“సాకేత రామాయణం” పై కవిరాజశేఖర చిటిప్రోలు కృష్ణమూర్తి అభిప్రాయం

“శ్రీ గజానన్ తామన్ గారికి
కవివరా! నమస్కారం.
మీ సాకేతరామాయణం పఠించి పరికించి సంతోషించాను. కర్త గజానన్, అనువక్త గజానన్. సమీక్షకులు లక్ష్మణులు. ఎంత శుభయోగం!
పాత్రల పలుకులతో కథను పాఠకుల కళ్ళకు కట్టించిన ప్రణాళిక ప్రశంసనీయం అపూర్వం.
సంతాన భాగ్యం లేని కౌసల్య పరితప్తహృదయం అద్భుతంగా అనిష్కృతమయింది. “ఎంత సనాతన మీ ఆకాశం ఎన్నితారకల నీ ననునిత్యం” – ఈమాటలలో ఎంత అర్థం గర్భితమై ఉన్నదో!
లక్ష్మణుడు అన్యాయం పట్ల ప్రదర్శించిన అసహనంలో ఆగ్రహంలో ప్రత్యేకత ఉంది. ‘మత్తమతంగజమై విధి నన్ను చిమ్మనీ రాఘవ! సంకెల దగిలించి దాని బింక మణచనా’ ఈ క్రోధావేశం ఎవరిమీదనో కాక విధిమీద గావడం విశేషం.
సీత తాను భూజాతనని చెప్పిన తీరు మనోజ్ఞం- ‘నిను సహవాసిగ పొంద నెంచియే నేలపొరలలో వేచితి యుగములు’.
శూర్పణఖ రావణుణ్ణి రెచ్చగొట్టిన చిన్నమాటలోని నైశితీచిత్రం గమనార్హం.
‘జనుల దృష్టి ఆ తాపసి పూజ్యుడు
జనుల దృష్టిలో నీవొకపూజ్యము’

మొదటి పాదంలో జనుల దృష్టి ఆ తాపసి – ఇక్కడ దృష్టి నాతాపసి- అంటే సప్తమి స్పష్టంగా ఉండేదేమో!
‘నిలిచినది నా మ్రోల—నిబిడనీలినుగా అనంతము’- అనుకొన్న శబరి పలుకుతో రాముడి అనంతత్వం స్ఫురితమయింది.
హనుమంతుడికి సీత ‘గ్రహణసమయాన దిగులొందు దిక్సతి వలె’, ‘అస్తమయవేళ సందిగ్ధ క్షితిజమువలె’ -తోచిందా? ఎంత రుచికరమైన ఊహ!
వానరులు తమ అసాధారణ పరాక్రమ ప్రాగల్భాలను అలవోకగా అసామాన్య ప్రజ్ఞా విశేషంతో ప్రకటించారు.
“ ఆ దరి వెలసిన లంకానగరిని
ఈ దరి కీడ్చుట మన కగు సాధ్యము.”
ఇట్లా కావ్యమంతటా భావశబలత ఉంది. ఉక్తి వైచిత్రి ఉంది.
మీ అనువాదం సరళసుందరం. రసజ్ఞుల నలరిస్తున్నది.
ఆ మహారాష్ట్రకవి గజానన్ దిగంబర్ మాడ్గోల్కర్ ఎప్పటివారు? మీరు మహారాష్ట్ర భాషలోనూ పండితులేమో!
పారశీకం నేర్చుకొనడంవలన దువ్వూరి రామిరెడ్డి గారి పానశాల ఉమార్ ఖయ్యాం రుబాయత్‌ల అనువాదాలలో ప్రసిద్ధమయింది.
మీరు పద్యాలూ చక్కగా వ్రాయగలరనుకొంటాను. అందరూ చదివి ఆనందించ దగిన మంచి కావ్యం సాకేతరామాయణం.”

* * *

శ్రీ గజానన్ తమన్ రచించిన “సాకేత రామాయణం”డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

సాకేత రామాయణం On Kinige

Related Posts:

“సాకేత రామాయణం” పై డా. పుల్లెల శ్రీరామచంద్రుడు అభిప్రాయం

“శ్రీ గజానన్ తామన్ గారికి

నమస్కారములు.

మీరు సౌహార్దముతో పంపిన సాకేతరామాయణం చదివి ఆనందించుచున్నాను. కావ్యం అంతా మృదుమధుర శైలిలో చక్కగ నడచినది. ఈ కావ్యంలోని సౌందర్యాన్ని ప్రొ. లక్ష్మణమూర్తిగారు, డా. గండ్ర లక్ష్మణరావుగారు చక్కగా విశదీకరించినారు. శ్రీ సువర్ణ లక్ష్మణ్ రావుగారు శ్రీ సీతారామసేవా సదనం ద్వారా ప్రచురించి సాహితీప్రియులకు ఉత్తమమైన భక్తిరసప్లుమైన కావ్యం అందజేసినారు.

సాకేత రామునికి ఒక్క లక్ష్మణుని సేవ అందితే సాకేత రామాయణానికి ముగ్గురు లక్ష్మణుల సేవ అందినది.

అభినందనములతో

భవదీయుడు
పుల్లెల శ్రీరామచంద్రుడు.”

* * *

శ్రీ గజానన్ తామన్ రచించిన “సాకేత రామాయణం”డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

సాకేత రామాయణం On Kinige

Related Posts:

“సాకేత రామాయణం” పై డా. సి. నారాయణ రెడ్డి అభిప్రాయం

“శ్రీ గజానన్ తామన్ గారికి
సమస్కారం.

మీరు ఆప్యాయంగా పంపిన మీ గేయ కావ్యం “సాకేతరామాయణం” అందింది. సంతోషం.

మరాఠీ మహాకవి మాడ్గూళ్కర్ “గీత్ రామాయణ్” కు మీరు చేసిన తెలుగు అనుసృజనం పరమ మౌలికంగా ఉంది.

గేయ చ్ఛందస్సులో వివిధ గతుల్లో ఈ కావ్యాన్ని రూపొందించారు మీరు. భావాలు మూలగ్రంధంలోనివే అయినా వాటిని తెలుగు పదాల్లో మీరు పొదిగిన తీరు శ్లాఘనీయంగా ఉంది.

చక్కని పరిణత కృతిని తెలుగులో అందించిన మీకు నా హార్దికాభినందన.
డా. సి. నారాయణరెడ్డి”

* * *

శ్రీ గజానన్ తమన్ రచించిన “సాకేత రామాయణం”డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

సాకేత రామాయణం On Kinige

Related Posts: