అద్దంలో ఆ ఊరి చరిత్ర

ఉన్న వూరు కన్న తల్లి సమానమంటారు. అమ్మను ఎలా మరిచిపోలేమో పుట్టిపెరిగిన ఊరును కూడా మరిచిపోలేం. దేశ చరిత్రలు ప్రాంతీయ చరిత్రలు రాయటం సులువు. గ్రామ చరిత్ర రాయటానికి ముందుగా పుట్టి పెరిగినవూరిపై మమకారముండాలి. ఆ వూరు చరిత్ర, సంస్కృతి, వ్యక్తులు, అభివ్యక్తులపై అధికారముండాలి. ఇన్నీ ఉన్నా ఒక్కోసారి చారిత్రక ఆధారాలు దొరకవు. తెలిసిన ఒకరిద్దరు పెద్దలూ తమ పిల్లలతో కలిసి ఉండటానికి దూరప్రాంతాలకు నివాసాలు మార్చుకున్న సందర్భాల్లో ఇది మరింత కష్టమవుతుంది. మిగతా వృత్తుల్లో ఉన్నవారు గ్రామచరిత్రలు రాసే కన్నా, ఉపాధ్యాయులు ఆ పనికి పూనుకుంటే మాత్రం ఊరి చరిత్రకు నిజంగా న్యాయం జరుగుతుంది.

తెలంగాణ సాహితీకారుల జాబితాలో చేరాల్సిన కవులనూ, వారి రచనలనూ పొందుపరచటానికి కృషి చేసిన సాహితీపరుడు. చిన్నప్పట్నుంచి తాను విన్న జానపద గేయాలు, నోటి పాటల వివరాలను సేకరించిన అసలు సిసలైన జానపదుడు. చరిత్ర అంటే పాలకులు మాత్రమేకాదు, పాలితులు కూడానని గ్రామ చరిత్రకు ఆనవాళ్ళైన చారిత్రక శకలాలతో పాటు గ్రామ పెద్దల జ్ఞాపకాలను కూడా ఒక్క చోట చేర్చి గ్రామం పుట్టినప్పటి నుంచి నాలుగు వందల ఏళ్ల చరిత్ర సమాహారంగా పుస్తకాన్ని తీర్చిదిద్దారు యాదగిరి. మోడెంపల్లిగా ఉన్న బేచిరా కుగ్రామ పునాదుల్ని తవ్వి ఎల్లమ్మ రంగాపురం ఆనవాళ్ళను వెదికి పట్టుకొని, గ్రామ నామాలపై గతంలో చేసిన పరిశోధనలకు దీటైన రచన చేశారు.

బిజినేపల్లి దగ్గరున్న నందివడ్డమాను (వర్థమానపురం) రాజధానిగా చేసుకొని, రాయచూరుదాకా పాలించిన గోన వంశీయుల కాలంతోనే అంటే క్రీ.శ.13వ శతాబ్దంలో ఆ వూరు పురుడు పోసుకుందని నిరూపించారు. వీర వైష్ణవ విజృంభణతో ఆలయాలు, వాటిలో విగ్రహాలతో పాటు గ్రామ నామాలు కూడా మారిపోయాయి. చదివేవారికి గ్రామ గ్రంథాలయం,పేరొందిన సాహితీ పరులు, వారి రచనలు, వ్యవసాయ పద్ధతులు, పాడి పంటలు, తూనికలు, కొలతలు, గ్రామ దేవతలు, ఆలయాలు, అపురూప శిల్పాలు, అన్ని విషయాలు యాదగిరిగారి పరిశోధనా పటిమకు నిదర్శనాలు.

జి.యాదగిరిగారు స్వయానా కవి, కళాకారుడు కాబట్టి ఆయన ఒంట పట్టించుకొన్న ఈ రెండు లక్షణాలు ఆయన వ్యక్తిత్వంలో భాగమై, వంద సంవత్సరాల కవిత్వం, ఏభై ఏళ్ల నాటక రంగం, యక్షగానాలు, బైలాటలు, యక్షగాన కళాకారులు వైద్యం గోపాల్,చాకలి ఎల్లయ్య, బెస్త బసవయ్య, రాచమళ్ళ గొల్లనారాయణ, బెస్త కృష్ణయ్య, ఒగ్గు కథకులు కురువ బీరన్నలపై అందించిన సమాచారం ఆ గ్రామాన్ని మరికొన్ని శతాబ్దాలపాటు బతికించుకుంటుంది. తాను స్వయంగా చిత్రకారుడు, విశ్వకర్మ అనువంశీకుడు, గ్రామానికి చెందిన శిల్పాలు, చింతోజు వీరయ్య, బెస్త మల్లయ్య, తోలుబొమ్మల కమ్మరి చంద్రయ్య, రంగయ్యగారు శిల్పితో పాటు వడ్ల లింగయ్య, ఆర్ చంద్రశేఖర్ లను వారు వేసిన చిత్రాలను శిల్పాలను పేర్కొంటూ గ్రామ చరిత్రలో, సాంస్కృతిక అనుబంధాలలో తానూ ఒక శకలమైనాడు జి.యాదగిరి. ఎల్లమ్మను తవ్వితీసి మసక బారిన చరిత్రను అద్దంలా తీర్చిదిద్ది గ్రామం పేరు ప్రఖ్యాతులు ఈ తరానికి అందించటానికి పడిన శ్రమ అంతా ఇంతా కాదు. కవులు, కళాకారులు, వృత్తి పనివాళ్ళు, పండుగలు, పబ్బాలు, జాతర్లు, సంబరాల ఫోటోలను సేకరించి ఆ వూరి చరిత్రతో పాటు నడుస్తున్న చరిత్రను కళ్ళకు కట్టినట్టు, మన ముందర ఒక్కో దృశ్యం కదలాడేటట్లు వర్ణించిన తీరు యాదగిరి గారి తపనకు తార్కాణం.

ఈరోజుల్లో చేష్టలుడిగిన ముసలోళ్ళు, శిథిలమైన గుళ్ళు, పుస్తకాల గ్రంథాలయం, ఊరు చుట్టూ దడి గట్టినట్టు పురాతన శిల్పాలు, ఇవన్నీ ఎవరిక్కావాలి? ఆధునికత పేరుతో నిన్నను కూడా మరిచే నేటి మనను తట్టిలేపి, వాటి ప్రాముఖ్యతను వివరించి, గ్రామంలోని ప్రతివారూ గర్వపడేలా మా వూరికీ చరిత్ర ఉంది. సాహిత్యం ఉంది, ఆటలున్నాయి. పాటలున్నాయి అన్న సోయిని రగిలించటంలో ఆయన పెకలించిన గత కాలపు పెళ్ళలు దాచినా దాగని సత్యాలు.

తెలంగాణలో గ్రంథాలయోద్యమం 20 వ శతాబ్దపు తొలినాళ్ళలో ప్రారంభమైనా, రంగాపురంలో 1951 సంవత్సరంలో ‘బాలవాణి’ గ్రంథాలయాన్ని నాటి యువకులు ఎలా నడిపించుకున్నారో చదివినవారికి ఏ మాత్రం స్వార్థ చింతనలేని గ్రామీణుల స్వచ్ఛమైన ఆలోచనలు ఈ తరం యువకుల్ని ప్రేరేపిస్తాయి.
ఇక శ్రామిక రంగంలో జిల్లెళ్ళ జంగయ్య, షబ్బీరలీలతో జరిపిన ఇంటర్యూలు, మానవ సంబంధాలను, నాటి జీవన విధానాన్ని, విద్య, రాజకీయ రంగాలు, వివిధ రంగాల్లో మొదటి వ్యక్తులు, ఉద్యోగులు, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, ప్రోత్సాహకాలు, అరుదైన 1869 నాటి రాజాచందూలాల్ రామగిరి సనదులను సేకరించి పి హెచ్ డీ పట్టాకు సరిపడ సమాచారాన్ని సమకూర్చాడు.

పుస్తకం చివర్లో రంగాపురం ఎల్లమ్మ దేవాలయం, ఎల్లమ్మ ప్రశస్తి, ఊరి ప్రజలనోళ్ళలో నానుతున్న తెలంగాణ సామెతలు, పొడుపు కథలు మనం మరిచిపోయినా యాదగిరిగారు మాత్రం అక్షరబద్ధం చేసారు. తాను సంప్రదాయ కుటుంబంలో జన్మించి, సాంప్రదాయ విద్యనభ్యసించినా, అభ్యుదయ భావాల పట్ల ఆకర్షితుడై, ఉద్యమాల బాటపట్టి, కొత్త బాణీలు కట్టి ఆ వూరిలో ఉద్యమాల్లో పాల్గొన్న త్యాగ జీవుల నేకరువుపెట్టారు.

పేరు కోసం పాటుపడని, పేరు చెప్పటానికే ముందుకు రాని సామాన్య జానపద గాయక, గాయకురాళ్ళ వివరాలతో పాటు వారి పాటల్ని కూడా సేకరించి మనముందుంచారు.
తన అరవై ఏడేళ్ల జీవన గమన నేపథ్యంలో కాచి వడపోసి మానవ సంబంధాలను మెరుగుపరచడంలో ఆ వూరి ఆచార వ్యవహారాలు ఎలా ప్రభావం చూపుతాయో వివరిస్తూ, గ్రామ సమాచారాన్ని చిత్రపటాలు, ఫోటోలతో సహా ప్రచురించి గ్రామ చరిత్రను నిక్షిప్తం చేయటమే గాక గ్రామ చరిత్రలు ఇలా రాయాలని, కొత్త ఒరవడిని దిద్ది, ఎల్లమ్మ రంగాపురానికి ఎన్నో వన్నెలద్దారు జి.యాదగిరిగారు.

ఈమని శివనాగిరెడ్డి
ఆదివారం వార్త 1 జూలై 2012

* * *

ఎల్లమ్మ రంగాపురం గ్రామ చరిత్ర పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె ద్వారా ప్రింటు పుస్తకాన్ని కూడా 20 శాతం తగ్గింపు ధరకు తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

ఎల్లమ్మ రంగాపురం గ్రామ చరిత్ర On Kinige

Related Posts: