తేనెపట్టులాంటి హాస్యామృతం

అరె! ఎవరిదో పది రూపాయలు నోటు పడిపోయిందే అని ఒకరనగానే- నాదే.. నాదే.. అంటూ రెండో వ్యక్తి వెనక్కి తిరిగి వంగి తీసుకోవాలని వెతుకుతుంటాడు. సరిగ్గా అదే అదనుగా మొదటి వ్యక్తి రెండోవ్యక్తిని వెనుకనుంచి ఒక్క తన్ను తన్నడంతో ప్రాంగణమంతా పగలబడి నవ్వుతుంది. ఒకరి చెంప ఛెళ్లుమంటుంది. ఎందుకుసార్ కొడతారు? -చెంపదెబ్బ తిన్నవాడి ప్రశ్న. మళ్ళీ చెంప ఛెళ్ళు. క్లారిటీ మిస్సవుతోంది. చెప్పి కొట్టొచ్చు కదా సార్! మళ్ళీ చెంప ఛెళ్ళు. చెప్పి కొట్టడానికి పర్మిషన్ తీసుకుని కొట్టడానికి నువ్వేమైనా వి.ఐ.పి.వేంట్రా? ఉత్త…??? మళ్లీ గొల్లుమని నవ్వులు. వెండితెరైనా, బుల్లితెరైనా ఇదే పరిస్థితి. ఇప్పటితరం ఈ సన్నివేశాల్ని బాగా ఆస్వాదిస్తోంది. కానీ, హాస్యమంటే ఇదేనా? మన పిల్లలకి చెప్పడానికి ఇదే మిగిలిందా? ఇంతకుమించి మన పిల్లలకు హాస్యాన్ని గురించి ఏమైనా తెలుసా? ఇదో అయోమయ స్థితి. ఇలాంటి నేపథ్యంలో మనమున్నప్పుడు, ద్వానా శాస్ర్తీ ఒక గొప్ప లోకోపకారం చేశారు. పూర్వకాలం నుండి ఇటీవలి కాలం వరకు వచ్చిన సాహిత్యాన్ని బాగా పిండి, తేనె బిందువుల్లాంటి హాస్యాన్ని దోసిళ్ళకొద్దీ పట్టిపోశారు. అదే ‘తెలుగు సాహిత్యంలో హాస్యామృతం’ పేరిట వచ్చిన ద్వానా శాస్ర్తీ కొత్త పుస్తకం. అనాదిగా తెలుగు సాహిత్యంలో వచ్చిన హాస్యరచనల్ని తన వ్యాఖ్యలతో విశే్లషణలతో కలిపి సంపుటీకరించిన గ్రంథం, ఈ కొత్త పుస్తకం సరైన సమయంలో వర్తమాన తరానికి ఈ పుస్తకం అంది వచ్చింది. అందుకు శాస్ర్తీగారు బహు ధా ప్రశంసాపాత్రులు.
నిజానికి ఈ పుస్తకం సరైన సమయంలో వచ్చిందని సంబరపడటంతోపాటు చాలా ప్రణాళికాబద్ధంగా వచ్చిందని సంతోషపడాలి. లిఖిత వ్యవహారానికి నోచుకోని జానపదుల కాలం నుండి, చాటుపద్యాలు, చమత్కార పద్యాలు పుట్టుకొచ్చిన నాటినుండి, అవధానాలు రాజ్యమేలిన నాటినుండి, ఆశుకవితా ధారలు ప్రవహించిన నాటినుండి, ఆధునిక సాహిత్యంలో మైలురాళ్లు పాతి, అటువైపు మార్గాన్ని మళ్లించి, ఆ కొత్త సాహిత్యంలో దీపస్తంభాలై నిలిచిన, గురజాడ, కందుకూరి, చిలకమర్తి గిడుగు వంటి వాళ్ళు మొదలుకొని, విశ్వనాధ, శ్రీశ్రీ, మునిమాణిక్యం, మొక్కపాటి, భమిడిపాటి వంటివారు మొదలుకొని, ముళ్లపూడి, గోపాలచక్రవర్తి, శ్రీరమణ, శంకరమంచి పార్థసారధి వంటివారు మొదలుకొని, తానే వ్రాసిన పేరడీల వరకు, హాస్యరసాన్ని జీవనదిలా ప్రవహింపజేశారు. దాదాపుగా ఒక సంపూర్ణత్వాన్ని చేరుకొనే ప్రయత్నం చేశారు. తేనెటీగ ఒక్కొక్క పువ్వుమీద వ్రాలి అక్కడి తేనెను సంగ్రహించి తేనెపట్టు గదుల్లో దాచినట్టు తెలుగు నాట హాస్యరచనలకు చిరునామాలుగా నిలిచిన, ఎందరో చెయ్యి తిరిగిన రచయితల రచనల్లోని కితకితలు పెట్టే కొన్ని మంచి ఖండికల్ని మనకి పరిచయం చేశారు. వాటికి ముందూ, వెనుకా కూడా తనదైన వ్యాఖ్యానమూ వుంది.
తెలుగువాళ్ళకి తొలి జ్ఞానపీఠాన్ని బహుమతిగా ఇచ్చిన విశ్వనాధ సత్యనారాయణగారు, మహాగంభీరుడన్న విషయం ఆయనె్నరిగిన వాళ్ళందరికీ తెలిసున్నదే. అటువంటి విశ్వనాధ మంచి హాస్యప్రియుడన్న విషయాన్ని వెతికిపట్టిన ఒక వ్యాసంలోంచి వెలికితీశారు శాస్ర్తీగారు. ఒక ఉద్యోగి ఆంగ్లేయుడైన తన అధికారిని శ్రావణ శుక్రవారం సెలవు కావాలని అడిగాడు. వెంటనే ఆ అధికారి తన సహాయకుణ్ణి ‘‘నిరుడు శ్రావణ శుక్రవారం సెలవిచ్చామా?’’ అని అడిగాడు. వెనువెంటనే ఆ సహాయకుడు ‘‘శ్రావణ శుక్రవారం నిరుడు ఆదివారంనాడు వచ్చింది’’ అన్నాడట.
అలాగే మనందరికీ సుపరిచితమైన రచయిత రావిశాస్ర్తీ. ఆయన పేరు చెప్పగానే సారాకథలు మాత్రమే తెలిసిన జనానికి, ఆయనలోని హాస్యాన్ని పట్టంకట్టి మరీ చూపారు ద్వా.నా. అప్పుడెప్పుడో, ఓ సినిమాకి మాటలు వ్రాయడానికి మద్రాసు వెళ్లివచ్చిన రావిశాస్ర్తీని ఓ అభిమాని అడిగాడు, ‘‘గురువుగారూ! ఎలా వుంది సినిమా ప్రపంచం’’ అని. రావిశాస్ర్తీ ఎంత చమత్కారంగా జవాబు చెప్పారో గమనించండి. ‘‘సినిమా వాళ్ళతో చాలా సుఖముంది. మన గదికి మనల్ని అద్దె చెల్లించనివ్వరు, వాళ్లే చెల్లిస్తారు. మన సిగరెట్టు మనం కొనే పనిలేదు, వాళ్ళే కొనిస్తారు. మన మందు మనం కొనఖ్ఖర్లేదు, వాళ్ళే కొనిస్తారు. మన తిండి మనల్ని తిననివ్వరు, వాళ్ళే ఏర్పాటుచేస్తారు. మన డైలాగులు మనల్ని రాయనివ్వరు, వాళ్ళే రాసుకుంటారు’’. తర్కించుకోవడం కాసేపు ప్రక్కన పెట్టేస్తే, హాయిగా నవ్వుకోడానికి ఈ ముక్క ఎంత బావుందో కదా!
కాస్త పరిశీలనగా గమనిస్తే, ఈ పుస్తకంలో ద్వానాశాస్ర్తీగారు, చాలా పార్శ్వాలను స్పృశించినట్టుగా తోస్తుంది. మొదటిది రచయితల పరంగా చాలామందిని పట్టి చూపారు. ప్రక్రియల పరంగా, తెలుగులో వచ్చిన అనేక సాహితీ విభాగాలలోని హాస్యస్ఫోరకమైన సన్నివేశాల్ని సంభాషణల్ని ఉటంకించారు. ఇంకా వ్యంగ్యం, వక్రోక్తి, చమత్కారం, వెటకారం, వేళాకోళం, హేళన, ఇటువంటి ఎన్నో ముఖాలలోని హాస్యజనిత సన్నివేశాల్ని ఉటంకించారు. ఇంకా చెప్పాలంటే, భాషవల్ల యాసవల్ల, వాక్య నిర్మాణంవల్ల, వ్యాకరణ దోషాలవల్ల, అనుకరణలవల్ల ఆనాటి ఆచార వ్యవహారాలవల్ల కాలమాన పరిస్థితులవల్ల, వ్యక్తులవల్ల, వ్యక్తిత్వాలవల్ల, హాస్యమెలా సంఘటిల్లుతుందో ఉటంకించినట్లు తోస్తుంది. ఇదంతా పరిశోధన గ్రంథ ప్రణాళికలా వుంది. అంతేనా, ఆయా రచనల్లోనే కాదు, వ్యక్తిముఖంగా సేకరించిన వాటిని కూడా ఇందులో చేర్చడం విశేషంగా అనిపిస్తోంది.
మొత్తంమీద తేనె పట్టులోకి బొట్టు, బొట్టుగా తేనె సేకరించినట్టు ద్వానాశాస్ర్తీ ఎక్కడెక్కడివో, ఎప్పటెప్పటివో హాస్యస్ఫోరకమైన సన్నివేశాల్ని, సంఘటనల్ని, సంభాషణల్ని, వర్ణనల్ని, ఒక్కచోట పదిలపరిచారు. శాస్ర్తీగారి కృషి గమనార్హమైనది. పది చోట్ల వెతుక్కోవలసిన నవ్వుల్ని ఒక్కచోట పోగేశారు. ఈ గ్రంధంలోని పరిమళం, కాలంతో కలిసి కొంతదూరం తప్పక ప్రయాణిస్తుంది.

వోలేటి పార్వతీశం , ఆంధ్రభూమి అక్షర పేజి, 12/10/2013

“తెలుగు సాహిత్యంలో హాస్యామృతం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈక్రింది లింక్‌ని అనుసరించండి.

తెలుగు సాహిత్యంలో హాస్యామృతం On Kinige

Related Posts: