్తుంది. అప్పటిదాకా మా బిడ్డలను అణగారిపొమ్మని చెప్పలేంగదా. కనుకనే ఉన్నతవర్గాల పిల్లలతో సమంగా మాకు చదువుల్లోనూ అన్ని అవకాశాలూ కావాలంటున్నాం.” – ఇదీ వారి సిద్ధాంత సారాంశం.

సత్యమూర్తి గారు వాస్తవవాది. అందువల్లే ఆయన కవితలు చిరకాలం నిలిచిపోయేంతగా గుర్తింపుకొచ్చాయి. తెలుగులో వచ్చిన ప్రజా కవిత్వాన్ని విలువకడితే శివసాగర్‌ కవిత మొదటివరుసలో నిలబడుతుంది. ఇతర కవుల కవితలు కూడ కొన్ని ఇదే వరుసలోకి వచ్చినా, వాటిలో పోరాట నేపథ్యంలోంచీ, బడుగు జీవితాల నేపథ్యంలోంచీ వచ్చినవి ఒక చేతివ్రేళ్లమీద ఎంచదగినంత మందివే.

ఆయనతో మాట్లాడినప్పుడు నాకనిపించింది – ఈయన తెలుగువారికి ‘పెరియార్‌’ అయితే ఎంత బాగుణ్ణు అని. పెరియార్‌ రామస్వామి నాయకర్‌ తమిళనాడులో నిర్మించిన ద్రవిడ ఉద్యమం బడుగువర్గాల సామాజిక రాజకీయ చైతన్యానికి, తమిళ భాషా సంస్కృతులు బలోపేతం కావడనికి దారితీసింది. అందుకు కారణం ఆ ఉద్యమ స్వభావంలో ఉంది. అక్కడి బడుగువర్గాలు ఎక్కువగా పాల్గొన్నందువల్లనే తమిళనాట సామాజిక రాజకీయోద్యమాల్లో స్థానిక భాషా సంస్కృతులు కీలకాంశాలు అయినాయి. అంతటి మార్పును తెలుగునాట తేగల నేతల అక్కర మనకు ఉంది.

సత్యమూర్తి గారు 84 ఏళ్లు జీవించాడు. ఒక రాజకీయ యోధునిగా, విప్లవకవిగా ఆయన ఎక్కువకాలం శ్రమించాడు. సామాజిక సంస్కర్తగా, జాతి పునర్నిర్మాణ దీక్షతో ఆయన కొన్నేళ్లయినా శ్రమించివుంటే, దాని ఫలితం బడుగువర్గాల మీద బలంగా ఉండేది. వారి సాంస్కృతిక రాజకీయ పునరుజ్జీవనానికి రాచబాట పడేది కూడ. ఆయన ఆ మార్గాన్ని ఎంచుకొనే సమయానికే ఆయన శరీరం పట్టుతప్పింది. అదను కుదరలేదు. ఆ జీవితం తాను నమ్మిన ఆశయాల సాధనకై చేసిన కృషిలోనే ముగిసింది. ఆయన స్ఫూర్తితో బడుగువర్గాల నేతలు అస్తిత్వ ఉద్యమాలకు భాషాసాంస్కృతిక బలాన్ని కలిగించినపుడే శక్తివంతమైన సామాజిక రాజకీయ పోరాటాల్ని తీర్చిదిద్దగలుగుతారు.

సామల రమేష్ బాబు

* * *

నడుస్తున్న చరిత్ర మాసపత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. తాజా సంచిక కోసం ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

నడుస్తున్న చరిత్ర మే 2012 On Kinige

Related Posts:

జయంతి త్రైమాసిక పత్రిక జనవరి –మార్చి 2012 సంచిక సంపాదకీయం

సాంఘిక మానవీయ సంబంధాలు మెరుగు పడాలంటే విద్యాలయాలలో సాంఘిక మానవీయ శాస్త్రాల అధ్యయనాల ప్రాధాన్యత పెరగాలి.

* * *

మనుషుల్లో సాంఘిక మానవీయ దృక్పధాలు కొరవడుతూ, అతి స్వార్థ దృక్పధాలు పెంపొందుతుండటం అందరమూ చూస్తోన్న, అందరికి అనుభవంలోకి వస్తోన్న విషయమే. అటు కుటుంబంలో, ఇటు సంఘంలో విచ్చలవిడి ధోరణులు పెంపొందడం కూడా అందరమూ గమనిస్తోన్న విషయమే.

ఒకప్పటి కుటుంబ వ్యవస్థలు స్వేచ్ఛ తక్కువుండడం వలన పిల్లలు అభివృద్ధి కాకుండా పోతున్నారని, ఆత్మ విశ్వాసాలు కోల్పోతున్నారని అందరము అంగీకరించేవారమే. ఇప్పుడు అతి స్వేచ్ఛల వలన పిల్లలు ప్రక్కతోవలు పడుతున్నారని, చెడిపోతున్నారని కూడా అంగీకరిస్తున్నాం.

ఈనాటి కుటుంబ స్వేచ్ఛ, సాంఘిక స్వేచ్ఛ, స్వేచ్ఛ పేరిట యధేచ్ఛలాంటిదవుతోందని, ఎలాంటి బాధ్యత లేనిదవుతోందని అందరము అనుకుంటూనే ఉన్నాము. లేకపోతే ఇంత అవినీతి పెరగదు, ఇన్ని దుర్మార్గాలు, దుష్ట చర్యలు పెరగవు, సమాజం, కుటుంబం ఇంత ఎవరికి వారే యమునాతీరే లాంటిది కాదు.

కుటుంబం కుటుంబం కాక పోవడానికి కుటుంబ పెద్దలు కుటుంబ పెద్దల్లా వ్యవహరించకపోవడం, సంఘం సంఘం కాకపోవడానికి సంఘ పెద్దలు, దేశం దేశం కాకపోవడానికి దేశ పెద్దలు పెద్దల్లా వ్యవహరించకపోవడమేనని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదేమో!

ఈనాటి యువతకు ఆదర్శాలు కల కుటుంబాలు, ఆదర్శాలు కల సంఘాలు కరువైపోతున్నాయి. వారికి రోల్ మోడల్స్ లాంటి వారు లేకుండా పోతున్నారు, వారి లాగా నడుచుకోవడానికి. వీటికన్నింటికీ కారణం విద్యాలయాలలో, మరీ విశ్వవిద్యాలయాలలో సాంఘిక సామాజిక మానవీయ శాస్త్రాల అధ్యయనాల ప్రాధాన్యత తగ్గిపోవడమేనని అనక తప్పదు. వాటి ప్రాధాన్యత పెరగనిదే కుటుంబంలో, సంఘంలో, దేశంలో ఆదర్శనీయులైన పెద్దలను మనము సృష్టించుకోజాలమని కూడా అనక తప్పదు.

సాంఘిక సామాజిక మానవీయ శాస్త్రాల అధ్యయనాల గిరాకీ పెరగాలంటే దానికొరకు ఆ శాస్త్రాలకు చెందినవారు వాటి ప్రాముఖ్యత గురించి తగినంత మేరకు పనికట్టుకుని ఉధృతంగా ప్రచారాలు చేపట్టవలసి ఉంటుంది. అలాంటి ప్రచారాన్ని ఒకఉద్యమంలా కూడా చేపట్టవలసి ఉంటుంది.

ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలు ఈ పనికి పూనుకోవాలి, పూనుకునేవారికి తగినంత చేయూత నివ్వాలి, చేదోడువాదోడుగా నిలవాలి. ఈ శాస్త్రాలు నిలవాలంటే, నిలదొక్కుకోవాలంటే మరి వేరే మార్గం లేదు. ఇలాంటి ప్రచారాలు లేనందువలననే వీటిని చదివేవారు దినదినం తగ్గుతున్నారు.

వీటికి చెందిన అధ్యయనాలు ఇలాగే సాగుతే ఇవన్నీ రానురాను మూతపడే రోజులు సమీపిస్తాయి. ఇంతవరకే ఎన్నో విద్యాలయాలలో, విశ్వవిద్యాలయాలలో వీటిని కోరేవారు చాలా తగ్గిపోయారు. అసలు విద్యార్ధులకు వీటిగురించి సదవగాహన కల్పించడంతో పాటు, ఇవి చదవడం వలన అనేకానేక ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయని నచ్చజెప్పడం, వాటి గురించిన సమాచారం అందించడం ఒక ఉద్యమం లాంటి పని. ఈ పని చేపట్టాలని ప్రత్యేకంగా సాంఘిక సామాజిక మానవీయ శాస్త్రాలకు చెందిన వారిని, విశ్వవిద్యాలయాలను కోరుతూ ఈ కోరికను కొత్త మా కొత్త సంవత్సర కోరికగా జయంతి వైపునుండి అందజేస్తున్నాం.

డా. వెలిచాల కొండలరావు

* * *

సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్యపీఠం వారు ప్రచురిస్తున్న “జయంతి” విద్య – సాహిత్య – సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది.

జయంతి పత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

Related Posts:

సాహిత్యాభిరుచి ప్రదాత కోవెల సంపత్కుమారాచార్య

ఒకప్పటి భాషాధ్యాపకులు, సాహిత్యాధ్యాపకులు వారి బోధనంతా భాషాభిరుచి, సాహిత్యాభిరుచి పుట్టించుటకు, పాఠాలు చెప్పేవారు కాని కేవలం ఎలాగో ఒకలాగు పాఠ్యాంశాలు పూర్తిచేసి విద్యార్థులను పరీక్షలకు, పట్టాలకు తయారు చేయడానికి పాఠాలు చెప్పేవారు కారు.

సంపత్కుమారగారు కేవలం అధ్యాపక పాత్ర మాత్రమే నిర్వహించేవారు కాదు, వాటితో పాటు సాహిత్య ప్రచార పాత్ర కూడా నిర్వహించేవారు. వారి భాషా సాహిత్య బోధన, మత, తాత్త్విక, దార్శనిక బోధకుల బోధనలా ఉండేది. వారికి భాషాభివృద్ధి, సాహిత్యాభివృద్ధి పట్ల అలాంటి లక్ష్యం, పట్టుదల ఉండేది. వారు వక్తల్లా కాక ప్రవక్తల్లా బోధించేవారు. అలాంటి భాషా సాహిత్యాల ప్రచారకుల్లాంటివారు అరుదే కాదు, అత్యరుదు.

స్వతహాగా వారు భాషా సాహిత్యాలను ఎప్పుడేకాని ఎంతో రుచితో, అభిరుచితో, శుచితో అధ్యయనం చేసేవారు. అలాగే ఇతరులకు కూడా బోధించారు. అందుకే వారికి అంతటా వారినారాధించే, అభిమానించే ఎంతోమంది శిష్యులున్నారు.

భాషా సాహిత్యాభివృద్ధియెడ వారికొక తపన వుండేది. వాటితోపాటు విమర్శనాత్మక దృష్టి, పరిశోధనాత్మక దృక్పథం వారికొక జీవ వేదనలాగుండేది. వాటి కొరకు వారి తుదిశ్వాస వరకు శ్రమించారు.

వారికి నాలుగు తరహాల ప్రేమలు ఉండేవి. ఒకటి -భాషా సాహిత్యాల యెడ ప్రేమ, రెండవది – విశ్వనాథ యెడ ప్రేమ, మూడవది – లక్ష్మణ యతీంద్రులయెడ ప్రేమ, నాలుగవది జువ్వాడి గౌతమరావుగారి యెడ ప్రేమ. తక్కిన ప్రేమలన్నీ వారికి అటుతదుపరి ప్రేమలే.

వారు పండిత కుటుంబంలో జన్మించారు కనుక వారికి పాండిత్యం పుట్టుకతో, ఉగ్గుపాలతోపాటే అబ్బింది. అటు వారిని ‘బాబాయ్’ అని సంబోధించే సుప్రసన్న ఇటు సంపత్కుమార ఇరువురూ సాహిత్య కోవెలల్లాంటి వారే. ఇరువురూ మేటి వక్తలు, విమర్శకులు, అధ్యాపకులు, రచయితలు, వ్యాఖ్యానకర్తలు, పరిశోధకులు,నిత్య భాషా సాహిత్య కృషీవలులు, నిత్య విశ్వనాధారాధకులు. ఇరువురికీ సాహిత్యమే దైవం, సాహిత్యమే సత్యం, సాహిత్యమే శివం, సాహిత్యమే సుందరం.

సంపత్కుమార చాలానాళ్ళు వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయునిగా పనిచేసి జగిత్యాల కళాశాలలో నేను ప్రిన్సిపాలుగా పనిచేస్తుండే రోజుల్లో (45 ఏళ్ళ క్రితం) ఏ సిఫారసూ లేకుండా లెక్చరర్ గా ఎంపికయ్యారు. వారి పాండిత్యం వలన ఆనాటి అధ్యాపకుల్లో అగ్రగణ్యులుగా భావింపబడేవారు. విద్యార్థులతో, సహఅధ్యాపకులతోనే కాదు, ఊళ్ళోవాళ్ళందరితో ఎంతో గౌరవభావంతో చూడబడేవారు. “అధ్యాపకుడంటే ఇలా ఉండాలి” అని అతనిని వారందరూ అంటూ ఉండగా నేనెన్నోసార్లు నా చెవులారా విని ఆనందించాను.

అందుకే వారు నిన్న మొన్న ‘స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్’ ఛైర్మన్‌గా ఎంపిక చేయబడిన డాక్టర్ జయప్రకాష్ రావు, అంతకుపూర్వం తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఎంపిక చేయబడిన ఆచార్య అనుమాండ్ల భూమయ్య, న్యాయాధిపతిగా ఇపుడు వికారాబాద్‌లో కొనసాగుతున్న రాజేందర్ జింబో, డా. గండ్ర లక్ష్మణరావు లాంటివారి నెందరినో పెంపొందించగలిగారు. ఎంతోమంది విద్యార్థుల్లో భాషా సాహిత్యాల యెడ శ్రద్ధ, రుచి, అభిరుచి కలిగించగలిగారు.

జగిత్యాలలో వారి అధ్యాపక వృత్తి కేవలం క్లాస్ రూమ్‌లకే పరిమితం కాక, క్లాస్ రూమ్ బయటికి కూడా విస్తరించేది. ఆ రోజుల్లో వారెన్నో సాహిత్య సభలు, సదస్సులు, గోష్ఠులు వగైరా నిర్వహించి కళాశాలనొక సాహిత్య సాంస్కృతిక నిలయంగా, కాదు కాదు ఆలయంగా తీర్చిదిద్దేవారు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, ధూళిపాళ శ్రీరామమూర్తి, తుమ్మపూడి కోటేశ్వరరావు, జువ్వాడి గౌతమరావు, సంగీత విద్వాంసులు నారాయణరావు మున్నగు వారినెందరినో ఆహ్వానించి వారిచే ఉపన్యాసాలిప్పించేవారు. అలా వారచట ఉన్నన్నాళ్ళు ఆ కళాశాల సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాలతో పండగలాంటి సందడితో నిండుగా ఉండేది.

ఎందరో విద్యార్థులే కాదు, పౌరులు కూడా సాయంకాలం కళాశాల గ్రౌండ్స్‌కు వచ్చి సంపత్కుమారతో చర్చాగోష్ఠులు జరిపేవారు. అలా వారినుండి తెలుసుకున్న వాటిని వారిప్పటికీ నెమరువేసుకుంటుంటారు. అలా సంపత్కుమారకు వారెచట పనిచేసినా విస్తృతమైన శిష్యకోటే కాక, అనేకానేక అభిమానులుండేవారు. వారిలో నేనూ ఒకడిని.
ఈ సందర్భంగా వారికి చెందిన దేశాభిమానం, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలలో వారి ప్రగాఢ విశ్వాసం, సామాజిక సాంఘిక స్పృహకు చెందిన వారి అవగాహన గురించి కూడా చెప్పాలి.

నా అభిప్రాయంలో వారికి వారి బలీయమైన భాషాభిరుచి సాహిత్యాభిరుచి, వారి జాతీయాభిమానం వలన, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల పట్ల వారికున్న దృఢ విశ్వాసం వలన, వారికి వాటి ద్వారా ప్రాప్తించిన సాంఘిక, సామాజిక దృక్పథం వలన అబ్బింది. అది వారితో సాంఘిక సామాజిక రాజకీయ ఆర్థిక విషయాల గురించి చర్చిస్తే తెలిసేది. వారికి వారి భాషా సాహిత్యాలకు చెందిన పునాదులు వారి దేశభక్తి వలన, సామాజిక సాంఘిక స్పృహ వలన లభించినవేనని నా దృఢ నమ్మకం.

ఒక దేశానికి చెందిన భాషా సాహిత్యాల, కళల యెడ ఒకరికి అభిమానం, ఆరాధనాభావం ఏర్పడాలంటే నా అభిప్రాయంలో అతనికి మొదట ఆ దేశ సంప్రదాయాలయెడ, సంస్కార సంస్కృతుల, విలువలయెడ అభిమానం, ఆరాధనాభావం ఏర్పడాలి. అతనికి అతని జన్మభూమిపై తల్లిప్రేమలాంటి ప్రేమ ఏర్పడాలి. అతడాతని జన్మస్థలాన్ని తన తల్లిని, తండ్రిని, గురువును ప్రేమించినట్లు ప్రేమించగలగాలి. అలాంటివానికే ఆ దేశభాషపట్ల, దాని సాహిత్యం, కళలపట్ల సహజమైన ఆసక్తే కాదు అనురక్తి ఏర్పడుతుంది. తద్వారా సహజమైన అనుభూతి, అభివ్యక్తి ప్రాప్తిస్తాయి.

సంపత్కుమార అసలు సిసలైన దేశీయుడు. ఈ నేలను, దాని సంస్కృతీ సంప్రదాయాలను, పరంపరను, చరిత్రను అమితంగా ప్రేమించినవాడు. అతనికి ఆ ప్రేమ ద్వారా అబ్బింది అతని భాషా సాహిత్యాలకు చెందిన ప్రేమ. ఇదే నా అభిప్రాయంలో అతని అసలు సిసలైన పాండిత్య రహస్యం, పరిశోధనా రహస్యం, ఆచార్య రహస్యం.
ఎచటుంది సంపత్కుమారాచార్య పాండిత్య పునాది అంటే మనం అచటికి పోయి పట్టుకోవలసి వస్తుంది. అదే విశ్వనాథ వారి సాహిత్య సంప్రదాయం. అలాంటిది సాధారణంగా ప్రాచ్య సంప్రదాయ పద్ధతిలో భాషా సాహిత్యాలు, తదితర విద్యలు నేర్చుకుంటే వస్తుంది, చదువుకుంటే వస్తుంది. అలా నేర్చుకున్నవారు సంపత్కుమారాచార్య.

జాతిని ప్రేమించేవాడే సకల విద్యలను, సాహిత్య సారస్వతాలను, భాషా భావాలను మేధతో కాక మనసుతో ప్రేమించగలడు. విశ్వనాథలా సంపత్కుమార కూడా ఈ దేశ మట్టిని దాని గట్టిని అమితంగా ప్రేమించాడు. అందువలననే అతడు అంత ఎదిగాడు, ఇతరుల ఎదుగుదలకు అంత పాటుపడ్డాడు. ఆ పాటు అతని పాండిత్య ప్రకర్ష కొరకు పడింది కాదు దేశంకొరకు, సమాజం కొరకు పడిన పాటు.

అతనికి కొన్ని సాహిత్య విలువలలో, సిద్ధాంతాలలో, క్రమశిక్షణలలో, నియమ నిబంధనలలో దృఢమైన విశ్వాసముండేది. ఆ విశ్వాసం చెట్టు శాఖలకు చెందిన విశ్వాసం లాంటిది కాదు, చెట్టు వేర్లకు చెందిన విశ్వాసం లాంటిది. దానినే ఇంగ్లీషులో ‘కన్విక్షన్’, తెలుగులో హేతుబద్ధ విశ్వాసమంటారు, సాన, జల్లెడబట్టిన లాంటిది. వాటి ఆధారంగా వారు అనేకానేక సాహిత్య గోష్ఠులు జరిపేవారు. తాను నొవ్వక, ఇతరులను నొప్పించక మెప్పించే ప్రయత్నం చేసేవారు. వారి భావాలతో, విలువలతో ఎవరైనా ఏకీభవించకపోతే విభేదించేవారే కాని విరోధించేవారు కాదు. ఒక భావం కొరకు ఒక స్నేహితున్ని విరోధించి పోడగొట్టుకునే వారు కాదు. ఇష్టం కాకపోతే మౌనం వహించేవారు, లేక ఒక చిరునవ్వు చింది ‘సరే మీ దారి మీది నాదారి నాది’ అని వదిలేసేవారు. వాదంలో ఇష్టం కాకపోతే తప్పుకునేవారే కాని ఒప్పుకొనేవారు కాదు. అతనికి అతనిపై, అతని భాషా సాహిత్యాల అవగాహనపై అంత విశ్వాసం, దృఢ నమ్మకముండేది.

సంపత్కుమార వ్యక్తిగా చాలా ‘సింపుల్’గా వుండేవారు. వారి కోరికలు మితమే కాదు, అతి మితం. వారికి తానొక పెద్ద పండితున్ని, విమర్శకున్ని, అధ్యాపకున్ని, రచయితనను అహంకారం ఎప్పుడూ ఏమాత్రం ఉండేది కాదు. చూడడానికి ఎంతో నిగర్వంగా, నిరాడంబరంగా ఋషిగా ఉండేవాడు కాని సన్యాసిగా కాదు. ఈ ప్రపంచంలో ఉంటూ కూడా దానికి అతీతంగా ఉంటున్న వారిలా అనిపించేవాడు, కనిపించేవాడు.

సంపత్కుమారాచార్యకు కొన్ని చిన్న చిన్న ఐహిక రుచులు, అభిరుచులుండేవి. అరుదైన ఆ సమయాలలో వారొక పండితునిగా కాక, సాధారణ మనుషుల్లోని మనిషిగా సాధారణ మనుషుల్లోని మనిషిగా సాధారణ ఇష్టాగోష్టిగా, తనకిష్టమైన వారితో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. అలా వారు పెద్ద ఆనందాలతో ఎంత తృప్తిపడేవారో చిన్న ఆనందాలతో కూడా అంత తృప్తిపడేవారు.

నావరకు నాకు సంపత్కుమారలో ఎంతో నచ్చిన విషయం వారి భాషా సాహిత్యాల ప్రచారం, వాటిని అత్యధికుల్లోకి తీసుకు పోవడానికి వారు చేసిన ప్రయత్నం. వారు ఎంత ‘సాహిత్య కామియో’ అంత ‘సాహిత్య ప్రచార కామి’. వారికి భాషా సాహిత్య ప్రచార భావంతో ఇసుమంతయినా స్వభావం, స్వభావం, స్వార్థభావం ఉండేది కాదు. భాషలు, సాహిత్యాలు, కళలు బ్రతకాలంటే వారివలె అలా నిష్కామంగా వాటి అభివృద్ధికి పాటుపడేవారే కావాలి. అలాంటి వారు మనకు ఎంత మంది లభిస్తే జాతి అంత బాగుపడుతుంది, భాషా సాహిత్యాలు అంత బాగుపడుతాయి. కాని ఏరీ అలాంటివారు? ఉన్నా ఎంతమంది?

ఈ రోజుల్లో వారి స్వంత సాహిత్య ప్రచారం చేసుకునే వారే తప్ప సదరు సాహిత్య ప్రచారం చేసేవారు అరుదే కాదు అతి అరుదు. అందుకే మన భాషలు, సాహిత్యాలు వెనుకబడుతున్నాయి. వాటిని అధ్యయనం చేసేవారు తగ్గుతున్నారు. మన సాహిత్య అధ్యయన అభ్యాస సభలకు పట్టుమని పదిమంది రారు. వచ్చేవారిలో కూడా చాలావరకు వారి బంధుమిత్రులు, కుటుంబీకులు, నిర్వాహకుల వలన ఏదో ఒక విధంగా లాభపడినవారే కాని నిజమైన సాహిత్యాభిమానులు, సాహిత్యప్రియులు చాలా తక్కువే. వారు కూడా ఎంతోమంది అవి ముగియకపూర్వమే వెళ్ళిపోతూ వుంటారు. ఏదో మొక్కుబడిగా వచ్చినట్లు పెళ్ళిళ్ళకు అక్షింతలు వేయడానికి వచ్చినట్లు. మన సాహిత్య సభలను, సదస్సులను చూస్తేనే తెలుస్తుంది మన భాషాసాహిత్యాభివృద్ధికి మనం చేస్తోన్న ప్రయత్నం, ప్రచారం ఎంతపాటిదో.

సంపత్కుమారాచార్య చనిపోవడం సాహిత్యానికి తీరని లోటు. సాహిత్యాభిమానులకు, సాహిత్యాభిలాషులకు, పరిశోధకులకు సందేహాలు తీర్చుకొనుటకు వారొక ‘ఎన్ సైక్లోపీడియా’గా, ‘రిఫరెన్స్ పాయింట్’గా, పెద్ద దిక్కుగా ఉండేవారు. ‘జయంతి’ త్రైమాసిక పత్రికకు వారు సంయుక్త సంపాదకులుగా ఉంటూ ఎన్నో విలువగల సూచనలు అందిస్తూ ఉండేవారు. వారికి జయంతి సంపాదక మండలి తరఫున శ్రద్ధాంజలులు. వారి కుటుంబానికి మా ప్రగాఢ సంతాపాలు, సానుభూతులు.

డా. వెలిచాల కొండలరావు
జయంతి త్రైమాసిక పత్రిక కోవెల సంపత్కుమారాచార్య స్మారక ప్రత్యేక సంచిక
సంపాదకీయం

* * *

సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్యపీఠం వారు ప్రచురిస్తున్న “జయంతి” విద్య – సాహిత్య – సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది.

జయంతి పత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

Related Posts:

‘బతుకమ్మ’గా మారిన ‘బ్రతుకమ్మ’

‘బతుకమ్మ’ అంటే బ్రతుకుదెరువును మెరుగు పరచే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవచ్చు. ‘బ్రతుకమ్మ’ తెలంగాణ గ్రామీణ భాషలో ‘బతుకమ్మ’గా మారిందని అనుకోవచ్చు.

ప్రతి బతుకమ్మ పాటను తుదకు ‘ఉయ్యాలో’ అను పదంతో ముగిస్తారు. పాడేవారందరూ ఉయ్యాలలా క్రిందికీ మీదికీ ఊగుతూ లేస్తూ పాడుతారు కనుక. జీవితం బతుకమ్మలా రంగుల సువాసనల పూల వలె అందంగా సువాసనగా ఉండాలని వివిధ రంగుల, వివిధ సువాసనల పూలతో బతకమ్మలను పేరుస్తారు, కూరుస్తారు.
ప్రధానంగా ఈ పండగ పల్లెటూరి వారి పండగ. పట్నాలలో నివసించేవారు కూడా చాలావరకు ఎన్నో ఏళ్ళనుండి పల్లెలనుండి తరలివచ్చి స్థిరపడ్డవారే, కనుక వారు కూడా బతకమ్మ పండగ జరుపుకుంటున్నారు.

ఈ పండగ తెలంగాణా ప్రాంతానికే పరిమితమైన పండగ, పండగ తుదిరోజున బతుకమ్మలన్నిటినీ దగ్గరి చెరువులోనో, కుంటలోనో, నదిలోనో ‘సాగనంపు’ గా వేయడం ఆనవాయితీ. నదులు చాలా తక్కువే కాక చాలా ప్రాంతాలకు సమీపంలో ఉండవు కనుక బతుకమ్మలను చెర్లల్లో, కుంటల్లోనే వేస్తారు ఎక్కవగా.

కాస్త తీవ్రంగా ఆలోచిస్తే ఈ పండగ సీమాంధ్రలో లేక తెలంగాణాలోనే ఉండడానికి కారణం సీమాంధ్ర భూములు చాలావరకు సమానమైన భూములు, ఎక్కువ నదీజలాలతో సాగుబాటయే భూములు కావడం తెలంగాణావి నీటి కొరత గల భూములు కావడం. వర్షంపై ఆధారపడే భూములు కావడమని అనిపిస్తుంది. అందువలన తెలంగాణావారు ‘బతుకమ్మ’ను దేవతగా సృష్టించుకొని ఆ దేవతను వారి చెరువులు, కుంటలు సమృద్ధిగా వర్షాపాతం ద్వారా నింపుమని మ్రొక్కుతూ ఆడుతూ పాడుతూ ప్రార్థిస్తూ తుది రోజున బతుకమ్మలను నీటిలో నివేదనగా అర్పిస్తారేమోనని అనిపిస్తుంది. లేకపోతే నీటిలో వేయడానికి అట్టే అర్థం వేరే కన్పించడం లేదు.

అలాగే ఈ పండగ. అన్ని సంపదలతో పాటు వాన సంపదకు కూడా కూడలి అయిన లక్ష్మీ గౌరీదేవిల ద్వారా వానదేవుడ్ని ప్రార్థించే పండగయని అనిపిస్తోంది. బతకమ్మను లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా పూజిస్తారు కనుక. అది ప్రత్యేకంగా ఆడవారి పండుగ కనుక.

అలా బతుకమ్మ పండుగకు తెలంగాణా చెరువు, కుంటల నీటికి ఒక అనుబంధం ఏర్పడిందని అనిపిస్తుంది.

అలా తెలంగాణా బతకమ్మ, తెలంగాణా వారి బ్రతుకులకు బ్రతుకు దెరువులకు అమ్మ లాంటిదయింది.

ఈ బతుకమ్మ పాటల్లో ప్రేమ, బంధుత్వం, స్నేహం, భక్తి మున్నగు వాటికి చెందిన వాక్యాలు, పంక్తులుంటాయి. వీటి అర్థాలన్నీ అందరూ కలిసి కలెగలుపుగా కలిసిమెలిసి ఉండాలని, వారి వారి స్నేహాలు, ప్రేమలు, బాంధవ్యాలు, సంబంధ అనుబంధాలు బాగుండాలని. భక్తికి, ముక్తికి, రక్తికి చెందినవి. సామాజిక సంబంధాలు మెరుగు పరచేవి వాటి సాహిత్యాల్లోకి, భావాల్లోకి చొచ్చుకుపోయి చూస్తే మనకు అది తెలుస్తుంది.

అందుకే ఈ పండగను అందరూ కలసి కలుపుగోలుగా జరుపుకుంటారు. ఏ కుల మతభేదాలు ఆర్థిక భేదాలు లేకుండా. మరొక విధంగా చూస్తే ఈ పండగ కూడా దసరాలాగా ‘శక్తి’కి చెందిన పండుగలా అనిపిస్తుంది. ఒకటి పురుష శక్తికి, రెండవది స్త్రీ శక్తికి. అందుకేనేమో ఈ పండుగలు రెండూ వరుసగా వస్తాయి. ‘విజయ దశిమి’ని స్త్రీలు పురుషులు ఉమ్మడిగా జరుపుకునే పండగల్లా.

ఏది పురుషుల విజయమో అది స్త్రీల విజయం. ఏది స్త్రీల విజయమో అది పురుషుల విజయం కూడా కదా మరి. అందుకని ఇరువురూ విజయాలలో భాగస్వాములేనని చాటుటకు కాబోలు ‘దసరా’ ‘బతుకమ్మ’ పండుగలు జంటగా వస్తాయి.

‘బతుకమ్మ’ పండగ జరుపుకున్నట్లే తెలంగాణాలో అన్ని కులాలవారు అన్ని ఆర్థిక స్థోమతల వారూ ‘దసరా’ పండుగ కూడా జరుపుకుంటూ ఆడుతారు, పాడుతారు, తింటారు, త్రాగుతారు, కేరింతలు కొడతారు. ఈ రెండు పండుగలు తెలంగాణా పండుగలలోని అన్ని పండుగల కంటే అతి ముఖ్యమైన పండుగలని చెప్పుకోవచ్చు.

డా. వెలిచాల కొండలరావు

జయంతి త్రైమాసిక పత్రిక అక్టోబర్ – డిసెంబర్ 2011 సంచిక సంపాదకీయం

* * *

సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్యపీఠం వారు ప్రచురిస్తున్న “జయంతి” విద్య – సాహిత్య – సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది.

జయంతి పత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

Related Posts:

ప్రత్యామ్నాయ సంస్కృతికి తల్లినుడే కీలకం

అంబేద్కర్‌ పుట్టినరోజు ఏప్రిల్‌ 14న దేశమంతా పండుగ. బడుగుల ఆత్మగౌరవ ప్రకటనకు అంబేద్కర్‌ ప్రతీకయ్యాడు. దళితుడిగా పుట్టి, ఈసడింపులతో అణచివేతతో సంఘర్షిస్తూ, ఒక మేధావిగా, మహానాయకుడిగా ఎదిగి, చివరికి బౌద్ధమే తనవారికి దిక్కు అని గట్టిగా నమ్మి, ఆ దారిన తన అడుగువేసి తోటి దళిత బడుగు జీవులకు దిక్సూచి అయ్యాడు. స్వాభిమాన పతాకను చేపట్టి బౌద్ధమార్గాన్ని అనుసరించడం ద్వారా తాను ఈ సమాజానికి చెప్పదలచుకున్నదంతా చెప్పేశాడు. అప్పటిదాకా వ్రాసినదంతా, మాట్లాడినదంతా, పొందిన జ్ఞానాన్నంతా ఆ ఒక్క నిర్ణయంతో, ఆ ఒక్క అడుగుతో ప్రపంచానికి చెప్పేశాడు.
తన భూమిని, తన జనాన్ని, తన తాత్విక భూమికను తన ఆత్మగౌరవానికి సంకేతాలుగా చూపించాడు. అందులో తరతరాల అణచివేతకు, అసహనానికీ, దోపిడికి, ఆధిపత్య భావజాలానికి సవాలు విసిరాడు. భయంతో కన్నీటితో బీదరికంతో కునారిల్లుతున్న బడుగులను ఓదార్చి, వారి సమస్యలకు పరిష్కారంకోసం ముందుకు సాగాల్సిన త్రోవను చూపించాడు.
ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి మాట్లాడేవారంతా అంబేద్కర్‌ నిర్ణయాన్ని, ముందడుగును లోతుగా అధ్యయనం చెయ్యాలి. ఈ సమాజంలో ఉన్న కులాల కుళ్లును, ఆధిపత్య భావజాలపు దుర్మార్గాన్ని, అణచివేతను ఎదుర్కోదలచిన వాళ్లంతా అడుగులు వేయాల్సిన త్రోవ అదే. ఆ త్రోవ దేశీయం. సర్వజనావళికి సుఖశాంతుల్ని కలిగించేది. అన్ని కాలాలకూ వర్తించేది. వేల ఏండ్ల జాతి సమస్యలకిదే పరిష్కారం.
ఈ ప్రత్యామ్నాయ సంస్కృతికి ఆధారం ‘తనది’ అనే భావం. ఈ ‘తనానికి’ మూలం – తాను పుట్టిపెరిగిన నేలపైన, తోటి జనంపైన నెనరు – అభిమానం. తన భాష, తన కళలు, తన తెలివితేటలు ఆధారంగా విశ్వమంతా తానుగా ఎదగమే ప్రత్యామ్నాయ సంస్కృతి.
బడుగులు సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ రంగాల్లో దూసుకురాలేకపోవడనికి రెండు మౌలికమైన అడ్డంకులున్నాయి. మొదటిది – ఇష్టారాజ్యంగా పెరిగిన సంస్కృత భావజాలం బడుగులను వారి సాంప్రదాయక నుడి సంపదకు, తమ వృత్తులతోపాటు, కళలతోపాటు ఎదిగిన సంస్కృతికి, తమదైన ఆలోచనకు దూరంచేసింది. ఆత్మన్యూనతకు గురిచేసింది. ఈ నేల మూలవాసులు తమ భాషాసంస్కృతులకు దూరంకావడం సహజంగా జరిగింది కాదు. బయటివారి సాంస్కృతిక దాడికి బలై ఆత్మన్యూనతకు లోనయ్యారు. కాగా, రెండవ అడ్డంకి మరొకవైపు నుంచి వచ్చింది. పైనచెప్పిన మొదటి అడ్డంకిని దాటడనికి, పరాయి పాలకుల కాలం నుండి నేటి వరకూ చూపబడుతున్న మరోదారే వారి స్వయంప్రకాశానికి మరో అడ్డంకి అయింది. ఇది పరభాష రూపంలో, పరమత రూపంలో వారికి అడ్డంకిగా నిలిచింది. ఈ రెండు అడ్డంకులనూ గుర్తించిన వైద్యుడు అంబేద్కర్‌. అందుకే సరైన మందుకోసం అన్వేషించాడు. దాన్ని సూచించాడు. అదే బౌద్ధమార్గం. వేల ఏండ్ల చరిత్రలో అనేక విధాలుగా చెదిరిపోయిన తీరులను అధ్యయనం చేసి, బౌద్ధాన్ని ఈ కాలానికి కావలసిన రీతిలో వివరించాడు అంబేద్కర్‌.
పైన పేర్కొన్న రెండు అడ్డంకుల్లోంచీ బడుగులు బయటపడలేకపోతున్నారు. ఆ రెండు అడ్డంకుల మధ్యా నలిగిపోతున్నారు. ఆయన చూపిన త్రోవలో నడవడనికి వేలాది బడుగులు ముందుకు వచ్చారు. భద్రజీవుల్లో కూడ దేశభక్తులు, మానవతను ప్రాణంగా నమ్మినవారు ఆయనకు తోడయ్యారు. కాని, అంబేద్కర్‌ ఆశించిన ఆ ‘గొప్ప సామాజిక మార్పు’ ఆయన అకాల మరణంతో ఆదిలోనే ఆగిపోయింది. సాగవలసినంతగా ముందుకు సాగలేదు. ఆ మహోన్నత వ్యక్తి మరి కొంతకాలం బ్రతికివుంటే పై రెండు అడ్డంకుల నుంచీ బడుగులు బయటపనికీ, స్వాభిమాన ప్రాతిపదికన తమదైన ప్రత్యామ్నాయ సంస్కృతిని పెంపొందించుకోవడనికీ బలమైన త్రోవ ఏర్పడి వుండేది. ఆయనలేని లోటును పూడ్చగల అంతటి నేతృత్వం బడుగులకు నాటికీ నేటికీ ఒనగూడలేదు.
అందువల్ల ఆధిపత్య భావజాల విషసంస్కృతిలో తాము కూడ భాగమవుతున్నారు. ఆంగ్ల సంస్కృతి మోజులోపడి తమదైన మౌలిక శక్తియుక్తులను, భాషాసంస్కృతులను కోల్పోతున్నారు. గత 50 ఏళ్లుగా ఈ దేశంలో పెరుగుతున్న విషరాజకీయాల్లో భాగమై తమ ఎదుగుదలకు తామే అడ్డుకట్టలు వేసుకొంటున్నారు.
బడుగులు అన్నివిధాలుగా ఇప్పుడు సంఘర్షణను ఎదుర్కొంటున్నారు. ఆత్మన్యూనత నుండి బయటపడడానికి తమకు రాజకీయాలే మార్గమనీ, అధికారంలోకి రావడమే పరిష్కారమనీ భావిస్తున్నారు. నేటి రాజకీయాల్లోకి ఎలాగైనా చొచ్చుకు రావడంకోసం పార్టీల ఎత్తుగడలకు పావులవుతున్నారు తప్ప, తమ బలాన్ని పంచి ఇస్తున్నారు తప్ప, బడుగులందరి అభివృద్ధి కోసం అన్ని రంగాల్లోనూ జరగవలసిన కృషి గురించి నిర్మాణాత్మకంగా ఆలోచించే ధోరణి లేకుండా పోయింది.
ఈ దేశంలో బడుగువర్గాలకు తమదైన భాష ఉంది. తమవైన వృత్తినైపుణ్యాలున్నాయి. తమవైన కళారూపాలున్నాయి. తమవైన మానవీయ జీవన విలువలున్నాయి. అవి కులాలవారీగా వున్నాయి. నేటి పరిస్థితుల్లో వారు తమ కులాల వారసత్వాన్ని ఆత్మన్యూనతా చిహ్నాలుగా భావించకూడదు. అవి ఉన్న పళంగా పోవు. కనుక వాటికి విలువను సంతరింపచేసుకోవడమే మార్గం. మాదిగ కులస్థుడు తన పేరు చివర ‘మాదిగ’ అని చేర్చుకొని దాన్ని ఒక ఆత్మగౌరవ చిహ్నంగా చేసుకొన్నట్లే బడుగులంతా తమ కులాల గుర్తుల్ని తమ పేరుచివర ఆత్మగౌరవ సంకేతాలుగా ఉంచుకోవడనికి ఇక ఏమాత్రం సంకోచించనక్కరలేదు. కులాల సంకేతాల్ని పేరులోంచి తొలగించుకోవడనికి అందరూ ఇష్టపడనంతకాలం బడుగుల ఆత్మగౌరవానికి వారి కులాలు అడ్డుకాకూడదు.
అంతేకాదు, తమ వృత్తులతోపాటు ఎదిగిన తమ తల్లి నుడిని కించపరచుకోకూడదు. తమ నుడినీ, నుడికారాన్నీ తమ ఆత్మగౌరవ అంశాలుగా, తమ సంపదగా భావించాలేగాని, వాటిని ఆత్మన్యూనతకు చిహ్నాలుగా అనుకోకూడదు. తరతరాలుగా తమ ఆస్తిగా వచ్చిన తమ నుడి సంపదకు సంస్కృతంవల్లా ఆంగ్లంవల్లా కలిగిన నష్టాన్ని వారు తెలుసుకోవాలి. తమ నుడి సంపద రక్షణకోసం వారు పోరాడలి. నేటి అవసరాలకు తగ్గట్లుగా ఆంగ్లంలోనో, మరొక భాషలోనో ప్రవీణులు కావడనికి తమ భాషను కోల్పోనక్కరలేదు. పరభాషల్ని నేర్చుకోవడనికి, ఈకాలపు అవసరాల్లో దూసుకుపోవడనికి వారి భాషాసంపదే వారికి గొప్ప పెట్టుబడి. తాము నివసిస్తున్న సమాజంలోగాని, ఇతర దేశాల సమాజాల్లోగాని వికసించడానికి తమ నుడి సంపద ఎంత గొప్పగా పనికొస్తుందో వారు తెలుసుకోవాలి. దాన్నే వారొక ఆయుధంగా మలచుకోవాలి. ఈ దేశాన్ని అన్ని రంగాలలో ఏలడానికి మూలవాసులుగా వారికి హక్కు ఉంది. దానికి వారి తల్లినుడి, తరతరాలుగా తమవైన కళలు, చేతివృత్తులు పెట్టుబడులు. తమ కళల్ని, తమ నుడిని, తమ సంస్కృతిని కాపాడుకోవడమంటే తమ ప్రగతిని నిరోధించుకోవడం కాదు – తమ వారసత్వాన్ని ఆధునికం చేయడం. వాటికి గౌరవాన్ని సంతరించుకోవడం. అనేక బడుగు కులాల్లో నిలిచివున్న జానపద కళారూపాలకు సామాజిక గౌరవాన్ని సంపాదించి వాటిపట్ల అన్ని వర్గాలకూ ఆకర్షణ కలిగించిననాడు అవి కూడ భరతనాట్యం వలె, కూచిపూడివలె గౌరవకేంద్రాలవుతాయి. అదే విధంగా తమ వృత్తులలోని విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఆధునిక అవసరాలకు తగ్గట్లుగా ఎదిగించుకొని ఆయా వృత్తులకు గౌరవాన్ని సాధించాలి.
తెలుగు భాషోద్యమంలోకి బడుగువర్గాలు దూసుకురావాలి. తెలుగంటే తెలుగే. అది బడుగు జీవులనుండి, శ్రామికుల నుండి పుట్టింది. వారి సాహిత్యం నుండి వికసించింది. సామాజిక, రాజకీయ పెత్తందారీతనంవల్ల, ఆధిపత్యంవల్ల అది క్రమంగా తన తనాన్ని కోల్పోతూ వచ్చింది. ఉద్యమాల ఫలితంగా తెలుగు నుడి ప్రజాస్వామ్య త్రోవలో కొచ్చింది. అది ఇంకా మౌలికంగా ప్రజలభాష కావాల్సి ఉంది. ఆ పనీ మొదలయింది. ఇదంతా అత్యంత సహజంగా జరిగేదే. అడ్డంకుల్ని అధిగమించగల శక్తి తెలుగు నుడికి ఉంది. అయితే ఇందుకు పెద్ద ఎత్తున ఉద్యమం సాగాలి. అది బడుగువర్గాల వల్ల, మహిళలవల్ల మాత్రమే వీలవుతుంది. ప్రత్యామ్నాయ సంస్కృతికి తల్లి నుడే కీలకం. అంబేద్కర్‌ ఆశయసాధన కోసం బడుగుల త్రోవ – తల్లి నుడిని కాపాడుకుంటూ స్వాభిమానంతో ముందుకు సాగడమే. అంబేద్కర్‌ చూపిన బౌద్ధమార్గానికి ప్రాతిపదిక ఇదే. తన నుడి, తన నాడు, తన నెనరు (స్వాభిమానం) మాత్రమే బడుగుల కరదీపికలు.
– సామల రమేశ్‌బాబు (నడుస్తున్న చరిత్ర ఏప్రిల్ 2012 సంచిక సంపాదకీయం)

* * *

నడుస్తున్న చరిత్ర మాసపత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. తాజా సంచిక కోసం ఈ క్రింది లింక్ చూడండి.

నడుస్తున్న చరిత్ర ఏప్రిల్ 2012 On Kinige

Related Posts:

మిసిమి మార్చి 2012 సంపాదకీయం

భామనే… సత్యభామనే… అంటూ కూచిపూడి నృత్యరీతులను సత్యభామ వాలుజడ తాకిడితో నేల నాలుగు చెరుగులా తీసుకువెళ్ళిన కళాకారులు వేదాంతం సత్యనారాయణ శర్మ – సత్యభామకు ఏ విధంగా అంచెలంచెలుగా మెరుగులు దిద్దారో ఆయన వివరణ చదవండి.

శ్రీకాకుళంలో ఎగళ్ళ రామకృష్ణ అని సాహిత్య కళాభిమాని వున్నారు. ప్రతి సంవత్సరం సాహిత్య సభలు రంగరంగ వైభవంగా జరిపి అన్ని రంగాల ప్రతినిధులకు పూలదండలు వేస్తారు, పురస్కారాలు ఇస్తారు. ఆ సందర్భంగా ‘ఆధునిక సాహిత్య ధోరణులు’పై సదస్సు నిర్వహించి వ్యాసాలను ఆహ్వానించారు. అందులో కొన్నింటిని వారి సౌజన్యంతో మిసిమి పాఠకులకు అందిస్తున్నాము.

మనకు రంగుల పండగ దసరానే. కాని ఒకప్పుడు రెడ్డి రాజుల కాలంలో ‘వసంతోత్సవం’ -ఇప్పటి హోళీ లాంటిదే – నిర్వహించేవారని వేదుల రాజేశ్వరి తెలియజేస్తున్నారు.
రేడియోతో పెరిగాము ఒక తరం. అప్పతి కవులు, సాహిత్యకారులు, ఆకాశవాణిని ఎంతో పరిపుష్టం చేసారు. ఆకాశవాణి బాణిని, చరిత్రను ఓలేటి పార్వతీశం అ, ఆ ల దగ్గర్నించి వివరిస్తున్నారు.

