ప్రముఖ డిటెక్టివ్ రచయిత మధుబాబు రచించిన మరో థ్రిల్లర్ “బాంబింగ్ స్క్వాడ్“.
ఓ అసైన్మెంట్ నిమిత్తం శ్రీకర్ జపాన్ బయల్దేరడంతో కథ ప్రారంభం అవుతుంది. విమానంలో పరిచయమైన ఓ మహిళ ఓ కవర్ శ్రీకర్ చేతికిచ్చి దాచమంటుంది. ఆ తర్వాత ఆమె హత్య చేయబడుతుంది. ఆ కవర్ కోసం తన వెంటబడిన గ్యాంగ్ నుంచి శ్రీకర్ తప్పించుకునే ప్రయత్నంలో షాడో, బిందులను కలుసుకుంటాడు. నిజానికి, వీళ్ళు ముగ్గురూ ఒకే అసైన్మెంట్ కోసం జపాన్ వచ్చారు. అయితే శ్రీకర్ కొద్దిగా ముందుగా వచ్చి ఆ ప్రమాదంలో ఇరుక్కున్నాడు.
ఆ కవర్ని ఇంటర్‌పోల్ అధికారులకు అందజేస్తారు. జపనీస్ ఇంటర్‌పోల్ అధికారి ఆ కవర్ విప్పి అందులో ఏముందో షాడో, బిందు, శ్రీకర్ లకు చూపుతాడు. జపాన్ ప్రజలని భయభ్రాంతులని చేస్తున్న ఫ్లైయింగ్ సాసర్ల ఫిల్మ్లవి.
వాటి వెనుక కిల్లర్స్ గ్యాంగ్ ఉందని అనుమానిస్తూ, ఆ మిస్టరీని పరిష్కరించాల్సిందిగా జపనీస్ అధికారులు కోరుతారు. జపనీస్ ఏజెంట్లు సేకరించిన సమాచారం ప్రకారం – ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయని, వాటిని పూర్తిగా నాశనం చేయమని కోరుతారు. క్రితం రోజు శ్రీకర్‌పై దాడి చేయించిన వ్యక్తి – మన్‌టాయ్ – కిల్లర్ గ్యాంగ్‌కి స్థానికంగా వత్తాసు పలుకుతున్నాడని, అతనితో జాగ్రత్తగా వ్యవహరించవలసింగా సూచిస్తారు.
షాడో తనకి పాత పరిచయస్తుడైన ఫాక్స్ సాయం తీసుకుని మన్‌టాయ్ జాడలు తెలుసుకోడానికి ప్రయత్నిస్తాడు. మన్‌టాయ్ స్థావరం తెలుసుకుని రహస్యంగా లోపలికి ప్రవేశించి పట్టుబడిబోతాడు షాడో. అతన్ని అనుసరించి వచ్చిన బిందు, శ్రీకర్లు షాడోని విడిపించి ఆ స్థావరం పై బాంబులు వేస్తారు. ఈ అలజడిలో మన్‌టాయ్ అక్కడినుంచి పారిపోతాడు.
తర్వాత ఏమైంది? మన్‌టాయ్ దొరికాడా? ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ వెనుక రహస్యం ఏమిటి? అవి ఎక్కడ నుంచి వస్తున్నాయనేది షాడో ఎలా తెలుసుకున్నాడు? ఈ అసైన్‌మెంట్‌లో షాడోకి సహకరించిన ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యుడెవరు? వీరంతా ప్రవేశించిన సొరంగం ఎక్కడికి తీసుకుపోయింది? మన్‌టాయ్ అపహరించిన బిందుని షాడో ఎలా విడిపించాడు? ఈ అసైన్‌మెంట్‌ని విజయవంతంగా ఎలా ముగించారు?
ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఆసక్తికరమైన ఈ నవలలో లభిస్తాయి.
“బాంబింగ్ స్క్వాడ్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
కొల్లూరి సోమ శంకర్