కుప్పడు ఎలా అక్షరభిక్ష పెట్టాడో ఈ నెల ‘సామాన్యుడి సాహిత్యం’లో తెలుసుకుంటే మనసు ఆర్ద్రమై పోతుంది.

మనకు స్వాత్రంత్ర్య భిక్ష పెట్టిన వారిలో ఎందరో మనకు తెలియనే తెలియదు. ఉరితాడుని పూలదండలా వేసుకుని దేశం కోసం నవ్వుతూ ప్ర్రాణాలర్పించిన ‘బిస్మిల్’ ఉత్తరాన్ని చదివితే మన బాధ్యత కొంతవరకైనా తెలుస్తుందేమో.

నాలుగు ‘అట్టమీది బొమ్మలు’ నల-దమయంతి కథకు సంబంధించినవి -రష్యన్ చిత్రకారుడు పెన్‌బర్గ్ ఆవిష్కరణ.

అమ్మ సత్యమని, నాన్న నమ్మకమని వింటుంటాము. తమ ఆశయం కోసం, తల్లి లేని కొడుకుని పెంచి ప్రపంచానికివ్వటానికి, తన వయసును పేదల సేవల ఆవిరి చేస్జుకున్న తండ్రి విశ్వాసమే సత్యమనిపిస్తుంది – ‘డాక్టరు గారు’ చదవండి.

సంపాదకులు

* * *

మిసిమి మార్చి 2012 సంచిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ అనుసరించండి.

మిసిమి మార్చి 2012 On Kinige

Related Posts:

మిసిమి మే 2011–సంపాదకీయం

 

ఇప్పుడు మిసిమి మాస పత్రిక ఈ పుస్తకం రూపంలో కినిగెపై లభిస్తుంది. వివరాలు ఇక్కడ http://kinige.com/kbook.php?id=171 

 

 

మిసిమి మే 2011 On Kinige

సంప్రదాయంలో బుద్ధ జయంతి మూడు ప్రత్యేకతలను సంతరించుకుంది. సిద్ధార్థుడు వైశాఖ పూర్ణిమనాడే జన్మించాడు. ముప్పది అయిదేండ్ల తర్వాత ఉరువెల (ఇప్పటి గయ)లో నేరంజనానది ప్రక్కన బోధివృక్ష ఛాయలో సంబోధి ప్రాప్తమయింది. ఎనబదిఏండ్లకు అదే దినాన కుసినార (ఇప్పటి ఉత్తరప్రదేశ్) వనంలో మహాపరినిర్వాణం చెందాడు. థేరవాద బౌద్ధం ప్రకారం – బుద్ధుడు 2555 సంవత్సరాల క్రితం నిర్వాణం చెందాడని విశ్వసిస్తారు. మహాయాన సంప్రదాయ ప్రకారం బుద్ధుని పరినిర్వాణం క్రీ.పూ. 483 నాటికి లెక్కించబడింది. భారతదేశంలో ప్రచారంలో వున్న మూడు కాలమాన లెక్కల పద్ధతుల్లో బౌద్ధశకం పురాతనమైనది. మిగిలిన రెండు శాలివాహన, విక్రమనామ శకాలు.

ఈ నెల మిసిమి బుద్ధ జయంతి ప్రత్యేకం.

బౌద్ధ సంబంధమైన అనేక విషయాలపై వ్యాసాలు అందిస్తున్నాం. ముఖ్యంగా తెలుగువారి జీవనంతో వేయిసంవత్సరాలపైగా పెనవేసుకుని పోయిన విశ్వాసంగా పేరొందినది బౌద్ధధర్మం. దురదృష్టవశాత్తు అనేక కారణాలవలన (అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రామాణికంగా చూపినవి కొన్ని ఈ సంచికలోనే ఉన్నవి.) భారతదేశంలో బౌద్ధం క్షీణించి పొరుగుదేశాలకు వలస పోవలసి వచ్చింది. ఇందుకు దోహదం చేసినది – సాంఘీకంగా ప్రజలను కుల – వర్గాలుగా చీల్చిన శక్తులు మాత్రమే. ఈ ప్రమాణాలే ప్రజలను అస్పృశ్యులుగా, అంటరానివారిగా అణచి అవిద్యకు కారణమైనవి.

ఇప్పటికైనా మనం మేల్కొని ఈ అనైతికమైన మాయాజాలం నుంచి బైటపడి కులవిభజనల కుయుక్తులను అధిగమించి సాంఘీక పునర్వికాసం సాధించవలసి వుంది.

తెలుగునాట బౌద్ధధర్మ ప్రాశస్త్యాన్ని, చరిత్రను వీరనారాయణ రెడ్డి వ్యాసంలో విపులంగా వివరించారు.

ఆచార్య నరేంద్రదేవ్ వ్రాసిన ‘బౌద్ధధర్మ దర్శన్’ బృహద్గరంథాన్ని సవివరంగా సమీక్షించిన సంజీవదేవ్, బౌద్ధధర్మ చరిత్రను సంక్షిప్తంగా మన కళ్ళ ముందుంచారు.

‘త్రిరత్న వందనం’ మన కందించినవారు బొర్రా గోవర్ధన్. వీరి బౌద్ధ సాహిత్యానువాదాలు ఇటీవలనే వెలుగులోకి వస్తున్నాయి. ‘ధర్మచేతన’ కవిత – తియ్యగూర సీతారామి రెడ్డి ఎంతో ఆర్తితో వ్రాశారు.

బుద్ధఘోషుని ‘విపశ్యన – మనోవిశ్లేషణ’ ఫ్రాయిడ్ మనోవిజ్ఞానిక సిద్ధాంతాలకు, బౌద్ధములోని ధ్యాన ప్రక్రియలకు వున్న సంబంధాలను, ఇప్పటికీ అనుసరణీయమైన ప్రాధాన్యతను వివరిస్తోంది.

చంద్రశేఖర్, బుద్ధుని జీవితాన్ని నిశ్శబ్ద విప్లవంగా వర్ణించారు. భదంత ఆనంద కౌసల్యాయన్ – భారతదేశంలోని కులవ్యవస్థలను, సాంఘీక దురాచారాలను సహేతుకంగా గర్హించారు.

ఎన్నో వ్యాసాలు – లబ్ధ ప్రతిష్ఠులు వ్రాసినవే – చోటు లేకపోవటమనే ఒకే కారణంతో ప్రచురించలేక పోతున్నాం. వీలుకల్పించుకొని మునుముందు అందించగలమని మనవి చేస్తూ…

- సంపాదకులు

మిసిమి మే 2011 On Kinige

Related Posts: